Monthly Archives: April 2015

పెరియవాచ్చాన్ పిళ్ళై

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

తిరునక్షత్రము:  శ్రావణ మాసము, రోహిణి నక్షత్రము
అవతార స్థలము:  శంగనల్లూర్ (సేంగణూర్).
ఆచార్యులు: నంపిళ్ళై

శిష్యులు: నాయనారాచాన్ పిళ్ళై, వాదికేసరి అళగియ మణవాళ జీయర్, పరకాల దాసర్  మొదలగు వారు.

సేంగణూరులో అవతరించారు. తండ్రిగారు యామునులు. వారు పెట్టిన పేరు “కృష్ణన్” తరువాతి కాలములో పెరియ వాచ్చాన్ పిళ్ళైగా ప్రసిద్ది గాంచారు. వీరు నంపిళ్ళై ప్రధాన శిష్యులలో ఒకరు. వారి దగ్గరే సకల శాస్త్ర అర్థములను తెలుసుకున్నారు. పెరియ వాచ్చాన్ పిళ్ళై తన ఆచార్య అనుగ్రహము వలన మన సంప్రదాయములో వ్యాఖ్యానాచార్యులుగా ప్రసిద్ది పొందారు.

 
periyiavachanpiLLai-nampillai

పెరియ వాచ్చాన్ పిళ్ళై – నంపిళ్ళై

పెరియ తిరుమొళి 7.10.10, ప్రకారము తిరుక్కణ్ణమంగై పెరుమాళ్ తిరుమంగై ఆళ్వార్ల  (కలియన్) పాశురములకు వారి వద్దనే అర్థములు తెలుసు కొవాలనుకున్నారు. నంపిళ్ళై తాను  కలియన్ అవతారముగా, ఎంపెరుమాన్ (పెరుమాళ్ళు) పెరియ వాచ్చాన్ పిళ్ళై అవతారముగా చెపుతారు. పెరియ వాచ్చాన్ పిళ్ళైకి వ్యాఖ్యాన చక్రవర్తి, అభయప్రద రాజర్ అనే బిరుదులున్నాయి. వీరు నాయయ వాచ్చాన్ పిళ్ళైని కుమారులుగా స్వీకరించారు.

వీరి జీవిత కాలములో వీరు ఈ క్రింది గ్రంధములకు వ్యాఖ్యానములను అనుగ్రహించారు.

  • నాలాయిర దివ్య ప్రబంధము – వీరు మొత్తము ప్రబంధమునకు వ్యాఖ్యానములు అనుగ్రహించారు. దురదృష్టవశాత్తు పెరియాళ్వార్ తిరుమొళిలోని 400 పాశురములకు వీరు రాసిన వ్యాఖ్యానములు లుప్తమై పోగా మాముణులు ఆ భాగమునకు వ్యాఖ్యానమును రాశారు.
  • స్తోత్ర గ్రంధములు – పూర్వాచార్య శ్రీ సూక్తులైన స్తోత్ర రత్నమునకు, చతుశ్లోకికి, గద్య త్రయమునకు, జితంతే స్తోత్రమునకు వీరు వ్యాఖ్యానములు రాశారు.
  • *శ్రీ రామాయణము – శ్రీ రామాయణములోని ముఖ్యమైన శ్లోకములను ఎంచుకొని వాటికి చక్కటి వ్యాఖ్యానములు రాశారు. రామాయణ తని శ్లోకికి మంచి వివరణ పూరకమైన వ్యాఖ్యాలు చేసారు. విభీషణ శరణాగతి భాగమునకు “అభయ ప్రదరాజర్” అని పేరు పెట్టారు.
  • ఇవి కాక మాణిక్య మాలై, పరంద రహస్యం, సకల ప్రామాణ తాత్పర్యము వంటి చాలా రహస్య గ్రంథములకు వ్యాఖ్యానములు రాశారు. వీటిలో రహస్య త్రయసారము విపులముగా తెలుపబడింది.  పిళ్ళై లోకాచార్యులు, రహస్య త్రయమునకు నంపిళ్ళై మరియు పెరియ వాచ్చాన్ పిళ్ళైల ఉపదేశములను తీసుకొని అష్టాదశ రహస్య గ్రందములను అనుగ్రహించారు.

“పాశురపడి రామాయణము” ద్వారా వీరికి శ్రీ రామాయణము, దివ్య ప్రబంధములలో ఉన్న పట్టు అవగతమవుతుంది. దివ్య ప్రబంధములోని పదములను తీసుకొని శ్రీ రామాయణమును చక్కగా సులభముగా రచించారు.

వాది కేసరి అళగియ మణవాళ జీయర్  జీవితములో జరిగిన సంఘటన వలన వీరి దయా గుణము అర్థమవుతుంది. జీయర్, తన పూర్వాశ్రమములో పెరియ వాచ్చాన్ పిళ్ళైగారి తిరుమాళి వంటశాలాలో కైంకర్యము చేస్తుండేవారు. ఆ రోజులలో వీరు నిరక్షరులు. ఆచార్య భక్తి మాత్రము అపారంగా వుండేది. ఒకసారి కొందరు శ్రీ వైష్ణవులు వేదాంత విషయములుము చర్చించు కుంటున్నారు. వీరు వాళ్ళను చూసి “మీరు ఏవిషయము మీద చర్చించు కుంటున్నా” రని అడగగా దానికి వాళ్ళు హేళనగా నవ్వి “ముసల కిసలయము” (అప్పుడే పుట్టిన మొగ్గ) అనే గ్రంథము మీద అని చెప్పారు. వీరు తమ ఆచార్యులతో ఈ విషయమును విన్నవించగా, పెరియ వాచ్చాన్ పిళ్ళై అపారమైన కారుణ్యముతో వారికి సకల శాస్త్రములను బోధించారు. అనతి కాలములోనే అన్ని సాస్త్రములను అధికరించి వాది కేసరి అళగియ మణవాళ జీయరుగా ప్రసిద్ది గాంచి ఎన్నో సంప్రదాయ గ్రంధములను రాశారు.

పెరియ పెరుమాళ్, పెరియ పిరాట్టి, పెరియ తిరువడి, పెరియాళ్వార్, పెరియ కోయిల్ లాగా ఆచ్చాన్ పిళ్ళై కూడా వారి ఔన్నత్యము వలన పెరియ వాచ్చాన్ పిళ్ళైగా ప్రసిద్ది గాంచారు.

మణవాళ మాముణులు తమ “ ఉపదేశరత్న మాలై “లో రెండు పాశురములలో పెరియ వాచ్చాన్ పిళ్ళైని ప్రస్తావించారు.

పాశురం: 43

“నంపిళ్ళై తమ్ముడైయ నల్లరుళాల్ ఏవియిడ
పిన్ పెరియవాచ్చాన్ పిళ్ళై అదనాల్, ఇన్ బా
వరుపత్తి! మారన్ మరై పొరుళై చొన్నదు
ఇరుపత్తు నాలాయిరం”

అర్థము: నంపిళ్ళై ఆనతి మేరకు పెరియ వాచ్చాన్ పిళ్ళై వేద సారమైన తిరువాయ్మొళికి చక్కని వ్యాఖ్యానమును రాసారు. శ్రీ రామాయణమును మనసునందు నిలుపుకొని రాసినందు వలన అది 24000 పడి అయింది. శ్రీ రామాయణములో శ్లోకములు 24000).

పాశురం: 46

“పెరియ వాచాన్ పిళ్ళై పింబుళ్ళవైక్కుం
తెరియ! వియాక్కిగైగళ్! శెయ్వాల్ అరియ
అరుళిచ్చెయల్ పొరుళై! ఆరియ ర్ గట్కు ఇప్పోదు
అరుళిచ్చెయలాయ త్తరిం న్ దు“

పెరియ వాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానముల వలననే దివ్య ప్రబంధమునకు పెద్దలు అర్థాలను గ్రహించి తమ ఉపన్యాసముల ద్వారా ప్రచారము చేయగలుగు తున్నారు. వీరి వ్యాఖ్యానములే లేకుంటే ఇది ఎవరికీ సాధ్యమయ్యేది కాదు.

మాముణులు 39వ పాశురములో, తిరువాయ్మొళి వ్యాఖ్యాన కర్తలైన ఐదుగురిలో పెరియ వాచ్చాన్ పిళ్ళైని చేర్చి చెప్పారు. ఇటువంటి పూర్వాచార్యుల వ్యాఖ్యానముల వలననే దివ్య ప్రబంధములోని అంతరార్థములను గ్రహించ గలుగు తున్నాము.

వార్తామాలై గ్రంధములోను ఇతర పూర్వాచార్య గ్రంథములలోను వీరి జీవిత విశేషాలు కొన్ని లభిస్తున్నాయి. ఇప్పుడు వాటిలో కొన్నిటిని చూద్దాము:

ఒకసారి కొందరు పెరియ వాచ్చాన్ పిళ్ళైని ఈవిధముగా అడిగారు.”మనము ఎందుకు పెరుమాళ్ కృప కోసము, లీల కోసము ఎదురు చూస్తాము?”

దానికి వారు “మనము సంసారములో చిక్కుకున్నామని తలిస్తే పెరుమాళ్ కృప కోసము, ఇక్కడ ఆనందముగా వున్నామనుకుంటే లీల కోసము ఎదురు చూస్తాము” అన్నారు.

“పారతంత్ర్యము అంటే ఏమిటని?” ఒకరు అడిగారు. దానికి  పెరియ వాచ్చాన్ పిళ్ళై పూర్తిగా పెరుమాళ్ళ శక్తిపై ఆధారపడి యుండుట, స్వప్రయత్నముతో సహా ఉపాయాంతరములను వదిలి వేయుట, నిరంతరము భగవత్కైంకర్యములో గడుపుట, అంతే కాదు మోక్షము కూడా పారతంత్ర్యమే అని చెప్పారు.

“ఉపాయ మంటే ఏవిటి అన్ని వదిలి వేయడమా? ఆయనను పట్టు కోవడమా?” అని ఒకరు అడుగగా పెరియ వాచ్చాన్ పిళ్ళై దానికి “రెండు ఉపాయములు కావు. పరమాత్మ మనలను సృష్ఠించాడు. మనకు అన్నీ ఇచ్చాడు. ఆయనను పట్టు కోవడము ఒక్కటే ఉపాయము” అని వివరించారు.

ఒకసారి వారి బంధువు ఒకరు చాలా విచారముగా కనబడ్డారు. పెరియ వాచ్చాన్ పిళ్ళై కారణము అడిగారు. దానికి ఆమె ఈ సంసారములో అనాది కాలముగా ఉండి అనేక కర్మలను చేస్తున్నాను, పరమాత్మ నాకు మోక్షము ఎలా ఇస్తారు? అని అడిగింది. దానికి పెరియ వాచ్చాన్ పిళ్ళై మనము ఆయన సొత్తు. స్వామి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన కర్మలను లెక్క చేయక తానే తీసుకుంటాడు అన్నారు.

ఒక శ్రీ వైష్ణవులు మరొక శ్రీ వైష్ణవులను తప్పులెంచడము చూసి, పెరియ వాచ్చాన్ పిళ్ళై, యముడు శ్రీ వైష్ణవుల తప్పులు చూడవద్దని తన భటులకు చెపుతాడు, పిరాట్టి “న కశ్చిన్ నా పరాధ్యతి” అంటుంది. అందు వలన ఇతరుల తప్పులను చూడకండి. పెరుమాళ్ళు కూడా “నా భక్తులు తప్పులు చేయరు. ఒకవేళ చేస్తే అది మంచికే” అన్నారు.  ఆళ్వార్ కూడా ఎవరైతే ఎంపెరుమాన్ల భక్తులో వారు స్తుతింపబడాలి. శ్రీ వైష్ణవులలో తప్పులు పట్టే వాడు శ్రీ వైష్ణవుడే కాదు.

ఒకసారి భాగవతుల గురించి చర్చ జరుగుతున్నప్పుడు భగవంతుని గురించి ఒకరు అడగగా పెరియ వాచ్చాన్ పిళ్ళై “విశేష విషయములు చర్చ జరుగుతున్నప్పుడు సామాన్య విషయముల గురించి ఎందుకు మాట్లాడుతారు శ్రీ వైష్ణవులందరు ప్రబంధమును తప్పక సేవించాలి అని అన్నారు.

పెరియ వాచ్చాన్ పిళ్ళై తనియన్

శ్రీమత్ కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే|
యత్ కటాక్షైకలక్ష్యాణం సులభ: శ్రీధర స్సదా||

ఎవరి కటాక్షము వలన శ్రీమన్నారాయణుని కృప మన మీద పడుతుందో అటువంటి యామునుల కుమారులైన పెరియ వాచ్చాన్ పిళ్ళైని నేను సేవిస్తాను.

వారు సంప్రదాయమునకు చేసిన కృషిని స్మరిస్తూ మనము సదా వారి శ్రీ పాదములను మనసులో నిలుపుకుందాము.

అదియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము: http://guruparamparai.wordpress.com/2013/10/05/periyavachan-pillai/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/2012/08/17/introduction-contd/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org