Monthly Archives: December 2013

కులశేఖర ఆళ్వార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

kulasekarazhwar

తిరునక్షత్రము: మాఘ మాసము (మాశి), పునర్వసు నక్షత్రం

అవతార స్తలము: తిరువంజిక్కళమ్

ఆచార్యులు: విష్వక్సేనులు

శ్రీ సూక్తులు: ముకుందమాల, పెరుమాళ్ తిరుమొళి

పరమపదము చేరిన ప్రదేశము: మన్నార్ కోయిల్ (తిరునల్వేలి దగ్గర)

కులశేఖరాళ్వార్ క్షత్రియ కులములో (రజో గుణ ప్రధానమైనది) జన్మించినప్పటికి భగవంతుని మరియు భక్తుల యెడల చాలా విధేయుడై ఉండెడివారు. రాముడి యందు గల అనన్య సామాన్యమైన భక్తి వలన ఈ ఆళ్వార్ ‘కులశేఖర పెరుమాళ్’ (పెరుమాళ్ అనేది భగవంతుని సంబోధించు పదం) గా ప్రసిద్దులైరి. తమపెరుమాళ్ తిరుమొళిలో మొదటి పదిగములో (10 పాశురముల సమూహం) (ఇరుళిరియ చ్చుడర్ మణిగళ్) పెరియ పెరుమాళ్ (శ్రీరంగనాధునకు)కు మంగళాశాసనము చేసిన వెంటనే తన రెండవ పదిగములో (తేట్టరున్ తిఱల్ తేనినై) శ్రీవైష్ణవుల వైభవమును తెలిపిరి. శ్రీవైష్ణవుల సంభందము వలన వీరు ప్రసిద్ధి పొందిరి. దీనిని వీరి చరిత్రలో మున్ముందు తెలుసుకుందాం.

జీవాత్మ అసలు స్వరూపము శేషత్వమే అని ఆళ్వార్ నిర్ణయించుకొని తామే స్వయంగా తమ పెరుమాళ్ తిరుమొళి చివర (10.7) ఈ విధముగా తెలిపిరి “తిల్లైనగర్ త్తిరుచిత్తిరకూడన్ తన్నుళ్ అరశ అమర్ న్దాన్ అడిశూడుమ్ అరశై అల్లాల్ అరశాగ ఎణ్ణేన్ మత్తరశు తానే” దీనర్థము: తిరుచిత్రకూట రాజు (గోవింద రాజ పెరుమాళ్) శ్రీపాద పద్మములను తప్ప మరేతర దానిని ఉపాయముగా నేను భావించను. జీవాత్మకు ఉండకూడని దేవతాంతర / విషయాంతర సంబంధములను ఈ వాక్యం ద్వారా స్పష్టముగా నిర్ధారించెను.

“అచిత్ వత్ పారతంత్ర్యం” వలె జీవాత్మ స్వరూపం ఉండాలని తిరువేంకట పదిగములో  4.9 లో తీర్మానించెను,

దాని వివరణ:

శెడియాయ వల్వినైగళ్ తీర్కుమ్ తిరుమాలే
నెడియానే వేఙ్గడవా! నిన్ కోయిలిన్ వాశల్
అడియారుమ్ వానవరుమ్ అరమ్బైయరుమ్ కిడన్దు ఇయఙ్గుమ్
పడియాయ్   క్కిడన్దు ఉన్ పవళ వాయ్ కాణ్బేనే||

“ఓ వేంకటేశా! అనాది కాలముగా ఆర్జించిన పాపాలను ఛేదించే వాడివై, తిరుమలలో వేంచేసి ఉండే నీ భక్తులు, దేవతలు కలసి సంచరించే నీ దివ్య సన్నిధి వాకిటిలో అందరు కాలితో తొక్కే గడపగా పడిఉండి పగడము వంటి పరమ భోగ్యమైన నీ అధరోష్ఠాన్ని ఎల్లప్పుడూ సేవించే భాగ్యాన్ని కలవాడను కావాలి.” అని కోరుకొనిరి.

పెరియ వాచ్చాన్ పిళ్ళై జీవాత్మకు ఉండు రెండు సంబంధములను గురించి ఈ విధముగా వివరించిరి.

  • పడియై కిడందు – అచిత్ (అచేతనములు) అను జీవాత్మ ఎల్లప్పుడూ భగవానుని ఎడల పూర్తి నియంత్రణను కలిగి ఉండవలెను. ఎలాగైతే చందనము మరియు పుష్పములు వాటి వ్యక్తిగత ఆసక్తి కాకుండా వినియోగదారుని ఆనందమును గురించి ఉంటాయో ఆ విధముగా.
  • ఉన్ పవళవాయ్ కాణ్బేనే –  చిత్ (చేతనములు) ఎల్లప్పుడూ భగవానుడు మా సేవను అంగీకరించి ఆ సేవచే ఆనందమును పొందుచున్నాడని గ్రహించవలెను. ఒక వేళ మేము ఆ సత్యమును గ్రహించని యెడల మాకు అచిత్ నకు ఏవిధమైన తేడా లేదు.

ఈ సూత్రమును “అచిత్ వత్ పారతన్త్రియమ్” అని పిలుచుదురు. దీనర్థము జీవాత్మ పూర్తిగా భగవానునిచే నియంత్రించబడును. ఇది మన శ్రీవైష్ణవ సిద్దాంతములో అతి ముఖ్యమైన సూత్రము.

ఇది వరకే మాముణులు తమ ‘అర్చావతార అనుభవము’ అనే సంచికలో కులశేఖరాళ్వార్  గొప్పతనమును వివరించారు. దానిని ఈ సైట్ లో చూడండి

http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-kulasekara.html.

భాగవతులను జన్మని బట్టి వారి యందు భేదమును చూపరాదని వివరించి చివరన నమ్మాళ్వార్ మరియు ఇతర మహానుభావుల గొప్పతనమును చెప్పిరి. మానవ జన్మ దుర్లభత్వమును వివరిస్తూ దానిని భగవత్ కైంకర్యము చేయుటకు అనుకూలముగా మలచు కోవాలి చెప్పిరి. వారు నిమ్నజాతిలో జన్మించిన మహాపురుషులు ఏవిధముగా కైంకర్యమును చేసిరో ఇక్కడ దృష్టాంతములతో సహా నాయనార్ ఉదాహరించెను.  87వ చూర్ణికలోని సారమును మరియు అది ఏవిధముగా కులశేఖరాళ్వార్ నకు అన్వయమవునో చూద్దాము.

“అన్ణైయ ఊర పునైయ అడియుమ్ పొడియుమ్ పడప్ పర్వత భవణన్ఙ్గళిలే ఏతేనుమాగ జణిక్కప్ పెఱుగిఱ తిర్యక్ స్తావర జణ్మన్ఙ్గళై పెరుమక్కళుమ్ పెరియోరుమ్ పరిగ్రహిత్తుప్ ప్రార్తిప్పర్గళ్”

నిత్యసూరులైన అనంత గరుడాదులు పానుపుగా (ఆదిశేషుడు), ఒక పక్షిలా (గరుడాళ్వార్), మొదలగు వాటిగా జన్మించుటకు అవకాశము కొరకు చూసెదరు. భగవానునికి తిరుత్తుళాయ్ (తులసి) అంటే మహా ప్రీతి అందుకనే ఆ తులసిని తన దివ్య శరీరమంతయు (తన శిరస్సుపై, భుజములపై, వక్షస్థలముపై) అలంకరించు కొందురని నమ్మాళ్వార్ వివరించిరి. కృష్ణుడు మరియు గోపికల పాద పద్మముల స్పర్శ కలిగి దివ్య స్థలమైన బృందావనములో మట్టిగానైన ఉండవలెనని పరాశర వ్యాస శుక మహర్షులు కోరు కొనిరి. కులశేఖరాళ్వార్  కూడా తిరువేంగడ కొండపై ఏదైనా ఒక వస్తువుగా పడి ఉండవలెనని కోరుకొనిరి. ఆళవందార్ కూడా ఒక శ్రీవైష్ణవుడి గృహములో పురుగానైనా జన్మించవలెనని కోరు కొనిరి. క్రింద చూర్ణికలో కులశేఖరాళ్వార్ కోరికని మాముణులు ఏవిధముగా వ్యాఖ్యానించిరో  చూద్దాము.

పెరుమాళ్ తిరుమొళి 4 వ పదిగములో, ఆళ్వార్ తిరువేగండముతో ఎదైనా ఒక సంబంధము కలిగి ఉండవలెనని కోరుకొనిరి – వారు నిత్యము తిరువేంగడముపై ఉండవలెనని కోరుకొనేవారు.

sri-srinivasar

వారికి గల కోరికలు~:

  • కొండపై గల కొలను దగ్గర ఒక పక్షిలా –
  • కొలనులో ఒక చేపలా – ఎందుకంటే –  ఒకవేళ  పక్షినైతే తిరువేంగడం నుండి దూరంగా ఎగిరి పోవచ్చునేమో?
  • భగవానుని కైంకర్యపరుల చేతిలో బంగారు పాత్రలా –  ఎందుకనగా చేపనైతే ఈదుతూ వెళ్ళి పోవచ్చునేమో?
  • చెట్టుపై ఒక పువ్వులా – ఎందుకంటే – బంగారపు తత్త్వం కలిగి ఉండడముచే అహంభావము కలిగి  ఙ్ఞానము దారితప్పు నేమో? .
  • ఒక పనికిరాని చెట్టులా – ఎందుకంటే –  ఒకసారి పువ్వుని వాడి, బయట పడివేయుదురు కదా.
  • ఒక నదిలా – ఎందుకంటే – పనికిరాని చెట్టుని ఒకరోజు తీసివేయుదురు కదా.
  • సన్నిధికి వెళ్ళు దారిలో మెట్లవలె – ఎందుకంటే – నది ఒక రోజు ఎండి పోవచ్చు కదా.
  • చివరకు గర్భగుడికి  ఎదురుగా గల మెట్టులా (దీనినే కులశేఖర పడి అని వ్యవహరించుదురు) ఎందుకంటే – మెట్లవలె ఉండడము వలన కొన్ని రోజుల తర్వాత  దారి మార్చవచ్చు.

ఏ విధంగానైన  నిత్యము తిరువేంకట నివాసం చేయవలెనని కోరుకొనిరి. పెరియ వాచ్చాన్ పిళ్ళై తన వ్యాఖ్యానములో ఈ విధముగా చెప్పిరి – తిరువేంకటముడైయాన్ స్వయముగా ఆ కొండతో నిత్య సంభదము కలిగి ఉండునని ఆళ్వార్ మరిచిరి.

కులశేఖరాళ్వార్లు తమ స్వలాభమును కాక్షించక పూర్తిగా భగవత్భాగవత సంభందము గురించే తపించెడివారు.

దీనిని మన మదిలో ఉంచుకొని వారి జీవిత చరిత్రను చూద్దాం.

శ్రీ కులశేఖర పెరుమాళ్ కొల్లినగర్ (తిరువన్జిక్కళమ్) అను రాజ్యములో క్షత్రియ వంశములో శ్రీకౌస్తుభం అంశముతో జన్మించిరి. వీరిని కొల్లి కావలన్, కొళియర్ కోన్, కూడల్ నాయకన్ మొదలగు నామములతో కూడా వ్యవహరించెదరు.

తనియన్ లో వివరించినట్టు మాఱ్ఱలరై  వీరంగెడుత్త శెంగోల్ కొల్లి కావలన్ విల్లవర్ కోన్  శేరన్ కులశేఖరన్ ముడివేందర్ శిఖామణియే” వీరు చేర రాజ్యమునకు రాజు, శత్రువులను నిర్మూలించే గొప్ప బలము కలిగిన రథములు, గుఱ్ఱములు, ఏనుగులు మరియు శత్రువులను ప్రారదోలే సైనికులను కలిగి ఉన్నారు. ఆళ్వార్ ధర్మ బద్ధంగా రాజ్యమును పరిపాలించెడివారు. శ్రీరాముని వలె బలుడైనప్పటికినీ ఎప్పుడు కూడా బలహీనులను ఇబ్బందులకు గురి చేసేవారు కాదు.

రాజైన ఆళ్వార్ సరైన నిర్ణయములతో రాజ్యమును తమ ఆధీనములో ఉంచు కొనేవారు.  శ్రీమన్నారాయణుడు మాత్రమే పరమపదమునకు మరియు సంసారమునకు సర్వాధికారి అని నమ్మేవారు. వారి నిర్హేతుక కృపచే, అపారమైన దైవిక విషయము లందు పరిఙ్ఞానమును కలిగి,  రజో/తమో గుణములను నిర్మూలించుకొని పూర్తిగా సత్వ గుణముచే భగవానుని దివ్య స్వరూపము, రూపము (అవతారము), గుణము, విభూతి (సంపద/శక్తి) మరియు చేష్ఠితములు (లీలలను) పూర్తిగా తెలుసుకొనిరి. భగవద్విషయమందు ఆలోచన లేకుండా తమ శరీర అవసరములను గురించి మాత్రమే చింతించే సంసారులను చూసి ఆళ్వార్ వేదన చెందెను. నమ్మాళ్వార్ చెప్పినట్లుగా సాంసారిక విషయాలు పెద్ద అగ్ని వంటిదని అది మానవుని శారీరక అవసరములందు మరలా మరలా వ్యామోహమును పెంపొందిచునని గ్రహించిరి. కులశేఖరాళ్వార్ తమ రాజ్యముతో ఎటువంటి సంబంధ పెట్టు కోకుండ శ్రీవిభీషణాళ్వాన్ వలే తమ సంపదను శ్రీ రాముని పాదాల వద్ద ఉంచి శరణు వేడెను.

ప్రాపంచిక విషయములను వదిలి ఎల్లప్పుడూ శ్రీరంగనాథున్ని గుణములను కీర్తించుదురో వారి ఎడల వ్యామోహమును పెంచు కొనిరి ఆళ్వార్. అధిక సమయమును శ్రీవైష్ణవులైన సాధువులతో  గడిపెడివారు. “అన్నియరంగన్ తిరుముట్రత్తు అడియార్” (అధికముగా తమ దినచర్యను శ్రీరంగనాధుని ఆలయములో గడిపెడివారు) అన్నట్లుగా గడిపెడివారు. ‘శ్రీరంగ యాత్ర చేయవలెననే కోరిక ఉంటే చాలు పరమపదము లభించునని’ అనే వాక్యముననుసరించి  సదా శ్రీరంగం గురించే ఆలోచించెడివారు.

స్వామి పుష్కరిణితో కూడిన తిరువేంగడంపై (తిరుమల) అధిక వ్యామోహమును ఏర్పరుచుకొనిరి. స్వామి పుష్కరిణి గంగా యమునాది నదుల కన్నా విశేషమైనదని కీర్తించబడెను. ఆండాళ్ కూడ  “వేంకటత్తైప్ పతియాగ వాళ్వీర్గాళ్” (సదా మానసికముగా తిరువేంకటముపై నివాసము చేయవలెను) అని చెప్పెను కదా. అక్కడ గొప్ప ఋషులు మరియు మహాత్ములు నిత్యవాసము చేయుదురు కారణం వారు కూడా అదే విధమైన కోరికని కలిగి ఉన్నారు కనుక. పెరుమాళ్  తిరుమొళి 4వ పదిగంలో  తిరుమల దివ్యదేశములో పక్షిలా, చెట్టులా, రాయిలా, నదిలా ఉండవలెనని ఆళ్వార్ కోరికను చూసితిమి కదా ఇదివరకు. ఇది కాకుండా  దివ్య దేశములలోని అర్చావతార భగవానున్ని వారి భక్తులను సేవించవలెనని కోరికను కలిగి ఉండిరి.

పురాణేతిహాసములను పరిశీలించి “ముకుందమాల” అను సంస్కృత శ్లోక గ్రంథమును వ్రాసిరి.

శ్రీరామాయణము గొప్పతనమును తెలుపు శ్లోకం:

వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే |
వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా||

వేద వేద్యుడు, వేదము చేత తెలియ బడేవాడు దశరథాత్మాజుడిగా అవతరించి నప్పుడు వేదము వాల్మీకి మహర్షికి ఆశువుగా రామాయణముగా అవతరించింది.

rama-pattabishekam

పై శ్లోక ప్రమాణంగా కులశేఖరాళ్వార్  ప్రతిరోజు దినచర్యగా శ్రీరామాయణాన్ని శ్రవణం చేస్తు  ప్రవచిస్తూ ఉండేవారు. ఆళ్వార్ ఒక్కొక్కసారి శ్రీరామాయణంలో తన్మయత్వంగా మునిగి తమను తాము మరచి పోతుండేవారు.

ఒకసారి ఉపన్యాసకుడు శ్రీరామాయణంలోని ఖరదూషణాదులు మరియు పదనాల్గు వేల మంది రాక్షసులు శ్రీరామునితో యుద్ధానికి సిద్ధమవుతుండగా శ్రీరాముడు ఒక గుహలో సీతాదేవిని ఇళయ పెరుమాళ్ (లక్ష్మణుని) సంరక్షణలో ఉంచి తానొక్కడే పదనాల్గు వేలమంది రాక్షసులతో ఒంటి చేత్తో ఎదుర్కొనుచుండగా, ఋషులందరు భయముతో చూస్తుండే ఘట్టం ప్రవచిస్తున్నారు. అది విన్న ఆళ్వార్ నిష్ఫల భావోద్వేగముతో శ్రీరామునికి యుద్ధములో సహకరించుటకు తన సేనలకు యుద్ధరంగం వైపు వెళ్ళుటకు సిద్ధం కావల్సినదని ఆఙ్ఞాపిస్తారు. దీనిని చూసిన మంత్రులు కొందరిని రాజు యాత్రకు ఎదురుగా వచ్చేలా చేసి వారితో  “మహారాజా శ్రీరాముడు యుద్ధములో విజయాన్ని వరించాడు, సీతాదేవి అతని గాయాలకు ఉపశమన చర్యలు చేస్తున్నది కావున మీరిక వెళ్ళవలసిన పనిలేదు” అని చెప్పించారు. ఆళ్వార్ సంతుష్టి చెంది తన రాజ్యానికి వెనుదిరిగాడు.

మంత్రులందరు ఆళ్వార్ వింత ప్రవర్తన గురించి ఆలోచించి శ్రీవైష్ణవుల అనుభంధ వ్యామోహము నుండి విడదీయాలని నిర్ణయించుకొన్నారు. మంత్రులందరు రాజును శ్రీవైష్ణవుల నుండి దూరం చేయుటకు ఒక యుక్తిని పన్నారు. వారు ఆళ్వార్ తిరువారాధన గది నుండి ఒక వజ్రాల నగను దొంగిలించి ఆ దొంగతనాన్ని అత్యంత సన్నిహితులైన శ్రీవైష్ణవులపై మోపుతారు.  ఇది తెలసిన ఆళ్వార్ విషనాగుతో ఉన్న ఒక కుండను తెప్పించి దానిలో తన చేతిని పెడుతూ “శ్రీవైష్ణవులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే  పాము నన్ను కాటు వేయును గాక”  అనగా, వారి నిజాయితికి ఆ పాము కాటువేయ లేదు. దీనిని చూసిన మంత్రులు సిగ్గుచెంది ఆ నగను తిరిగి ఇచ్చి వేసి ఆళ్వార్ కు మరియు ఆ శ్రీవైష్ణవులకు క్షమా ప్రార్ధన చేసిరి.

క్రమంగా, ఆళ్వార్  ఈ సంసారుల మధ్యన ఉండుటకు ఇష్టపడక, ‘శౌనక సంహిత’ లో చెప్పిన విధంగా “భగవంతుని కీర్తించని సంసారుల మధ్య నివసించుట ఒక అగ్ని గోళం మధ్యన ఉండుట లాటింది” అని విచారించిరి.

ఆళ్వార్ తన రాజ్య భారాన్ని, బాధ్యతలను తన కుమారుని చేతిలో ఉంచి వానికి పట్టాభిషేకం చేసి ఇలా నిర్ణయించుకొన్నాడు “ఆనాద శెల్వతత్తు అరంబైయర్గళ్ తార్చుళ వానాళుం శెళ్వముం మన్నాన్నరశుం యాన్ వేన్నాదెన్” (సేవకులచే పరివేష్టించబడి ఉండే వినోదాలను మరియు సంపదను ఇక కోరను)

ఆళ్వార్ తన సన్నిహితులైన శ్రీవైష్ణవులతో రాజ్యాన్నివదిలి శ్రీరంగమును చేరి బంగారపు పళ్ళెములో వజ్రము వలె ఉన్న(ఆదిశేషునిపై పవళించి ఉన్న) శ్రీరంగనాధున్ని మంగళాశాసనము చేసినారు. తన భావ సంతృప్తి ఫలముకై ప్రతి క్షణమును ఎంపెరుమాన్ కీర్తిస్తు, “పెరుమాళ్ తిరుమొళి” రచించి అందరి ఉన్నతికై ఆశీర్వదించినారు. కొంత కాలము ఈ సంసారములో జీవించి చివరకు దివ్యమైన పరమపదమునకు వేం చేసి పెరుమాళ్ళకి నిత్య కైంకర్యమును చేసిరి.

ఆళ్వార్ తనియన్:

ఘుష్యతే  యస్య నగరే  రంగయాత్రా దినేదినే |
తమహం శిరసా వందే రాజానం కులశేఖరమ్ ||

వీరి అర్చావతార అనుభవం  క్రిత మేఇక్కడ చర్చించబడినది: – http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-kulasekara.html.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలము: https://guruparamparai.wordpress.com/2013/01/18/kulasekara-azhwar/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org