Monthly Archives: March 2015

శ్రీ శ్రుతప్రకాశికభట్టర్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమత్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

అవతార స్థలము~:శ్రీరంగము

ఆచార్యులు~: వేదవ్యాసభట్టర్, నడాదూర్ అమ్మాళ్

శ్రీ సూక్తులు: శ్రుతప్రకాశిక, శ్రుతప్రదీపక, వేదార్ధసంగ్రహము వ్యాఖ్యానము(తాత్పర్యదీపిక), శరణాగతిగద్యము మరియు సుబాలోపనిషత్తులకు వ్యాఖ్యానము, శుకపక్షీయము.

శ్రీపరాశరభట్టర్ పుత్రులు శ్రీవేదవ్యాసభట్టర్ పౌత్రులుగా అవతరించిన శ్రీశ్రుతప్రకాశికభట్టర్ శ్రీవైష్ణవసాంప్రదాయములో సుప్రసిద్ధ ఆచార్యపురుషులు. శ్రీభాష్యమునకు శ్రుతప్రకాశిక మరియు శ్రుతప్రదీపకలను మిక్కిలి ప్రశస్తములు, గహనములు అగు వ్యాఖ్యానములు చేశారు. ఈ వ్యాఖ్యానముల నామకరణముద్వారా తాము ఎంపెరుమానార్ నుంచి నడాదూర్ అమ్మాళ్ వరకు ముఖతః శ్రోత్రపరంపరగా వచ్చిన సూత్రములనే గ్రంథీకరించామని తెలియజేశారు.

శ్రుతప్రకాశికభట్టర్ శ్రీభాష్యమును నడాదూర్ అమ్మాళ్ వద్ద అధ్యయనము చేశారు. భట్టర్ ప్రజ్ఞను, సునిశితబుద్దిని గమనించిన అమ్మాళ్, భట్టర్ వచ్చిన తరువాతనే కాలక్షేపము ప్రారంభము చేసేవారు.  విషయమును గ్రహించిన కొందరు శిష్యులు అమ్మాళ్, భట్టర్ వారి వంశప్రాశశ్త్యమువలననే వారిని ఎక్కువగా ఆదరించుచున్నారని ఆరోపించారు. అమ్మాళ్ వారందరకు భట్టర్ వారి ప్రజ్ఞాపాటవములు తెలియజేయుటకు, ఒకసారి అధ్యాపనమును అకస్మాత్తుగా ఆపి, క్రితం రోజు తాము అదే విషయము గురించి చేసిన వివరణమును ప్రశ్నించిరి. అప్పుడు భట్టర్ అందరును ఆశ్చర్యచకితులు అగునట్లు, వినినది వినినట్టు సమాధానము ఇచ్చారు. అప్పుడు అమ్మాళ్ శిష్యులకు భట్టర్ ప్రజ్ఞాపాటవము అవగతము అయినది.

నంపిళ్ళై మరియు పెరియవాచ్ఛాన్పిళ్ళై మొదలగు వారు దివ్యప్రబంధమునకు వ్యాఖ్యానములు రచించి, ఆళ్వార్ల భావపరంపరలను శాశ్వతముగా విస్తరింపచేసినట్లు, శ్రుతప్రకాశికభట్టర్ శ్రీభాష్యము, వేదార్ధసంగ్రహము మొడలగు వ్యాఖ్యానములు రచించి సంస్కృతవేదాంతమును విస్తరింపచేసిరి.

గొప్ప జ్ఞాని మరియు నడాదూర్ అమ్మాళ్ ప్రియశిష్యులు అయిన శ్రీశ్రుతప్రకాశికభట్టర్ యొక్క జీవితమునుండి కొన్ని ముఖ్యమైన ఘట్టములను దర్శించాము. వారి పాదకమలములను ఆశ్రయించి, వారి భాగవతనిష్ఠలో కొంత అయినా పొందెదము. 

శ్రుతప్రకాశికభట్టర్ తనియన్

యతీంద్ర కృత భాష్యార్ధా యద్ వ్యాక్యానేన దర్శితాః
వరమ్ సుదర్శనార్యమ్ తమ్ వన్దే కూర కులాధిపమ్

అడియేన్ అనంతరామ రామానుజదాసుడు

 archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source: http://guruparamparai.wordpress.com/2013/04/16/srutha-prakasika-bhattar/

నడాదూర్ అమ్మాళ్

   శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వవరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

engaLazhwan

                       ఎంగలాళ్వాన్ శ్రీచరణములలో నడాదూర్ అమ్మాళ్

తిరునక్షత్రము:  చైత్ర,  చిత్త

అవతార స్థలము:కాంచీపురం

ఆచార్యులు: ఎంగలాళ్వాన్

శిష్యులు: శ్రీ శ్రుతప్రకాశికభట్టర్  (సుదర్శన సూరి), శ్రీ కిడాంబి అప్పుళ్ళార్ మొదలగువారు

పరమపదము చేరిన ప్రదేశము: కాంచీపురం

శ్రీ సూక్తులు: తత్త్వసారము, పరత్వాది పంచకము (లఘువివరణము – http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-parathvadhi.html), గజేంద్రమోక్ష శ్లోకద్వయము, పరమార్ద శ్లోక ద్వయము, ప్రపన్న పారిజాతము, చరమోపాయసంగ్రహము, శ్రీభాష్య ఉపన్యాసము, ప్రమేయ మాలై మొదలగునవి.

కాంచీపురంలో అవతరించిన వీరి నామధేయము వరదరాజన్. ఎమ్పెరుమానార్ స్థాపించిన శ్రీభాష్య సింహాసనాధిపతులలో ఒకరు అయిన నడాదూర్ ఆళ్వాన్ మునిమనుమలు.

ఎంగళాల్వాన్  కాంచీపురమ్ దేవపెరుమాళ్కు క్షీరకైంకర్యము చేస్తూ ఉండేవారు.  క్షీరమును వేడి చేయడములో,  ఆ క్షీరమును దేవపెరుమళ్కు సమర్పించడములో, దేవపెరుమాళ్ పట్ల మాతృత్వభావము చూపెడివారు.  అందువలన  దేవపెరుమాళ్ వీరిని “అమ్మాళ్” మరియు “వాత్స్య వరదాచార్యులు” అని  ప్రేమతో సత్కరించారు.

ఎంగళాల్వాన్  శ్రీభాష్యము అధ్యాపనమునకు పితామహులు అయిన నడాదూర్ ఆళ్వాన్ ను ఆశ్రయించగా, వారు వయోభారముచేత ఎంగళాల్వాన్నుఅశ్రయించమనిరి. అమ్మాళ్ ఎంగళాల్వాన్ తిరుమాళిగను చేరి, ద్వారమును తట్టగా, ఎంగళాల్వాన్ “వచ్చినది ఎవరు” అని అడుగగా, అమ్మాళ్ “నేను వరదన్” అని సమాధానము ఇచ్చారు. అప్పుడు ఎంగళాల్వాన్  అమ్మాళ్ను ” ‘నేను’ అనేది  నశించిన తరువాత రమ్మ” ని అన్నారు. అమ్మాళ్ పితామహులను చేరి జరిగిన వృత్తాంతము తెలియజేయగా, వారు “నేను” అని స్వపరిచయము చేసుకొనుట అహంకారపూరితము కావున, “అడియేన్” అని వినమ్రముగా అహంకారరహితముగ చేయవలెను అని ఆదేశించిరి. అమ్మాళ్ మరల ఎంగళాల్వాన్ తిరుమాళిగను చేరి, ద్వారమును తట్టగా, వారు “వచ్చినది ఎవరు” అని అడుగగా, అమ్మాళ్ “అడియేన్ వరదన్ దాసన్” అని సమాధానము ఇచ్చిరి. ఈ సమాధానముతొ తృప్తి చెందిన ఎంగళాల్వాన్ , అమ్మాళ్ను స్వాగతించి, శిష్యునిగా స్వీకరించి, వారికి సాంప్రదాయరహస్యములను విశదీకరించిరి.  అమ్మాళ్ శ్రీవైష్ణవ సాంప్రదాయ విశిష్ఠులుగా ప్రసిద్ది చెందడముతో, వారి అచార్యులు అయిన  ఎంగళాల్వాన్  “అమ్మాళాచార్యులు” గా కొనియాడబడిరి.

అమ్మాళ్ శిష్యులలో అగ్రగణ్యులయిన శ్రుతప్రకాశికభట్టర్ (శ్రీవేదవ్యాసభట్టర్ మునిమనమలు), అమ్మాళ్ వద్ద శ్రీభాష్యము అధ్యయనము చేసి, శ్రీభాష్యమునకు శ్రుతప్రకాశిక అను వ్యాఖ్యానము మరియు వేదార్ధసంగ్రహము, శరణాగతిగద్యములకు వ్యాఖ్యానములు చేసిరి.

ఒకపరి అమ్మాళ్ శ్రీభాష్యప్రవచనము చేయుచుండగా, ఒక శిష్యుడు భక్తియోగమును ఆచరించుటలో క్లిష్ఠతను మనవి చేయగా, అమ్మాళ్ వారికి శరణాగతిని సూచించిరి. శిష్యులు శరణాగతి కూడ మిగుల కష్టసాధ్యమని మనవి చేయగా, అమ్మాళ్ వారితొ “ఉజ్జీవనమునకు రామానుజులవారి పాదకమలములనే శరణ్యముల”ని భావించవలెనని ఆదేశించిరి.

చరమోపాయ నిర్ణయములో మరి ఒక వృత్తాంతము తెలుపబడినది.

నడాదూర్ అమ్మాళ్ శిష్యులకు శ్రీభాష్యము ప్రవచించుచుండిరి. వారిలో కొందరు
“జీవులకు భక్తియోగమును ఆచరించుట దుస్సాధ్యము (ఎందువలననగా, భక్తియోగము ఆచరించగోరు జీవులకు పురుషులు మరియు త్ర్రైవర్ణికులు(బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు) అయి ఉండుట అను మొదలగు లక్షణములు ఉండవలెను) మరియు జీవాత్మకు ప్రపత్తి చేయుట స్వరూపవిరుధ్ధము (ఎందువలననగా, జీవుడు పరమాత్మకు దాసుడు, పరతంత్రుడు అయి ఉండటము వలన ఉజ్జీవనము కొరకు తానై ఏమి ఆచరించుటకు అధికారము లేకుండుట వలన), మరి జీవుడు ఉజ్జీవనము పొందుట ఎట్లూ?” అని ప్రశ్నించిరి. ఈ ప్రశ్నకు నడాదూర్ అమ్మాళ్ “అప్పుడు జీవునకు ఎంపెరుమానార్ అభిమానమునకు పాత్రము అయి ఉండుటయే చరమోపాయము. మరియొక ఉపాయము లేదు. ఇది నా ధృఢనిశ్చయము” అని పలికిరి.అమ్మాళ్ చరమసందేశము ప్రసిద్ధమైన శ్లోకరూపములో:

ప్రయాణకాలే చతురస్స్వశిష్యాన్ పదాస్తికస్తాన్ వరదోహి వీక్ష్య
భక్తి ప్రపత్తి యది దుష్కరేవః రామానుజార్యమ్ నమత్యేవధీత్

ఆమ్మాళ్ చివరి దినములలో వారి శిష్యులు తమకు ఏది శరణ్యము అని ప్రశ్నించగా వారు “భక్తి మరియు ప్రపత్తి మీ స్వరూపమునకు తగినవి కాదు. అందువలన మీరు ఎమ్పెరుమానర్లను ఆశ్రయించి, వారికే ఆధార్యము కలిగి ఉండినచో మీకు ఉజ్జీవనము కలుగును” అని సమాధానము ఇచ్చారు.

వార్తామాలైనందు అమ్మాళ్ గురించి కొన్ని ఐతిహ్యములు ప్రస్తావించబడినవి.

  • 118 – ఎంగళాల్వాన్ నడాదూర్ అమ్మాళ్కు చరమశ్లోకమును వివరించుచుండగా,  “సర్వధర్మాన్ పరిత్యజ్య” వద్ద అమ్మాళ్ పరమాత్మ శాస్త్రములందు కల ఇతర సకల ఉపాయములను త్యజించుమని ఏ విధముగా  అంత స్వాతంత్ర్యముతో  ఆదేశించుచున్నారు అని ఆశ్చర్యమును వ్యక్తము చేశారు. అప్పుడు ఎంగళాల్వాన్ “నిరంకుశస్వాతంత్ర్యము పరమాత్మకు స్వభావసిద్ధము కావున ఆ ఆదేశము శాస్త్రసమ్మతము. జీవులు పరమాత్మకు పరతంత్రులు కావటమువలన, వారు పరమాత్మ కంటె వేరగు ఉపాయములను ఆశ్రయించుట స్వరూపవిరుద్ధము కావున, పరమాత్మను మాత్రమే రక్షకముగా భావించవలెనను అదేశముతో జీవులను సంసారమునుండి ఉజ్జీవింపచేయుచున్నారు.  అందువలన పరమాత్మ ఆదేశము ఆయన స్వభావోచితము” అని పలికిరి.
  • 198 – ఒకపరి నడాదూర్ అమ్మాళ్ ఆలిపిళ్ళాన్ అను  (బహుశా అబ్రాహ్మణ లేక ఆచార్యపురుషత్వము లేని)  శ్రీవైష్ణవునితో ప్రసాదమును స్వీకరించుచుండగా చూసిన పెరుంగూర్పిళ్ళై ఆనందముతో ” నేను తమని  ఈ శ్రీవైష్ణవునితో కలసిమెలసి ఉండుట చూచియుండని యెడల వర్ణాశ్రమధర్మములు ఎల్లప్పుడూ పాటించవలెనననే సామాన్యధర్మము  యొక్క ముఖ్యభావము నాకు గోచరించెడిది కాదు” అని పలికిరి. అప్పుడు అమ్మాళ్  “యధార్ధముగా పూర్ణుడైన ఆచార్యసంబంధము కలిగిన అందరు వ్యక్తులు, సమస్త వస్తువులు మనకు సేవ్యములు/స్వీకార్యములు. అటులనే నేను ఈ గొప్ప శ్రీవైష్ణవునితో ప్రసాదస్వీకారమను  అనుష్ఠానము మన పూర్వాచార్యులు ఆదేశించిన విశేషమైన భాగవతధర్మములో భాగముగానే భావించవలయున”ని సెలవిచ్చిరి.

మనవాళమానులు తమ పిళ్ళైలోకాచార్యుల తత్త్వత్రయవ్యాఖ్యానము సూత్రము 35 లో (http://ponnadi.blogspot.in/p/thathva-thrayam.html), జీవస్వాతంత్ర్యమును (జీవాత్మకు పరమాత్మచే ప్రసాదించబడినది) అనగా, కర్మాచరణములో జీవుని ప్రథమప్రయత్నము, పిమ్మట ఆ కర్మాచరణలో పరమాత్మ యొక్క సహాయసహకారములను స్పష్ఠపరచుటకై, నడాదూర్ అమ్మాళ్ యొక్క తత్త్వసారమునుంచి ఒక అద్భుతమైన శ్లోకమును ఉదహరించిరి.

పరమోత్కృష్ఠజ్ఞానమును కలిగినవారు, ఎంగళాల్వాన్లకు మిక్కిలి ప్రియతములు అయిన నడాదూర్ అమ్మాళ్ యొక్క జీవితమునుండి కొన్ని ముఖ్యమైన ఘట్టములను దర్శించాము. వారి పాదకమలములను ఆశ్రయించి, వారి భాగవతనిష్ఠలో కొంత అయినా పొందెదము. 

నడాదూర్ అమ్మాళ్ తనియన్:

వందేహమ్ వరదార్యమ్ తమ్ వత్సాభిజనభూషణమ్
భాష్యామృత ప్రధానాఢ్య సంజీవయతి మామపి

అడియేన్ అనంతరామ రామానుజదాసుడు

Source: http://guruparamparai.wordpress.com/2013/04/05/nadathur-ammal/

తిరువరంగత్తు అముదనార్

తిరువరంగత్తు అముదనార్

(శ్రీరంగామృత కవి)

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

Thiruvarangathu-Amudhanar

తిరువరంగత్తు అముదనార్

తిరునక్షత్రము: ఫాల్గుణ(ఫంగుణి) హస్తా నక్షత్రం

అవతార స్థలము: శ్రీరంగం

ఆచార్యులు:కూరత్తాళ్వాన్

పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగం

తిరువరంగత్తుఅముదనార్  పూర్వము పెరియకోయిల్ నంబిగా వ్యవరించబడెడి వారు. వీరు శ్రీరంగమున అధికార ప్రతినిధిగా  మరియు పురోహితులుగా(వేదపురాణ విన్నపము చదివెడివారు) ఉండెడి వారు. ప్రథమంగా వీరు శ్రీరంగ ఆలయములోని కార్యకలాపాలను సంస్కరించే  ఎంపెరుమానార్ (శ్రీరామానుజులు)  పై   ప్రతికూలంగా ఉండెడివారు. కాని  శ్రీమన్నారాయణుని దివ్యకటాక్షముతో అంతిమంగా ఎంపెరుమానార్ తో బాంధవ్యం ఏర్పడి  వారి కృప కు పాత్రులయ్యారు .

ఎప్పుడైతే ఎంపెరుమానార్ , పెరియపెరుమాళ్ చే ఉడయవర్(విభూతిద్వయనాయకులు)గా ప్రకటింపబడి ఆలయ సంస్కరణలను ఉత్తమ మార్గములో చేయదలచిరో పెరియకోయిల్ నంబి వీరిని అంత సులువుగా అంగీకరించలేదు. ఎంపెరుమానార్ చాలా విసుగుచెంది మొదట వీరిని పదవి నుండి తీసివేయాలని నిర్ణయించుకున్నారు. కాని ఓ రోజు ఎంపెరుమానార్, పెరియపెరుమాళ్ తిరువీధి/పురప్పాడు గురించి ఎదురుచూస్తునప్పుడు, స్వామి  వీరి స్వప్ననమున  సాక్షాత్కరించి పెరియకోయిల్ నంబి తనకు చాలా కాలము నుండి సేవచేస్తున్న ఆప్తుడి గా సూచించారు.

ఎంపెరుమానార్ , పెరియకోయిల్ నంబిని ఉద్ధరించడానికి మరియు మార్గనిర్ధేశం చేయడానికి,  తాను చేయు సంస్కరణలకు తగ్గట్టుగా తయారుకావడానికి కూరత్తాళ్వాన్ ను నియమించారు. ఆళ్వాన్ వారిని ప్రభావశీలురుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అయితే  పెరియకోయిల్ నంబి తాను ఎంపెరుమానార్ కు శిష్యులు కావాలని ఆశించారు. కాని  పెరియకోయిల్ నంబిని, తనను ఉద్ధరించిన కూరత్తళ్వాన్  ను ఆచార్యులుగా స్వీకరించవలసినదని ఎంపెరుమానార్ సూచించారు. పెరియకోయిల్ నంబి తన సాంప్రదాయ సామర్ధ్యముతో తమిళభాషలో రాసిన అమృతము వంటి పద్యముల వలన ఎంపెరుమానార్  చే ‘అముదనార్’ అనే నామంతో వ్యవహరింపబడ్డారు. క్రమంగా అముదనార్  ఆళ్వాన్ మరియు ఎంపెరుమానార్ల తో  తమ బాంధవ్యమును పెంచుకున్నారు.

అముదనార్ పెరియకోయిల్ అధికార నియంత్రణను ఎంపెరుమానార్ కు  అప్పగించుట

అముదనార్ తల్లిగారు పరమపదించినప్పుడు 11వ రోజున జరుగు ఏకోధిష్ఠమున, మరణించిన వ్యక్తి శరీరమును ఒకరి యందు భావించి వారికి విశేషముగ ఆతిథ్యమును ఇవ్వవలసి ఉండును.   చివరన  ఆ ఆతిథ్యము స్వీకరించిన వారిని ఆతిథ్యము ఇచ్చిన వారు ‘మీరు సంతృప్తులయ్యారా’ అని అడగాలి. స్వీకరించినవారు పూర్తిగా ‘సంతృప్తులమయ్యాము’ అంటేనే ఆ కార్యము సఫలవుతుంది. దీనిలో విశేషమేమనగా ఎవరైతే ఈ ఆతిథ్యమును ఇస్తారో వారు ఒక సంవత్సరము వరకు ఆలయ కైంకర్యమును చేయరాదనే నియమం  ఉండెడిది ఆరోజుల్లో. అముదనార్ ఈ కార్యానికై ఉన్నత లక్షణాలు గల  శ్రీవైష్ణవుడు కావాలని  ఎంపెరుమానార్ ఆశ్రయిస్తారు.  ఆళ్వాన్ ను వెళ్లవలసినదిగా ఎంపెరుమానార్ నియమించగా ఆళ్వాన్ సంతోషముతో అంగీకరిస్తారు. ఆ ఆతిథ్యకార్యము ముగియగా అముదనార్ , ఆళ్వాన్ ను సంతృప్తులయ్యారా అని అడుగగా వారు ఆలయ నియంత్రణను ఎంపెరుమానార్ కు అప్పగిస్తే తాము సంతృప్తులము అవతామన్నారు. దీనికి అంగీకరించిన అముదనార్ తమ మాటను నిలబెట్టుకొనుటకై ఆలయ తాళం చెవులను  మరియు నియంత్రణను ఆళ్వాన్ ద్వారా ఎంపెరుమానార్ కు అప్పగించారు.   కాలక్రమేణ అముదనార్ తమ పౌరోహిత్యమును కూడా ఆళ్వాన్(ఇప్పటికి శ్రీరంగమున మనం ఆళ్వాన్ యొక్క వారసులు కైంకర్యమును  చేయుటను సేవించవచ్చు) కు ఇచ్చివేసారు. అధికారం ఇచ్చినప్పటి నుండి అముదనార్ రానురాను ఆలయ కైంకర్యమునకు దూరమయ్యారు. ఎంపెరుమానార్ ఒకపరి తిరువరంగపెరుమాళ్ అరైయర్ దగ్గరకు వెళ్ళి ‘ఇయఱ్పా; గాన అధికారమును  తమకు ఇవ్వవలసినదని ప్రార్థించారు. వారు దీనికి ఆమోదించి  ఆ గానాధికారాన్ని ఎంపెరుమానార్ కి ఇచ్చారు. ఎంపెరుమానార్ ఈ ‘ఇయఱ్పా’ ను అముదనార్ కు అధికరింపచేసి నిత్యము శ్రీరంగనాథుని కైంకర్యమున దీనిని ఆలపించ వలసిన నిత్య కైంకర్యమును వారికి ఏర్పరిచారు.

శ్రీరామానుజనూర్ట్రందాది అవతారము మరియు వైభవం

serthi-amudhanar-azhwan-emperumanar

శ్రీరంగనాయకి సమేత నంపెరుమాళ్, అముదనార్, కూరత్తాళ్వాన్, ఎంపెరుమానార్

 కొంతకాలం తర్వాత అముదనార్ ఎంపెరుమానార్ పైన  ‘రామానుజ నూర్ట్రందాది’ ని (108పాశురములు) రాసి ఎంపెరుమాన్ మరియు ఎంపెరుమానార్ సన్నిధిన ఉంచారు. నంపెరుమాళ్ ఒకసారి తన బ్రహ్మోత్సవ చివరి రోజున ఎంపెరుమానార్ ను ఇక తమ ఊరేగింపు గోష్ఠిలో పాల్గొనరాదని  మరియు శ్రీవైష్ణవులకు  రామానుజ నూర్ట్రందాది ని ఊరేగింపు గోష్ఠిలో  సేవించవలెనని, అది కాలక్రమేణ ప్రతి పురప్పాడులో ఇక నిత్య కృత్యము అవ్వాలని నిర్ణయించారు.

ఎంపెరుమాన్ యొక్క అభీష్ఠమున ఎరిగిన ఎంపెరుమానార్ , అముదనార్  యొక్క ఈ గొప్పకార్యమును  గ్రహించి , ముదలాయిరమ్ నకు ఎలాగైతే మధురకవిఆళ్వార్ కూర్చిన (నమ్మాళ్వార్ వైభవమును సూచించు) కణ్ణినుణ్ శిరుత్తాంబు అంతిమంగా(శాత్తుమరై) ఉండునో    అలాగే ఇయఱ్పా కు ఈ రామానుజ నూర్ట్రందాది  కూడ ఉండాలని నియమనం చేసారు.

ఈ ప్రబంధం  ప్రపన్నగాయత్రిగా ప్రసిద్ధి పొందినది, అలాగే ఎంపెరుమానార్  అందరి శ్రీవైష్ణవులకు ప్రతి రోజు ఒక్కసారైన గాయత్రిజపం తో సమానంగా బ్రహ్మోపదేశం(ఉపనయనవీతులు)పొందిన వారందరు తప్పని సరిగ్గా  దీనిని అనుసంధించాలని నియమనం చేసారు.

రామానుజ నూర్ట్రందాది లో ఎంపెరుమానార్  యొక్క దివ్యనామము ప్రతిపాశురంలో పొందుపరచబడింది. కావుననే దీనికి రామానుజ నూర్ట్రందాది అనే నామము స్థిరమైనది.ఇది  ఆచార్య అభిమాన నిష్ఠులకు (ఆచార్యుల దయకు   పాత్రులైనవారు) అన్నింటిని సమకూర్చునది. మరియు ఈ ప్రబంధం ఎవరైతే  ఆచార్యునిపై దృష్ఠిని నిలుపుతారో వారికి ఇక ఏ స్వప్రయత్నము చేయడం  అవసరమే లేకుండ భగవత్ సంబంధముకూడ ఏర్పడును. అందుకే మన పూర్వాచార్యులందరు మనం నిత్యము శ్రీరామానుజుల దివ్య పాదారవిందములపై పూర్తిగా ఆధారపడాలని సూచించారు.

శ్రీవైష్ణవ పండితుల్లో  నాయకుడైన  నాడాదూర్ అమ్మాళ్ అనే వారు దివ్య ప్రబంధమగు రామానుజ నూర్ట్రందాది లో  45వ పాశురమగు ‘పేరొన్ఱు మత్తిల్లై’  మరియు  ‘నిన్ఱవణ్ కీర్తియుం’  అను 76 వ పాశురం ఆధారంగా   ఎంపెరుమానార్ మనకు లక్ష్యం మరియు దానిని చేరుటకు సాధనం కూడా అని కృపచేసారు.

 పెరియవాచ్చాన్ పిళ్ళై తిరుక్కుమారులగు నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై అను వారు  తమ కృతమగు చరమోపాయనిష్ఠ (http://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html) అను  గ్రంథమున ఎంపెరుమానార్  వైభవమును తెలుపుటకు రామానుజ నూర్ట్రందాది ని  విస్తృతంగా ఉపయోగించారు.

మామునులు  రామానుజనూర్ట్రందాది పై  సంక్షేపముగా   సుందరమగు ఒక వ్యాఖ్యానాన్ని రచించారు. పరిచయ భాగంలో అముదనార్ మరియు రామానుజనూర్ట్రందాది వైభవమును తెలిపిరి. ఆ అమృత రుచిని ఇప్పుడు మనం ఆస్వాదిస్తాము.

తిరుమంత్రం మరియు ఆళ్వారు పాశుర సారము  చరమ పర్వనిష్ఠ(సర్వం ఆచార్యులపై ఆధారపడి ఉండుట). ఇది నమ్మాళ్వార్ విషయమున మధురకవి ఆళ్వార్ వెల్లడించిరి. మధురకవిఆళ్వార్ వలె అముదనార్ కూడ సర్వం ఎంపెరుమానార్  మీద ఆధారపడ్డారు మరియు తమ ప్రబంధములో నిరూపించారు కూడ.

అముదనార్  ఆళ్వాన్ యొక్క అలుపెరుగని మరియు అపార కరుణా ప్రయత్నముతో మరియు   ఎంపెరుమానార్  దివ్యకృపచే సంస్కరించబడ్డారు. ఎలాగైతే మధురకవిఆళ్వార్ తమ 10 పాశురములలోని తమ నిష్ఠతో వెల్లడింపబడ్డారో, అముదనార్  తమ 108 పాశురములో ఆచార్య నిష్ఠను ఈ జగత్తులో    ప్రతివారు ఉజ్జీవించి లాభపడుటకు మరియు ఆచార్య నిష్ఠులకు చాల ప్రధాన సూత్రముగా ఆచార్య నిష్ఠను  బహిర్గతం చేసారు. మామునులు కూడ దీనిని ఉపవీతులకు(ఉపనయన సంస్కారవంతులకు) ప్రధానమగు గాయత్రి మంత్రము వలె ప్రతి శ్రీవైష్ణవ ప్రపన్నుడికి అత్యంత ప్రధానమైనదని,  దీనిని ప్రపన్నగాయత్రిగా వ్యవహరించి  ప్రతిదినం శ్రీవైష్ణవుని చే పఠింపబడాలి అని వెల్లడించారు..

అముదనార్ ప్రావీణ్యత

అముదనార్ తమిళం మరియు సంస్కృతములలో నిష్ణాతులు. ఇది అతనికి అరుళిచ్చెయళ్ లో చాలా పాశురములకు సుందరమగు అర్థాలను తెలుపుటకు తోడ్పడింది.

ఇక్కడ దానికి ఉదాహరణలను సేవిద్దాం:

తిరువిరుత్తం 72వ పాశురమున, నంపిళ్ళై గారు అముదనార్ యొక్క కథన్నాన్నిఅందంగా వర్ణిస్తారు. ఈ పాశురమున నమ్మాళ్వార్ ,  పరాంకుశ నాయికా అవస్థ(స్థితి) భావనలో ఉన్నప్పుడు  గాఢాంధ రాత్రిన ఎంపెరుమాన్ తో వియోగం కలిగినప్పుడు  ఆ భావనను ఆందోళనగా  అనుభవిస్తారు.  సాధారణంగా లోకమున ప్రేయసి ప్రియులు వియోగ దుఃఖాన్ని ఎక్కువగా రాత్రి సమయాన అనుభవిస్తారు.  ఆ సమాయాన సన్నని  చంద్రవంక  దర్శనం వలన చీకటి కొంత తగ్గును. సాధారణంగా ఈ చల్లని నెలవంకను చూసి ప్రేమికుల సమూహం ఆనందాన్ని అనుభవిస్తారు, కాని వియోగమున ఇది బాధాకరం. పరాకుంశనాయకి  ఈ  నెలవంక చల్లదనం వల్ల  ఎంపెరుమాన్ విషయాన తన మానసిక స్థితిని  అసలు నియంత్రించుకోలేక పోయినది . ఈ విషయాన్ని అముదనార్ ఉపమానంతో  చాలా చక్కగా వర్ణించారు. ఒకసారి భయస్థుడగు ఒక బ్రాహ్మణుడు రాత్రి సమయాన అడవి గుండా ప్రాయాణిస్తున్నాడు. ఆ సమయాన ఒక అడవి మృగం అతన్ని వేటాడగా దాన్నుండి తప్పించుకొని ఎలాగో ఒక చెట్టుపైన ఎక్కాడు. ఆ మృగం  ఈ బ్రాహ్మణుడు దిగగానే  ఆరగిస్తామని క్రింద ఎదురుచూడ సాగింది. ఆ బ్రాహ్మణుడు చాలా భయపడసాగాడు . ఆ సమయాన్నే ఒక పులి ఆ వైపుగా వచ్చి ఆ అడవి మృగాన్ని చంపి తినివేసి  ఈ బ్రాహ్మణుడు దిగగానే  ఆరగిస్తామని క్రింద ఎదురుచూడ సాగింది. ఆ బ్రాహ్మణుడు క్రితము కన్నాఇంకా ఎక్కువగా భయపడసాగాడు పులి తినునేమో అని. అదే విధంగా ఈ పరాంకుశనాయకి  అసలు ఆదిలోనే చీకటికి భయపడ సాగింది ఆపై నెలవంక చల్లదనం – ఇలా అభివర్ణించారు అముదనార్.

భట్టర్ మరియు అముదనార్

                   భట్టర్ తాను ఆళ్వాన్ కుమారుడని అహంభావించేవారు.  తాను స్వయంగా తమ సహస్రనామ భాష్యములో ఎంపెమానార్ తో గొప్ప సంబంధము గల ఆళ్వాన్ కు తాము జన్మించామని చెప్పుకున్నారు. అముదనార్ కూడ ఆళ్వాన్ తో సంబంధమును తమ రామానుజనూర్ట్రందాది  లో 7వ పాశురాన చెప్పుకున్నారు.

ఒకసారి అముదనార్  అత్యంత పారవశ్యంతో వేరొక శ్రీవైష్ణవుడితో భట్టర్ కు ఇలా కబురు  పంపారు “ మీకు కేవలం ఆళ్వాన్ తో  శారీరక సంబంధము మాత్రమే,  కాని మాకు వారితో ఙ్ఞాన సంబంధము” అని.  భట్టర్ దానికి ప్రతిసమాధానంగా “ అది సరే ! కాని మీరు అలా ఆత్మస్తుతి చేసుకోరాదు కదా” అనిరి.

                   ఆళ్వాన్ తో సంబంధము చాల విశేషమైనదని కావుననే  అది అముదనార్ గర్వమునకు దారితీసినది- అని  దీనిలోని వైభవ విషయములో మన పూర్వాచార్యుల అభిమతం. కాని వారు ఈ చర్చల సమస్యలను అంతగా ఇతరులు నొచ్చుకోకుండా ఉండేలా చూసారు. ఆ విషయం ఒక ఉదార మార్గమున  పరిష్కరించారు,  ఇలాంటి సంఘటన మనం అర్థము చేసుకుంటామని.  మనం మన పూర్వాచార్యుల నిజాయితీని గొప్పగా అభినందించాలి, ఎందుకనగా ఇలాంటి సంఘటనలను కూడ వారు చాప క్రింద(సాధారణముగా పరిష్కరించలేనిది) దాయకుండా బహిర్గతం  చేసారు.

చివరగా మామునులు, తమ  ఆర్తిప్రబంధములోని 40వ పాశురాన   – ఈ సంసార సాగరములో మునగ కుండ తప్పించునది అదేనని  గుర్తించారు. మనం ఎంపెరుమానార్ దివ్య పాదార విందముల యందు సదా ఆధీనులమై ఉండాలి, శ్రీరామానుజుల  ప్రియ భక్తులతో కాలం గడపాలి. కబురు రామానుజనూర్ట్రందాదిని సదా పఠనం/ధ్యానం చేయాలి.

మనం కొంత మాత్రమే  తిరువరంగత్తు అముదనార్ వైభవమును అనుభవించాము. వారు  పూర్తిగా భాగవత నిష్ఠలో ఉండి సదా ఎంపెరుమానార్ కు మరియు ఆళ్వాన్ కు అత్యంత ప్రియతములై ఉండిరి. మనం కూడ వారి  భాగవత నిష్ఠలో కొత నైన రావాలని వారి శ్రీపాదాలను ప్రార్థిస్తాము.

తిరువరంగత్త అముదనార్ తనియ:

శ్రీరంగే మీనహస్తే చ జాతమ్ రంగార్యనందనం |

రామానుజ పదస్కంధం రంగనాథ గురుంభజే  ||

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source: http://guruparamparai.wordpress.com/2013/03/26/thiruvarangathu-amudhanar/