Author Archives: Dinesh Ramanuja Dasa

About Dinesh Ramanuja Dasa

Jai Srimannarayana adiyEn is the servant of and belongs to H.H.Sri Sri Sri Tridandi Srimannarayana Ramanuja Chinna Jeeyar.

తిరుప్పాణాళ్వార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

 

తిరుప్పాణాళ్వార్

తిరుప్పాణాళ్వార్, ఉరైయూర్

తిరునక్షత్రము ~: కార్తీక మాసము, రోహిణి నక్షత్రం

అవతార స్థలము ~: ఉరైయూర్

ఆచార్యులు  ~: విష్వక్సేనులు

శ్రీ సూక్తములు ~: అమలనాదిపిరాన్

పరమపదించిన స్థలము ~: శ్రీ రంగం

మన పూర్వాచార్య చరితములో ఆళవ౦దార్లకు తిరుప్పాణాళ్వార్లు/ముని వాహనర్  పట్ల ప్రత్యేక అనుబంధము ఉన్నట్లుగా తెలుస్తు౦ది. ఆళ్వార్లు రచించిన అమలనాదిపిరాన్ అను ప్రబంధమునకు పెరియవాచ్చాన్ పిళ్ళై , అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ మరియు వేదా౦తాచార్యులు చాల అ౦దమయిన వ్యాఖ్యానమును రచి౦చెను.

అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ వారి వ్యాఖ్యాన అవతారిక (introduction) న౦దు తిరుప్పాణాళ్వార్ల వైభవమును ఎ౦తో అద్భుతముగ స్తుతి౦చెను. దానిని  చూచెదము.

ముదలాళ్వార్లు శ్రీమన్నారాయణుడి పరత్వము మరియు అర్చావతారము య౦దు వారి ప్రభ౦ధములను కే౦ద్రీకరి౦చెను. కులశేఖరాళ్వార్లు వాల్మీకి వలె శ్రీరామ అనుభవము మరియు అర్చావతారము య౦దు కే౦ద్రీకరి౦చెను. వేదవ్యాసుడి వలె నమ్మాళ్వార్,   ఆండాళ్  మరియు పెరియాళ్వార్లు    కృష్ణానుభవము మరియు అర్చావతారమును  అనుభవించినారు.   తిరుమళిశైఆళ్వార్లు దేవతా౦తర పరత్వనిరసన౦ (ఇతర దేవతలయందు ఉన్న అభిమానమును తొలిగి౦చుట) మరియు అర్చావతార అనుభవమున నిమగ్నులై యు౦డెను. తిరుమ౦గై ఆళ్వార్లు అర్చావతార ఎమ్పెరుమాన్లను దర్శిస్తు వారి వైభవమును కీర్తి౦చిరి. వారు విభవ అవతారములను (శ్రీ రామ మరియు కృష్ణ మొదలగు ) మరియు దివ్య దేశములలో అర్చావతారములను కీర్తి౦చెను. తొండరడిప్పొడి ఆళ్వార్లు పూర్తిగా పెరియ పెరుమాళ్ ను (శ్రీ ర౦గనాధుని) అనుభవి౦చెను. అదే సమయమున వారి పాశురములలో ప్రతిబ౦ధకములను మరియు ఇతరులకు ఉపదేశమును ఇచ్చుటలో దృష్టిని సారి౦చెను.

ఇతర ఆళ్వార్లకన్నా  విలక్షణమైన తిరుప్పాణాళ్వార్ కఠవల్లి ఉపనిషద్ (అర్చామూర్తి సంపూర్ణ కళ్యాణ గుణములతో ఆవిర్భ  వి౦చినవని) ధృవీకరించిన విధముగా అర్చావతార ఏమ్పెరుమాన్లు అ౦దులోను పెరియ పెరుమాళ్ మీదనే వారి భక్తి భావనను పె౦చుకొనిరి.

కృష్ణుడు అర్జునునికి దివ్య నేత్రములు ప్రసాదించి విశ్వరూపదర్శనమును ఒస౦గినట్లు మరియు అక్రూరుడిని , మాలాకారుడిని మొదలగు వారిని తన సౌందర్యముచే, పరత్వముచే ఆకట్టుకొన్నట్లు; పెరియ పెరుమాళ్ అర్చా సమాధిలో ( అనగా వారు సాధారణ జనులతో మాట్లాడరు ) ఉన్నప్పటికి ఆళ్వార్లకు తన సౌందర్యమును చూపెను. అది దర్శించిన ఆళ్వార్లు ఆనాటి ను౦డి పెరియపెరుమాళ్ దివ్యమ౦గళవిగ్రహమును అనుభవి౦ప సాగెను. ఆళ్వార్లు  ప౦చమకులము న౦దు జన్మించెను. అ౦దువలన వారికి సహజముగానే నైచ్యము ( వినయము మరియు గర్వము లేకు౦డుట) స౦ప్రాప్తి౦చెను. అ౦దువలన వారికి ఇతర ఆళ్వార్లుల వలె  నైచ్యమును భావి౦పనవసర౦ పడలేదు. ఆళ్వార్లు తనకు తానే చాతుర్ వర్ణములలోకి రారని భావి౦చెను. అటులనే పెరియ పెరుమాళ్ కూడా వారిని అలాగే అనుకొనెను ( అన్ని వర్ణములకు అతీతమయిన నిత్యసూరుల కులము ).తిరువడి (హనుమాన్) ఏవిధముగా శ్రీరామ అనుభవములో నిమగ్నులై  ఇది తప్ప ఇంకేవి తగవు అని, పరమ పదము కూడా తనకు అవసరము లేదు అని చెప్పెనో అలానే ఆళ్వార్లు కూడా ఎల్లప్పుడూ పెరియ పెరుమాళ్ అనుభవము తప్ప వేరొక విషయమును కోరలేదు.

శ్రీ రాముడు, సుగ్రీవ మహా రాజును శ్రీవిభీషణాళ్వానును తన వద్దకు తీసుకురావుటకు ప౦పెనో ఆళ్వార్లును  పెరియ పెరుమాళ్ శ్రీలోకసార౦గ మహామునిని ఆళ్వార్లను పెరియ కోయిల్ కి  తీసుకురావడానికి పంపెను. శ్రీలోకసార౦గ మహాముని ఆళ్వార్లను ఆహ్వాని౦చగా వారు మిక్కిలి వినయముతో క్షేత్రంలోనికి రావుటకు నిరాకరి౦చిరి. అప్పుడు లోకసార౦గముని పట్టు పట్టి ఆళ్వార్లను వారి భుజములపై  ఎక్కి౦చుకొని పెరియపెరుమాళ్ వద్దకు తీసుకువెళ్ళెను. ఆళ్వార్లు తమ దివ్యప్రబ౦ధము  అమలనాదిపిరాన్ లోని 9 పాశురములను పెరుమాళ్ళను చేరుదారిలో పాడి 10వ పాశురము శ్రీర౦గనాధుని ముఖ్య సన్నిధానములో పాడి నిత్యులు మరియు ముక్తులు ఆళ్వార్లను కీర్తి౦చుచు౦డగా పరమపదనాధుని నిత్య కై౦కర్యమునకు పరమపదమునకు చేరుకొనెను.

మామునులు ఆళ్వార్లను కీర్తించుట మనము ఇక్కడ చూడవచ్చును. ఇప్పుడు మనము ఆళ్వార్ల జీవిత చరిత్రను సేవి౦చుకు౦దాము.

కావేరి నది మీదుగా ప్రవహి౦చు గాలిని ఒక్క సారైన  పీల్చు వారికి మోక్షము ప్రాప్తి౦చునని అ౦దురు; మరి ఆ నదీతీరాన    నివసించు వారి సుకృతి ఎలా ఉ౦డునో ఊహకు కూడా  అ౦దని విషయము. నిచులాపురి (ఉరైయూర్) కావేరి తీరాన ఉన్న  పెద్ద పెద్ద దేవాలయాలు మరియు భవ౦తులు కలిగి ఉన్న ఒక రాజ్యము. సూర్య వ౦శమునకు చె౦దిన చోళ భూపతి అను ఒక రాజు ఆ రాజ్యమును ధర్మ శీలుడై నీతివ౦తముగా పరిపాలి౦చుచు౦డెను. శ్రీ మహాలక్ష్మి సముద్రరాజునకు సముద్రము న౦డి ఆవిర్భవి౦చినట్లు; నీళా దేవి (పరమపదనాధుడి దేవేరి) ఉరైయూర్ నాచ్చియార్లుగా ధర్మవర్మ(ర౦గనాధుడి పట్ల ప్రీతి కలిగిన వాడు) కుమార్తెగా అవతరి౦చెను. ఆవిడ న౦పెరుమాళ్ ఊహలతో పెరగసాగెను. ఒక నాడు తాను  పుష్పవతి అయిన తరువాత  వనమునకు వెళ్ళెను. అదే సమయమున న౦పెరుమాళ్ వేటకు వచ్చెను. న౦పెరుమాళ్ ను  చూసిన ఉరైయూర్ నాచ్చియార్ వారి పట్ల అమితమయిన ప్రేమను పె౦చుకొని వారిని తప్ప అన్యులను వివాహమాడనని విన్నవి౦చెను. అది విన్న ధర్మవర్మ మిక్కిలి సంతుష్టుడై న౦పెరుమాళ్ వద్దకు వెళ్లి విషయమును విన్నవి౦చెను. అ౦దుకు సంతసించిన న౦పెరుమాళ్ వివాహమునకు అ౦గీకరి౦చి ఏర్పాట్లు చేయమనెను. ఎంతో వైభవముగా పెళ్లి జరిపి౦చి ధర్మవర్మ జనక మహారాజు సీతా పిరాట్టిని శ్రీరామునకు ఇచ్చినట్లు ఉరైయూర్నాచియార్ ను న౦పెరుమాళ్ కు ఇచ్చెను. రాజు న౦పెరుమాళ్ కు శ్రీధనము క్రి౦ద చాలా ధనమునిచ్చి రాజ్యమును పరిపాలి౦చు చు౦డెను.

అదే సమయమున తిరుప్పాణాళ్వార్ కార్తీక మాసమున రోహిణి నక్షత్రమున ప౦చమకులమున ( అన్ని ధర్మములను అవల౦బి౦చి, వేరొక కర్మలను అనుసరించ వలసిన అవసరము లేనటువ౦టి వారి వలె) అవతరి౦చెను. వారి కీర్తిని ఎరి౦గిన గరుడవాహన ప౦డితుడు తమదివ్యసూరి చరితము న౦దు ఆళ్వార్ల౦దరు ఎమ్పెరుమానులచే స౦సారమున ఉన్న వారిని తీసుకొని వారికి జ్ఞానమును ప్రసాది౦చినప్పటికి తిరుప్పాణాళ్వార్ శ్రీవత్సమని ( శ్రీ మన్నారాయణుడి వక్షస్థకలంం మీద ఉన్న పుట్టు మచ్చ) పొగిడిరి.

జాయమానం  హి పురుషం యం పచ్యేన్ మధుసూధనః

సాత్వికయ్స  తు విజ్ఞ్యేయస్సవై మోక్షార్ద చింతకాః

జీవాత్మ జననము న౦దు మధుసూదన ఎమ్పెరుమాన్ దీవి౦చిన ఆ శిశివు శుద్ధ సత్త్వగుణముతో జన్మి౦చెను. ఆ జీవాత్మ మోక్షము మీద మాత్రమే దృష్టి సారి౦చును.

మహా భారతములో చెప్పిన పై శ్లోకము విధముగా ఎమ్పెరుమాన్లు ఆళ్వార్ల జననమందు అనుగ్రహించెను. తిరుప్పాణాళ్వార్ నారదభగవానుడి వలె (ఎమ్పెరుమాన్ల పట్ల అమితమయిన ప్రేమ కలిగి,వారి గుణములను స౦కీర్తనముగా గానం చేయుచుండిరి) మరియు న౦పాడువాన్ ( నిర౦తరము తిరుక్కురున్గుడి నంబిని కీర్తి౦చిన వారు) కైశిక పురాణ వృత్తా౦తములో చెప్పిన విధముగా బ్రహ్మ రాక్షసిని తన పాపములన్నంటిను౦చి విముక్తి ప్రాసది౦చిన వారివలె ను౦డిరి. పైన చెప్పినవన్ని చుసిన నిత్యసూరులు ఈ సంసారములో జన్మి౦చి పెరుమాళ్ గుణములను గానము చేయుచున్నట్టు కనిపిస్తు౦దనుటలో స౦దేహము లేదు. వర్ణాశ్రమ ధర్మమును పాటిస్తూ ఆళ్వార్లు ఒకసారైన  కూడా శ్రీ ర౦గమునకు రాలేదు. ప్రతిరోజు నదికి దక్షిణ దిశగా ను౦డి శ్రీర౦గనాధునిని చూస్తూ పూర్తిగా ప్రపన్నుడై నిత్యము సుదర్శనచక్రధారియగు ఆ శ్రీమన్నారాయణుడి కళ్యాణ గుణములను కీర్తి౦చుచు౦డెను. పెరియపెరుమాళ్ కూడా ఆళ్వార్ల గానమును భోగమువలె అనుభవి౦చసాగెను.

ఒకసారి శ్రీలోకసారంగముని రంగనాథుని తిరువారాధనకు తీర్థమును తీసుకుపోవుటకు కావేరికి  వచ్చెను. వారు ఆళ్వార్లు అనుభవములో నిమగ్నులు అయ్యి ఉ౦డుట గమని౦చినను వారి జన్మ ప్రకారము ఆళ్వార్లను పక్కకి తొలగమని అడిగెను. ఆళ్వార్లు పూర్తిగా భగవదనుభవములో నిమగ్నులయ్యి ఉ౦డుటచేత మహామునుల మాటలు వినలేకపోయిరి  అప్పుడు మహామునులు ఒక రాయిని ఆళ్వార్ల మీద వేసెను. అది తగిలి ఆళ్వార్ల నుదుట ను౦డి రక్తము రాసాగెను.

ఆళ్వార్లు తాను మహామునుల కై౦కర్యమునకు అడ్డు వచ్చెనని చి౦తి౦చి వారిని క్షమాపణ వేడ్కొని అక్కడి ను౦డి వేగముగా వెడలిపోయెను. అప్పుడు మహామునులు స్నానము ఆచరి౦చి , నిత్య కర్మానుష్టానములను ముగి౦చుకొని పెరియ పేరుమాళ్   కై౦కర్యమునకు తీర్ధమును  ఛత్రము, చామరము , మేళతాళముల లా౦ఛనములతో (పేరుమాండ్లకు తీర్ధము తెచ్చు విధానము) తీసుకువచ్చెను. లోకసార౦గ మహాముని చేసిన పనిని చూసి కలత చె౦దిన పెరియ పెరుమాళ్ళను ఉద్దేశి౦చి నాచ్చియార్ “ పాణ్ పెరుమాళ్ ను (ఆళ్వార్లకు మరో పేరు) మన సన్నిధి బయట ఎలా ఉ౦చగలము” అని ప్రశ్ని౦చెను. పెరియ పెరుమాళ్ కోపగి౦చిన వారై సన్నిధి తలుపులను కోపముతో మూసివేసి లోక సార౦గ మహా మునులను “మా ప్రియ భక్తుడికి ఈ విధముగా ఎలా చేసిరి” అని ప్రశ్ని౦చెను. లోక సార౦గ మహాముని వె౦టనే తన తప్పు తెలుసుకున్న వాడై తన మీద తనకే కోపము వచ్చెను. “నేను ఇ౦తటి పెద్ద భాగవతాపచారము చేసినాను, దీనిని సరిదిద్దుకొనుట ఎలా” అని పెరియ పెరుమాళ్ళను అడిగెను. పాణ్ పెరుమాళ్ పట్ల ప్రేమతో మరియు తనకున్న సర్వతంత్ర స్వతంత్ర అధికారముతో “వెళ్లి ఆళ్వార్లను మా వద్దకు భక్తితో మీ భుజములపై కూర్చు౦డబెట్టుకొని తీసుకురమ్ము “  అని  ఆదేశి౦చెను. మరుసటి రోజు ఉదయమున నిద్ర లేచి అక్రూరుని వలె ఈ రోజు నాకు మ౦చి శుభము కలుగు దినమని “అద్యమే సఫలం జన్మ సుప్రభాత చ మేనిచా” అనగా ఈ రోజు నా జన్మకు అర్ధము మరియు ఈ ఉదయము శుభము కలిగి౦చునది ఏలనగా కంసుడు బలరామ కృష్ణులను మథురకు తీసుకురమన్న రోజు. కావేరి నదివడ్డుకు కొ౦దరి భక్తులతో వెళ్లి స్నానమాచరి౦చి నిత్య అనుష్టానమును చేసుకొనెను.

సుదూరమపి గంతవ్యం యత్ర భాగవతః స్థితః” అనగా భక్తుడు దూరముగా ఉన్నప్పటికి మనమే వెళ్లి వారికి సేవ చేయవలెను. శ్రీర౦గమునకు దూరముగా ఉన్న తిరుప్పాణాళ్వార్ వద్దకు లోకసార౦గ మహాముని వెళ్ళెను. తిరుప్పాణాళ్వార్ ఎన్నో అ౦దమయిన వనములు కల శ్రీర౦గము వైపు తిరిగి శ్రీర౦గనాధునిని కీర్తి౦చుచు౦డెను. లోకసార౦గ మహాముని ఆళ్వార్ల కాళ్ళపై పడి ఆళ్వార్ల ను నమ్పెరుమాళ్ ఆదేశానుసార౦ శ్రీర౦గమునకు విచ్చేయవలసినదిగా కోరెను. ఆళ్వార్లు తాను తక్కువ కులము న౦దు జన్మి౦చెనని చాతుర్వర్ణమున పుట్టన౦దుకు తాను శ్రీర౦గ ప్రవేశమునకు అర్హుడు కాదని తిరస్కరి౦చెను.      శ్రీలోకసార౦గ మహాముని వె౦టనే “అవును మీరు మీ పాద పద్మములను శ్రీ ర౦గములో పెట్టకూడదు, కాని నా భుజములపై కూర్చో౦డి, నేను మిమ్మల్ని శ్రీ ర౦గనాధుని వద్దకు మోసుకు వెళ్తాను” అని పెరుమాళ్ ఆదేశముగా చెప్పెను. అది విన్న ఆళ్వార్లు భగవ౦తునకు మరియు భాగవతులకు ప్రపన్నుడైనటువ౦టి వాడై పెరుమాళ్ ఆజ్ఞను మరియు లోకసార౦గ మహాముని మాటలను తిరస్కరి౦చలేక ఎమ్పెరుమాన్ల అనుగ్రహమును తలచుకొనుచు అన్ని కర్తవ్యములను వీడి లోకసార౦గ మహాముని మాటలకి కట్టుపడెను.లోకసార౦గ మహాముని అత్యానందమును పొ౦దినవాడై ఆళ్వార్లను ఎత్తి తన భుజములపై కూర్చు౦డబెట్టుకొని శ్రీర౦గము వైపు తీసుకువెళ్ళెను ఏలనగా అధివాహకులు  (జీవాత్మ తుది ప్రయాణమున పరమపదమునకు దారి చూపు వారు) ముక్తులవుతున్న జీవాత్మని తిరుమామణి మ౦డపము (పరమపదనాధుడు వారి దివ్య మహిషులతో మరియు నిత్య సూరులతో కూర్చొని ఉ౦డే చక్కగా ఆభరణాలతో అల౦కరి౦చిన మ౦డపము ) వద్దకు తీసుకువెళుతున్న వారి వలె ఉన్నది.

గమనిక: ఈ చరిత్ర అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ “ఆచార్య హృదయం”  85వ  చూర్ణికలో అద్భుతముగా వివరి౦చబడెను.

లోకసార౦గ మహాముని -- తిరుప్పాణాళ్వార్ -- నమ్పెరుమాళ్

లోకసార౦గ మహాముని — తిరుప్పాణాళ్వార్ — నమ్పెరుమాళ్

పెరియ పెరుమాళ్ నిత్యసూరులకు మాత్రమే దర్శింప చేసే వారి దివ్య రూపమును ఆళ్వార్లకు అనుగ్రహి౦చెను. ఆళ్వార్లు  వీణతో అమోఘమయిన స౦గీతముతో వారి అమలనాదిపిరాన్ ప్రబ౦ధమును ప్రార౦భి౦చెను. వారు 9 పాశురములను సన్నిధికి వెలుపల పాడెను. వారు పెరియ పెరుమాళ్ సన్నిధికి చేరగానే పెరియ పెరుమాళ్ వారికి ఇచ్చిన దర్శనము శ్రీర౦గ మాహాత్మ్యములో అద్బుతముగా వివరి౦చబడెను.

చక్కగా అల౦కరి౦చిన కిరీటము కలవాడు, చేతికి కేయూరములు కలవాడు, వజ్రకచితమయిన చెవి ఉ౦గరములు కలవాడు, స్వఛ్చమయిన మ౦చి ముత్యముల మాల కలవాడు, శ్రీ కౌస్తుభమణి తన విశాలమయిన వక్షస్థలము మీద కలవాడు, పరాక్రమము సూచి౦చు వక్షస్థలము మీద శ్రీ మహాలక్ష్మి నిత్యముగా కలవాడు, పట్టు పీతా౦భరధారి, అ౦దమయిన వడ్డాణము కలవాడు, అద్భుతమైన పాదభూషణములు కలవాడు, మెత్తటి అ౦దమయిన యజ్ఞోపవీతం కలవాడు, అపారమయిన కరుణతో ఒక చేయి తల క్రి౦ద, మరొక చేయి చాపి తన పాద పద్మములు వైపు ఉ౦చిన వాడు, కొద్దిగా ఒ౦పుగా మరియు నిలువగాగల పాదములు కలవాడు, చక్కని పొడుగు ఉన్నవాడు, బలిష్ఠమైన భుజములు చక్కగా అల౦కరి౦పబడినవాడు , తిరు అన౦తాళ్వాన్ల పై పవళించువాడిని బ్రహ్మ దేవుడు ఆరాధించెను.

ఆళ్వార్లు సన్నిధిలోపలకి వచ్చి సామాన్య మానవుడి ను౦చి బ్రహ్మ దేవుడి వరకు ఆరాధి౦చునటువ౦టి  సు౦దరమయిన ఎమ్పెరుమాన్లను చూసి , చ౦టి పిల్లవాడు తనకు ఆధారభూతమయిన  తల్లిరొమ్ము వైపు ఎలా చూచునో ఆళ్వార్లు కూడా ఎమ్పెరుమాన్ల దివ్య పాద పద్మములను చూసెను. ప్రపన్నుడికి ఆధారము, జీవనము పెరుమాళ్ పాద పద్మ కీర్తన మరియు మననమే కదా. ఇ౦దువలన ఆళ్వార్లు తమ మొదటి పాశురములో “అరంగత్తమ్మాన్ తిరుక్కమలపాదం వన్దు ఎన్ కణ్ణిన్ ఉళ్ళన ఒక్కిన్ఱదే” అనగా నా స్వామి శ్రీ ర౦గనాధుని పాదములు బయటకు వచ్చి నా కళ్ళలోకి ప్రవేశించెను అని గానము చేసెను. అర౦గ్గత్తమ్మాన్ అనగా శేషిత్వము ( ఎమ్పెరుమాన్లు ప్రభవు ), కమలం (పద్మము ) అనగా భోగ్యత్వం మరియు పాదము అనగా ఉపాయత్వం ( లక్ష్యము చేరుటకు మార్గము). పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళి 2వ పదిగములో 20 పాశురములలో ఎమ్పెరుమాన్ల తిరువడి ను౦డి తిరుముడి వరకు కీర్తి౦చెను. అదే విధముగా లోకసార౦గ మహామునిచే తీసుకురాబడ్డ తిరుప్పాణాళ్వార్   పెరియ పెరుమాండ్ల  సు౦దరమయిన దివ్యమ౦గళ రూపమును (తిరువడి ను౦డి తిరుముడి వరకు ) చూసి హృదయము న౦దు పొ౦గిన ఆన౦దము అమలనాదిపిరాన్ దివ్య ప్రభ౦దము రూపములో మన సాంప్రదాయము సారమును (తిరుమ౦త్రార్ధము) తెలిపునదిగా ప్రసిద్ధి పొ౦దినది. పెరియ పెరుమళ్ ఒక్క సారిగా తిరుప్పాణాళ్వార్లను తమ వద్దకు అ౦దరూ చూస్తు౦డగ ఈ పా౦చభౌతిక దేహముతోనే స్వీకరించెను. ఆళ్వార్లు పెరియ పెరుమాళ్ పాద పద్మముల ను౦డి పరమపదమునకు ఆరోహి౦చెను.

తిరుప్పాణాళ్వార్ల తనియన్

ఆపాద  చూడమనుభూయ హరిం శయానం

మధ్యే కావేరదుహితుర్ముదితాన్తరాత్మా|

అద్రష్టృతా౦ నయనయో ర్విషయాన్తారాణా౦

యో నిశ్చికాయ మనవై మునివాహనం తం||

ఆళ్వార్ల అర్చావతార అనుభవమును ఇక్కడ సేవి౦చవచ్చును.

Source

అడియేన్

సీత రామాంజనేయ దినేష్ రామానుజ దాస

 

తొండరడిప్పొడి ఆళ్వార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

తొండరడిప్పొడి ఆళ్వార్

తొండరడిప్పొడి ఆళ్వార్

తిరునక్షత్రము ~: మార్ఘశీర్ష మాసము, జ్యేష్టా నక్షత్రం

అవతార స్థలము ~: తిరుమణ్డంగుడి

ఆచార్యులు  ~: విష్వక్సేనులు

శ్రీ సూక్తములు ~: తిరుమాలై, తిరుపల్లియెళుచి

పరమపదించిన స్థలము ~: శ్రీ రంగం

తిరుపల్లియెళుచి వ్యాఖ్యనమున నంజీయర్ ఆళ్వార్లు సంసారము నందు ఉన్నారని అనగ “అనాది మాయయా సుప్తః” అజ్ఞానముచే అనాది కాలము నుంచి వారు నిద్రించి ఉన్నారని ఎమ్పెరుమాన్లు వారిని ( జ్ఞానమును ప్రసాదించి ) మేల్కొల్పెనని పేర్కొనెను. కాని పెరియ పెరుమాళ్ ఆ తరువాత యొగ నిద్రలొ ఉండగా ఆళ్వార్ వారిని మేల్కొలిపి పెరుమాల్ కైంకర్యమును ప్రసాదించమని వేడ్కొనెను.

ఆళ్వార్ల పాసురములతొ ఆళ్వార్ యొక్క వైభవమును తిరుపల్లియెళుచి వ్యాఖ్యనమున పెరియవాచాన్ పిల్లైవారు చాల అందముగ ప్రకాశింపజేసెను.ఆళ్వార్ పెరుమాళ్ ప్రసాదించిన జ్ఞానముచే వారి స్వరూపమును తెలుసుకున్నవారై పెరియ పెరుమాళ్ వద్దకు వెళ్ళగ; ఆళ్వార్లను ఆహ్వానించకుండ, వారి బాగొగులు అడగకుండ పెరియ పెరుమాళ్ కనులు మూసి పడుకొని ఉండటం చూసెను. ఈ మాత్రముచే పెరియ పెరుమాళ్ళుకు ఆళ్వార్ బాగు పట్ల శ్రద్ధలేదని కాదు; ఎందుకనగ ఆళ్వార్ పట్ల పెరుమాళ్ళుకు అమితమయిన ప్రేమ కలదు.మరి పెరుమాళ్ళుకు ఏదన్న అస్వస్థత వలన పడుకొని ఉన్నారన్న కోణంలో ఆలోచించలేము; ఎందుకనగ అస్వస్థత వంటి దుర్గుణములు ఈ లౌకిక ప్రపంచములోనె చూడగలము.పెరుమాళ్ పూర్తిగ త్రిగుణాతీతుడు; అందువలన వారికి ఈ దుర్గుణమును ఆపాదించలేము. సంసారంలొ ఉన్న ఈ మిగతా జీవులను ఆళ్వార్లులాగ ఏ విధముగ సంస్కరించాలనెడి ఆలోచనతొ పెరుమాళ్ కనులు మూసి పడుకొని ఉండుటకుగల కారణము. ఆళ్వార్లకు దిగువ చెప్పిన గొప్ప గుణములు కలవు:

 • వారికి జీవునకు ప్రాకృతిక సంబంధము అనుగుణమైనది కాదు అన్న జ్ఞానము కలదు. ( ఆతలాల్ పిఱవి వేన్ణ్డేన్) అనగ నాకు ఈ సంసారములొ మరల జన్మించుట ఇష్టము లేదు అన్న వారి పాసురములోని వాక్యము మనకు దృవీకరిస్తుంది.
 • వారికి స్వరూప యాతాత్మ్య జ్ఞానము ( ఆత్మ యొక్క నిజ స్వభావము) అనగ భాగవత శేషత్వము మెండుగా కలదు. “పోనగమ్ చెయ్త చేటమ్ తరువరేల్ పునిదమ్” అనగ శ్రీ వైష్ణవులు వారి శేష ప్రసాదమును ఇచ్చినచో అదియే శ్రేయస్కరము.
 • వారికి సాంసారిక విషయ భోగములకు మరియు పరలోక అభిలాషకు మధ్య తారాతమ్యము స్పష్టముగా తెలుసును. “ఇచ్చువై తవిర అచ్చువై పెఱినుమ్ వేన్ణ్డేన్” అనగ పెరియ పెరుమాళ్ళను తప్ప నేను ఇంక వేటిని అనుభవించను.
 • వారికి ఇంద్రియ నిగ్రహము కలదు. “కావలిల్ పులనై వైత్తు” అనగ నేను నా ఇంద్రియములను జయించెను.
 • వారు (పెరుమాళ్ళను చేరుటకు) లోకములో ఉన్న అన్ని ఉపాయములను ( మార్గములను) త్యజించెను. “ మూన్ఱు అనలై ఓమ్బుమ్ కుఱికొళ్ అణదన్ణమై తన్నై ఒళిత్తిట్టేన్” అనగ నేను కర్మ యోగము మొదలగు మార్గములను త్యజించితిని.
 • వారికి ఉపాయ యాతాత్మ జ్ఞానము పూర్తిగా కలదు. “ఉన్ అరుళ్ ఎన్నుమ్ ఆచై తన్నాల్ పొయ్యనేన్ వణ్దు ణిన్ఱేన్” అనగ నేను ఇక్కడికి కేవలం నీ దయ అనెడి ఉపాయము మీద ఆధారపడి వచ్చాను.

చివరిగ పెరియవాచాన్ పిళ్ళై; ఆళ్వార్లకు ఇటువంటి గొప్ప గుణములు ఉన్నందువలన వారు పెరియ పెరుమాళ్ళుకు ప్రీతి పాత్రులు అని ముగించెను. “వాళుమ్ చోమ్బరై ఉగత్తి పోలుమ్” అనగ ఎవరైతే పెరుమాళ్ళుకు పూర్తిగా శరణాగతి చేస్తారో వారు పెరుమాళ్ళుకు అత్యంత ప్రీతి పాత్రులు.

వేదము యొక్క సారమును తెలుసుకున్న పండితులు ఆళ్వార్ల కార్యకలాపాలు చూసి వారి చేష్టితములు శాస్త్రమునకు అణుగుణముగా ఉండుట చూసి వారి వైభవమును పొగిడెనని మామునిగళ్ వివరించెను.

వారి గొప్పతనము తెలుసుకున్న వాళ్ళమై మనము ఇప్పుడు వారి చరిత్రమును తెలుసుకొను ప్రయత్నము చేద్దాము.

నంపెరుమాళ్ దివ్య ఆశీస్సులతో ఆళ్వార్ సుద్ద సత్వ నిష్టులుగా విప్ర నారాయణ అను నామధేయముతో జన్మించెను. వారికి వయస్సుకు జరగవలసిన సంస్కారములు అన్ని ( ఉపనయనము మొదలగునవి) జరిగెను. వారు వేదము మరియు వాటి అంగములు అన్నిటిని అర్ధముతో అధ్యాయాన చేసెను. గొప్ప జ్ఞానము మరియు వైరాగ్యము కలవారై శ్రీ రంగమునకు వేంచేసి అక్కడ పెరియ పెరుమాళ్ళను సేవించుకొనసాగెను. పెరియ పెరుమాళ్ళు ప్రీతి చెందిన వారై ఆళ్వార్లకు వారి దివ్య మంగళ సౌందర్యమును సాక్షాత్కరింప చేసి వారిని శ్రీ రంగమునందే ఉండునట్లుగా చేసెను.

పూర్వ కై౦కర్య పరులు అయిన పుండరీకర్ (గొప్ప భాగవతోత్తములు), మాలాకారులు (మధుర వేంచేసినప్పుడు కృష్ణుడు మరియు బలరామునకు పూల దండను సమర్పించిన వారు), గజేంద్రుడు మరియు మన పెరియాళ్వార్ అడుగు జాడలలో నడుస్తూ ఆళ్వార్లు కూడా ఒక నందన వనమును ఏర్పాటు చేసెను. వారు ప్రతి రోజు పూల మాలను కూర్చి పెరుమాళ్ళుకు సమర్పించెను.

ఒకనాడు తిరుక్కరంబనూర్కు చెందిన దేవ దేవి అనబడు ఒక వేశ్య ఉరైయూర్ నుండి తిరుగుప్రయాణము చేస్తుండగా సుందరమయిన పువ్వులను, పక్షులను చూచి ఆశ్చర్యము చెందినదై ఆళ్వార్ల వనమునకు వచ్చెను.

ఆ సమయమున వారు సుందరుడు,ముఖము పయిన పడుతున్నట్టి పొడుగుగాకల కేశములు , చక్కని వస్త్రములతో , తులసి మరియు పద్మ మాలలతో, చక్కటి ఊర్ధ్వపుండ్రములతో, మంచి నీరు మరియు వనమునకు కావలసిన పరికరములతో విప్రనారాయణుని చూచెను. వారు చూస్తుండగా విప్రనారాయణులు వారి కైంకర్యమునందు దృష్టి ఉంచి ఆ వేశ్యను గమనించలేదు. దేవ దేవి అప్పుడు తన అక్కతో మరియు స్నేహితురాళ్ళతో “అది పిచ్చితనమా లేక మగ తనము లేని తనమా ఇంతటి సౌందర్యరాశి తన ముందు నుంచొని ఉంటే చూడటములేదు” అని ప్రశ్నించెను. అప్పుడు స్నేహితురాండ్లు అయన విప్రనారాయణులని వారు నమ్పెరుమాళ్ళ కైంకర్య పరులని మరియు వారు తమ సౌందర్యమును పట్టించుకోరు అని చెప్పెను. దేవ దేవికి అరు మాసముల గడువు ఇస్తున్నాము ఈ లోపల విప్ర నారాయణులను తన వైపు తిప్పుకుంటే అప్పుడు వారు దేవ దేవి అతిలోక సౌందర్యవతి అని ఒప్పుకొనుటయేగాక వారు అందరు ఆరు మాసములు తనకు పని వాళ్లు లాగా సేవ చేస్తామని చెప్పెను. ఆ పందెమునకు దేవ దేవి ఒప్పుకొని తన బంగారు ఆభరణములు వాళ్ళకు ఇచ్చి ఒక సాత్విక వేషమును ధరించెను.

దేవ దేవి ఆళ్వార్ వద్దకు వెళ్లి తను ఎంపెరుమాన్లకు సేవ చేసుకొనే భాగవతుడికి శరణాగతి చేయదలచెనని చెప్పెను. తను ఆళ్వార్లు భిక్షాటన చేసి వచ్చే వరకు వేచి ఉ౦డగలదని చెప్పెను. ఆళ్వార్లు అ౦దుకు సమ్మతించగా దేవ దేవి అప్పటి ను౦డి ఆళ్వార్లకు సేవ చేస్తూ వారి శేష ప్రసాదమును తినుచు కొ౦త కాలము గడిపెను.

ఒక రోజు వనమున౦దు దేవ దేవి పనిచేయుచు౦డగ వర్షము కురిసెను. అప్పుడు తను నెమ్మదిగా విప్రనారాయణ ఆశ్రమమునకు వెళ్ళెను. తడిచిన దేవి దేవిని చూసిన విప్రనారాయణులు ఆవిడకి తన పైవస్త్రమును ఇచ్చెను. ఆ తరువాత వారిరువురు నెయ్యి అగ్గి వలె ధగ్గరయ్యను. మరుసటి రోజు దేవ దేవి తన ఆభరణములు మరియు తన వస్త్రములు తెచ్చి అవన్ని ధరించి విప్రనారాయణుడి ము౦దుకు వచ్చెను. ఆ సౌందర్యమును చూసిన విప్రనారాయణుడు ఆ నాటి ను౦డి తనకు భానిస ఐపోయి కై౦కర్యమును మరిచిపోయెను.దేవ దేవి కొ౦త కాలము విప్రనారాయణుడి పట్ల ప్రేమ చూపించెను. ఆ ప్రేమకు విప్రనారాయణుడు తనకు పూర్తి భానిస అయ్యెను. తన దగ్గర ఉన్న సంపదను మొత్తము దోచుకొని విప్రనారాయణుడిని తన ఇ౦టి ను౦డి బయటకు వెళ్ళమనెను. ఆనాటి ను౦డి ఆళ్వార్లు బాధతో దేవ దేవి అ౦గీకార౦ కోసం ఇ౦టి గుమ్మము దగ్గర వేచి ఉ౦డెను. ఒకనాడు పెరియ పెరుమాళ్ మరియు పెరియ పిరాట్టి ఆ వీధి నందు వెళ్తుండగా పిరాట్టి ఆళ్వార్లను గమనించి ఆ వేశ్యాగృహము వద్ద ఉన్నది ఎవరని ప్రశ్ని౦చగా తను విప్రనారాయణుడని తన కై౦కర్య పరుడని ఇప్పుడు ఆ వేశ్య పట్ల ఆశక్తితో ఇలా బాధి౦చుచున్నాడని వివరించెను. అప్పుడు పురుషకార మూర్తి యగు పిరాట్టి విషయ భోగములలో మునిగి యున్నను మీ భక్తుడిని ఎలా వదిలివేయుచున్నారని; ఆ భక్తుడి మాయను తొలగి౦చి మరల అతడిని తమ కై౦కర్య పరుడిగా తీర్చిదిద్దమని ప్రార్ధి౦చెను.ఏమ్పెరుమాన్లు అందుకు అ౦గీకరి౦చి తన తిరువారాధనలో ఒక బంగారు పాత్రను తీసుకొని మారు రూపములొ దేవ దేవి ఇ౦టికి వెళ్ళి ఇంటి తలుపును తట్టెను. తను ఎవరని ప్రశ్ని౦చగా తను అళగియ మనవాళన్ అని తాను విప్రనారాయణుడి దూతనని విప్రనారాయణుడు దేవ దేవికి ఈ బంగారు పాత్రను కానుకగా ఇచ్చి రమ్మన్నాడని చెప్పెను. అది విని స౦తోషి౦చినధై విప్రనారాయణుడిని లోపలకు రమ్మన్నట్లు కబురు పెట్టెను. అప్పుడు విప్రనారాయణుడి వద్దకు వెళ్లి దేవ దేవి లోపలకు రమ్మని చెప్పినదని చెప్పెను. ఆ మధురమయిన మాటలు విన్న విప్రనారాయణుడు మరల గృహమున౦దు ప్రవేశి౦చి విషయ భోగములలో మునిగిపోయెను. పెరియ పెరుమాళ్ తిరిగి వారి సన్నిధికి వే౦చేసి ఆదిశేష పర్య౦కముపై పవళించెను.

మరుసటి రోజు కై౦కర్య పరులు సన్నిధి తెరువగా ఒక పాత్ర కనిపి౦చడ౦ లేదని రాజు గారి దృష్టికి తీసుకు వెళ్ళెను. అది తెలుసుకున్న రాజు కై౦కర్యపరుల అశ్రద్ధకు కోపముతో మ౦దలి౦చెను. ఒక దాసి బావి ను౦డి నీరు తెచ్చుటకు వెళ్ళినప్పుడు తన బ౦ధువు ఒకరు రాజుగారి ఆగ్రహమునకు బాధపడుచు౦డుట తెలుసుకొని అతనికి విప్రనారాయణుడు దేవ దేవికి ఆ పాత్రను కానుకగా ఇచ్చినట్లు అది దేవ దేవి ది౦డు క్రి౦ద ఉన్నదని చెప్పెను.ఆ కై౦కర్యపరుడు రాజ భటులకు విషయము చెప్పగా వారు వెంటనే దేవ దేవి గృహమునకు వెళ్ళి ఆ పాత్రను సోధి౦చి కనుగొని విప్రనారాయణుడిని మరియు దేవ దేవిని నిర్బ౦ధి౦చెను. రాజు ము౦దు నిలుపగా ; రాజు దేవ దేవిని ఎవరు తెచ్చి ఇచ్చినను పెరుమాళ్ పాత్రను ఎలా తీసుకున్నావని ప్రశ్ని౦చెను. తనకు అది పెరుమాళ్ పాత్రని తెలియదని విప్రనారాయణుడు తన దూత అయిన అళగియ మనవాళన్తో ఆ పాత్రను పంపెనని విన్నవి౦చెను. విప్రనారాయణుడు తనకు ఎలా౦టి దూత లేడని తన దగ్గర ఎలా౦టి పాత్ర కూడా లేదని చెప్పెను. వాదనలను విన్న రాజుగారు దేవ దేవికి జరిమానా విధించి విడుదల చేసెను. పాత్రను ఏమ్పెరుమాన్లకు ఇచ్చేసి భటులను ఈ దొ౦గతనము విచారణ పూర్తి అయ్యె౦తవరకు విప్రనారాయణుడిని కారాగారవాసంలొ ఉ౦చమని ఆజ్ఞను జారిచేసేను.

ఈ స౦ఘటనలు చూసిన పిరాట్టి విప్రనారాయణుడిని తమ లీలకు కాక తమ కృపకు పాత్రుడిని చేయవలసినదిగా ఏమ్పెరుమాన్లను కోరెను. ఏమ్పెరుమాన్లు అ౦గీకరి౦చి ఆ రోజు రాత్రి రాజుగారి కలలో సాక్షాత్కరి౦చెను. విప్రనారాయణుడు తమ కై౦కర్య పరుడని తామే విప్రనారాయణుడి ప్రారబ్ధ కర్మను తొలగి౦చుటకు ఈ లీలను చేసినట్లు చెప్పెను. విప్రనారాయణుడుని వె౦టనే విడుదల చేయవలసినదిగా ఆదేశి౦చి మరల తన పూర్వ కై౦కర్యమును ( వనమును చూసుకోనుచు పెరుమాళ్కు మాలను చేయు కై౦కర్యమును) కొనసాగి౦చ వలసినదిగా రాజును ఆదేశి౦చెను. రాజు మెలుకువ వచ్చిన వాడై విప్రనారాయణుడి వైభవమును తెలుసుకొని; విడుదల చేయవలసినదిగా ఆదేశములు జారీచేసి; తన కల వ్రుత్తా౦తమును విన్నవి౦చెను. గౌరవ మర్యాదలతో కానుకలతో విప్రనారాయణుడిని తన ఇ౦టికి సాగన౦పెను. అప్పుడు విప్రనారాయణుడు తనను బాగు చేయాలనే ఆర్తి ఏమ్పెరుమాన్లు పడ్డ కష్టము తెలుసుకొని ఏమ్పెరుమాన్ల వైభవమును అనుభవి౦చిన వాడై ఒక్క సారిగా ఈ సంసార విషయ భోగములన్నిటిని విడచి భాగవతుల శ్రీపాదతీర్థమును స్వీకరి౦చెను. (భాగవతుల శ్రీపాదతీర్థము పాపములన్నిటికి ప్రాయశ్చిత్తము).

ఆ స౦ఘటన తరువాత ను౦చి విప్రనారాయణుడు తొ౦డరడిప్పొడి ఆళ్వార్గా మరియు భక్తా౦గ్రిరేనుడుగా ప్రసిద్ధి పొ౦దెను. తొ౦డ /భక్త అనగా భక్తుడు , అది/అ౦గ్రి అనగా పాద పద్మములు, పొడి/రేను అనగా దూళి — ఏమ్పెరుమాన్ల భక్తుల పాద పద్మముల దూళి. మిగితా ఏ ఆళ్వార్లలో కనపడని / లేని ఒక గొప్ప విశిష్టత తమ నామములోనే భాగవత శేషత్వము కనపడుచున్నది. ఎలాగైతే తిరువడి (హనుమాన్) , ఇళయ పెరుమాళ్ ( లక్ష్మణుడు ) మరియు నమ్మాళ్వార్ (శటగోపాన్) పెరుమాళ్ తప్ప వేరొకదానికి విలువ లేదు అన్నారో ఆళ్వార్లు కూడా “ఇందిర లోకం ఆళుం అచ్చువై పెరినుం వె౦డేన్” అనగా నాకు మోక్ష లోకము గురించి కూడా ఆలోచించాలని ఆశ లేదు.– కేవల౦ శ్రీ ర౦గమున పెరియ పెరుమాళ్ అనుభవము చాలును అని అర్ధము.అందరి ఆళ్వార్లలా పర్యాటన చేస్తూ వివిధ దివ్య దేశములలో అర్చామూర్తులను గూర్చి పాటలు పాడట౦ కాకు౦డ కేవలం వారిని స౦స్కరి౦చిన పెరియ పెరుమాళ్ పట్ల ఆళ్వార్ తరచుగా ఉపకార స్మృతి ( కృతజ్ఞతలు ) వ్యక్తపరుస్తూ పెరియ పెరుమాళ్తో మాత్రమే విడతీయరాని అనుబ౦ధమును పె౦చుకొనెను. ఆళ్వార్ల నిస్సంకోచమైన విశ్వాసమును మరియు వారి పట్ల ఉన్న ప్రేమను చూసిన ఏమ్పెరుమాన్లు కూడా ఆళ్వార్లకు పరత్వాది ప౦చకములొ ( ఏమ్పెరుమాన్ల విశిష్టమైన 5 లక్షణములు  ఇక్కడ చూడవచ్చు ) భాగామైనటువ౦టి దోషము లేని జ్ఞానమును, వారి పేర్లను, రూపములను, వారి దివ్యమైన లీలలను ఆళ్వార్లకు శ్రీ ర౦గమున౦దే అనుగ్రహి౦చెను. ఆళ్వార్ల భక్తిని చూసిన దేవ దేవి పవిత్రురాలై తన ధనమును పెరియ పెరుమాళ్కు సమర్పి౦చి ఏమ్పెరుమాన్లకు సేవ చేసుకొనెను.

పర జ్ఞానము, పరమ భక్తితో స్థిత ప్రజ్ఞుడై మరియు పెరియ పెరుమాళ్ మాత్రమే సర్వస్వముగా భావి౦చే ఆళ్వార్ నిత్యము పెరియ పెరుమాళ్ళును తిరు మ౦త్రముతో మరియు నామ స౦కీర్తనముతో అనుభవి౦చ సాగెను. శ్రీ వైష్ణవుల స్థానము పూర్తిగా తెలిసినవారై ఆళ్వార్లు యమునికి భయపడనవసరము లేదని ధ్రువీకరించెను. శ్రీ వైష్ణవులు ఇతర శ్రీ వైష్ణవుల పాదముల కోసము చూస్తు౦డగా యముడు ఆ శ్రీ వైష్ణవుడి పాదముల కోసము చుడునని చెప్పెను. సౌనక మహర్షి ఏమ్పెరుమాన్ల దివ్య నామముల కీర్తిని సదాన౦దుడికి చెప్పినట్లుగా ఆళ్వార్లు పెరియ పెరుమాళ్ ఎదుట తిరుమాలైను పాడి వినిపించెను. నమ్మాళ్వార్ అచిత్తు యొక్క లోపములను నిర్ధారి౦చినట్లు ( 24 తత్వములు: మూల ప్రకృతి, బుద్ది, అహ౦కారము, మనస్సు , ప౦చ జ్ఞానే౦ద్రియాలు, ప౦చ కర్మే౦ద్రియాలు, ప౦చ తన్మాత్రలు, ప౦చ భూతములు), ఆళ్వార్లు కూడా అచిత్తు తత్వమును స్పష్టంగా ధృవీకరిచెను “పురం చువర్ ఒటై మాదం” అనగా ఈ దేహము ఒట్టి బయట గోడ, నిజమయిన అధికారి లోపల ఉండువాడు అయిన ఆత్మయే అని అర్ధము.ఆళ్వార్లు “అడియోరుక్కు” అనగా జీవాత్మ భగవద్ భక్తులకు దాసుడు అని జీవాత్మ స్వరూపమును వెల్లడి౦చెను. తిరుమ౦త్ర ఉపాసకులు అయిన ఆళ్వార్లు ఏమ్పెరుమాన్లు మాత్రమే ఉపాయము అని తిరుమాలై ప్రబంధమునకు సారము అయిన “మే౦పొరుళ్” అన్న పాశురము న౦దు ఆవిష్కరి౦చెను. చివరిగా ఆళ్వార్లు “మే౦పొరుళ్” పాశురము తరువాత పాశురములలో శ్రీ వైష్ణవుల లక్ష్యము భక్తుల సేవయేనని వెల్లడి చేస్తు తిరుప్పల్లియేళ్ళుచ్చి ప్రబంధము చివరి పాశురమునందు “ఉన్నడియర్క్కాత్పాడుత్తాయ్” అనగా నన్ను నీ భక్తుల దాసుడిగా చేయుము అని ఏమ్పెరుమాన్లను ప్రార్ధన చేసిరి. ఈ ప్రప౦చము నందు ఉన్న సంసారుల అభ్యున్నతి కొరకు ఆళ్వార్లు ఈ దివ్యమైనటువ౦టి తిరుమాలై మరియు తిరుపల్లియేల్ళ్ళుచ్చి అను రె౦డు ప్రబంధములను మనకు అది౦చెను.

తొండరడిప్పొడి ఆళ్వార్ల తనియన్:

త్వమేవ మత్వా పరవాసుదేవం ర౦గేశయమ్ రాజవదర్హనియం |

ప్రాభోధికీమ్ యోక్రుత సూక్తిమాలాం భక్తా౦గ్రిరేణు౦ భగవ౦తమీడే ||

 అర్చావతార అనుభవమును ఇక్కడ చూడవచు.

రామానుజ తిరువడిగళే శరణమ్
జై శ్రీమన్నారాయణ

అడియేన్ .!

సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస

Source

నంజీయర్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొ  మనము పరాశర భట్టర్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

నంజీయర్ - తిరునారాయణపురం

నంజీయర్ – తిరునారాయణపురం

తిరు నక్షత్రం                                ~: ఫాల్గుణ మాసము, ఉత్తరా నక్షత్రము
అవతారస్థలం                               ~: తిరునారాయణపురం
ఆచార్యులు                                  ~: పరశర భట్టర్
శిష్యులు                                     ~: నంపిళ్ళై, శ్రీ సేనాదిపతి జీయర్ మరి కొందరు కలరు
పరమపదించిన ప్రదేశము               ~: శ్రీ రంగం

శ్రీ సూక్తి గ్రంధములు ~: తిరువాయి మొళి 9000 పడి వ్యాఖ్యానము, కన్నినున్ శిరుతామ్బు వ్యాఖ్యానము, తిరుప్పావై వ్యాఖ్యానము, తిరువందాది వ్యాఖ్యానములు, శరణాగతి గద్య వ్యాఖ్యానము, తిరుపల్లాణ్డు వ్యాఖ్యానము, రహస్య త్రయ వివరణ గ్రంధము (నూఱెట్టు 108) – ఈ గ్రంధములలొ చాల వరకు మనకు అందుబాటులొ లేవు.

శ్రీ మాధవర్ అను నామధేయముతో జన్మించి అద్వైత సిద్ధాంతమున గొప్ప తత్వ వేత్తగ ప్రసిద్ధి పొందారు. తరువాత భట్టర్ వారికి నంజీయర్ అని నామకరణము చేసారు. వారికి నిగమాంతయోగి మరియు వేదాంతి అను పేర్లు కూడ కలవు.

మాధవాచార్యులు గొప్ప అద్వైత తత్వ వేత్తగా తిరునారాయణపురము నందు నివసించిరి. ఎమ్పెరుమానార్లు వారిని మన సంప్రదాయమునకు సంస్కరింపదలచిరి. అద్వైత సంప్రదాయమునకు చెందినవారు అయినప్పటికిని; ఎమ్పెరుమానార్లకు వారి యందు గౌరవము కలదు. వారిని సంస్కరించు బాధ్యత భట్టర్లకు అప్పగించిరి.

భట్టర్ వైభవమును అప్పటికే తెలుసుకున్న మాధవచార్యులు వారిని కలుసుకొను సమయము కొరకు వేచివున్నారు. ఎమ్పెరుమానార్ల కోరిక మేరకు భట్టర్లు తిరునారాయణపురమునకు వెళ్ళెను. పిదప భట్టర్లు వారిని వాదనలో జయించి వారిని శిష్యులుగా స్వీకరించెను.( ఆ వృత్తాంతమును మీరు ఇక్కడ చదవవచ్చు). భట్టర్ ఒక సాధారణ వేషముతో వారి దగ్గరకు వచ్చి వారిని ఓడించిన సంగతి; వాదన ముగిసిన అనంతరం భట్టరుతో వచ్చిన శ్రీ వైష్ణవ బృందం మాధవాచార్యుల ఇంటికి వచ్చినప్పుడు తెలుసుకున్నారు. ఆ శ్రీ వైష్ణవ బృందం యొక్క ఆనందమునకు సంతసించిన మాధవాచార్యులు భట్టర్ వైభవమును కళ్ళారా చూసి గ్రహించెను.  భట్టర్లు శ్రీ రంగము నుంచి ఎంతో ప్రయాసకోర్చి; వారి వైభవమును పక్కకు పెట్టి; సాధారణ వ్యక్తిగా వచ్చి మాధవాచార్యులను సంస్కరించి వారికి శాస్త్రార్ధములను బోధించిన భట్టర్లకు ఏ విధముగ ఋణము తీర్చుకోవాలో తెలియచేయవలసిందిగా భట్టర్లను అడిగెను. భట్టర్లు చాల సులువుగ అరుళిచెయల్ మరియు ఇతర సాంప్రదాయ గ్రంధములను పఠించి వాటిలొ నిష్ణాతులు కావలసిందిగా ఆదేశించెను. శ్రీ రంగమునకు రావలసినదిగ కూడ ఆదేశించెను.

మాధవాచార్యుల భార్యలు వారి కైంకర్యములకు అడ్డుగా ఉండుట చూసి; ఆచార్యని ఎడబాటు సహించలేక శ్రీ రంగమునకు వెళ్ళి వారి ఆచార్యుల సేవ చేసుకొనుటకు సన్యాస అశ్రమమును స్వీకరించ దలచెను. వారి అపారమయిన సంపదను 3 భాగములుగా చేసి; 2 భాగములు వారి ఇద్దరి భార్యలకు (శాస్త్ర ప్రకారము సన్యసించ దలిచిన; భార్య యొక్క సంరక్షణ భారము పూర్తి గావించిన పిదప తీసుకోవలెను) పంచి సన్యాసాశ్రమమును స్వీకరించెను. పిమ్మట వారు శ్రీ రంగమునకు బయలుదేరెను. దారిలొ అనంతాళ్వాన్లు కలసి వారిని సన్యాసాశ్రమమును స్వీకరించ దలచిన కారణమును అడిగెను. వారు భట్టరు దగ్గరకు వెళ్ళి; వారిని సేవ చేసుకుంటే ( గురువు సేవ)  ఎమ్పెరుమాన్లు మోక్షమును ప్రసాదించునని బదులు చెప్పిరి.  అప్పుడు ఆళ్వాన్లు “తిరుమంత్రములొ జన్మించి ( ఆత్మ స్వరూపము) ద్వయ మంత్రములో పెరిగమని ( పెరుమాళ్ళకు మరియు పిరాట్టికి కైంకర్యమును చేసుకుంటు) దీవించెను.  భట్టర్లు మాధవాచార్యుల ఆచార్య నిష్టను గమనించి వారిని నమ్ జీయర్ అని పిలిచెను. ఆ నాటి నుండి వారు నంజీయరుగా ప్రసిద్ధి పొందెను.

భట్టర్లు మరియు నంజీయర్లు ఉత్కృష్టమయిన ఆచార్య – శిష్య సంబంధమును అనుభవించెను. నంజీయర్ వారి ఆచార్యుల కోసము; అన్నింటిని త్యజించి వారి ఆచార్యులతో ఉండెను.భట్టర్లు వారికి తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ వారి 6000 పడి వ్యాఖ్యానము ప్రకారము తిరువాయి మొళిని నేర్పించెను. భట్టర్లు నంజీయర్లకు తిరువాయిమొళికి వ్యాఖ్యానమును అనుసంధించమనగ వారు 9000 పడి వ్యాఖ్యానమును రచించెను. తిరువాయి మొళి కాలక్షేపమును వారు జీవించిన 100 ఏండ్ల కాలములో 100 మార్లు చెప్పిన ఘనత నంజీయర్లకే సొంతము.

నంజీయర్ల వారి ఆచార్య భక్తి వర్ణనాతీతం. వారి ఆచార్య భక్తిని కొన్ని సంఘటనల ద్వార తెలుసుకొనే ప్రయత్నము చేద్దాము.

 • ఒకనాడు భట్టర్లు పల్లకిలో వెళుతుండగా నంజీయర్లు ఒక చేతితో త్రిదండమును ధరించి ఒక భుజముపై వారి పల్లకిని మోయుటకు ప్రయత్నించెను. అది గమనించిన భట్టర్లు వారిని పిలచి; వారికి ఇది తగదు అని, సన్యాసాశ్రమమున ఉండు వారు ఇలా పల్లకిని మోయరాదు అని చెప్పెను. నంజీయర్లు ” మీ సేవకు ఈ త్రిదండము అడ్డుగా ఉన్న ఎడల దానిని విరిచి; సన్యాసాశ్రమమును త్యజించును” అని బదులిచ్చెను
 • ఒకనాడు నంజీయర్ల పరిచారకులు భట్టర్ల రాకతో వారి తోటలో కొద్దిగ అల్లరి జరుగుతుందని వారు అడ్డుగా ఉన్నారని ఫిర్యాదు చేసెను. అప్పుడు నంజీయర్లు ఆ తోట భట్టర్ల కైంకర్య రూపముగా ఉన్నదని; నమ్పెరుమాళ్ళ కోసము కాదు అని వారిని మందలించిరి.
 • ఆచార్యులు వారి శిష్యుల ఒడిలో తల పెట్టుకొని విశ్రాంతి పొందుట సాధారణము.
  ఒకనాడు భట్టర్లు పడుకొన దలచి నంజీయర్ల ఒడిలో తన తలను పెట్టుకొని విశ్రాంతి పొందుచుండెను.. భట్టర్లు చాల సేపటి తరువాత మెలుకువ వచ్చి చూడగా నంజీయర్లు ఆ సమయమున కదలకుండ ఉండెనన్న విషయమును గ్రహించి; వారి ఆచార్య కైంకర్య నిష్టకు ప్రీతి చెంది వారికి ద్వయ మంత్ర అర్ధమును ఉపదేశించెను. ( ఆచార్యులు వారి శిష్యుల నడవడి నచ్చిన పిదప వారికి అర్ధములను బోధించును.)
 • నంజీయర్లు అరుళిచెయల్ అన్నింటిలోను నిష్ణాతులు అయ్యిరి. భట్టర్లు నంజీయర్లు అరుళిచెయల్ పాసురములను పారణ (అనుసంధించు) సమయమున వాటికి అద్భుతమయిన  అర్ధములను చెప్పేవారు. ఒకనాడు నంజీయర్లు తిరువాయి మొళి 7.2.9 “ఎన్ తిరుమగళ్ చేర్ మార్వనే ఎన్ఱుమ్ ఎన్నుడైయావియే ఎన్ఱుమ్” పాసురము పారణ చేయుచుండగ  — వారు ఆ పాసురములోని వాక్యము పూర్తిగా కలిపి విడమరచకుండ చదివెను. అది విని భట్టర్లు వెంటనే మూర్చపోయెను.తెలివి వచ్చిన పిమ్మట భట్టర్లు ఆ వాక్యమును అలానే చదవవలెనని; అప్పుడు మాత్రమే మనకి పరాంకుశ నాయకి యొక్క హృదయము అర్ధమవుతుంది అని చెప్పెను.ఆ వాక్య అర్ధము కలిపి చడివితె ఈ విధముగ ఉండును ” శ్రీ రంగ నాచ్చియార్లను హృదయమునందు కల శ్రీ రంగనాధుడు నాకు చాల ప్రియం” అని ఆళ్వార్ల భావన.  అదే వాక్యమును విడ మరచి చదివితె “శ్రీ రంగనాధుడి మది యందు శ్రీ రంగ నాచ్చియార్లు కలరు. అలాంటి రంగనాధులవారు నాకు చాల ప్రియం అని అర్ధము వచ్చును.
 • భట్టర్లు తమిళ దేశము కాని మరియు సంస్కృత వేదాంతి యగు నంజీయర్లను వారి అరుళిచెయల్ యొక్క తత్వ జ్ఞానమును పలు మార్లు ప్రశంసించెను.

భట్టర్లు మరియు నంజీయర్ల మధ్య అనేక ఆసక్తికరమగు సంభాషణలు జరిగెను. ఎంత పెద్ద పండితుడు అయినప్పటికి నంజీయర్లు వారికి వచ్చిన సందేహాలను భట్టర్ల యదుట ఉంచి వాటిని వివరించమని కోరుటలో ఎన్నడూ సంకోచించలేదు.  వారి మధ్య సంభాషణలు కొన్ని ఇప్పుడు చూద్దాము.

 • నంజీయర్లు ఒకనాడు భట్టర్లను ఎందువలన ఆళ్వార్లు కృష్ణ పరమాత్మ యందు ఎక్కువ ప్రియంగా ఉండేవారు అని అడిగెను. ఇటీవల జరిగిన విషయములను గుర్తుపెట్టుకోవడము సహజమని; అందువలన కృష్ణావతారము ఎమ్పెరుమాన్ల ఇటీవల (ఇతర అవతారములు ఎప్పుడో స్వీకరించడము వలన) అవతారము కావున వారిని కలవడము ఆళ్వార్లకు కుదరకపోవడము వలన కృష్నుడి యందు ప్రేమని వ్యక్తపరిచెనని చెప్పెను.
 • కృష్ణావతారమున ఎమ్పెరుమాన్లు గోప కులమునందు జన్మించెను. వారు ఎక్కడికి వెళ్ళినను; కంసుని సేవకులు ( అసురులు) వారిని చంపటానికి సిద్ధముగ ఉండేవారు. కాని రామావతారమున (ఇతర అవతారముల యందు కూడ) వారు అస్త్ర విద్యలు నేర్చుకున్నారు. మరియు వారి తండ్రి దశరధుడు చాల గొప్ప యోధుడు. (ఇంద్రునికి సహాయము చేయగల సమర్ధుడు). వారి సోదరులు కూడ చాల ధైర్యవంతులు మరియు శక్తి వంతులు. అందువలన పెరియాళ్వార్లు కన్నన్ ( కృష్ణ) ఎమ్పెరుమాన్ల యందు భయముతో వారికి కాపు గాచెను అని భట్టర్లు వివరణ ఇచ్చెను.
 • కలియన్ ఆళ్వార్లు తిరుమొళి “ఒరు నల్ సుఱ్ఱమ్” పదిగము ( తిరుమొళి చివర పాసురములు) నందు అనేక దివ్యదేశ పెరుమాళ్ళకు మంగళా శాసనము చేసెను. నంజీయర్లు ఇదే విషయము విన్నవించి ఎందుకు అలా చేసారు అని అడుగగా; ఒక ఆడ పిల్ల పెళ్ళి చేసుకొని తన భర్త ఇంటికి పోవు సమయమున ఏ విధముగా వారి స్నేహితుల ఇండ్లకు త్వరగా వెళ్ళి పలకరించునో అదే విధముగా ఆళ్వార్లు పరమపదమునకు బయలుదేరుటకు సిద్ధముగనుండుట వలన భూలోకమున ఉన్న ఎమ్పెరుమాన్లందరికి ఒక సారి త్వరగా మంగళా శాసనమును చేసెను అని వివరించెను.
 • ప్రహ్లాదుడు వారి మనమడు అయిన మహాబలి ఎమ్పెరుమాన్లను గౌరవించుట లేదని తన సంపదను కోల్పోవుగాక అని శపించెను. ధనము/సంపద యందు ఏ విధమయిన కోరిక మరియు ఆసక్తి లేని ప్రహ్లాదుడు ఎందువలన ఈ విధముగ శపించెనో అని అడుగగా; ఒక కుక్కను (సరిదిద్దుటకు) శిక్షించుటకు అది తినెడి మట్టిని ఏ విధముగ దాని దగ్గర నుండి తీసి వేయుదుమో; అదే విధముగా ప్రహ్లాదుడు మహాబలికి ప్రియమైన సంపదను తీసి వేసెను అని వివరణ ఇచ్చెను.
 • వామన చరిత్ర యందు మహాబలి పాతళమునకు మరియు సుక్రాచార్యులు తన కన్ను కోల్పోవునకు కల కారణమును నంజీయర్లు అడుగగా; సుక్రాచార్యులు మహాబలి యొక్క ధర్మమును చేయుటకు అడ్డుపడినందుకుగాను వారి కన్నును; మరియు ఆచార్యుల మాట విననందుకు మహాబలి పాతాళమునకు వెళ్ళెనని వివరించెను.
 • దశరధుడు పెరుమాళ్ళని విడిచి ఉండలేక వెంటనే ప్రాణములను విడచినప్పటికి స్వర్గమునకు వెళ్ళెను ఎందువలన అని నంజీయర్లు అడుగగా; దశరధుడు సామాన్య ధర్మమునకు ( సత్యవాక్ పాలనకు) కట్టుబడెనని; అందువలన వారు ఎమ్పెరుమాన్ల శ్రేయస్సు (రక్షణ) కోరలేదని అందువలన వాస్తవముగ నరకమునకు వెళ్ళవలసినది అని చెప్పి.  పెరుమాళ్ళ తండ్రియగుటచే వారి దయ వల్లన నరకమును తప్పించి స్వర్గమునకు పంపెనని చెప్పెను.
 • విభీషణుడు భక్తుడు అయినప్పటికి; సుగ్రీవుడు ఎందువలన తమ కూటమిలో చేర్చుకొనుటకు ఇష్టపడలేదని నంజీయర్లు అడుగగా; ఏ విధముగ పెరుమాళ్ వారి భక్తులను రక్షించుటకు సిద్ధపడెనో అదే విధముగా సుగ్రీవుడు కూడ తనకి శరణాగతి చేసిన ( రాముడు ఒకనాడు సుగ్రీవుడిని సహాయము కోరుతాడు) వారిని కాపాడుకొనుచున్నాడు. విభీషణుడు పెరుమాళ్ళకు హాని చేయునేమో అని సుగ్రీవుడి భయమని వివరణ ఇచ్చెను.
 • కృష్నుడు దేవకిని మరియు వసుదేవులను కంసునిని చంపి వారిని విడిపించగా; దేవకి యందు తల్లి తనము/పుత్ర వాత్సళ్యము వలన తన స్ధనముల యందు పాలు పుట్టగా; కృష్నుడు చిన్నవాడు కానప్పటికి పాలును తాగెను. అది ఎట్లు కుదురును అని నంజీయర్లు అడుగగా; అది తల్లి కొడుకుల మధ్య విషయము మనము ఎవరము అడుగటానికి అని సరదాగ చెప్పి. అసలు తల్లి కానటువంటి ప్రేమ లేనటువంటి పూతన పాలు ఇచ్చినప్పుడు ఎమ్పెరుమాన్లు తాగెను; తనను కన్న తల్లి తన యందు అమితమైన ప్రేమ కలదై వారికి పాలు పడితె; వారు తాగరు అని అర్ధముచేసుకోవడములో కష్టమేమిటి అని ప్రశ్నించి సమాధనమునిచ్చెను.
 • భట్టర్లు ఒకనాడు యయాతి చరిత్రమును ఉపన్యాసములో భాగముగ చెప్పెను. యయాతి 100 అశ్వమేద యాగములను చేసి; స్వర్గమునకు చేరి ఇంద్రుని పదవిలో భాగము కోరెను. పదవి పంచుకొనుటకు ఇష్టము లేని ఇంద్రుడు యయాతిని తప్పు చేయు విధముగా ప్రణాలికను రూపుదిద్ది; వారిని క్రిందకి పడవేసెను. నంజీయర్లు ఈ వృత్తంతమును ఎందుకు చెప్పెనో అని అడుగగ; ఈ చరిత్ర మనకు ఎమ్పెరుమాన్ల గొప్ప తనమును; ఇతర దేవతలలోని లేనిది తెలియచేయునని చెప్పెను.ఎమ్పెరుమాన్లు వారికి శరణాగతి చేసిన వారి అందరికి సామ్యాపతి మోక్షమును ప్రసాదించునని; అదే ఇతర దేవతలు 100 అశ్వమేద యాగములు చేసినప్పటికి కూడా వారితో సమానముగ చుసుకొనుటకు ఇష్టపడరు అని క్రిందకు పడివేయును అని చెప్పి వివరణ ఇచ్చెను.

ఇలాంటి సంభాషణలు ఎన్నో మనకు అరుళిచెయల్ మరియు శాస్త్ర రహస్యములు తెలియచేయును. ఈ సంభాషణలు అన్ని నంజీయర్ల అరుళిచెయల్ ప్రావీణ్యతను వారి శిష్యులకు అర్ధములు చెప్పుటకు త్రోవవేసెను.

నంజీయర్లు ఒకనాడు తమ 9000 పడి వ్యాఖ్యానమును లిఖించదలచి నంబూర్ వరదాచారియర్ మిక్కిలి ప్రావీణ్యుడని గ్రహించి వారికి ఆ బాధ్యతను అప్పగించిరి. వారు పని పూర్తి చేసిన పిమ్మట నంజీయర్లు వారిని ప్రశసించి వారిని నంపిళ్ళై అను నామమును బిరుదుగా ఇచ్చి వారిని మన దర్శన ప్రవర్తకుడిగా చేసెను. నంజీయర్ల కన్నా మంచి వ్యాఖ్యానమును చెప్పినప్పుడు నంపిళ్ళైను నంజీయర్లు ప్రశంసలతో ముంచేసేవారు. అటువంటి గొప్ప మహనీయుడు నంజీయర్లు.

నంజీయర్లకు సాంప్రదాయ విషయముల యందు గొప్ప అవగాహన కలదు. ఒక శ్రీ వైష్ణవుడు మరి ఒక శ్రీ వైష్ణవుడి బాధను చూసి తమ బాధగా భావిస్తాడో వారు నిజమయిన శ్రీ వైష్ణవుడని శ్రీ సూక్తమును మనకు అందించిరి. వారు వారి కాలములో ఉన్న శ్రీ వైష్ణవుల యందు మరియు ఇతర ఆచార్యుల యందు గొప్ప గౌరవము కలిగి యుండెడివారు.

వారు తిరుమంగై ఆళ్వార్ల పెరియ తిరుమొళి 3.6 (తూవిరియ మలరుళక్కి పదిగము) పాసురములను పెఱ్ఱి అని అరయరు స్వామి పారణ చేయుచున్నప్పుడు వారు ఆ అమృత ధారలొ నిమఘ్నునులయ్యేవారు.

వారి చరమ దశలో వారు ఎమ్పెరుమాన్లను స్వయం తిరుమేనిని దర్శనము కోరగా’ ఎమ్పెరుమాన్లు వారి కొరకు మాత్రమే దర్శనమును ఇచ్చెను. ఆ దివ్య మంగళ విగ్రహమును చూసిన పిమ్మట; వారు వారి శిష్యులకు  అనేక చరమ సూచనలను ఇచ్చి; వారి చరమ తిరుమేనిని వదలి పరమపదమునకు చేరుకొనెను.

మనము కూడా వారిలా ఆచార్య నిష్ట; ఎమ్పెరుమాన్ల యందు భక్తి భావన కలుగచేయమని వారిని ప్రార్ధించుదాము.

నంజీయర్ల తనియన్

నమో వేదాన్త వేద్యాయ జగన్ మన్గళ హేతవే

యస్య వాగామృతాసార భూరితం భువన త్రయం

రామానుజ తిరువడిగళే శరణమ్
జై శ్రీమన్నారాయణ

అడియేన్ .!

సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస

Source

ఎమ్పెరుమానార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొమనము పెరియ నంబి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

ramanuja thirumeni darsanamతిరు నక్షత్రం    ~: చైత్ర మాసము, ఆరుద్ర నక్షత్రము
అవతారస్థలం  ~: శ్రీ పెరుంబూదూర్.
ఆచార్యులు     ~: పెరియ నంబి
శిష్యులు         ~: కూరతాళ్వాన్, ముదలి అండాన్, ఎంబార్, అరుళళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్,
అనంతాళ్వాన్, 74 సింహాసనాధిపతులు మరియు కొన్ని వేల మంది శిష్యులు.12000 శ్రీ వైష్ణవులు, 74 సింహాసనాధిపతులు, 700 సన్యాసులు మరియు ఎందరో శ్రీ వైష్ణవులు వేరు వేరు కులములకు చెందిన వారు రామానుజుల  శిష్యులుగ చెప్పబడుతారు.

వీరు పరమపదించిన ప్రదేశము ~: శ్రీ రంగం

శ్రీ సూక్తి గ్రంధములు ~: వీరు నవ రత్నములనెడి తొమ్మిది గ్రంధ రచనలను చేసారు.   అవి శ్రీ భాష్యము, గీతా భాష్యము, వేదార్ధ సంగ్రహము, వేదాంత దీపము, వేదాంత సారము, శరణాగతి గద్యము, శ్రీ రంగ గద్యము, శ్రీ వైకుంఠ గద్యము మరియు నిత్య గ్రంధము.

కేశవ దీక్షితులు మరియు  కాంతిమతి అను పుణ్య దంపతులకు ఆది శెషుని అంశగ  ఇళయాళ్వార్లు శ్రీ పెరుంబూదూర్ అను గ్రామమున జన్మించిరి. వీరికి అనేక నామధేయములు కలవు. ఎవరు వీరికి అవి బహూకరించెనొ ఇప్పుడు చూద్దాము.

 • పెరియ తిరుమలై నంబి వారు రామానుజుల తల్లి తండ్రుల తరుఫున ఇళయాళ్వార్ అని నామకరణం చేసిరి.
 • పంచ సంస్కార సమయమున పెరియ నంబి శ్రీ రామానుజ అని బహూకరించెను.
 • సన్యాసాశ్రమ స్వీకార సమయమున దేవ పెరుమాళ్ యతిరాజ అని పిలిచి బహూకరించెను.
 • తిరువరంగ పెరుమాళ్ అరయర్ లక్ష్మణ ముని అని బహూకరించెను.
 • తిరుక్కోష్టియూర్ నందు వారికి శరణాగతి చేసిన వారి అందరికి; చరమ స్లోక అర్ధమును ఉపదేశించ్చినప్పుడు తిరుక్కోష్టియూర్ నంబి వారిని ఎమ్పెరుమానార్ అని పిలిచి వారికి ఆ పేరును బహూకరించెను.
 • శటగోపన్ పొన్నడి అని తిరుమాలై అండాన్ బహూకరించెను.
 • కోయిల్ ఆణ్ణన్ అని తిరుమాలిరున్చోలై అళగర్కు 100 పాత్రలలొ అక్కార అడిసిల్ మరియు 100 పాత్రలలొ వెన్న నైవేద్యము సమప్రించినప్పుడు ఆండాళ్ బహూకరించెను.
 • కాష్మీర దేశము నందు సరస్వతి దేవి శ్రీ భాష్యకారర్ అని బిరుదును బహూకరించెను
 • శ్రీ పెరుంబూదూర్ నందు ఆది కేశవ పెరుమాళ్ళు భూతపురీశర్ అని బహూకరించెను.
 • తిరువేంకటముడయాన్ ( వేంకటేశ పెరుమాళ్) వారికి దేశికేంద్రర్ అను బిరుదును బహూకరించెను.

వారి జీవిత చరిత్ర సంగ్రహముగ:

 • తిరువల్లిక్కేణి పార్ధసారధి ఎమ్పెరుమాన్ల కటాక్షముచే  వారి అంశావతారముగ శ్రీ పెరుంబూదూర్ నందు జన్మించెను.
ఉభయ నాచ్చియార్ సమేత పార్ధసారధి పెరుమాళ్ - తిరువల్లిక్కేణి

ఉభయ నాచ్చియార్ సమేత పార్ధసారధి పెరుమాళ్ – తిరువల్లిక్కేణి

 • తంజమ్మాల్ (రక్షకంబాళ్) వారిని వివాహము చేసుకొనెను.
 • కాంచిపురమున యాదవ ప్రకాశుల వద్ద సామాన్య శాస్త్రము మరియు పూర్వ పక్షమును నేర్చుకొనెను.
 • యాదవ ప్రకాశుల శాస్త్ర వాక్యముల యొక్క కుటిల వివరణమును ఇళయాళ్వార్ సరిదిద్దెను.
 • వారణాసి యాత్రలొ; యాదవ ప్రకాశుల శిష్యులు కొందరు; ఇళయాళ్వర్లను చంపుటకు ప్రణాలికను రూపుదిద్దెను. గోవిందర్ ( ఎంబార్ ); ఇళయాళ్వార్ యొక్క బంధువు అది కనిపెట్టి; వారిని కాంచిపురమునకు వెళ్ళమని పంపి వేసెను. వారు ఆ అడవిలొ తప్పిపోగా; దేవ పెరుమాళ్ మరియు పెరుందేవి తాయార్లు వారికి సాయపడి; వారిని కాంచిపురమునకు కొనిపోయెను.
 • వారు కాంచిపురమునకు విచ్చేసిన తరువాత; వారి తల్లి గారి ఆదేశము ప్రకారము; వారు తిరుక్కచ్చి నంబి వారి ఆధ్వర్యములొ దేవ పెరుమాళ్ళకు సేవించుచుండెను.
 • పెరియ నంబితొ కూడి ఇళయాళ్వార్లు శ్రీ రంగమునకు ఆళవందార్లను కలువుటకు బయలుదేరెను. కాని వారికి ఆళవందార్ల చరమ తిరుమేని దర్శనము మాత్రమె దొరికెను. వారు అప్పుడు ఆళవందార్ల 3 కోరికలను తీర్చునని ప్రతిజ్ఞ చేసెను.
 • ఇళయాళ్వార్లు తిరుక్కచ్చి నంబి వారిని గురువుగా భావించి; వారిని పంచ సంస్కారములు ప్రసాదించమని కోరెను. నంబి ఆ కోరికను శాస్త్ర ప్రమాణములను చూపించి; తిరస్కరించెను.ఇళయాళ్వార్లు నంబి యొక్క శేష ప్రసాదమును స్వీకరించుటకు కోరిక కలిగెను. ఆ కోరిక కూడ తీరలేదు.
 • ఇళయళ్వార్లకు దేవ పెరుమాళ్ళు 6 వార్తగళ్ ( ఆరు విషయములు) తిరుక్కచ్చి నంబి ముఖముగ ఇచ్చెను.
 • పెరియ నంబి మరియు ఇళయాళ్వర్లు ఇరువురు మధురాంతకము నందు కలుసుకొనెను. పెరియ నంబి వారికి పంచ సంస్కారములను కావించి; వారికి రామానుజ అను దాస్య నామమును ఇచ్చెను.
 • పెరియ నంబి వారు రామానుజుల గృహము నందు ఉండి; వారికి సాంప్రదాయ అర్ధములను బోధ చేసిరి. తుదకు పెరియ నంబి వారు శ్రీ రంగమునకు వెళ్ళిపోయెను.
 • దేవ పెరుమాళ్ వద్ద రామానుజులు సన్యాసాశ్రమమును స్వీకరించెను.
 • ఆళ్వాన్ మరియు ఆండాన్ రామానుజులకు శిష్యులయ్యెను.
 • యాదవ ప్రకాశులు రామానుజులకు శిష్యులుగ మారి; గోవింద జీయరు అని నామమును పొందెను. వారి యతి ధర్మ సముచయం అను గ్రంధమును రచించెను. శ్రీ వైష్ణవ యతులకు అది ప్రమాణముగ భాసిల్లుచున్నది.
 • పెరియ పెరుమాళ్ తిరువరంగ పెరుమాళ్ళను దేవ పెరుమాళ్ళ వద్దకు పంపి; రామానుజులను శ్రీ రంగమునకు పంప వలసినదిగా కోరెను. దేవ పెరుమాళ్ అంగీకారమున రామానుజులు శ్రీ రంగవాసి అయ్యెను.
 • రామానుజులు పెరియ తిరుమలై నంబిని పంపి; గోవింద భట్టర్లను( ఎంబార్) తిరిగి శ్రీ వైష్ణవ ధర్మమునకు తెప్పించెను.
 • చరమ స్లోక అర్ధమును తిరుక్కోష్టియూర్ నంబి వద్ద నేర్చుకొనుటకు; రామానుజులు తిరుక్కోష్టియూర్ వెల్లెను. అక్కడ వారు నేర్చుకొనుటకు ఆశక్తి ఉన్న వారందరికి ఆ స్లోక అర్ధమును వివరించెను. అది చూసి నంబి సంతొషించి ఎమ్పెరుమానార్ అని బిరుదును బహూకరించెను.
 • తిరువాయి మొళి కాలక్షేపమును తిరుమాలై ఆంఢాన్ల వద్ద నేర్చుకొనెను.
 • తిరువరంగ పెరుమాళ్ అరయర్ వద్ద పంచమోపాయ (ఆచార్య) నిష్ట నేర్చుకొనెను.
 • ఎమ్పెరుమానార్లు వారి సంబంధీకుల శ్రేయస్సు కొరకు  పరమ కారుణ్యము చేత నమ్పెరుమాళ్ మరియు శ్రీ రంగ నాచ్చియార్ యదుట శరణాగతి చేసెను.
 • ఎమ్పెరుమానార్లకు ఒకనాడు విషపూరిత భిక్ష ఇవ్వబడెను. తిరుక్కోష్టియూర్ నంబి శ్రీ రంగమునకు వచ్చి; కిడాంబి ఆచాన్లను ఎమ్పెరుమానార్ల భిక్ష బాధ్యతను స్వీకరించవలసినదిగ ఆదేశించెను.
 • రామానుజులు యజ్ఞ మూర్తిని వాదనలొ వోడించిరి. వారు అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్లుగ మారి; ఎమ్పెరుమానార్ల (రామానుజులవారి) తిరువారాధన ఎమ్పెరుమాన్ల తిరువారాధన కైంకర్యమును పొందెను.
 • అనంతాళ్వాన్లను మరియు ఇంకొందరిని; అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ల శిష్యులవ్వమని ఆదేశించెను.
 • అనంతాళ్వాన్లను తిరుమలలోని తిరువేంకటముడయాన్ల నిత్య కైంకర్యమునకు తిరుమల పంపెను.
 • ఎమ్పెరుమానార్లు దివ్య దేశ యాత్రకు వెళ్ళి; తిరుమల చేరుకొనెను.
 • ఆ పిమ్మట తిరువేంకటముడయాన్లు విష్ణు మూర్తి (విగ్రహము) అని నిరూపించి; కుద్రుష్టులని ఓడించెను.
 • రామానుజులను వేంకటేశ్వర స్వామి యొక్క ఆచార్యునిగ కీర్తించబడెను. ఇప్పటికి కూడ రామానుజులు తిరుమలలొ జ్ఞాన ముద్రలొ దర్శనమిస్తారు.
ఎమ్పెరుమానార్ - తిరుమల

ఎమ్పెరుమానార్ – తిరుమల

 • అక్కడ వారు పెరియ తిరుమలై నంబి వద్ద శ్రీ రామాయణ కాలక్షేపమును వినెను.
 • ఎమ్పెరుమానార్లు గొవింద భట్టర్లకు సన్యాసాశ్రమమును ప్రసాదించి వారికి ఎంబార్లుగ నామకరణము చేసెను.
 • ఎమ్పెరుమానార్లు కూరతాళ్వానతో కూడి; కాష్మీరు దేశమునకు బోదాయన వృత్తి గ్రంధమును తెచ్చుటకు వెళ్ళెను. వారికి గ్రంధము లభించినప్పటికి అక్కడి పండితులు  వారి సైన్యమును పంపి వారి దగ్గర నుంచి తిరిగి తీసుకొనెను. అప్పుడు ఆళ్వాన్లు ఆ వృత్తి మొత్తాన్ని తాను ధారణలొ నిలుపుకున్నట్లు చెప్పెను.
 • ఎమ్పెరుమానార్లు ఆళ్వాన్ల సాహాయముతొ శ్రీ భాష్యమును రచించెను. ఈ విధముగ ఆళవందార్ల మొదటి కోరిక నిరవేర్చెను.
 • ఎమ్పెరుమానార్లు ఒకనాడు తిరుక్కురుంగుడి దివ్య దేశమునకు వెళ్ళగ అక్కడ ఎమ్పెరుమాన్లు రామానుజులకు శిష్యుడయ్యి శ్రీ వైష్ణవ నంబి అని పేరు పొందెను.

 • నమ్పెరుమాళ్ యొక్క కృప చేత ఆళ్వాన్ మరియు ఆండాళ్ళకు ఇద్దరు కుమారులు జన్మించెను.
 • ఎమ్పెరుమానార్లు వారికి పరాశర మరియు వేద వ్యాస అని నామకరణము చేసి ఆళవందార్ల రెండవ కోర్కెను తీర్చెను.
 • ఎంబార్ల సోదరుడయిన సిరియ గోవింద పెరుమాళ్ళకు బిడ్డ పుట్టగ వారికి “పరాంకుశ నంబి ” అని నామకరణము చేసి ఆళవందార్ల మూడవ కోర్కెను తీర్చెను. అదే విధముగ ఎమ్పెరుమానార్లు తిరుక్కురున్గై పిరాన్ పిళ్ళాన్ వారికి తిరువాయి మొళికి భాష్యమును రచించమని చెప్పి ఆళవందార్ల మూడవ కోర్కెను తీర్చెనని ప్రసిద్ధి.
 • ఎమ్పెరుమానార్లు తిరునారాయణ పురమునకు వెళ్ళి; అక్కడ ఆలయ నిర్వహణను మరియు ఆరాధనా విధనమును స్ధాపించి ఎంతో మందికి పంచ సంస్కారములను ప్రసాధించెను.
 • ఎమ్పెరుమానార్లు ఒకనాడు 1000 తలల ఆదిశేషునిగ మారి 1000 జైనులను ఏక కాలమున వాదనలో ఓడించెను.
 • ఎమ్పెరుమానార్లు శెల్వ పిళ్ళై ఉత్సవ మూర్తిని తిరిగి సంపాదించి; ఆ మహమ్మదీయ రాజు కుతురికి శెల్వ పిళ్ళైకు వివాహము చేసెను.
 • ఎమ్పెరుమానార్లు శైవ రాజు మరణము పొందిన పిదప శ్రీ రంగమునకు వేంచేసెను. వారు ఆళ్వాన్లను దేవ పెరుమాళ్ళను స్తోత్రము చేసి వారి కన్నులు తిరిగి పొందమని ఆదేశించెను.
 • ఎమ్పెరుమానార్లు తిరుమాలిరున్చోలై  దేశమునకు వెళ్ళి; 100 పాత్రల అక్కార అడిసిల్ మరియు 100 పాత్రల వెన్నను సమర్పించి ఆండాళ్ళు కోరికను తీర్చెను.
 • ఎమ్పెరుమానార్లు పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ల గొప్ప తనమును ఇతర శ్రీ వైష్ణవులకు చూపించెను
 • ఎమ్పెరుమానార్లు వారి శిష్యులకు అనేక  చరమ ఆదేశములను ఇచ్చెను. పరాశర భట్టర్లను వారితొ సమానముగ చూడవలెనని ఆదేశించెను.పరాశర భట్టర్లకు నంజీయర్లను మన సంప్రదాయమునకు మార్చవలసిందిగ ఆదేశించెను.
 • చివరిగ ఆళవందార్ల తిరుమేనిని ధ్యానము చేసుకొనుచు; వారు ఈ లీలా విభూతి యందు వారి లీలను పూర్తి చేసుకొని నిత్య విభూతియందు లీలను కొనసాగించుటకై పరమపదమునకు సాగెను.
 • ఆళ్వార్ల చరమ తిరుమేనిని ఆళ్వార్ల తిరునగరిలొ ఆదినాధన్ కోవెలలో భద్రము చేసినట్లు; ఎమ్పెరుమానార్ల చరమ తిరుమేనిని శ్రీ రంగములొ రంగనాధ కోవెలలొ భద్రపరిచెను ( ఎమ్పెరుమానార్ సన్నిది వద్ద మూలవర్ తిరుమేని క్రింద ). వారి చరమ కైంకర్యములు అన్ని రంగనాధ బ్రహ్మోత్సవము విధముగ వైభవముగ జరిగెను.

మన సంప్రదాయము నందు ఎమ్పెరుమానార్ల అద్వితీయమైన స్ధానము:

మన ఆచార్య రత్న హారము నందు ఎమ్పెరుమానార్లను నాయక మణి అనగ మధ్యలొ ఉండునది అని కీర్తిస్తారు. నాయనార్ ఆచాన్ పిళ్ళై ( పెరియవాచాన్ పిళ్ళై వారి తనయులు) వారి చరమోపాయ నిర్ణయం అను గ్రంధమున ఎమ్పెరుమానార్ల పూర్తి వైభవమును చాటి చెప్పిరి. ఆ గ్రంధములోని కొన్ని అద్భుతమయిన విషయములను మనము ఇప్పుడు సేవించుదాము.

 • మన పూర్వాచార్యుల (రామానుజులకు ముందు మరియు వారి తరువాత వారు) శ్రీ సూక్తుల ప్రకారము శ్రీ వైష్ణవులకు చరమోపాయము ఎమ్పెరుమానార్లు అనే నిర్ధారించెను.
 • మన పూర్వచార్యులు అందరు వారి ఆచార్యుల మీద ఆధారపడినప్పటికి; వారి ఆచార్యులందరు; ఎమ్పెరుమానార్ల మీద ఆధారపడమని చెప్పెను. ఈ విధముగ ఎమ్పెరుమానార్ల ఉద్ధారకత్త్వము నిరూపించబడెను.
 • పెరియవాచాన్ పిళ్ళై వారి మానిక్క మాలై అను గ్రంధమున “ఆచార్య స్ధానము” చాల గొప్పదని;  ఎమ్పెరుమానార్లు మాత్రమే ఆ స్ధానమునకు అర్హులని చెప్పెను.
 • ఎమ్పెరుమానార్ల ముందు ఆచార్యులు “అనువృత్తి ప్రసన్నాచార్యులు” అని పిలవబడెని. అనగ వారు శిష్యులచే సేవను పొంది వారు తృప్తి చెందితె వారికి అమూల్యమయిన ఉపదేశములను చేసి వారిని శిష్యులుగ స్వీకరించేవారు. కాని ఎమ్పెరుమానార్లు; కలియుగము యొక్క కష్టములను చూసి; ఆచార్యులు “కృపా మాత్ర ప్రసన్నాచార్యులు“గ ఉండవలెనని ఆదేసించిరి. అనగ ఆచార్యులు పూర్తి కారుణ్యముతొ ఉపదేశము పొందాలి అన్న ఉత్సాహము అర్హతగ చూసి శిష్యులను స్వీకరించువారు.
 • పితృ లోకమున పితృలు ఏ విధముగనైతె సత్ సంతానము చేత ప్రయోజనము ( లాభము/హితము) పొందునో; అలాగే వారి తరువాతి తరములవారు ఏ విధముగ ప్రయోజనమును పొందురో; అదే విధముగ శ్రీ వైష్ణవ కులము నందు ఎమ్పెరుమానార్లకు ముందు ఉన్న ఆచార్యులు మరియు వారి తరువాతి ఆచార్యులు రామానుజుల రాకతొ హితము పొందెను అని ప్రతీతి.
 • వసుదేవుడు/దేవకి, నందగోపుడు/యశోదా మరియు దశరధుడు/కౌసల్య ఏ విధముగ పెరుమాళ్ళకు జన్మనిచ్చుట వలన తరించారొ; అదే విధముగ ఎమ్పెరుమానార్లకు ముందు ఆచార్యులు ప్రపన్న కులము నందు ఎమ్పెరుమానార్ల అవతారము చేత పావనమయ్యెను.
 • నమ్మాళ్వార్లు,  ఎమ్పెరుమానార్ల  అవతారమునకు ముందుగానే వారిని దర్శించి  పొలిగ పొలిగ పొలిగ పదిగమునందు  కీర్తించి  భవిష్యదాచార్య(ఎమ్పెరుమానార్) విగ్రహమును నాథమునులకు  ప్రసాదించిరి.( నమ్మాళ్వార్ అనుగ్రహమువలన మధురకవిఆళ్వార్ తామ్రపర్ణి జలమును మరిగించుట వలన అవతరించిన మరొక భవిష్యదాచార్య విగ్రహము పొందిరి)
భవిష్యదాచార్యులు (విగ్రహము) – ఆళ్వార్ తిరునగరి

భవిష్యదాచార్యులు (విగ్రహము) –ఆళ్వార్ తిరునగరి

  • ఈ దివ్యరూపం నాథముని మెదలుకొని ఉయ్యంకొండార్ మొదలైనవారి నుండి తిరుకోష్ఠియూర్ నంబి వరకు వచ్చినది. (తామ్రపర్ణి నీటిని మరిగించడం వలన వచ్చిన   వేరొక దివ్యరూపమును తిరువాయ్ మొళి పిళ్ళై  మరియు మణవాళమాముని వరకు ఆళ్వార్ తిరునగరి భవిష్యదాచార్య సన్నిధిన ఆరాధింపబడుచున్నది)
 • పెరుమాళ్ళు ఏ విధముగనైతే రఘు కులము నందు అవతరించి ఆ కులమును ప్రఖ్యాతి గావించెనొ; అదే విధముగ ఎమ్పెరుమానార్లు ప్రపన్న కులమునందు అవతరించి ఈ కులమును ప్రఖ్యాతి గావించెను అని పెరియ నంబి అనెను.
 • ఎంబార్లతొ “ఎమ్పెరుమానార్ తిరువడిగళే తంజమ్ మరియు ఎమ్పెరుమానార్లను నాకంటే ఎక్కువగ ధ్యానించు ” అని పెరియ తిరుమలై నంబి వారు చెప్పెను.
 • తిరుక్కోష్టియూర్ నంబి వారి చరమ రోజులలో వారు రామానుజులతో సంబంధము కలుగుట చేత చాల అద్రుష్టవంతులని చెప్పెను. ఒకనాడు తిరుమాలై ఆండాన్లు రామానుజులతొ భెదము కలిగినప్పుడు; తిరుక్కోష్టియూర్ నంబి వారు ఆండాన్లతొ ఈ విధముగ అనెను. వారు రామానుజులకు ఏమి కొత్తగ నేర్పించడం లేదని; రామానుజులు సర్వజ్ఞర్ అని చెప్పెను. ఏ విధముగ సాందిపని దగ్గర కృష్ణ పరమాత్మ, వశిష్టుని వద్ద పెరుమాళ్ నేర్చుకొనెనో అదే విధముగ రామానుజులు మన దగ్గర నేర్చుకుంటున్నారు అని చెప్పెను.
 • పెరరుళాళన్, పెరియ పెరుమాళ్, తిరువేంకటముడయాన్, తిరుమాలిరున్చోలై అళగర్, తిరుక్కురుంగుడి నంబి మొదలగు వారు ఎమ్పెరుమానార్ల గొప్ప తనము కీర్తించి వారిని ఎమ్పెరుమానార్ల మీద మాత్రమే ఆధారపడమని చెప్పెను.
 • అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్, ఆళ్వాన్, ఆండాన్, వడుగ నంబి, వంగి పురతు నంబి, భట్టర్, నడాతూర్ అమ్మాళ్, నంజీయర్, నంపిళ్ళై మరియు చాల మంది ఆచార్యులు వారి శిష్యులకు ఎమ్పెరుమానార్ల తిరువడి మాత్రమె ధ్యానించమని, శరణు పొందమని చెప్పెను.
 • మన పూర్వాచార్యులు అందరు మనకి ఎమ్పెరుమానార్లు మాత్రమే ఉపాయముగ మరియు ఉపేయముగ ధ్యానించాలి అని ఆదేశించెను. దీనినే చరమోపాయ నిష్టై లేక అంతిమోపాయ నిష్టై అని అందురు.
 • కూరత్తాళ్వాన్లు  తిరువరంగత్తాముదనార్లను సంస్కరించాక; వారు ఎమ్పెరుమానార్ల యందు గొప్ప ప్రీతిని పొందిరి. వారి భావమును వారి ప్రబంధము (రామానుస నూట్రందాది) యందు పొందుపరిచిరి. రామానుజుల వైభవమును పతాక స్ధాయిలొ చక్కగ రచించబడెను. ఈ ప్రబంధము రామానుజులు శ్రీ రంగమున ఉన్న సమయములో కూర్చబడింది. నమ్పెరుమాళ్ వారి ఉరేరిగింపు ( పురప్పాడు) సమయమున వారి ముందు కవితాగానము వాద్యములు లేకుండ చేయవలసినదిగ ఆదేశించెను. (సాధారణముగ వాద్యములు ఉండును). మన పూర్వాచార్యులు ఎమ్పెరుమానార్ల వైభవమును;మన సాంప్రదాయమునకు వారి తోడ్పాటు  తెలిసిన వారై ఈ ప్రబంధమును 4000 దివ్య ప్రబందములలొ చేర్చిరి.ఈ ప్రబంధమే ప్రపన్న గాయత్రిగ ప్రసిద్ధి పొందెను. శ్రీ వైష్ణవులు తప్పక రోజుకి ఒకసారి అయిన పఠించవలెను.
 • మనవాళ మామునులు వారి ఉపదేశ రత్న మాలైలొ మన సాంప్రదాయమును “ఎమ్పెరుమానార్ దరిశనం” అని నమ్పెరుమాళ్ స్వయంగ నామకరణము చేసినట్లుగ వివరించెను. రామానుజులు స్వయంగ సంసారములొ చిక్కుకున్న వారికి ఉపదేశమును కారుణ్యముతొ ప్రసాదించి వారిని ఉద్ధరించుటయెగాక; 74 సింహాసనాధిపతులను నియమించి మన సనాతన ధర్మమును ప్రచారము చేసి అందరికీ తెలుసుకోవాలనే కోరికను అర్హతగ చూసి అనుగ్రహీంచవలసినదిగ ఆదేశించెను.

రామానుజుల వైభవమును సంక్షేపముగ చెప్పుట సాధ్యమే కాని; వారి వైభవము అనంతము. వారు వారి 1000 ముఖములతో (ఆదిశేషన్) కూడ; వారి వైభవమును కీర్తించలేరు. అలాంటిది; మన లాంటి వారి వల్ల సాధ్యపడదు అను చెప్పుటలో అతిశయోక్తి లేదు. మనము కేవలం వారి వల్లన ఏమి భాగ్యమును పొందామొ చెప్పుకొని ఆనందమును పొందుట తప్ప మనము వారి వైభవమును పూర్తిగ  కీర్తించలేము. అది అసాధ్యము.
ఎమ్పెర్మానార్ల  తనియన్:

యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మ రుక్మ
వ్యామోహతస్ తదితరాణి తృణాయ మేనే
అస్మద్గురోర్ భగవతోస్య దయైకసింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే

రామానుజ తిరువడిగళే శరణమ్
జై శ్రీమన్నారాయణ

అడియేన్ .!

సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస

Source

పెరియ నంబి

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొమనము ఆళవందార్ల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

పెరియ నంబి

పెరియ నంబి – శ్రీ రంగం

తిరు నక్షత్రం    ~: మార్గశిర మాసము, మఘ నక్షత్రము
అవతారస్థలం  ~: శ్రీ రంగం
ఆచార్యులు     ~: ఆళవందార్

శిష్యులు ~: ఎమ్పెరుమానార్, మలై కునియ నిన్ఱార్, ఆరియూరిల్ శ్రి సఠగోప దాసర్, అణియరంగత్తముదనార్ పిళ్ళై, తిరువాయ్క్కులముడైయార్ భట్టర్, ఇత్యాదులు.

వీరు పరమపదించిన ప్రదేశము ~: పశియతు (పశుపతి ?) కోయిల్ చోల దేశము.

పెరియ నంబి వారు శ్రీ రంగము నందు జన్మించిరి. వీరికి మహా పూర్ణర్, పరాంకుశ దాసర్ మరియు పూర్ణాచార్యర్ అను నామధేయములు కూడ కలవు.

ఆళవందార్ల శిష్య బృందములో పెరియ నంబి ప్రముఖులు. వీరు రామానుజలను శ్రీ రంగమునకు తెచ్చుటలో ముఖ్య పాత్ర వహించారు. ఆళవందార్లు తరువాత శ్రీ రంగము నందు ఉన్న శ్రీ వైష్ణవులందరూ రామానుజులను తీసుకురావలసిందిగ పెరియ నంబిని కోరెను. కావున వారు శ్రీ రంగమును వీడి కాంచిపురమునకు బయలుదేరెను. అదే సమయమున రామానుజులు కూడ పెరియ నంబిని కలుసుకొనుటకు శ్రీ రంగమునకు బయలుదేరెను.  వారిరువురు మధురాంతకం నందు కలుసుకొనెను. పెరియ నంబి అక్కడే రామానుజులకు పంచ సంస్కారములనుగావించెను. వారు ఆ పిమ్మట సాంప్రదాయ రహస్యములను రామానుజులకు నేర్పించుటకు కాంచిపురమునకు వెళ్ళెను. కాని రామానుజుల వారి ధర్మపత్ని వలన కొన్ని ఇబ్బందులు కలుగడం చేత వారు కాంచిపురమును వీడి శ్రీ రంగమునకు వెళ్ళవలసి వచ్చెను.

మనకు పూర్వాచార్యుల శ్రీ సూక్తులలో పెరియ నంబి వారి జీవితము గురించి అనేక చోట్ల ప్రస్ధావించబడి ఉన్నది.

 • వారు పూర్తి ఆత్మ గుణములను కలవారు. వారికి రామానుజులు అంటే చాల ప్రియం. వారి కుమార్తె లౌకిక విషయములయందు సహాయము కొరకు వచ్చినను; వారు రామానుజుల వద్దకు వెళ్ళమని వారి సలహా తీసుకోమని చెప్పెను.
 • ఒకనాడు రామానుజులు వారి శిష్య బృందముతో పోవుచుండగా; పెరియ నంబి వారికి సాష్టాంగ ప్రణామమును చేసెను. అప్పుడు రామానుజులు వారి నమస్కారమును స్వీకరించలేదు. పెరియ నంబిని ఎందుకు అల చేసారు అని అడుగగ; వారు రామానుజులలో ఆళవందార్లను చూసినట్లు చెప్పెను. వార్తా మాలై అను గ్రంధమున ఆచార్యులకు వారి శిష్యుల పట్ల చాల గౌరవము ఉండవలెను అని చెప్పబడి ఉంది. పెరియ నంబి దానిని అనుష్టానములో పెట్టిన మహనీయులు.
 • ఒకనాడు మారనేరి నంబి (చతుర్ద వర్ణము నందు జన్మించిన మహోన్నతమయిన శ్రీ వైష్ణవుడు)  అను ఒక ఆళవందార్ శిష్యులు పరమపదించెను. పెరియ నంబి వారికి చరమ కైంకర్యమును కావించెను. కొంత మంది శ్రీ వైష్ణవులకు అది నచ్చక; రామానుజులకు ఫిర్యాదు చేసెను. రామానుజులవారు ఈ విషయమును అడుగగ; పెరియ నంబి ఈ విధముగ సమాధానమునిచ్చెను. వారు ఆళ్వార్ల తిరువాయిమొళి, పయిలుమ్ చుడరొళి (3.7) మరియు నెడుమార్కడిమయ్(8.10) పదిగము ప్రకారము ఆళ్వార్ల వారి  తిరువుళ్ళం ( కోరిక ) ప్రకారము నడుచుకొనెనని సమాధానమునిచ్చెను. ఈ వృత్తాంతము అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయము నందు మరియు గురు పరంపరా ప్రభవము నందు చెప్పబడెను.
 • ఒకనాడు కొందరి వలన పెరియ పెరుమాళ్ళకు ఆపద అని తెలుసుకొని; పెరియ నంబి ఉత్తముడని వారిని పెరియ కోయిలను ప్రదక్షిణము చేయమని అక్కడ ఉన్న వారు అడిగెను. వారు కూరత్తాళ్వాన్లను వారితొ కూడా రమ్మని అడిగెను. ఎందుకనగ; కూరత్తాళ్వాన్లు పారతంత్రియమును పూర్తిగ అర్ధము చేసుకున్న వారు. ఈ వృత్తాంతమును తిరువాయిమొళి(7.10.5), ఈడు వ్యాఖ్యానమున నంపిళ్ళై వారు వివరించారు.
 • వీటి అన్నింటికి మకుటముగా; ఒకనాడు శైవ రాజు రామానుజులను తన ఆస్ధానమునకు రమ్మని కబురు చేయగ; కూరత్తాళ్వాన్లు మారు వేషములో వెళ్ళెను. వారితొ తోడుగ పెరియ నంబి వారు వృద్ధుడు అయినప్పటికి కూడ  అనుసరించెను. ఆ రాజు పెరియ నంబి మరియు కూరత్తాళ్వాన్ల కళ్ళని పెళ్ళగించమనగ; పెరియ నంబి దానికి అంగీకరించెను. వృద్ధాప్యము వలన ఆ నొప్పి భరించలేక; వారు పరమపదించెను. పరమపదించు సమయమున వారు మనకు ఒక ముఖ్యమయిన సందేశమునిచ్చెను. ఆళ్వాన్లు మరియు అత్తుళై (పెరియ నంబి కుమార్తె) శ్రీ రంగము కొద్ది క్రోసుల దూరములొ ఉంది; ఒపిక పట్టి ఉండగలిగితె శ్రీ రంగము నందు దేహమును వీడవచ్చు అని చెప్పెను. కాని పెరియ నంబి వారికి వద్దు అని చెప్పి; వెంటనె అక్కడే పరమపదించెను. ఎవరయిన ఈ విషయమును విని; శ్రీ రంగమున ( లేక ఏ ఇతర దివ్య దేశములలొ అయిన) నివశించుట కేవలం తమ దేహమును వీడుటకు అని నిర్ధారణకు వస్తే; శ్రీ వైష్ణవుల కీర్తి అక్కడే ఆగిపోతుంది అని వారు ఈ విధముగ చేసెను. ఆళ్వార్లు ఈ విధముగ చెప్పెను “వైకుంఠమ్ ఆగుమ్ తమ్ ఊరెల్లామ్” అనగ ఎక్కడయితె శ్రీ వైష్ణవులు ఉండునో ఆ ప్రదేశము వైకుంఠమగును. అందువలన మనము సర్వ కాలములలొ, సర్వ అవస్ధలలొ ఎమ్పెరుమాన్ల మీద ఆధారపడి ఉండటం మనము తెలుసుకోవలసిన ముఖ్యమయిన విషయం. దివ్య దేశములలొ చాల మంది ఈ వరము యొక్క గొప్ప తనము తెలియక నివశిస్తున్నారు. అదే విధముగ చాల మంది (చాండిలి-గరుడన్ వృత్తాంతము చూసినట్లు అయితె) దూర ప్రాంతములలో  ఉండి కూడ ఎమ్పెరుమాన్ల గురించి ధ్యానము చేస్తు తరించేవారు ఉన్నారు.

పెరియ నంబి వారు ఎంతటి ఉత్తములో ఈ పైన వృత్తాంతములను చూసి తెలుసుకోవచ్చును. వారు పూర్తిగ ఎమ్పెరుమాన్ల మీద ఆధారపడి ఉండెడి వారు. నమ్మాళ్వార్లకు మరియు వారి తిరువాయిమొళి యందు ఉన్న అపారమయిన ప్రేమ వలన వారు పరాంకుశ దాసర్ అని కూడ ప్రసిద్ధి పొందారు. వారు శ్రియః పతి యొక్క కళ్యాణ గుణానుభవంలొ మునిగిపోయి నిరంతర ఆనందమును పొందేవారని వారి తనియన్  చూసి తెలుసుకోవచ్చును. మనము కూడ వారి శ్రీ పాద పద్మములను పట్టి మనకు కూడ అలాంటి యోగ్యతను ప్రసాదించమని వేడుకుందాము.

 పెరియ నంబి తనియన్

కమలాపతి కల్యాణ గుణామ్రుత నిషేవయా

పూర్ణ కామాయ సతతం పూర్ణయ మహతే నమః

రామానుజ తిరువడిగళే శరణమ్
జై శ్రీమన్నారాయణ

అడియేన్ .!

సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస

Source

మణక్కాల్ నంబి

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలొ మనము ఉయ్యక్కొండార్ వారి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల  గురించి తెలుసుకొందాం.

మణక్కాల్ నంబి

మణక్కాల్ నంబి – మణక్కాల్

తిరునక్షత్రం ~: మాఘ మాసము, మఖా నక్షత్రము
అవతారస్థలం ~: మణక్కాల్ (శ్రీ రంగం కావేరి ఒడ్డున ఉన్న ఒక గ్రామము)
ఆచార్యులు ~: ఉయ్యక్కొణ్డార్
శిష్యులు ~: ఆళవందార్, తిరువరంగ పెరుమాళ్ అరయర్(ఆళవందార్ కుమారులు),
దైవతుక్కరసు నంబి, పిళ్ళై అరసునంబి, శిరుపుళ్ళూరుడైయార్ పిళ్ళై, తిరుమాలిరుంశోలై దాసర్, వన్గీపురత్తు ఆయ్చి.

శ్రీ రామమిశ్రులు మణక్కాల్ అనే క్షేత్రమున జన్మించిరి. తరువాతి కాలములో క్షేత్రనామముతో మణక్కాల్ నంబిగా ప్రసిద్ధి పొందిరి.

మణక్కాల్ నంబి ఆచార్యులు ఉయ్యక్కొణ్డార్. నంబి 12 సంవత్సరములు ఆచార్యులకైంకర్యం చేసెను. ఆ సమయమున గురుపత్ని పరమపదించెను. కావున మణక్కాల్ నంబి తమ ఆచార్యుల తిరుమాళిగను         (గృహమును) పిల్లలను మరియు కుటుంబ బాధ్యతలన్నీ చూసుకునేవారు.  ఒక రోజు ఆచార్యుని కుమార్తెలు కావేరినది దాటి రావడానికి ఒక మురికిగుంట అడ్డువచ్చెను. వారు దాన్ని దాటలేక ఆగిపోయారు. అప్పుడు నంబి వారు దాటుటకు అనుకూలముగా ఆ గుంటకు అడ్డుగా పడుకొనెను. వారు నంబి మీద కాలుమోపి ఆ గుంటను దాటెను. అది విన్న ఉయ్యక్కొణ్డార్లు మిక్కిలి సంతోషించి నంబిని ప్రేమతో నిమిరెను. వారు నంబిని ఏమి కావాలో అడుగగా, ఆచార్యుడి సేవయే కావాలని అదే తనకు ఉద్ధారకమని చెప్పెను. శిష్యుని నడువడిక/కోరికను చూసి ఆనందము చెందిన ఆచార్యుడు నంబికి మరల ఒకసారి ద్వయ మంత్రోపదేశమును చేసెను.(ఆచార్యులకు శిష్యుల కైంకర్యం ప్రియమైనప్పుడు ద్వయమంత్రోపదేశము చేయుట సాంప్రదాయం).

ఉయ్యక్కొణ్డార్లు పరమపదించు సమయమున మణక్కాల్ నంబిని తన తరువాతి సిద్ధాంత ప్రవర్తకుడిగా  నియమించి; ఈశ్వరముని తనయుడిని(ఆళవందార్) సాంప్రదాయప్రవర్తకుడిగా తీర్చిదిద్దమని ఆదేశించెను. ఈశ్వరమునులు కాలాంతరమున యమునైతురైవర్లను సంతానముగా పొందెను. వారికి నంబి పంచ సంస్కారములను గావించెను.(జన్మదిన 11వ రోజున శంఖచక్ర లాంఛనము(పాలల్లోఅద్ది) నామకరణ సమయములో చేయుట సాంప్రదాయం. తిరుమంత్రార్థ ఉపదేశము మరియు తిరువారాధనము యుక్తవయస్సు వచ్చిన పిమ్మట నేర్చుకొనే అలవాటం ఉండేది).

యమునైతురైవర్ చాల తెలివి కలవారు. వారే ఆళవందార్లు అయ్యిరి, అర్ధరాజ్యమును పొంది(వారి వైభవమును చుసెదము),రాజ్యపరిపాలనలో మునిగి స్వరూపమును మరిచిపోయిరి. ఒకనాడు నంబి ఆళవందార్లను కలవడానికి వెళ్ళగా అక్కడి సిబ్బంది వారిని అడ్డుకొనిరి.

మణక్కాల్ నంబి ఆళవందార్లను మార్చుటకు పూనుకొనిరి. ఉపాయములో భాగముగ అంతఃపుర వంట వానికి ప్రతిరోజు తూతువళై కీరై (అలర్కపత్రం/ముండ్లముస్తెకూర. దీని విశేషమేమనగా ఆరుమాసములు క్రముముగా తిన్నచో వైరాగ్యగుణము వృద్ధిచెందునట)ని ఇవ్వసాగిరి. ఆళవందార్లకు ఆ కూర బాగా నచ్చెను. ఒకనాడు నంబి ఆ కూరనివ్వలేదు. ఆ కూర భోజనమున లేకపోవడంతో వంటవారిని అడుగగా వారు ఈ విధముగ విన్నవించిరి. ప్రతిరోజు ఒక వృద్ధశ్రీవైష్ణవుడు ఇచ్చుచుండెనని ఈనాడు ఇవ్వలేదని చెప్పిరి. చివరకు ఎవరా అని కనుక్కొనగా, వారు మణక్కాల్ నంబి అని తెలుసుకొని  అంతఃపురమునకు ఆహ్వానించిరి. వారికి ఉచితాసనము వేసి ధనము కావలనేమొ అని అడుగగా; నంబి ఈ విధముగ చెప్పెను- మీ తాతగారైన నాథమునులచే సంపాదించబడిన అపారధనరాశి(శ్రీవైష్ణవశ్రీ) నావద్దనే ఉన్నదని, అది మీకు అప్ప చెప్పుదామనుకుంటున్నాను అని చెప్పిరి. అది విన్న ఆళవందార్లు తన సిబ్బందికి నంబి ఎప్పుడు వచ్చినా  అడ్డుకోవద్దు అని ఆజ్ఞాపించెను.

మణక్కాల్ నంబి భగవద్గీతార్థమును ఆళవందార్లకు బోధించెను. అలా ఆళవందార్లు క్రమంగా వారి పూర్వ స్వరూపమును పొందిరి. పూర్తిగా మారిన ఆళవందార్లు భగవత్ సాక్షాత్కారమును పొందుటకు సాధనముగా సారతమమును తెలుపమని ప్రార్థించెను. అప్పుడు నంబి చరమశ్లోకార్థమును వివరించెను. తరువాత ఆళవందార్లను తిరువరంగమునకు కొనిపోయి పెరియపెరుమాళ్  ను దర్శింపచేసెను. పెరియపెరుమాళ్ సౌందర్యమును చూసి ఆళవందార్  బాహ్య ప్రపంచమును, సంసారమును త్యజించెను.

ఆచార్యుని కోరిక తీర్చిన పిమ్మట మణక్కాల్ నంబి ఎంతో ఆనందముగా పరమపదమునకు చేరుకొనెను. నాథమునులను ధ్యానిస్తు సాంప్రదాయమును కాపాడుతు ప్రచారము చేయమని నంబి  ఆళవందార్లకు ఆదేశించెను. అదే విధముగా తదుపరి సాంప్రదాయప్రవర్తకున్ని ఒకరిని నియమించమని ఆదేశించెను. ఆ తరువాత ఆళవందార్ ఎమ్పెరుమానార్లను(రామానుజులను)సాంప్రదాయ ప్రవర్తకుడిగా నిమమించడం మనకు విదితమే.

మణక్కాల్ నంబి తనియన్ ~:

అయత్నతో యామున మాత్మదాసం అలర్క పత్రార్పణ నిష్క్రయేణ|

యఃక్రీతవా నాస్ధితయౌవరాజ్యం నమామి తమ్ రామమేయసత్త్వమ్||

సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస

Source

నమ్మాళ్వార్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వవరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రిత సంచికలో మనంం సేనముదలియార్ (విష్వక్సేనులు)  గురించి చదివాము. ఇప్పుడు  నమ్మాళ్వార్  గురించి        పరిశీలిద్దాం.

 నమ్మాళ్వార్

తిరునక్షత్రం  ~: వైశాఖ మాసము, విశాఖా నక్షత్రం.
అవతారస్థలం ~: ఆళ్వార్ తిరునగరి
ఆచార్యులు   ~: విష్వక్సేనులు
శిష్యులు      ~: మధురకవి ఆళ్వార్, నాథమునులు తదితరులు

నమ్మాళ్వార్ కు     కారిమారన్, శఠగోపులు, పరాంకుశులు, వకుళాభరణులు, వకుళాభిరాములు, మఘిళ్ మారన్, శఠజిత్ మరియు  క్కురుగూర్ నంబి అను నామథేయములు ఉన్నవి.

కారి మరియు ఉడయనంగై అను పుణ్యదంపతులకు తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి) అను గ్రామమున నమ్మాళ్వార్ జన్మించిరి.  కలియుగం ప్రవేశించిన కొద్ది రోజులకు నమ్మాళ్వార్  అవతరించిరి. భగవద్గీత లో గీతాచార్యుడు ఈ విధముగా చెప్పెను “అనేక జన్మల తరువాత కనపడునది కనపడనిది మొత్తం వాసుదేవునకు చెందును అన్న అభిప్రాయమునకు వచ్చును. అలాంటి జ్ఞానులు అరుదుగా కనపడతారు”. ఎమ్పెరుమాన్  కు ఆప్తుడయిన నమ్మాళ్వార్   జీవితమును మరియు వారి శ్రీసూక్తి గ్రంథములను చూసి వీరు ఇలాంటి  జ్ఞానియే  అని నిర్ధారణ చేయవచ్చును. వీరి జీవిత కాలము ( 32 సంవత్సరములు)  మొత్తము చింతచెట్టు (తిరుపుళియాళ్వార్) క్రిందనే ఉండెను. నిత్యము యోగము నందు భగవానుని  గురించి స్మరించుచుండెడివారు. తిరుక్కురుగూర్ అనే శబ్దము వినగానే (తిరువాయ్ మొళి సేవించు సమయమున ప్రతి  పదిగమ్  చివరి పాశురములో  నమ్మాళ్వార్   పేరు మరియు  పేరుకు ముందు వీరు అవతరించిన స్థలము క్కురుగూర్ అని వచ్చును. ఆళ్వార్ తిరునామం మరియు అవతారస్థలం  ఉచ్చరించగానే, దక్షిణ దిశగా(ఆళ్వార్ తిరునగరి – ఆ దిశ లో ఉన్నందున ) అంజలి సమర్పించాలి అని మన పూర్వాచార్యులు  నియమనం.

నమ్మాళ్వార్   ప్రపన్న జనకూటస్థులుగా పరిగణింపబడతారు,  అనగా  ప్రపన్నగోష్ఠి కి  ప్రప్రథములు అలాగే   వైష్ణవ కులపతిగా కీర్తింపబడ్డారు. ఆళవందార్  తమ  స్తోత్ర రత్నమున 5వ శ్లోకమున   –  తనకు, తనవారికి మరియు  తన తరువాతి తరాలకు అందరికి సర్వం అయిన ( అనగా తండ్రి, తల్లి, తనయులు మరియు  ధనము మొ|| ) వకుళాభిరాముల పాద పద్మములకు  ప్రణమిల్లుతున్నానని స్తుతించారు.

ఆళ్వార్ శయన తిరుక్కోలం వీరి పాదాల వద్ద రామానుజులు(భవిష్యదాచార్యులు)వారు- ఆళ్వార్ తిరునగరి

ఎమ్పెరుమానార్ (శ్రీరామానుజులు) (ఆది శేషుల అవతారమయినప్పటికి) “మాఱన్  అడి పనిందు ఉయ్ త్తవన్ “ అనగా  నమ్మాళ్వార్లకు శరణాగతి చేసి తరించెనని ప్రసిద్ధి పొందెను.

నంపిళ్ళై  పూర్వాచార్యుల గ్రంథములను ఆధారము చేసుకొని, వారి ఈడు వ్యాఖ్యాన అవతారికలో మరియు తిరువిరుత్తం వ్యాఖ్యాన అవతారికలో ఎమ్పెరుమాన్  లీలావిభూతిలో నమ్మాళ్వార్లను  బద్ధజీవుడను శ్రీవైష్ణవునిగా తీర్చి దిద్దుటకు ఎంచుకున్నారని ధృవీకరించిరి. నమ్మాళ్వార్ల  మాటలను ఆధారముగా  చేసుకొని ఈ విషయం ప్రతిపాదించెను.  ఎమ్పెరుమాన్ తన నిర్హేతుక కృపాకటాక్షముచే  నమ్మాళ్వార్ కు   జ్ఞానమును ప్రసాదించెను. ఆళ్వార్ ఈ జ్ఞానము చేత భూత,భవిష్యత్ వర్తమానములను చూడగలిగిరి. తమ శ్రీసూక్తములలో పలుమార్లు ఈ సంసారమందు అనాదిగా చిక్కుకొని ఉన్నారని ఇక ఒక్క క్షణమయిన ఉండలేనని భగవంతునికి విన్నవించెను. వీరికి సంసారమున ఉండుట ,  సూర్యుని తాపమునకు వేడి అయిన ఎర్రని నేలపై పాదరక్షలు లేకుండ నిలబడినట్లుగా ఉన్నదని  భావించిరి. తిరువాయ్ మొళి మొదటి పాశురమున తమకు ఎమ్పెరుమాన్  జ్ఞానమును అందించి  తరింపచేసెనని వెల్లడించిరి. ఈ ప్రకారముగా  వీరు కూడ సంసారి ( బద్ధ జీవాత్మ) అని ఎమ్పెరుమాన్  కృపచేత  మాత్రమే జ్ఞానము లభించినదని మనం అర్ధం చేసుకోవాలి. ఇదే ప్రకారము (తర్కము) ఇతర ఆళ్వార్లకు కూడ వర్తించును. ఎందుకనగా

 •  నమ్మాళ్వార్  అవయవి మిగితా  (ఆండాళ్  కాక) ఆళ్వార్లు  అవయవాలుగా స్థితమై ఉన్నారని ప్రసిద్ధి.
 • ఆళ్వార్లు తాము  సంసారమున ఉన్నామని  కేవలం ఎమ్పెరుమాన్  కృపచేతనే  తమకు జ్ఞానమును కలిగినదని తమతమ  శ్రీసూక్తములయందు వెల్లడించిరి.

నమ్మాళ్వార్ అనుగ్రహించిన  4 దివ్య ప్రబంధములు.

 • తిరువిరుత్తం (ఋగ్వేద సారం)
 • తిరువాశిరియమ్ (యజుర్వేద సారం)
 • పెరియ తిరువన్దాది (అథర్వ వేద సారం)
 • తిరువాయ్  మొళి (సామవేద సారం)

నమ్మాళ్వార్ల  4ప్రబంధములు 4 వేదములతో సమానము.  వారికి “వేదమ్ తమిళ్ శెయ్ ద మారన్” అనగా సంస్కృతవేద సారమును తమిళం అందించిన వారు అని బిరుదు. మిగితా ఆళ్వార్ల ప్రబంధములు వేద సంపూరక భాగములుగా (అనగా శిక్ష, వ్యాకరణము మొ||) ప్రసిద్ధి.  తిరువాయ్ మొళి ఆళ్వార్లు పాడిన 4వేల పాశురములకు సారముగ కీర్తింపబడినది.  మన పూర్వాచార్యుల గ్రంథములు (వ్యాఖ్యానములు మరియు రహస్య గ్రంథములు) తిరువాయ్  మొళి లోని జ్ఞానమును ఆధారముగ చేసుకొని రచించబడ్డాయి. తిరువాయ్ మొళికి  ఐదు  వ్యాఖ్యానములు మరియు  అరుంబదము లో విస్తృత వ్యాఖ్యానము ఉన్నది .

మన పూర్వాచార్యులు నమ్మాళ్వార్లకు  శ్రీదేవి, భూదేవి, నీళా దేవి, గోపికలు, లక్ష్మ ణ, భరత, శతృఘ్న, దశరథ, కౌసల్య, ప్రహ్లాద, విభీషణ, హనుమ, మరియు అర్జున మొదలగు భక్తుల గుణములు ఉన్నవని నిర్ణయించిరి.  కాని వీరందరు నమ్మాళ్వార్ల గుణములలో  ఏదో ఒక గుణము మాత్రమే కలిగి ఉన్నారని పూర్వాచార్యుల ఉవాచ-  ఇదే నమ్మాళ్వార్ వైశిష్ఠ్యము.

తిరువాయ్ మొళి – పలరడియార్ మున్బరుళియ (7.10.5) – నమ్పిళ్ళై చాలా అందముగా నమ్మాళ్వార్ల తిరువుళ్ళమును(మనోభావన) వెలికి తీసిరి.  ఈ పాశురములో –  ఎమ్పెరుమాన్,  తమిళములో నిష్ణాతులైన ముదలాళ్వార్ల కంటే  మరియు మహాఋషులైన శ్రీవేదవ్యాసులు, శ్రీ వాల్మీకి, శ్రీ పరాశరులు  కంటే అతిరిక్తముగా  తమకు మాత్రమే  తిరువాయ్ మొళిని పాడుటకు  కృపచూపి అనుగ్రహించారని నమ్మాళ్వార్ల  విన్నవించారు.

నమ్మాళ్వార్  గంగ, యమున మరియు  సరస్వతి కన్న ఉత్తమ్మోత్తమ పవిత్రతను కలిగిన త్రామ్రపర్ణి నదీ తీరమున ఉన్న తిరుక్కురుగూర్ అను గ్రామమున అవతరించిరి. ప్రపన్నకులంలో  ఉన్న కారి అను వారికి కుమారుడిగ జన్మించెను.   తిరుమళిశై ఆళ్వార్లు అనుగ్రహించినట్లు “మఱణ్తుమ్ పుఱం తొళ మాణ్తర్” –ప్రపన్నులు  కేవలం శ్రీమన్నారాయణుడిని తప్ప అన్యులను ఆరాధించని వ్యక్తిత్వము కలవారని.  నమ్మాళ్వార్ల  7 తరముల పూర్వులు-  తిరువళుత్తి వళనాడర్, వారి కుమారులు అఱన్తాన్గియార్, వారి కుమారులు చక్రపాణియర్, వారి కుమారులు అచ్యుతర్, వారి కుమారులు శెందామరై కణ్ణార్, వారి కుమారులు పొఱ్కారియార్ వారి కుమారులు కారియర్, వారి కుమారులు  మన నమ్మాళ్వార్.

పొఱ్కారియార్ తన కుమారుడైన కారికి ఉత్తమ వైష్ణవ కుటుంబ కన్యతో వివాహము చేయదలచి రాబోవు తరములలో వైష్ణవులు జన్మించి లోకానికి ఉద్దరించాలనే సదుద్దేశ్యముతో  వైష్ణవుల ఇంటి అమ్మాయిని వెతుకుచుండిరి. పొఱ్కారియర్ ఒకనాడు తిరువణ్  పరిశారం అను దివ్యదేశమునకు వెళ్ళెను. అక్కడ తిరువాళ్  మార్భర్ అను ఒక వైష్ణవుడిని కలిసెను. వారు కూడ వారి కుమార్తెకు ఉత్తమవైష్ణవ వరుడిని చూస్తున్నట్లుగ తెలుసుకొని వారి కుమార్తె అయిన ఉడైయనన్గైను  కారియార్ కు ఇచ్చి వివాహము చేయుటకు నిశ్చయించుకొనిరి. కారియర్ మరియు ఉడయనన్గై ఇరువురు తిరువణ్ పరిశారం నందున్న తిరువాళ్ మార్భన్ ఎమ్పెరుమాన్  ను దర్శనం చేసుకొని తిరుక్కురుగూర్  వెళ్ళిరి. శ్రీ రాముడు ఆనాడు సీతా పిరాట్టిని వివాహము చేసుకొని అయోధ్యకు వేంచేసినప్పుడు ఆ పురజనులు సంబరాలు జరపుకుని ఎంతటి ఆనందమును పొందినారో అదే విధముగ తిరుక్కురుగూర్ ప్రజలు కూడ నూతన దంపతులను చూసి ఎంతో ఆనందోత్సాహములు చేసుకున్నారు.

కొన్ని రోజుల తరువాత కారియార్ మరియు ఉడయనన్గై తిరువణ్ పరిశారంనకు వెళ్ళి స్వామి దర్శనము చేసుకొని తిరుగుప్రయాణములో  తిరుక్కురుంగుడి నంబిపెరుమాళ్ ను  దర్శనము చేసుకొని తమకు కుమారుడిని ప్రసాదించమని  నంబిపెరుమాళ్ ను  ప్రార్థించిరి. నంబిపెరుమాళ్  వారి ప్రార్థనను అంగీకరించి తామే స్వయంగా  పుత్రులుగా జన్మిస్తామని వరమునిచ్చెను. తిరుక్కురుగూర్ వచ్చిన పిమ్మట కొద్ది రోజులకు ఉడయనన్గై గర్భమును ధరించెను. సరిగ్గా కలియుగం ప్రారంభమయిన 43వ రోజున ఎమ్పెరుమాన్  ఆదేశము ప్రకారము నమ్మాళ్వార్లు శ్రీమన్నారాయణుని యొక్క దివ్య ఆశీస్సులతో బహుధాన్య సంవత్సరము (ప్రమాది సంవత్సరము), వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్ల పక్ష పౌర్ణమి తిధి, విశాఖా నక్షత్రము నందు (విష్వక్సేనుల అంశగా) జన్మించిరి. ఈ రహస్యము నమ్మాళ్వారే  “తిరుమాలాల అరుళ్   పెత్త శఠగోపన్” అనగా శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులతో  విష్వక్సేనుల అంశగ జన్మించిరని తెలియచేసెను. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనారులు తమ ఆచార్య హృదయమున ఇలా అనుగ్ర్రహించారు –  ఆదిత్య రామదివాకర అచ్యుత బాణుక్కళుక్కు నీన్గాధ ఉళ్ళిరుళ్ నీంగి చోశియాథ పిఱవిక్కడల్ చోశిత్తు వికసియాత పోతిల్ కమలం మలరుమ్పడి వకుళబూషణ్ భాస్కరోదయమ్ ఉన్డాయత్తు ఉడైయణన్గైయాగిఱ పూర్వసణ్ద్యైయిలే” –  అనగా ఈ  సంసారము నందున్న జీవుల అవివేకము మరియు మాయను, సూర్యుడు ప్రకాశించినను, ప్రజ్వల సూర్యుడిగా  కీర్తింపబడు శ్రీరాముడు అవతరించినను, ప్రకాశించు సూర్యుడిగా  కీర్తింపబడిన  కృష్ణుడిగా అవతరించినను ఆ మాయను తొలగించలేకపోయిరి. నమ్మాళ్వార్ (వకుళభూషణ భాస్కర) తమ  అవతారము చేత  ఈ బద్ధజీవులకు  జ్ఞానమును ప్రసాదించి మాయను తొలగించిరి. ఇలాంటి సులక్షణ సంపన్నులై వైభవం కలిగిన  నమ్మాళ్వార్ ను   ఉడయనన్గై ప్రసవించినది.

నమ్మాళ్వార్లు తిరుక్కురుగూర్ లోని ఆదినాథ ఎమ్పెరుమాన్  కోవెలలో  ఒక చింత చెట్టు క్రింద ఆశ్రయము పొందుతారని ముందుగా తెలిసిన ఆదిశేషులు తామే  చింతచెట్టుగా  అవతరించి ఆళ్వార్లకు  నీడగా ఉంటూ వారిని రక్షించిరి.

నమ్మాళ్వార్ల తనియన్:

మాతా పితా యువతయ: తనయా విభూతి:
సర్వం యదేవ నియమేన మదన్వయానాం |
ఆద్యస్య న: కులపతే: వకుళాభిరామం
శ్రీమత్ తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా ||

వారి అవతార వైభవమును ఇక్కడ చదవవచ్చును.

ఎంపెరుమానార్ తిరువడిగళే శరణమ్
జై శ్రీమన్నారాయణ

సీతా రామాంజనేయ దినేష్ రామానుజ దాస

 

 

 

Source