తిరుమజిశై ఆళ్వార్

శ్రీః

శ్రీమతే రామానుజాయ నమః

శ్రీమద్ వరవరమునయే నమః

శ్రీ వానాచల మహామునయే నమః

thirumazhisaiazhwar తిరునక్షత్రము: మాఘ మాసము(తై),మఖానక్షత్రం

అవతార స్థలము: తిరుమజిశై(మహీసారపురం)

ఆచార్యులు: విష్వక్సేనులు, పేయాళ్వార్

శిష్యులు: కణికణ్ణన్, ధ్రుడవ్రతన్

శ్రీ సూక్తులు: నాన్ముగన్ తిరువందాది, తిరుచన్ద విరుత్తమ్

పరమపదము చేరిన ప్రదేశము: తిరుక్కుడందై(కుంభకోణం)

శాస్త్రసంపూర్ణఙ్ఞాన సారమును  ఈ ఆళ్వారు కలిగిఉన్నారని మామునిగళ్  కీర్తించెను (ఈ ఆళ్వార్ వివిధ మత సిద్ధాంత గ్రంథాలను లోతుగా పరిశీలించి అవన్నీ నిస్సారమని తేల్చి చివరకు శ్రీవైష్ణవసాంప్రదాయమే ఉత్తమమైనదని నిర్ణయించుకొని పేయాళ్వార్ ని ఆశ్రయించారు )  .  శ్రీమన్నారాయణుడే మనకు ఆరాధనీయుడును అన్య దేవతలను (పాక్షిక దేవతలు)లేశ మాత్రము కూడ ఆరాధనీయులు కారు అని నిర్ణయించారు. మామునిగళ్ వీరిని “తుయ్యమది” అని సంభోధించిరి. దీనర్థము ‘నిర్మలమైన మనసు’ కలిగిన ఆళ్వార్. పిళ్ళైలోకమ్ జీయర్ ఆళ్వారు యొక్క శుద్దమైన మనసును ఈ విధముగా విపులీకరించిరి-  –  శ్రీమన్నారాయణుడు దేవతలందరికి కూడా పరతత్త్వమ్ (శ్రేష్టత్వము) అనే నమ్మకమును కలిగి ఉండవలెను, దీనిని ఏ మాత్రము సంశయించరాదు.

శ్రీవైష్ణవులు అన్య దేవతలయందు ఏవిధమైన భావనను కలిగి ఉండాలో ఆళ్వార్ తమ పాశురములలో వివరించిరి.  మచ్చుకకు కొన్ని ఉదాహరణలు                                                                                                                           :

 • నాన్ముగన్ తిరువందాది– 53వ పాశురం  – తిరువిల్లాత్ తేవరైత్ తేఱేల్మిన్ తేవు  – శ్రీమహాలక్ష్మి ఆరాధనీయ దేవత కాదు అన్న వారిని లెక్కించరాదు.
 • నాన్ముగన్ తిరువందాది– 68వ పాశురం – తిరువడి తన్ నామమ్ మఱణ్దుమ్ పుఱణ్తొజా మాణ్దర్ – ఒకవేళ శ్రీవైష్ణవులు శ్రీమన్నారాయణుడే సర్వస్వామి అని మరచిననూ ఫరవాలేదు కాని ఇతర దేవతలను మాత్రము ఆరాధించరాదు.

నాన్ముగన్ తిరువందాది వ్యాఖ్యానములో  పెరియవాచ్చాన్ పిళ్ళై మరియు నమ్పిళ్ళై  ఎమ్పెరుమాన్ (భగవంతుడు) పరత్వమును మరియు ఇతర దేవతల యొక్క పరిధిని తిరుమజిశైఆళ్వార్ ప్రతిఒక్కరి మనసులోని సందేహములను తన చేష్ఠితముల ద్వారా  తమ గ్రంథముల ద్వారా నివృత్తి చేసిన విధానమును  చాలా మధురంగా వివరించిరి.

పెరియవాచ్చాన్ పిళ్ళై వివరణ~: ముదలాళ్వారులు శ్రీమన్నారాయణుడు మాత్రమే తెలుసుకొని అనిభవించ దగిన వాడని నిర్ణయించిరి. తిరుమజిశై ఆళ్వార్ ఈ  క్రమమును పరిష్కృతము చేసిరి. వారు సంసారులకు ఈ విధముగా వివరించిరి – ఎవరైతే ఇతర దేవతలను ఈశ్వరునిగా  (అధికారి)  తలుస్తారో  ఆ  ఇతర దేవతలు కూడ  క్షేత్రగ్య (జీవాత్మ – శరీరము గురించి తెలిసిన వారు) వేరొకరిచే యేలబడుదురు. వారు కూడా  శ్రీమన్నారాయణుడే ఈ ప్రపంచమునకు అధికారి అని చెప్పెను .

నమ్పిళ్ళై వివరణ~: ముదలాళ్వారులు సర్వేశ్వరుని  గురించి  లోకజ్ఞానము వలన,  శాస్త్రము వలన,  వారి భక్తి వలన మరియు ఎమ్పెరుమానుల నిర్హేతుకకృప వలన తెలుసుకొనిరి. తిరుమజిశైఆళ్వార్ కూడా ఎమ్పెరుమాన్ గురించి అదేవిధముగా తెలుసుకొని అనుభవించిరి. కాని ప్రపంచమును చూసి  వారు కలత చెందిరి.    ఎందుకనగా  చాలామందిజనాలు  శాస్త్రములో చెప్పిన విధముగా శ్రీమన్నారాయణుడే అధికారి అని మరియు అతడే సర్వనియంత అని గ్రహించడం లేదు.  అతని అత్యంత కృప వలననే  వేదరహస్యములు చెప్పబడెను.  బ్రహ్మ (ప్రధమ సృష్టికర్త) తాను కూడా సృష్టి సమయములో శ్రీమన్నారాయణుని చేత సృజించబడిన ఒక జీవాత్మయే.  శ్రీమన్నారాయణుడే సకల చరాచర జగత్తుకు  అంతర్యామిగా ఉండునునని వేదములో వివరించబడినది. శ్రీమన్నారాయణుడే  సర్వనియంత. ఈ సూత్రమే పరమ ప్రామాణికంగా నిర్ధారించు కొని  ఎన్నటికిని విడువరాదు”.

ఈ విధముగా మామునిగళ్, పెరియవాచ్చాన్ పిళ్ళై మరియు నమ్పిళ్ళై తమ తమ  శ్రీ సూక్తులలో తిరుమజిశై ఆళ్వారుల ప్రత్యేకతని వివరించిరి.

తిరుచన్ద విరుత్తమ్ తనియన్ లో  చాలా అందముగా ఆళ్వార్ గురించి వివరించబడినది –  ఒకసారి మహా ఋషులు తపమును చేయుటకు అనువైన  ప్రదేశమును గురించి తెలుసుకొనుటకై   మొత్తము ప్రపంచమును తిరుమజిశైతో (తిరుమజిశై ఆళ్వార్  అవతార  స్థలము) పోల్చిచూసి  తిరుమజిశైయే గొప్పదని నిశ్చయించిరి. అంతటి గొప్పతనము ఆళ్వార్/ఆచార్యుల యొక్క అవతార స్థలములు. దివ్యదేశముల కన్నా మేటిగా  కీర్తీంచబడెను. ఎందుకనగా ఆళ్వార్/ఆచార్యులు మనకు ఎమ్పెరుమాన్ గురించి తెలియపరచిరి. వీరులేనిచో మనకు ఎమ్పెరుమాన్ యొక్క విశేషమైన గుణములను అనుభవించ లేక పోయేవారము.

దీనిని మనసులో ఉంచుకొని ఇక మనము ఆళ్వార్ చరితమును తెలుసుకుందాము.

ఆళ్వార్  కు కృష్ణుడితో  పోలిక  – కణ్ణన్ ఎమ్పెరుమాన్ వసుదేవ/దేవకిలకు జన్మించి నన్దగోప/యశోదల వద్ద పెరిగిరి. అదేవిధముగా  ఆళ్వార్ భార్గవ ఋషి /కనకాంగికి జన్మించి  తిరువాళన్/పంగయచెల్వి ( కట్టెలు కొట్టువాడు మరియు అతని భార్య) అను వారి వద్ద పెరిగెను. వీరిని శ్రీభక్తిసారులు, మహీసారపురాధీశులు, భార్గవాత్మజులు, తిరుమజిశైయార్ మరియు అతిప్రాధాన్యముగా తిరుమజిశై పిరాన్   అనికూడా వ్యవహరించెదరు. పిరాన్ అనగా అర్థము ఒక పెద్ద ఉపకారమును చేసిన వారు, ఆళ్వార్ నారాయణ పరత్వమును స్థాపించి గొప్ప ఉపకారమును చేసెను కదా.

ఒకసారి మహర్షులైన  అత్రి, భృగు, వశిష్ట, భార్గవ మరియు అంగీరస మొదలగు వారు బ్రహ్మ (చతుర్ముఖ) వద్దకు వెళ్ళి ఈ విధముగా అడిగిరి,  “మేము భూలోకములో ఒక మంచి ప్రదేశములో నివసించదలిచినాము, దయతో ఒక అనువైన ప్రదేశమును స్థాపించండి”. బ్రహ్మదేవుడు సారవంతమైన  తిరుమజిశై స్థలమును గ్రహించి  విశ్వకర్మ సహాయముతో మొత్తము ప్రపంచమును ఒకవైపు మరియు తిరుమజిశైని మరొకవైపు వేసి తూచగా తిరుమజిశైయే సారములో(పవిత్రతలో ) నెగ్గినది. దీనిని మహీసార క్షేత్రము అని కూడా పిలుచుదురు. మహర్షులు ఇక్కడ కొంతకాలము నివసించిరి.

ఒకానొక  సమయములో భార్గవ మహర్షి శ్రీమన్నారాయణుడి గురించి దీర్ఘసత్రయాగము చేసిరి. ఆ సమయాన అతని భార్య  12 మాసముల గర్భవతిగా ఉండి ఒక పిండమునకు (మాంసము ముద్ద)జన్మనిచ్చినది. వారే తిరుమజిశై ఆళ్వార్. వారు సుదర్శన అంశగా అవతరించిరి (ఆళ్వారుల కీర్తిని చూసి కొందరు పూర్వాచార్యులు వీరిని నిత్యసూరుల అంశ అని, మరికొందరు –  అనాదియైన సంసారమునందు అకస్మాత్తుగా భగవానుని కృపచే  జన్మించిరని  ధృడంగా నిశ్చయుంచిరి). అప్పటికి పూర్తి రూపము రానందున భార్గవమహర్షి మరియు అతని భార్య ఆ శిశువును ఆదరించక పొదల  మధ్యన విడిచివెళ్ళిరి. శ్రీ భూదేవిల అనుగ్రహము వలన  ఆ పిండము కాపాడబడినది. ఆమె స్పర్శ వలన ఆ పిండము ఒక అందమైన శిశువుగా మారెను. వెంటనే ఆ శిశువు ఆకలిచే ఏడుస్తుండగా జగన్నాథభగవానుడు  ( తిరుమజిశైకి అధిపతి)  తిరుక్కుడందై ఆరావముదన్ రూపములో దర్శనమిచ్చి కృపచూపి త్వరలో పూర్తి ఙ్ఞానమును గ్రహించగలవు అని దీవించి అదృశ్యమయ్యారు. భగవానుని విరహమును తట్టుకోలేక ఆళ్వార్  దు:ఖించిరి.

ఆ సమయములో తిరువాళన్ అను ఒక కట్టెలుకొట్టేవాడు  అటునుండి వెళ్ళుచుండగా ఏడుస్తున్న ఈ బాలుడిని చూసి చాలా సంతోషముతో తీసుకొని తన భార్యకు  ఇచ్చెను. వారికి సంతానము లేకపోవడముచే ఆమె ఆ బాలుడిని పెంచసాగినది. తన మాతృవాస్తల్యముచే  ఆళ్వారునకు  స్తన్యమివ్వాలని  ప్రయత్నించినది.  కాని ఆళ్వార్  భగవత్ కల్యాణగుణములను అనుభవించుటచే ఆహారము గ్రహించుట, మాట్లాడుట, ఏడ్చుట మొదలగు వాటిని చేయలేదు, కాని భగవత్ అనుగ్రహముచే  అందముగా పెరగసాగెను.

చతుర్ధవర్ణములో జన్మించిన  ఒక వృద్ద దంపతులు ఈ ఆశ్చర్యకరమైన వార్తను విని  ఒకరోజు వెచ్చని పాలను తీసుకొని ఈ బాలుని దర్శనార్ధం ఒక ఉదయాన  వచ్చిరి. ఆ బాలుని దివ్యమైన తేజస్సును చూసి ఆ పాలను వారికి సమర్పించి స్వీకరించవలసినదిగా  అభ్యర్ధించిరి. ఆళ్వార్ వారి భక్తికి సంతోషించి ఆ పాలను స్వీకరించి మిగిలిన శేషమును వారికి ఇచ్చి ప్రసాదముగా స్వీకరించమనిరి. ఈ ప్రసాద ప్రభావము వలన వారికి ఒక సత్పుత్రుడు  త్వరలో కలుగునని దీవించిరి. ఆళ్వార్ అనుగ్రహముచే వారు తమ యవ్వనమును తిరిగిపొందిరి మరియు  అతి త్వరలోనే ఆ స్త్రీ గర్భము దాల్చినది. 10 మాసముల అనంతరం ఆమె శ్రీ విదురుని వలెనున్న (శ్రీ కృష్ణునిలో భక్తి కలిగిఉన్న) ఒక బాలుడికి  జన్మనిచ్చెను. వారు అతడికి ‘కణికణ్ణన్’ అను పేరును పెట్టి భగవద్గుణములను గురించి పూర్తిగా నేర్పించిరి.

భార్గవాత్మజుడైన ఆ బాలుడు జన్మము నుండే భగవత్ కృప ఉండుటచే  తన ఏడు సంవత్సరముల వయసులో అష్టాంగయోగమును చేయదలచిరి. దానికి మొదలు పరబ్రహ్మను పుర్తిగా తెలుసుకొనుటకు ఇతర  మతముల  గురించి తెలుసుకొనెను (కారణం వాటి లోపభూయిష్టత తెలుసుకొనుటకు) అందు వలన బాహ్యమతములను (సాంఖ్య, ఉలూక్య, అక్షపాద,  కృపణ, కపిల, పాతంజల మరియు కుదృష్టి మతములైన శైవ,మాయావాద, న్యాయ, వైశేషిక, భాట్ట మరియు ప్రభాకర మొదలైన) పూర్తిగా పరీశీలించి ఇవన్నీనిజమైన పరమాత్మ తత్త్వమును నిర్ధారించుటలేవని  చివరగా సనాతన ధర్మమైన శ్రీవైష్ణవసిద్దాంతమును అవలంభించిరి. ఇలా 700 సంవత్సరములు గడిచినవి. సర్వేశ్వరుడు ఆళ్వారులను  అపరిమితమైన ఙ్ఞానమును ప్రసాదించి వీటిని దర్శింప చేసెను.

 • తన దివ్య స్వరూపమును
 • తన కళ్యాణ గుణములను
 • తన అవతారములను (ఇవి స్వరూప గుణములను దర్శింపచేయును)
 • ఆయా అవతారములలోని అందమైన ఆభరణములను
 • తన దివ్యమైన ఆయుధములను( ఎవైతే  అనుకూలురులకు ఆభరణముల వలె గోచరిస్తాయో)
 • తన మహిషీలను (శ్రీభూనీళాదేవేరులను) మరియు నిత్యసూరులను(వీరు ఎల్లప్పుడూ భగవద్గుణములను అనగా స్వరూపము, గుణములు, అవతారములు, ఆభరణములు, దివ్యాయుధములు మొదలైన అనుభవించుదురు)
 • పరమపదము –  దివ్యనిత్య నివాస ప్రదేశమును   చివరగా
 • సంసారమును –  ప్రకృతిపురుష కాల తత్త్వములను మరియు భగవానునిచే ప్రత్యక్షముగా లేదా  పరోక్షముగా(ఇతర దేవతలచే)   జరుగు నిరంతర సృష్టి, స్థితి, సంహారములు ఉండునది.

కళ్యాణగుణ పూర్ణుడైన భగవానుడు  ఆళ్వారునకు ఈ విధముగా చూపెను –

 • తాను బ్రహ్మను (తన మొదటి కుమారుడు)తన నాభి కమలము నుండి సృష్టించినది. శ్వేతశ్వేతారోపనిషత్తులో “యో బ్రహ్మణామ్ విదదాతి పూర్వమ్” దీని  అర్థము పరబ్రహ్మము (విష్ణువు)బ్రహ్మను(చతుర్ముఖ) సృజించుట
 • ఛాందోగ్య బ్రాహ్మణమ్ లో“బ్రహ్మణ: పుత్రాయ జ్యే ష్టాయ శ్రేష్టాయ” – దీనర్థం రుద్రుడు బ్రహ్మదేవునకు ప్రథమ సుపుత్రుడు.

ఆళ్వార్ దీనిని చూసి వెంటనే తమ నాన్ముగన్ తిరువందాది లో అదే భావమును  వ్రాసిరి “నాన్ముగనై నారాయణన్ పడైత్తాన్ నాన్ముగనుమ్ తాన్ముగమాయ్  శంకరనై త్తాన్ పడైత్తాన్” – దీని అర్థం  నారాయణుడు బ్రహ్మను సృజిస్తే , బ్రహ్మ తిరిగి రుద్రుడిని సృజించెను. ఇది సంసారులకు భగవానుని సర్వశక్తిత్వమును గురించి సందేహ నివృత్తి చేయును. తాను ఎన్నో మతములను చూసి చివరగా శ్రీమన్నారాయణుని కృపచే   వారి పాదపద్మములను చేరితినని ఆళ్వార్ భావించుకొనిరి. ఆళ్వార్  తిరువల్లిక్కేణి (బృన్దారణ్య క్షేత్రము) లోని కైరవిణి పుష్కరిణి తీరాన ఉన్న  శ్రియ:పతి కళ్యాణ గుణములను ధ్యానించుచుండిరి.

ఒకనాడు  రుద్రుడు పార్వతితో కలసి తన వాహనమైన వృషభముపై ఆకాశములో వెళ్ళుచుండెను. అప్పుడు వారి నీడ ఆళ్వారుపై  పడబోతుండగా ఆళ్వార్ ప్రక్కకు జరిగెను. అది గమనించిన పార్వతి రుద్రునితో మనము అతనిని  కలవాలని కోరినది.  మహాఙ్ఞాని, శ్రీమన్నారాయణుని భక్తుడైన అతను మనను  నిర్ల క్ష్యముచేయును అని రుద్రుడు బదులిచ్చాడు. రుద్రుడు  వారించినా పార్వతి  క్రిందికి వెళ్ళి అతనిని  తప్పక కలవాలని పట్టుబట్టెను. చేసేదేమి లేక సరేనని దంపతులు క్రిందకు దిగిరి. ఆళ్వార్ వారి రాకను కనీసము చూడనైనా చూడ లేదు.

రుద్రుడు –  “మేము మీ ముందర ఉన్నప్పటికినీ మీరు మమ్మల్ని నిర్లక్ష్యము చేయుచున్నారు?”.

ఆళ్వార్ – “నాకు మీతో చేయవలసిన పనేమీ లేదు”.

 రుద్రుడు – “మేము మీకు వరము ఇవ్వదలచితిమి”.

ఆళ్వార్ – “నాకు మీ నుండి ఎమియు అవసరము లేదు”.

రుద్రుడు – “నా వరము వృధాగా పోదు మీ కోరిక ఏమిటో చెప్పండి”.

ఆళ్వార్ – “మీరు నాకు మోక్షమును ఇస్తారా?”.

రుద్రుడు – “నాకు ఆ అధికారము లేదు కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే ప్రసాదించును”.

ఆళ్వార్ –  “ఎవరి మరణమునైనా నిలిపివేయుదురా?”

రుద్రుడు-  “అది వారి  కర్మానుగతము దానిపై నాకు అధికారము లేదు”.

ఆళ్వార్ – “కనీసము ఈ సూదిలో దారమునైన ఎక్కించగలరా?”.

రుద్రుడు కోపముతో- “ నిన్ను కామదేవుని వలె కాల్చివేయుదును”.

శివుడు తన మూడవ నేత్రమును తెరచి  అగ్నిని విడుదల చేసిరి. ఆళ్వార్ కూడా తన కుడికాలి బొటన వేలు ముందు భాగమున ఉన్న మూడవ నేత్రము నుండి అగ్నిశిఖలను ఏకధాటిగా విడుదల చేసెను. రుద్రుడు ఆళ్వారుల తిరువడి నుండి వచ్చే వేడిని తట్టుకోలేక  శ్రీమన్నారాయణుని శరణువేడెను. దేవతలు, ఋషులు మొదలగు వారు శ్రీమన్నారాయణుని ఆ ప్రళయమును ఆపమని అభ్యర్ధించిరి. శ్రీమన్నారాయణుడు  వెంటనే  మేఘములను పెద్ద వర్షమును కురిపించమని ఆఙ్ఞాపించెను. కాని అవి తమకు ఆళ్వారుల అగ్నిని ఆపే శక్తి లేదనగా శ్రీమన్నారాయణుడు వాటికి ఆ శక్తిని ప్రసాదించెను. ఒక పెద్ద వరద ఆ అగ్నిని అణిచివేయుటకు బయలుదేరెను. ఆళ్వార్ ఎలాంటి కలత చెందక శ్రీమన్నారాయణుని  ధ్యానమును చేయసాగెను. రుద్రుడు ఆళ్వారుల నిష్ఠకు ముగ్దుడై  “భక్తిసారులు” అని బిరుదును ఇచ్చి, అతడిని కీర్తిస్తు తన భార్యతో ‘దుర్వాసుడు అమ్బరీశుడికి చేసిన అపచారమునకు  ఏ విధముగా ఆ ఋషి  శిక్షించబడెనో వివరించి చివరకు దీనివలన భాగవతులు ఎప్పటికినీ అపజయమును పొందరు” అని  తమ ప్రదేశమునకు వెళ్ళిపోయిరి.

అలా ఆళ్వార్ తన ధ్యానమును కొనసాగించుచుండగా ఒక కేచరుడు (ఆకాశ సంచారకుడు) తన వాహనమైన పులిపై ఆకాశమున వెళుతు ఆళ్వారుని చూసిరి. ఆళ్వార్  యోగశక్తి వలన ఆ కేచరుడు వారిని  దాటి వెళ్ళలేకపోయినాడు. అతను క్రిందికు దిగివచ్చి ఆళ్వారునకు తన  ప్రణామములను సమర్పించి మాయచే ఒక దివ్యశాలువను సృజించి ఆళ్వార్ తో ఇలా అభ్యర్థించిరి  “మీ చిరిగిన శాలువను తీసి ఈ అందమైన శాలువను తీసుకొనవలసినది”. ఆళ్వార్ సులభముగా తమ శక్తిచే రత్నములతో పొదిగిన ఒక అందమైన శాలువాను సృజించగా కేచరుడు చికాకుపడెను. అప్పుడు అతను తన హారమును (నగ) తీసి ఆళ్వారునకు ఇచ్చిరి. ఆళ్వార్ తన తులసి మాలని తీసి వజ్రపు హారముగా చేసి చూపెను. కేచరుడు ఆళ్వార్  యోగ శక్తిని గ్రహించి  అతనిని కీర్తించి,  ప్రణామమును సమర్పించి సెలవుతీసుకొని వెళ్ళెను.

ఆళ్వారుల కీర్తిని విని కొంకణసిద్దుడు అను మంత్రగాడు ఆళ్వార్ దగ్గరికి వచ్చి ప్రణామములు సమర్పించి ఒక రసవిఙ్ఞాన రత్నమును(లోహము ను  బంగారముగా మార్పు చేయును ఒక రాయి), ఆళ్వార్  దానిని నిర్లక్ష్యము చేసి తన దివ్యమైన శరీరము నుండి కొంత మురికిని(చెవి భాగము నుండి) తీసి ఆ మంత్రగాడికి ఇచ్చి ఈ మురికి నీ రాయిని  బంగారముగా మార్పు చేయును అని అనిరి. అతను ఆ విధముగా ప్రయోగించగా తన రాయి బంగారముగా మారినది. అతను చాలా సంతోషించి ఆళ్వార్ కు తన ప్రణామములు సమర్పించి తిరిగి వెళ్ళెను.

ఆళ్వార్ అలా ఒక గుహలో ధ్యానమును చేసుకొనచుండిరి. ముదలాళ్వారులు (పొయ్ ఘై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్) భగవానున్ని కీర్తిస్తు నిత్యసంచారము చేస్తు  ఆళ్వార్ ధ్యానం చేయుచున్న గుహకు వచ్చిరి. ఆ గుహనుండి ప్రసరిస్తున్న దివ్యతేజస్సును చూసిరి. ఆ  ముదలాళ్వారులు తిరుమజిశైఆళ్వారుల  వైభవమును గ్రహించి వారి క్షేమమును గురించి విచారించిరి. ఆళ్వార్ కూడ ముదలాళ్వారుల  వైభవమును గ్రహించి వారి క్షేమమును విచారించిరి. కొంతకాలము వరకు  వారు తమతమ   భగవదనుభవములను  పరస్పరము ప్రవచించుకొనిరి. తరువాత వారు అక్కడి నుండి పేయాళ్వారుల అవతార స్థలమైన  ‘తిరుమయిలై’ (మైలాపూర్)చేరుకొనిరి. అక్కడ కైరవిణి తీరమున కొంతకాలము నివసించిరి. అలా  ముదలాళ్వారులు తమ  యాత్రను కొనసాగించగా తిరుమజిశైఆళ్వార్   మాత్రము తమ అవతారస్థలమైన తిరుమజిశైకి విళ్ళిపోయిరి.

తిరుమజిశైఆళ్వారు తిరుమణి గురించి  వెతకగా అది వారికి లభించలేదు. దానితో వారు విచారపడగా తిరువేంగడముడైయాన్(శ్రీనివాసుడు) ఆళ్వారునకు స్వప్నములో సాక్షాత్కరించి తిరుమణి లభించే ప్రదేశమును చూపించిరి. ఆళ్వార్   సంతోషముతో తిరుమణిని  స్వీకరించి ద్వాదశ ఊర్ద్వపుండ్రములను (శాస్త్రములో చెప్పిన విధముగా శరీరములోని12 ప్రదేశములలో ధరించు 12 నామములు) ధరించి తమ భగవదనుభవమును కొనసాగించిరి. తరువాత పొయ్ ఘైఆళ్వారుల అవతార స్థలమైన  తిరువె:క్కా దర్శించే కోరికతో కాంచీపురంకు చేరిరి. ఇది గొప్ప పుణ్యక్షేత్రముగా  కీర్తి క్కెక్కినది. అక్కడ శ్రీదేవి మరియు భూదేవి సపర్యలు చేయుచుండగా  ఆదిశేషునిపై అందముగా శయనించిన శ్రీమన్నారాయణుని  700 సంవత్సరములు తిరుమజిశైఆళ్వారులు  ఆరాధించిరి. పొయ్ ఘైఆళ్వార్ అవతరించిన పుష్కరిణి ఒడ్డున నివసిస్తు  పొయ్ ఘైఆళ్వారుల  ధ్యానముతో గడిపెను.

yathokthakari-swamy

                                              ఉభయదేవేరులతో యధోక్తకారి , తిరువెఃక్కా

 ఒక సమయములో కణికణ్ణన్, ఆళ్వార్  శ్రీ చరణములను ఆశ్రయించిరి. ఒక వృద్దస్త్రీ వచ్చి ప్రతిదినము ఆళ్వారునకు భక్తితో సేవలు చేయుచుండెను. ఆళ్వార్ ఆమె భక్తికి మరియు సపర్యలకు సంతోషించి  ఆమెతో ‘మీకు ఎమైనా కోరికలు  ఉన్నవా ?’ అని అడిగిరి. ఆమె దానికి తన యవ్వనమును తిరిగి పొందవలెనని  కోరినది. ఆళ్వార్ అలానే అని దీవించగా ఆమె  అందమైన యువతిగా మారినది. స్థానిక రాజైన పల్లవరాయుడు  ఆమె యందు ఆకర్షితుడై వివాహము చేసుకోమని కోరినాడు. ఆమె తన సమ్మతమును తెలుపగా ఇద్దరు వివాహమును చేసుకొని ఆనందముగా జీవించసాగిరి. ఒకరోజు, పల్లవరాయుడు తన వయసు రోజురోజుకు పెరుగుచుండగ తన భార్య యుక్తవయసులోనే (ఆళ్వార్ ఆశీస్సుతో)  ఉండడము గమనించి ఆమెను ఏవిధముగా తరగని యౌవ్వనమును పొందినదో అడిగెను. ఆమె ఆళ్వార్ ఆశీస్సుల గురించి చెప్పి ఆ రాజును ఆళ్వార్ నుండి అదే విధముగా యౌవ్వనమును పొందుటకు అనుగ్రహము లభించేలా కణికణ్ణన్ (సామాగ్రికై రాజు వద్దకు వస్తాడు)ను అభ్యర్థించవలసినదిగా చెప్పినది. ఆ రాజు కణికణ్ణన్ ను పిలిపించి ఆళ్వారును ఆరాధించుటకు తన రాజభవనమునకు తీసుకురావలసినదిగా అభ్యర్థించిరి. కణికణ్ణన్,  ఆళ్వార్ శ్రీమన్నారాయణుని కోవెలను వదలి ఇతర ప్రదేశములకు  రారని చెప్పెను. ఆ రాజు కణికణ్ణన్ తో తన గొప్పదనం గురించి చెప్పవలసినదిగా అభ్యర్థించిరి. దానికి కణికణ్ణన్ మా గురువుగారు  శిష్టాచారము ప్రకారము  శ్రీమన్నారాయణుడిని మరియు ఆయన భక్తులను తప్ప ఇతరులను ఎవ్వరిని కీర్తించననిరి. తనను కీర్తించని కారణముగా రాజు కోపముతో కణికణ్ణన్ ని  రాజ్యమును విడిచి వెళ్ళవలసినదిగా ఆఙ్ఞాపించెను. కణికణ్ణన్  రాజభవనమును వదిలి ఆళ్వార్ వద్దకి చేరి జరిగిన సంఘటనను  వివరించి తనకు సెలవును ప్రసాదించవలసినదిగా వేడెను. ఆళ్వార్ ఇలా అనెను “ ఒకవేళ మీరు వెళ్ళిపోతే మేము కూడ వెళ్ళిపోతాము, మేము వెళితే భగవానుడు కూడా వెళ్ళును , భగవానుడు వెళితే ఇక్కడి దేవతలందరు వెళ్ళిపోవుదురు”.ఆళ్వార్  కణికణ్ణన్ తో “నేను కోవెలకు వెళ్ళి భగవానుడు లేపి నాతో పాటు తీసుకువచ్చెదను చెప్పి” కోవెలకు వెళ్ళిరి. ఆళ్వార్ తిరువె:క్కా ఎమ్పెరుమాన్ ఎదురుగా ఇలా ప్రార్థించిరి:

కణికణ్ణన్  పోగిన్ఱాన్ కామరుపూ కచ్చి మణివణ్ణా నీ కిడక్క వేన్డా తున్ణివుడైయ చెణ్ణాప్పులవనుమ్ పోగిన్ఱేన్ నీయుమ్ ఉన్ఱన్ పైణ్ణాగప్పాయ్ చురుట్టిక్కొళ్

ఆహా!  అందమైన రూపును ధరించిన తిరువెఃక్కా నివాసకుడా! కణికణ్ణన్ వెళ్ళుచున్నాడు అతని వెంట నేను కూడా వెళ్ళుచున్నాను నీవు నీ ఆదిశేషుణ్ణి  చుట్టుకొని మాతో పాటు రావలెను”.

భగవానుడు, ఆళ్వార్ మాటను అంగీకరించి లేచి తన ఆదిశేషువును చుట్టుకొని వారిని  అనుసరించిరి. అందువలన వారికి యథోక్తకారి (యధా – ఎలానైతే, ఉక్త – చెప్పిన ప్రకారము,కారి – చేయువాడు) అను పేరు వచ్చినది. దేవతలందరు భగవానున్ని అనుసరించెను కావున మంగళకర ప్రధానులైన వారు లేకపోవుటచే కాంచీపురమును  తమము  ఆవరించినది. సూర్యుడు కూడా ఉదయించలేక పోయెను. ఆ రాజు అతని మంత్రులు పరిస్థితిని గ్రహించి వెంటనే  పరిగెత్తి కణికణ్ణన్ శ్రీచరణములయందు క్షమాప్రార్థన చేసిరి. అప్పుడు కణికణ్ణన్ తమ ఆచార్యులైన ఆళ్వారును వేడి తిరిగి  వెళదామని  అభ్యర్థించిరి. ఆళ్వార్ దానికి అంగీకరించి  భగవానునున్ని కూడ యదాస్థానమునకు వేంచేయవలసినదిగా ప్రార్థించిరి:

కణికణ్ణన్  పోక్కొజిణ్తాన్ కామరుపూ కచ్చి మణివణ్ణా నీ కిడక్క వేండుమ్ తుని వుడైయ చెణ్ణాప్పులవనుమ్ పోక్కొజిణ్తేన్ నీయుమ్ ఉన్ఱన్ పైణ్ణాగప్పాయ్ పడుత్తుక్కొళ్

“ఆహా!  అందమైన రూపును ధరించిన తిరువెఃక్కా నివాసకుడా! కణికణ్ణన్ తిరిగి వస్తున్నాడు నేను కూడా తిరిగివస్తున్నాను నీవు నీ ఆదిశేషుణ్ణి విప్పి  తిరిగి యథా విధముగా  శయనించుము”.

అదీ భగవానుని సౌలభ్యము- నీర్మై (నిరాడంబరత్వం) అందువలన  ఆళ్వార్ భగవానుని ఈ గుణమునకు ఈడు పడి   వెఃక్కానై క్కిడందతెన్న నీర్మైయే అని పాడిరి– నా అభ్యర్థనని మన్నించి ఈ విధముగా భగవానునుడు తిరువెఃక్కా లో శయనించి నాడో అని.

ఆళ్వార్ ఆర్తితో  తిరుక్కుడందై (కుంభకోణము) వేంచేసిఉన్న  ఆరావముదాళ్వార్/శార్ఙపాణి కి  మంగళాశాసనమును చేయుటకు వెళ్ళిరి. తిరుక్కుడందై మాహాత్మ్యము ఇలా చెప్పబడినది,  “ఎవరైతే క్షణ కాలమైనను కుంభకోణములో నివాసము చేయుదురో వారికి  శ్రీవైకుంఠ ప్రాప్తికలుగును  ఇక సంసారములోని సంపదను గురించి ఏమి చెప్పవలెను” – అదీ ఈ దివ్యదేశ వైభవము .

ఒకసారి ఆళ్వార్  తన ప్రయాణంలో  పెరుమ్పులియూర్ అనే గ్రామములో  ఒక గృహ వరండాలో విశ్రమించిరి. అక్కడ కొందరు బ్రాహ్మణులు వేదాధ్యయనమును చేయుచున్నారు. ఆ సమయములో వారు ఆళ్వారు యొక్క జీర్ణమైన ఆకారమును(శూద్రుడని) చూసి తప్పుగా అర్థము చేసుకొని వేదాధ్యయనమును నిలిపివేసిరి. దీనిని ఆళ్వార్  వినమ్రతతో అర్థము చేసుకొని ఆ ప్రదేశమును విడిచి వెళ్ళిరి. ఆ బ్రాహ్మణులు ఆ వేధాద్యయనము నిలిపిన పంక్తి  గుర్తుకురాక ఇబ్బంది పడసాగిరి. ఆళ్వార్ వెంటనే ఒక వరి ధాన్యపు గింజను తీసుకొని తన గోటితో విరిచెను. ఆళ్వార్ యొక్క ఆ చర్య వారు మరచిన పంక్తిని సూచించెను. “క్రిష్ణాణామ్ వ్రిహిణామ్ నఖనిర్భిన్నమ్”  ఇది యజు: ఖండము లోనిది. అప్పుడు బ్రాహ్మణులు వెంటనే వారి  వైభవమును  గుర్తించి , ప్రణామములను సమర్పించి తమ అమర్యాదను క్షమించమని వేడుకొనిరి.

ఆళ్వార్ తమ తిరువారాధన సామగ్రి గురించి సంచరిస్తుండగా ఆ గ్రామకోవెలలోని భగవానుడు మారిమారి ఆళ్వార్ ఉన్నదిక్కుకు తిరుగుచుండెను. అర్చకులు ఆ ఆశ్చర్యకరమైన సంఘటనను కొందరి బ్రాహ్మణులకు చూపి  ఆ గ్రామములో యాగము చేయుచున్న పెరుమ్పులియూర్ అడిగళ్ వద్దకు వెళ్ళి ఆ సంఘటనను మరియు ఆళ్వార్  వైభవమును వారికి చెప్పిరి. పెరుమ్పులియూర్ అడిగళ్ యాగశాలను వదిలి నేరుగా ఆళ్వార్ వద్దకి వెళ్ళి వారి అప్రాకృత (ఆధ్యాతికతను దైవత్వమును) తిరుమేనిని (శరీరము) చూసి ప్రణామమును సమర్పించి ఆళ్వార్ ను తన యాగశాలకు వేంచేయవలసినదిగా ప్రార్థించిరి. ఆళ్వార్ యాగశాలను సందర్శించినపుడు  అడిగళ్  యాగభాగములోని అగ్రపూజని (మొదటి మర్యాద) ఆళ్వార్ కి సమర్పించెను. ధర్మరాజు  రాజసూయయాగములో  కృష్ణుడికి అగ్రపూజని ఇచ్చినప్పుడు శిశుపాలుడు అతని స్నేహితులు అడ్డుతగిలినట్లుగా ఇక్కడ కూడ కొందరు అడ్డుతగిలారు. అడిగళ్ విచారముతో ఆళ్వారునకు వారి మాటలను వినలేనని చెప్పిరి. ఆళ్వార్ తన వైభవమును తెలుపుటకు నిశ్చయించుకొని అంతర్యామి భగవానునున్ని తన  హృదయములో అందరికీ దర్శనమిచ్చేలా  ప్రత్యక్షమవ్వమని  పాశురంచే ప్రార్థించిరి. భగవానుడు తన దయాగుణముచే దివ్య మహిషీలు, ఆదిశేషుడు, గరుడాళ్వార్ మొదలగు వారితో ఆళ్వార్ హృదయములో ప్రత్యక్షమయ్యెను. ఇంతకు మునుపు ఎవరైతే   అడ్డుతగిలిరో వారు  ఆళ్వార్  వైభవమును గ్రహించి వారి శ్రీచరణముల యందు సాష్టాంగపడి తమ తప్పులను మన్నించమని వేడుకొనిరి.  ఆళ్వార్ వైభవమును  ప్రచారం గావించుటకు వారు ఆళ్వార్ కు  బ్రహ్మరథమును(ఆళ్వారును పల్లకిలో తీసుకువెళ్ళడము) పట్టెను.  ఆళ్వార్ అప్పుడు వారికి శాస్త్రసారమును విశేష వివరణలతో అనుగ్రహించిరి.

ఒకసారి ఆళ్వార్   ఆరావముదన్ ఎమ్పెరుమాన్ సేవించుటకై తిరుక్కుడందైకు  వెళ్ళిరి. తిరుక్కుడందై చేరిన తరువాత వారు తమ గ్రంథములను (తాళ పత్రములను) కావేరినదిలో విసిరివేసిరి. భగవానున్ని  కృపవలన నాన్ముగన్ తిరువందాది మరియు తిరుచ్చన్త విరుత్తమ్  తాళపత్రములు తరంగాలలో తేలుచూ ఆళ్వార్ వద్దకు తిరిగి చేరినవి. ఆళ్వార్  వాటిని తీసుకొని ఆరావముదన్ సన్నిధికి  వెళ్ళి భగవానుని   దివ్యతిరువడి (పాదము) నుండి తిరుముడి (శిరస్సు) వరకు సేవించి కీర్తించిరి.  అత్యంత ప్ర్రీతిచే  ఆళ్వార్ ఎమ్పెరుమాన్ ను ఈ విధముగా ఆదేశించిరి “కావిరిక్కారైక కుడందయుళ్ కిడంద వారెళుందిరుందు పేచ్చు”. దీనర్థము-     “ఆహా! కావేరితీరాన తిరుక్కుడందై లో శయనించి ఉన్న వాడా లేచి నిలబడి నాతో మాట్లాడు”. ఆళ్వార్ సూక్తిని ఆలకించిన భగవానుడు లేచుటకు ప్రయత్నించగా, ఆళ్వార్ భగవానుని చర్యను చూసి  వారికి మంగళాశాసనమును  చేసిరి “వాజి కేశనే” అర్థము “ఓ అందమైన కేశములను కలిగిన వాడా! నిత్య మంగళము”. ఆ దివ్య స్వరూపమును ధ్యానిస్తూ ఆళ్వార్ మరొక  2300 సంవత్సరములు తిరుక్కుడందైలో పాలను మాత్రమే స్వీకరించి  నివసించిరి. ఆ విధముగా 4700 సంవత్సరములు భూలోకములో వేంచేసిఉండి  ప్రతిఒక్కరినీ ఈ సంసారసాగరమును దాటించుటకు సకలశాస్త్రముల సారమును తన ప్రబంధముల ద్వారా  అనుగ్రహించిరి.

                                  aarAvamuthan

కోమలవల్లి తాయార్ సమేత ఆరావముదన్, తిరుక్కుడందై

ఆళ్వార్ తిరుమజిశై పిరాన్ గా వ్యవహరించబడెను ( పిరాన్ అనగా ఎవరైతే  ఈ ప్రపంచమునకు మహోపకారము చేయుదురో వారు.  సాధారణముగా ఈ వాచక శబ్దమును  భగవానుని  కీర్తిని తెలుపుటకు వాడుదురు ) – ఆళ్వార్ భగవానుని  పరతత్త్వమును తెలుపుటకు మహోపకారమును చేసిరి – ఆనాటి నుండి తిరుమజిశైఆళ్వార్ తిరుమజిశైపిరాన్ గా  తిరుక్కుడందై ఆరావముద ఎమ్పెరుమాన్ ఆరావముదాళ్వాన్  గా ప్రసిద్దికెక్కిరి ( ఆళ్వార్ అనగా ఎవరైతే ఎమ్పెరుమాన్ కల్యాణగుణములలో, దివ్య సౌందర్యములో  మునిగితేలుదురోవారు, ఈ వాచక శబ్దాన్ని భగవానుని  ప్రియభక్తులకు వాడుదురు) –  తిరుమజిశై ఆళ్వార్ భగవంతుని నామ ,రూప, గుణము మొదలగు కళ్యాణగుణములను కలిగి ఉండడముచే, ఆరావముదఎమ్పెరుమాన్ కూడా ఆరావముదాళ్వార్ గా ప్రసిద్దిగాంచిరి.

భగవానుని మరియు వారి దాసులతో మనకు అటువంటి సంభందమును  నిత్యము కలిగేలా అలాగే ఆళ్వార్ దివ్యకృప ప్రసరించేలా ఆళ్వార్ శ్రీచరణారవిందములయందు ప్రార్థిస్తాము.

తిరుమజిశై ఆళ్వార్  తనియన్:

శక్తి పంచమయ విగ్రహాత్మనే శుక్తికారజాత చిత్త హారిణే |

ముక్తిదాయక మురారి పాదయో:  భక్తిసార మునయే నమో నమ:||

అడియేన్: నల్లా శశిధర్   రామానుజదాస

Source

2 thoughts on “తిరుమజిశై ఆళ్వార్

 1. Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu

 2. Pingback: కూరత్తాళ్వాన్ | guruparamparai telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s