సేనై ముదలియార్ (విష్వక్సేనులు)

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వవరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

గత  సంచికలో మనం పెరియ పెరుమాళ్ళ గురించి, పెరియ పిరాట్టి గురించి తెెెెలుసుకున్నాము.

 సేన ముదలియార్ (విష్వక్సేనులు) 

విష్వక్సేనులు– తిరువల్లికేణి

తిరు నక్షత్రం: ఆశ్వీజ పూర్వాషాడ నక్షత్రం
శ్రీ సూక్తులు : విష్వక్సేన సంహిత

విష్వక్సేనులు నిత్య సూరులలో ఒకరు. సర్వ సైన్యాధి పతి. భవవానుడి ఆదేశానుసారము నిత్య విభూతి, లీలా విభూతి  కార్యములను పర్యవేక్షిస్తుంటారు. సేన ముదల్వర్, సేనాధి పతి, వేత్రధరులు, వేత్రహస్తులు అను నామాలతో కూడ వ్యవహరింపబడతారు. ‘సూత్రవతివిష్వక్సేనుల దివ్యమహిషి. విష్వక్సేనులు శేషాసనులుగా వ్యహరింపబడతారు. అనగా భగవానుడి శేష ప్రసాదాన్ని ప్రథమంగా వీరు స్వీకరింస్తారు.

పూర్వాచార్యుల ప్రకారము  విష్వక్సేనులకు పెరియ పిరాట్టి ఆచార్యులు.  విష్వక్సేనులు ఆళ్వార్లందరికి ఆచార్యులు.

భగవానుడు నిత్య విభూతి, లీలా విభూతి కార్య భారాలను విష్వక్సేనులకు అప్పగించి, పరమపదములో తమ పట్ట మహిషులతో, నిత్యసూరులతో ఆనందించుచుందురని మన పూర్వాచార్యుల భావన. భగవానుడిని రాజకుమారునిగా, విష్వక్సేనులను అనుభవజ్ఞులైన వృద్ధ మంత్రిగా వర్ణిస్తారు.

ఆళవందార్లు అనుగ్రహించిన ‘స్తోత్ర రత్నము’ అను గ్రంథమున 42వ శ్లోకములో భగవానుడు విష్వక్సేనుల మధ్య సంబంధాన్ని ఈ విధముగా వివరించారు.

త్వదీయ భుక్తో జ్జిత శేష భోజినా త్వయా నిసృష్టాత్మ భరేణ యద్యథా|
ప్రియేణ సేనాపతినా న్యవేది తత్  తథాऽను జానంతముదార వీక్షణైః||

ఆళవందార్లు  ఈ శ్లోకములో విష్వక్సేనులను ఈ విధముగా కీర్తించిరి.

అనువాదము: (భగవానుడిని ఉద్ధేశించి)
భగవానుడి శేష ప్రసాదమును ప్రథమంగా స్వీకరించి, ఉభయ విభూతుల పర్యవేక్షణా భారమును భగవానుడి ఆజ్ఞగా స్వీకరించి, సమర్థవంతంగా నడిపించు విష్వక్సేనులను అందరూ ఇష్ట పడుదురు. భగవానుడి కటాక్షము చేత అనుగ్రహించబడిన కైంకర్యమును సమర్ధవంతముగా చేయగలవానిగా కీర్తింపబడువారు. అనగా పెరుమాళ్ళు చెప్పకుండానే వారి నేత్రముల సైగలతో వారి మనస్సును గ్రహించి కార్యమును సమర్ధవంతముగా పూర్తి చేయగల సామర్థ్యము కలవాడు.

విష్వక్సేనుల తనియన్

శ్రీరంగచంద్రమసం ఇందిరయా విహర్తుమ్
విన్యస్య విశ్వచిద చిన్నయనాధికారమ్ |
యో నిర్వహత్య నిశమంగుళి ముద్రయైవ
సేనాన్యం అన్య విముఖాః తమసి శ్రియామః ||

విష్వక్సేనుల పాద పద్మములను ఆశ్రయించి మనకు భగవత్ భక్తిని అనుగ్రహించమని ప్రార్థిద్దాము. 

వచ్చే సంచికలో నమ్మాళ్వార్ల  గురించి తెలుసుకుందాం.

అడియేన్!

మూలము: https://guruparamparai.wordpress.com/2012/08/18/senai-mudhaliar/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org