Monthly Archives: June 2015

తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

తిరునక్షత్రం: ఆశ్వీజం, పూర్వాషాడ (ఆవణి/మార్గశీర్షం)
అవతార స్థలం: ఆళ్వార్ తిరునగరి
ఆచార్యులు: ఎంపెరుమానార్
రచనలు: తిరువాయ్ మొళి ఆరాయిరప్పడి వ్యాఖ్యానం

భగవద్రామానుజుల ఆచార్యులైన పెరియతిరుమలనంబి గారి ఉత్తమ కుమారుడు  తిరుక్కురుగై ప్పిరాన్ ప్పిళ్ళాన్. వీరిని కురుగేశర్ లేదా కురుగాదినాథులు అని కుడా పిలుస్తారు. సాక్షాత్తు  భగవద్రామానుజులు వీరికి కురుగాదినాథులు అని తిరునామాన్ని ప్రసాదించి, తిరువాయ్ మొళి కి వ్యాఖ్యానం  వ్రాయమని ఆఙ్ఞాపించారు. దీనినే  ఆరాయిరప్పడి వ్యాఖ్యానం (6000)అంటాము.

పిళ్ళాన్ ను  ఎంపెరుమానార్ తమ మానసపుత్రుని గా భావించి అభిమానించారు. ఒక సారి భగవద్రామానుజుల శిష్యులందరు కలిసి పిళ్ళాళ్  దగ్గరకు వెళ్ళి  రామానుజులు తిరువాయ్  మొళి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించాలని ఆఙ్ఞాపించారని చెపుతారు. పిళ్ళాన్,  ఎంపెరుమానార్ల ని కలిసి ఇలా అంటారు “స్వామివారు దేశము నలు మూలల సంచరించి విశిష్ఠాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు, శ్రీభాష్యాన్ని అనుగ్రహించారు, అలానే తిరువాయ్  మొళికి కూడా  వ్యాఖ్యానాన్ని అనుగ్రహించడం చేత వాటికి సరైన అర్థాలు లోకానికి అందుతాయి” అని వారి భావాన్ని వ్యక్త పరుస్తారు. రామానుజులు వీరితో ఏకీభవించి వారు వ్రాయటము చేత దివ్య ప్రబంధాలకు ఇదివరికే అర్దము తరువాతి తరాలు చెప్పుకుంటారేమో అని భావించి  అలా చేయడం చేత ఆచార్య పురుషులు వీటిలో ఉన్న లోతైన అర్థాలు భవిష్యత్తు లో అందించటానికి సాహసించరేమో అని పిళ్ళాన్ ను వీటికి వ్యాఖ్యానాన్ని ఏర్పాటు చేయమని ఆదేశిస్తారు. విష్ణుపురాణములో ఉన్న 6000 శ్లోకములకు సమానము గా 6000 ల పడి ఉన్న వ్యాఖ్యానాన్ని అందించవలసినది గా కోరుతారు. ఇలా రామానుజుల ఆదేశానుసారం పిళ్ళాన్ 6000 పడిని  అందిస్తారు, దీనిని అనుసరించే భట్టరులు,  నంజీయర్ కు తిరువాయ్  మొళి అర్థములను వివరిస్తారు.

055_4762658378_lఎంపెరుమానారులు పిళ్ళాన్  గారి వివాహన్ని చూసి వారిని అనుగ్రహిస్తున్నారు

పిళ్ళాన్ కు శ్రీభాష్యం మరియు భగవద్విషయం మీద మంచి అవగాహన పట్టు కలవు. ఒకసారి పిళ్ళాన్ గారు శ్రీవిల్లి పుత్తూర్ లో ఉన్నప్పుడు, సోమాసియాణ్దాన్ గారు వీరి దగ్గర శ్రీభాష్యాన్ని మూడు మార్లు అధ్యయనం చేశారు. సోమాసియాణ్దాన్ ,  పిళ్ళాన్ కు  దాసోహం చేసి కొన్ని సూక్తులు అనుగ్రహించమనగా పిళ్ళాన్ ఇలా అన్నారు ” ఇతర సాంప్రదాయాల లోని విషయాలు గ్రహించి, విశిష్ఠాద్వైత సిద్ధాంతాన్ని చాటి చెప్పే ఘనత మీకు ఉన్నది,  ఎటువంటి గర్వాన్ని దరిచేరనీయక రామానుజుల పాద పద్మములను ఎల్లప్పుదు మనసున ధరించి ఆశ్రయించుము ”

భగవద్రామానుజులు అవతార అవసానమున కిదాంబి ఆచ్చాన్, కిడాంబి పెరుమాళ్, ఎంగళాళ్వాన్, నడాదూర్ అమ్మాళ్ , మొదలగు వారిని పిలిచి పిళ్ళాన్ ను ఆశ్రయించమని, పరాశరభట్టర్ ను సాంప్రదాయ  వారసుడిగా బాధ్యతలను నిర్వహించమని ఆఙ్ఞాపిస్తారు. భగవద్రామానుజులు, పిళ్ళాన్ పుతుడిని తమ పుత్రుడిలా భవించెడివారు, అందువలన పిళ్ళాన్ భగవద్రామానుజుల చరమ కైంకర్యాన్ని నిర్వహించారు.

పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానముల లో, తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్  వైభవాన్ని కొంత ఆస్వాదిద్దాము.

  • నాచ్చియార్ తిరుమొళి 10.6 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం – ఆణ్డాళ్  ఈ పాశురం లో కృష్ణుని వలె నాట్యమాడు నెమలిని సేవిస్తుంది. అమ్మణియాల్వాన్  ( ఒక ఆచార్య పురుషులు ) తన శిష్యుడికి  దాసోహం సమర్పించేవారు. ఇదేమని శిష్యుడు వారిని అడుగగా, ‘ శ్రీ వైష్ణవులందరూ పూజనీయులు కదా,  గురువుకి శిష్యుడి గురించి తెలిసినప్పుడు వారిని ఆ విధముగా సేవించడము ఉచితమే కదా’ అని  అన్నారు. నంజీయర్  అభిప్రాయము లో , ఒక వేల శిష్యుడికి  బుద్ధి పరిపక్వత లేనప్పుడు అది అహంకారమునకు దారి తీయునని సెలవిచ్చారు. కాని పిళ్ళాన్ ఈ విధముగ దానిని అందముగా విశదీకరిస్తారు – అమ్మణియాళ్వాన్ వంటి ఆచార్యుల అనుగ్రహముతో   శిష్యులు ఎటు వంటి హేయ గుణములుకు పోకుండ,  పరిపక్వతా బుద్ధి కలిగి ఆచార్యునికి   పరికరముగ మెదులుతారు అని అందంగ వివరిస్తారు.
  • పెరియ తిరుమొళి 2.7.6 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం – ఇందులో పరకాల నాయకి ( తిరుమంగై ఆళ్వార్లు ప్రియుని విరహతాపములో ఉన్న ప్రేయసీభావములో  ఉంటారు) తల్లి తన కుటుంబాన్ని పరకాలనాయకి పరివారముగా గుర్తిస్తారు. ఇక్కడ తల్లిగారు తన కుటుంబం అని అనకుండ ఉండడాన్ని మనము గమనించాలి. పిళ్ళాన్ స్వామి ఈ విషయాన్ని ఇలా పోల్చి చెప్తారు. నంపెరుమళ్ (శ్రీరంగనాథుడు) స్వయంగా  శ్రీ వైష్ణవ సాంప్రదయన్ని “ఎంపెరుమనార్ దర్శనం” అని కీర్తించి ‘ శ్రీరామానుజులను–   ఉడయవర్ గా(లీలా మరియు నిత్య విభూతులకు నాయకునిగా)  చేసి జనులందరిని  తరింప చేస్తాను’ అని చెపుతారు. పెరుమాళ్ తనకి స్వయముగ శరణాగతి చేసేవారి కంటే రామానుజుల శ్రీపాద  సంబంధీకులుగా ఉన్నవారి యందు ఎక్కువ ప్రీతిని ప్రదర్శిస్తారని  తెలుసుకోవాలి. ఎలాగైతే ఒక అందమైన ముత్యాల హారానికి మధ్యలో అమర్చబడ్డ  మణి చేత ఆ హారానికి మరింత  అందము చేకురునో అలాగే  శ్రీ వైష్ణవ గురుపరంపర  (https://guruparamparaitelugu.wordpress.com/2013/09/01/introduction-2/)
    లో భగవద్రామానుజుల ప్రత్యేక స్థానం  వల్ల  విశేషమైన అందమును సంతరించుకున్నది అని పెద్దలు కీర్తించారు.
  • తిరువాయ్ మొళి 1.4.7 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానం – ఈ పాశురం లో నమ్మాళ్వారులు భగవంతుడు తనని వీడి ఉన్న భావనతో ఒక చోట  పెరుమాళ్  ను  “అరుళాత తిరుమాలార్” అని సంబోధిస్తారు. ఆ పదానికి అర్థం నిర్దయుడు, కాని అమ్మవారి తో కలిసి ఉన్న స్వామి దయాసాగరుడు. కాని నిర్దయుడెట్లా?  నంజీయర్ దీనిని ఈ విధముగా వివరిస్తారు “కరుణ, దయా వంటి గుణములతో నిండి ఉన్న అమ్మ తో కలిసి ఉన్న స్వామి దాసుడి కి సాక్షాత్కారము ఇవ్వడం లేదు” అని ఆళ్వారుల  పరితాపాన్ని, ఆర్తి ని తెలియచేస్తారు. అయితే పిళ్ళాన్  దీనికి ఈ విధముగ అందంగా చెపుతారు,  శ్రీమన్నారాయణుడు అమ్మవారి సౌందర్యన్ని చూస్తు మైమరిచి పోవడం చేత స్వామి వారు తన కన్నులను, ఆలోచనలను అమ్మవారి నుంచి మరల్చకుండడం చేత ఆళ్వారులను అనుగ్రహించలేరని  అంతరార్థాన్ని వివరిస్తారు.
  • తిరువాయ్ మొళి 6.9.9 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానం – ఈ పాశురం లో నమ్మాళ్వారులు  భగవంతుని తో సంసారములో ని బాధలను తొలగించి, పరమపదానికి తీసుకొని వెళ్ళవలిసినదిగా వేడుకుంటారు. పిళ్ళాన్ కూడ వారి చివరి రోజులలో ఆళ్వారులు చెప్పిన ఈ పాశురములను సేవిస్తూ పెరుమాళ్ ను  ప్రార్థిస్తారు. ఇది చూసి నంజీయర్ దు:ఖించగా పిళ్ళాన్  ఇలా అంటారు “ఎందుకు ఏడుస్తున్నారు ! ఇక్కడ ఉన్న జీవితం కంటే పరమపదములో పొందే అనుభవము తక్కువ అని అనుకుంటున్నారా, దుఖించటం మానేసి సంతోషించు”

చరమోపాయ నిర్ణయం (http://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html),లో ఉన్న ఒక సంఘటన. ఒకనాడు శ్రీరామానుజులు తిరువాయ్ మొళి లో “ పొలిగ పొలిగ” అనే పాశురనికి అర్థాలు పిళ్ళాన్ కు వివరిస్తున్నారు. పిళ్ళాన్ణ్ (శ్రీరామానుజులకు అభిమాన పుత్రుడు) శ్రీరామానుజుల దగ్గర వింటు పులకితులైపోతారు. అది చూసిన రామానుజులు, పిళ్ళాన్  ను ప్రశంసించగా దానికి పిళ్ళాన్ ఇలా సమాధానం ఇస్తారు ‘ఆళ్వారులు అనుగ్రహించిన విధముగ ” కలియుం కెడుం కణ్దు కొణ్మిన్” అంటే మీ అవతార విశేషం వలన కలి దరిదాపులోకి రాడు అని భావిస్తారు. ఇదే విధముగ మీ దగ్గర నుండి తిరువాయ్  మొళి సేవిస్తున్న ప్రతిసారి మాకు ఈ విషయం గుర్తుకొస్తుంది. ఈ విషయాలు తలుస్తున్న ప్రతిసారి ఆనందంతో పులకరించిపొతున్నాను, మీతో గల సంబంధ భాగ్యం మరియు సాక్షాత్తుగా మీ నుంచి తిరువాయ్  మొళి సేవిస్తున్నందుకు మేము ధన్యులమయ్యాము’  అని రామానుజులకు విన్నవిస్తారు. ఇది విన్న రామానుజులు  ప్రసన్నులవుతారు. ఆ రాత్రి పిళ్ళాన్ ని తన తిరువారాధన పెరుమాళ్ ని తన దగ్గరికి తెమ్మాన్నారు మరియు తమ శ్రీ పాదాలను పిళ్ళాన్ తలపైన ఉంచి ‘ఈ పాదాలను ఎల్లప్పుడు ఆధారముగ తలచి, మిమ్మల్ని ఆశ్రయించిన వారికి కూడా వీటిని చూపుము’అన్నారు. తెల్లవారున తిరువాయ్ మొళి వ్యాఖ్యానము విష్ణుపురాణ రీతి లో (6000 ప్పడి )  ప్రారంభము చేయమని సూచన ఇచ్చి తమ ఉదారతను  స్వయముగ పిళ్ళాన్ కు తెలియ చేస్తారు.

శ్రీవచనభూషణ దివ్యశాస్త్రం లో పిళ్ళైలోకాచార్యులు ఈ విధముగా తన సూత్రాలను పిళ్ళాన్  అనుగ్రహించిన వాటిని ఆధారముగ చేసుకొని బలపరుస్తారు. అందులో కొన్ని చుద్దాము

సూత్రం 122 – భక్తి యోగానికి ఉన్న కొరువ – జలముతో ఉన్నబంగారపు బింద లో పొరపాటున ఒకేఒక్క విషపు చుక్క పడినచో అది త్రాగడానికి ఎలా యోగ్యము కాదో, అలానే జీవాత్మ ని బంగారపు బింద అని, మంచి నీటిని ని భక్తి తో పొలిస్తే విషపు చుక్క వంటి లేశమైన అహంకారము స్వరూపనాశనం కలిగిస్తుంది. ఇలా చెప్పినప్పుడు భక్తిలో అహంకారానికి తావు రాకుండా చూడ వచ్చు కదా అని కొందరు అభిప్రాయపడవొచ్చు, కాని భక్తియోగంలో అహంకారానికి చాలఎక్కువ శాతం ఆస్కారము ఉన్నది. ఎందుకనగా భక్తి కలిగిన వాడు ఒకడు ఉండాలి, వాడు నేను భగవంతుడికి ప్రీతి ని కలిగిస్తున్న అనే భావన ఉంటుంది. అందు వలన పిళ్ళాన్ భక్తియోగం జీవాత్మకు స్వరూప విరుద్ధం, ప్రపత్తి (భగవంతుడే మనకు ఉపాయము అని స్వీకరించటం) మనకు సహజ లక్షణము అని నిర్ధారిస్తారు.

సూత్రం 177 – పరగత స్వీకారము ఒక్క గొప్పతనము – భగవంతుడు స్వయముగ తన నిరహేతుక జాయమాన కాటాక్షము వలన జీవాత్మలను ఉద్ధరించి కైంకర్యము అనడి ఫలమును ప్రాసాదిస్తాడు. జీవాత్మ తన స్వయం క్రుశి వలన విపరీతమైన ఫలమును మాత్రమే పొందుతాడు. జీవాత్మ స్వరూపము సహజముగ పారతంత్ర్యము. దీనిని మనము ఈ ద్రుస్టాంతముతో తెలుసుకో వచ్చు. జీవాత్మ భగవంతుడిని పొందడం అనేది పాలను బయట కొని తెచ్చుకోటం లాంటిది. అదే భగవంతుడు తనకు తాను జీవాత్మను అనుగ్రహం చేత దెగ్గరికి తెచ్చుకోవటం తల్లి తన స్థనం నుంచి బిడ్డకు పాలు పత్తడం లాంటిది. పరగత స్వీకారము కూడా తల్లి పాల వలె సహజముగ పోషనమును కలిగిస్తుంది.

మణవాళమామునులు అనుగ్రహించిన ఉపదేశరత్తినమాలై (పాశురం 40,41) లో ఈ విధముగ తెలియచేస్తారు. తిరువాయ్ మొళి లోని అతి గహనమైన విషయాలను పూర్వచార్యులు అనుగ్రహించిన ఐదు వ్యాఖ్యనముల ద్వారానే తెలుసుకోవచ్చు అని స్పష్ఠపరుస్తారు. “తెళ్ళారుం జ్ఞాన తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్” అని పిళ్ళాన్ వైభవాన్ని ప్రకటిస్తారు, దాని అర్థం పిళ్ళాన్ కు భగవద్విషయం లో అతిగహనమైన అర్థాలను తాను స్పష్ఠముగ తెలుసుకొని వాటిని మధురమైన వ్యాఖ్యానం ద్వారా మనము తెలుసుకొని తరించేలా చేసారు. వారి తరువాత నంజీయర్ 9000(ఒన్బదారాయిర)ప్పడి వ్యాఖ్యానాన్ని భట్టర్ సూచనల మేరుకు అనుగ్రహిస్తారు, తరువాత నంపిళ్ళై కాలక్షేపాన్ని అనుసరిస్తూ వడక్కుతిరువీధి పిళ్ళై 36000 ప్పడి అనుగ్రహించారు, అలాగే పెరియ వాచ్చాన్ పిళ్ళై 24000ప్పడిడి అనుగ్రహించి ఉన్నారు, ఆపైన వాదికేసరి అళగియ మణవాళ జీయర్ 12000 ప్పడిలో తిరువాయ్ మొళి ప్రతిపదనికి గల అర్థాలను అనుగ్రహించారు.

ఈ విధముగ ఆచార్య పురుషులైన తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్ వైభవాన్ని కొద్దిగా తెలుసుకున్నాము. వారు ఎల్లప్పుడు భాగవతనిష్ట కలిగి ఉండి శ్రీరామానుజుల అభిమానానికి పాత్రులు అయ్యారు. మనందరము కూడా వీరి శ్రీ పాదాల యందు భాగవత నిష్ట కలిగేలా  అనుగ్రహించమని ప్రార్థిద్దాము.

తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళాన్స్ తనియన్ (భగవద్విషయం కాలక్షేప ప్రారంభం లో అనుసంధిస్తారు):

ద్రావిడాగమ సారఙ్ఞం రామానుజ పదాశ్రితం |
సుధియం కురుకేశార్యం నమామి శిరసాన్వహం ||

ద్రావిడవేదములో లోతైన ఙ్ఞానము కలిగి శ్రీరామానుజులు పాదారవిందములను ఆశ్రయించి ధీమంతులైన కురుకేశులను నమస్కరిస్తున్నాను.

అడియేన్ సారథి రామానుజ దాసన్

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source: http://guruparamparai.wordpress.com/2013/04/14/thirukkurugaippiran-pillan/

తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచార్యులు

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

ay-jananyacharyar

తిరునక్షత్రం: ఆశ్వీజ(తులామాసం) పూర్వఫల్గుణి నక్షత్రం .

అవతారస్థలం : తిరునారాయణ పురం.

ఆచార్యులు: తమ తండ్రిగారు లక్ష్మణాచార్యులు(పంచ సంస్కారములు)మరియు  నాలూరాచ్చాన్ పిళ్ళై(గ్రంథకాలక్షేప గురువులు)

పరమపదించిన స్థలం: తిరునారాయణ పురం

గ్రంథరచనలు: తిరుప్పావై వ్యాఖ్యానం( ఇరండా ఆరాయిరప్పడి)మరియు స్వాపదేశం , తిరుమాలై  ప్రబంధమునకు వ్యాఖ్యానం, ఆచార్యహృదయమునకు,  శ్రీవచనభూషణమునకు  మరియు మామునును కీర్తించు తమిళ పాశురములకు వ్యాఖ్యానం.

తల్లిదండ్రులు ఇతనికి పిన్నవయస్సులో దేవరాజర్  అని పేరుంచిరి. దేవపెరుమాళ్, ఆసూరిదేవరాజర్, తిరుత్తాళ్వరై దాసర్, శ్రీశానుదాసర్, మాతృ గురు, దేవరాజ మునిధర్ మరియు ఆయ్  జనన్యాచార్యులు అని నామాంతరములు కలవు.

ఆయ్ అనగా అమ్మ అని అర్థం. తాను తిరునారయణ పెరుమాళ్ కి పాలను కాచి సమర్పించే కైంకర్యమును చేసేవారు. ఒకనాడు వీరు కైంకర్యమునకు  కొద్దిగా ఆలస్యం అయినది , అప్పుడు తిరునారయణ పెరుమాళ్ ” మా ఆయ్ (అమ్మ) ఎక్కడ?అని  వారిపై మాతృవాత్సల్యమును చూపిరి. ఆనాటి నుండి వీరిని ఆయ్ అని లేదా జనన్యాచార్యులని వ్యవహరించేవారు. ఇది దేవరాజ పెరుమాళ్ కి నడాదూర్ అమ్మాళ్ మధ్య ఉన్న సంబంధమును   పోలి ఉండును.

వీరు గొప్పపండితులు మరియు ఉభయ వేదాంతములో అనగా ద్రావిడ మరియు సంస్కృత వేదాంతములలో బహు నిష్ణాతులు.

తిరువాయ్ మొళిపిళ్ళై  మరియు తిరువాయ్ మొళి ఆచ్చాన్(ఇళంపిళ్ళిచెయ్ పిళ్ళై) తో కలసి తాను నంపిళ్ళై గారి ఈడు వ్యాఖ్యానాన్ని నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై ద్వారా సేవించారు. ఈడు యొక్క వివరణ ఇక్కడ చూడవచ్చు  (https://guruparamparaitelugu.wordpress.com/2015/04/13/eeyunni-madhava-perumal/).

ఆచార్య హృదయం(అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్  – పెఱ్రార్ పెఱ్రార్    అని ఆయ్ జనన్యా చార్యులు – మణవాళ  మాముని)  పరంపరలో వీరు కూడా కీర్తింపబడ్డారు.

మామునులు ఆచార్యహృదయానికి వ్యాఖ్యానాన్ని వ్రాసేటప్పుడు 22 వ చూర్ణికా వ్యాఖ్యానం దగ్గర  వారు  స్పష్ఠీకరణ చేయాలనుకున్నారు. ప్రత్యేకించి ఈ చూర్ణిక వ్యాఖ్యానం దగ్గర వీరు తిరువాయ్ మొళి పిళ్ళైకి సహఅధ్యాయి అయిన ఆయ్ జనన్యాచార్యుల గురించి చర్చించాలనుకొని ‘ఆయ్’ తమ ఆచార్యుల భావించారు. మామునులు ఆళ్వార్ తిరునగరి నుండి తిరునారాయణ పురం వెళ్ళడానికి నమ్మాళ్వార్ దగ్గర ఆఙ్ఞను తీసుకుని బయలుదేరారు.

అదే సమయాన మామునుల గొప్పవైభవమును విన్న ఆయ్ జనన్యాచార్యులు తాము మామునులను దర్శించాలని ఆళ్వార్ తిరునగరికి బయలుదేరారు. వీరిద్దరు ఆళ్వార్ తిరునగరి వెలుపల కలుసుకున్నారు. పరస్పరం నమస్కరించుకొని మర్యాదలతో పలకరించుకొని ఆలింగనం చేసుకున్నారు.   మామునుల శిష్యులు వీరిద్దరి కలయికను పెరియనంబి మరియు ఎంపెరుమానార్ ల కలయిక వలె జరిగినదని భావించి పారవశ్యముచే ఆనందాన్ని అనుభవించారు.

ఇద్దరు కలసి ఆళ్వార్ తిరునగరికి  చేరుకున్నారు. మామునులు ఆచార్యహృదయాన్ని ఒక సారి సంపూర్ణంగా  ఆయ్ జనన్యాచార్యుల వద్ద సేవించారు. ఉపన్యాసం చివరి రోజున మామునులు,  ఆయ్ జనన్యాచార్యుల మీద  ఒక అందమైన తనియన్ ను వ్రాసి వారికి సమర్పించారు. ఆయ్ జనన్యాచార్యులు దానికి తగిన వాడిని కాదని భావించి  ప్రతిగా వారు మామునులను కీర్తిస్తు ఈ తమిళ పాశురాన్ని అనుగ్రహించారు.

పూత్తురిల్ వన్దుదిత్త  పుణ్ణియనో?
పూంగకమళుం తాతారుంఅళిగియమార్బన్ తానివనో?
తూత్తూర వన్ద నెడుమాలో ?
మణవాళ మామునివన్  ఎన్దైయివర్ మూవరిలమ్ యార్?

సంక్షిప్త అనువాదం: 

వీరు శ్రీపెరుంబుదూర్ లో దర్శనమిచ్చు సద్గుణ సంపన్నులగు ఎంపెరుమానారా?

వీరు వకుళపుష్పమాలచే అలంకరింప బడ్డ నమ్మాళ్వారా?
కృష్ణునిగా తనకు తాను పాండవులను రక్షించడానికి వచ్చిన  దూత యా?-సౌలభ్య ప్రదర్శన
పైన చెప్పిన ముగ్గురి కన్నా  నాయందు తండ్రి ఆప్యాతను ప్రదర్శించిన మామునులు వీరు.

ఆయ్ జనన్యాచార్యులు కొంత కాలం ఆళ్వార్ తిరునగరిలో నివసించి చివరకు తిరునారాయణ పురమునకు  చేరుకొనిరి. కాని వీరు లేని సమయాన వీరిపట్ల అసూయ గలవారు ఆయ్ జనన్యాచార్యులు పరమపదమును చేరుకున్నారని ప్రచారం చేసి సంపదనంతా స్వాధీనపరచుకొని దేవాలయ ఆధీనంలోకి చేర్చారు.

దీని చూసిన జనన్యాచార్యులు చాలా ఆనందించి ఇలా అన్నారు “భగవానుడు తన ఆప్తుల దగ్గరనుండి సంపదనంతటిని తీసుకొనేస్తారు కావున ఇది గొప్పచర్యే”. సాధారణ జీవితాన్ని గడపినారు. ఆచార్యుని ద్వారా అనుగ్రహించిబడిన  తమ తిరువారాధన పెరుమాళ్(ఙ్ఞానపిరాన్)తో కైంకర్యము కొనసాగాలని ప్రార్థన చేశారు.  అంతిమదశలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించి పరమపదమునకేగి అక్కడ ఎంపెరుమాన్ కు నిత్యకైంకర్యము చేయసాగిరి.

ఇంతవరకు మనం ఆయ్ జనన్యాచార్యుల విశేషమైన జీవిత ఘట్టములను చూశాము. వీరు బహుముఖప్రఙ్ఞాశాలి ,  తన ఆచార్యులకు మరియు మామునులకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. లేశమాత్ర భాగవత కైంకర్యము మనకు అబ్బాలని ఆయ్ జనన్యాచార్యుల పాద పద్మముల  యందు ప్రార్థన చేద్దాం.

ఆయ్ జనన్యాచార్యుల తనియన్:

ఆచార్య హృదయస్యార్త్తాః సకలా యేన దర్శితాః |
శ్రీశానుదాసమ్ అమలం దేవరాజం తమాశ్రయే ||

ఆచార్య హృదయమునకు దివ్యార్థములను అనుగ్రహించిన,  అమలులై(ఎలాంటి అఙ్ఞానములేక‌) ఉన్న శ్రీశానుదాసులు అను నామాంతరము కలిగిన దేవరాజాచార్యులను ఆశ్రయిస్తున్నాను.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మిగితా ఆళ్వారాచార్యుల వివరణ కోసం దీనిని దర్శించండి. https://guruparamparaitelugu.wordpress.com, మరియు  http://ponnadi.blogspot.com/

Source: http://guruparamparai.wordpress.com/2013/04/24/thirunarayanapurathu-ay/

వేదాన్తాచార్యులు

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

vedanthachariarThiruvallikeni

వేదాన్తదేశికులు, తిరువల్లిక్కేణి(ట్రిప్లికేన్)

శ్రీమాన్ వేంకటనాథార్య కవితార్కిక కేసరీ |
వేదాంతాచార్య వర్యోమే సన్నిధత్తాం సదా హృది ||

ఎవరైతే కవులకి(వ్యతిరేఖులకు) ప్రతివాదులకు సింహము వంటి వారో,ఙ్ఞాన భక్తి , వైరాగ్య ములకు ఆవాసమైన శ్రీ వేంకటనాథార్యులు( వేదాంతదేశికులు) సదా నా హృదయములో నివసింతురు గాక.

అవతార వివరములు

జన్మించినప్పుడు నామము వేంకటనాథులు
అవతార సంవత్సరం కలియుగ ఆరంభం నుండి 4370 (1268 AD)సంవత్సరములు
మాసం మరియు తిరునక్షత్రం ఆశ్వీజ మాస శ్రవణా నక్షత్రం (తిరువేంగడ ముడయాన్ వలె)
అవతార స్థలం తిరుతంగా,కాంచీపురం
గోత్రం విశ్వామిత్ర
అవతారం తిరువేంగడ ముడయాన్ యొక్క దివ్య ఘంట(తమ సంకల్ప సూర్యోదయం అను గ్రంథంలో ప్రస్తావించారు)
జననీజనకులు  తోతాంరంబ మరియు అనంతసూరి
అవతార సమాప్తికి వీరు వయస్సు శత సంవత్సరములు.
శ్రీరంగం నుండి ఈ విభూతి యందు అవతార సమాప్తి-కలియుగ సంవత్సరం  4470 (1368 AD)

వీరికి శ్రీరంగనాథుడు “వేదాన్తాచార్యులు”అని , “కవితార్కిక కేసరి” మరియు శ్రీరంగనాయకి ” సర్వతంత్ర స్వతంత్రులు” అని  బిరుదులను అనుగ్రహించారు.

వీరి కుమారులు ‘వరదాచార్యులు’. వరదాచార్యుల శిష్యులు ‘ బ్రహ్మతంత్ర స్వతంత్ర జీయర్’.

కిడాంబి ఆచ్చాన్ యొక్క మనుమడగు కిడాంబి అప్పులార్,  శ్రీ నడాదూర్ అమ్మాళ్ యొక్క శిష్యుల్లో ఒకరు.

“అప్పుళ్” అను పదం ‘తిరువిరుత్తం’ లో మూడుసార్లు గరుడన్ కు సూచించబడినది. గరుడన్ కు ఉన్న లక్షణాలు వీరియందు ఉన్నవి కాన వీరికి ‘అప్పులార్’ అను పేరు ఆపాదించబడింది. ఇంకొక పేరు కూడ ఉన్నది అది- ‘వాదిహంసాబువాహర్’  అనగా ప్రతివాదిని పరాజయం పొందించువారు – ఈ నామం శ్రీరామానుజులు అనుగ్రహించారు.

ఈ కిడాంబి అప్పులార్ యొక్క మేనల్లుడే ప్రసిద్ధిగాంచిన వేదానన్తాచార్యులు .

పిన్నవయస్సులో వేదాన్తాచార్యులు  తన మేనమామతో (కిడాంబి అప్పులార్)తో కలసి నడాదూర్ అమ్మాళ్ యొక్క కాలక్షేపగోష్ఠికి వెళ్ళేవారు.ఆ సమయమున  వేదాన్తాచార్యులను ఉద్ధేశిస్తూ    నడాదూర్ అమ్మాళ్  ‘విశిష్ఠాద్వైత శ్రీవైష్ణవ సిద్ధాంతానికి ఉన్న అన్నీ ప్రతికూలతలను నిర్మూలించి గొప్ప సిద్ధాంతమును స్థాపిస్తారు’ అని మంగళాశాసనం అనుగ్రహించారు.

గ్రంథములు

నడాదూర్ అమ్మాళ్ యొక్క ఆశ్వీరాదబలం వల్ల వేదాన్తాచార్యులు అసంఖ్యాక గ్రంథములను రచించారు మరియు విశిష్ఠాద్వైత సిద్ధాంతానికి  వ్యతిరిక్తతో ఉన్న ప్రతివాదులను మరియు  తత్త్వవేత్తలను వాదం లో జయించారు.

శ్రీ వేదాన్తాచార్యులు శతాధిక గ్రంథకర్త. ఇవి సంస్కృతములో ,ద్రావిడములో మరియు మణిప్రవాళ (సంస్కృత తమిళ మిళితం ) భాషలలో ఉన్నవి

కొన్ని అతి ముఖ్య గ్రంథములు

* తాత్పర్య చంద్రిక- గీతా భాష్య వ్యాఖ్యానం

* తత్త్వటీక. శ్రీభాష్యమునకు వ్యాఖ్యానం

*న్యాయ సిద్ధాంజనం- సాంప్రదాయ తత్త్వ విశ్లేషణా గ్రంథం

*శత దూషణి- అద్వైతసిద్ధాంత ఖండనా  వాదన గ్రంథం

* అధికర్ణ సారావళి- శ్రీభాష్యం పై ఒక వ్యాఖ్యాన గ్రంథం

*తత్త్వ ముక్తాకఫలం – తత్త్వనిరూపణ- సర్వార్థసిద్ధి వ్యాఖ్యానం

*గద్యత్రయం మరియు స్తోత్రచతుశ్లోకి లపై సంస్కృత భాష్యం

*సంకల్ప సూర్యోదయం- నాటకం

*దయాశతకం, పాదుకాసహస్రం, యాదావాభ్యుదయం, హంససందేశం

* రహస్యత్రయసారం, సాంప్రదాయ పరిశుద్ధి, అభయప్రధాన సారం,పరమత భంగం

*మునివాహనభోగం- అమలనాదిపిరాన్ పై వ్యాఖ్యానం

*ఆహార నియమం-  ఆహారనియమాలు సూచించ బడ్డాయి- తమిళంలో

* స్తోత్రాలు- దశావతార స్తోత్రం, గోదాస్తుతి, శ్రీస్తుతి,యతిరాజ సప్తతి,హయగ్రీవస్తోత్రం  మొదలైనవి

*ద్రమిడోపనిషత్ తాత్పర్య రత్నావళి,  ద్రమిడోపనిషత్ సారం- తిరువాయ్ మొళి అర్థ సంగ్రహం

పుత్తూర్ స్వామి యొక్క ప్రచురణ అయిన  ‘మాలర్’ నుండి అధిక మొత్తంలో విషయ సంగ్రహం చేయబడింది.

SriVedanthachariar_Kachi_IMG_0065

కాంచీపురమునకు సమీపాన ఉన్న తూప్పిల్ లో ని అవతార ఉత్సవ చిత్రం

వేదాన్తాచార్యులు మరియు ఇతర ఆచార్యులు

వేదాన్తాచార్యులు , పిళ్ళైలోకాచార్యులను కీర్తిస్తు ఒక విశేషమైన గ్రంథమును రచించారు దాని పేరు “లోకాచార్య పంచాశత్”.

వేదాన్తాచార్యులు,  పిళ్ళైలోకాచార్యుల కన్నా కనీసం 50సంవత్సరములు పిన్న వయస్కులు.  పిళ్ళై లోకాచార్యుల యందు వేదాన్తాచార్యులకు చాలా అభిమానం ఈ విషయం మనకు ఈ గ్రంథపరిశీలనలో సులభంగా  తెలుస్తుంది. ఈ గ్రంథం  ఈ నాటికి నిత్యము తిరునారాయణ పురం(మేల్కోటే)లో పఠింప బడుతుంది.

లోకాచార్యపంచాశత్ గ్రంథమును  శ్రీ. ఉ.వే.T. C. A. వేంకటేశన్ స్వామివారు సంక్షిప్తంగా ఆంగ్లభాషలో అనువదించారు. దీనిని ఈ సైట్ లో చూడవచ్చు.

fromhttp://acharya.org/books/eBooks/vyakhyanam/LokacharyaPanchasatVyakhyanaSaram-English.pdf.

* వాదికేసరి అళిగియ మణవాళ జీయర్ తమ ‘తత్త్వదీప’అను గ్రంథమున మరియు ఇతరులు వేదాన్తాచార్యుల గ్రంథములను ప్రస్తావించారు.2.

* శ్రీమణవాళ మామునులు తత్త్వత్రయం మరియు ముముక్షుపడి (పిళ్ళైలోకాచార్య ప్రణీతం)వ్యాఖ్యానములందు వేదాన్తాచార్యులను ప్రస్తావించారు.  మణవాళ మామునులు తాము వేదాన్తాచార్యులను ‘అభియుక్తర్’ అని అభిమానంగా ప్రస్తావించారు.3.

శ్రీమణవాళ మామునుల అష్ఠదిగ్గజములలోని ఒకరైన  శ్రీఎరుంబియప్ప తమ ‘విలక్షణ మోక్షాధికారి నిర్ణయం’ లో వేదాన్తాచార్యుల’న్యాయవింశతి’ గ్రంథమును  ప్రస్తావించి దీనికి  సారాంశమును అనుగ్రహించారు.3.

*చోళసింహపుర (ఘటికాచలం/షోళింగర్)  స్వామి దొడ్డయాచార్యులు ,  వేదాన్తాచార్యుల  ‘శతదూషణి’ కి ‘చందామృతం’ అను వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. దీనిలో తాము ‘ చందామృతం దొడ్డయాచార్యులు’ అని పేర్కొన్నారు, అలాగే  తమ తర్వాత వచ్చిన ఆచార్యులు కూడ దీనిని ప్రస్తావించారు.

*ప్రతివాది భయంకర అణ్ణా మరియు వారి శిష్యులు  వేదాన్తాచార్యుల యందు భక్తిభావమును కలిగే ఉండేవారు. వీరు వంశస్థులు తిరువిందళూర్ మరియు దక్షిణమధ్య ప్రాంతమున నివసించేవారు. వేదాన్తాచార్యుల కుమారుడైన నాయనాచార్యుల యందు భక్తిని కల్గి ఉండేవారు.

*చాలా మంది విద్వాంసులు మరియు ఆచార్యులు వేదాన్తాచార్యుల గ్రంథములను అక్కడక్కడ ఉట్టంకించారు.

దొడ్డయాచార్యుల శిష్యుడైన నరసింహరాజాచార్యులు,  వేదాన్తాచార్యుల ‘న్యాయ పరిశుద్ధి’ పై వ్యాఖ్యాన్నాన్ని రచించారు.

19 వ శాతాబ్ధానికి చెందిన  మైసూర్(మాండ్య) అనంతాళ్వాన్  చాలాచోట్ల వేదాన్తాచార్యుల గ్రంథములను తమ రచనలలో  ప్రస్తావించారు.

19వ శతాబ్ధానికి చెందిన కాంచీపుర వాసులు  కున్ఱప్పకంస్వామి తమ రచన అయిన ‘ తత్త్వ రత్నావళి’ లో వేదాన్తాచార్యుల మీద ఉన్న భక్తి  అభిమానం తో వారిని “జయతి భగవాన్ వేదాంత రహస్య తార్కిక కేసరి ” అని సంబోధించారు.

* వేదాన్తాచార్యులు పూర్వాచార్యుల  మరియు సమకాలీన ఆచార్యుల యందు అధికమైన ప్రీతిని కలిగి ఉండేవారు.  ఈ విషయం మనకు వారి “అభీతిస్తవం” లో ‘క్వచన రంగముఖే విభో! పరస్పర హితైషిణమ్ పరిసరేషు మామ్ వర్తయ” ( హే ! శ్రీరంగనాథ! నన్ను పరస్పర శ్రేయోభిలాషులగు  శ్రీరంగనివాసుల  పాదాల వద్ద ఉంచు)

* ‘భగవద్-ధ్యాన సోపానమ్’లోని చివరి శ్లోకమున వేదాన్తాచార్యులు- శ్రీరంగములోని శాస్త్ర పాండిత్యం కలవారికి మరియు కళా నైపుణ్యులకు శ్రద్ధాంజలి  ఘటిస్తున్నారు,  కారణం  ఎవరైతో తమ  స్పష్ఠమైన ఆలోచనలు, తమ సులువైన  ఆలోచనలను సుందరముగా తయారుచేశారో. .2

* వేదాన్తాచార్యులు తాము శ్రీభగవద్రామానుజుల యందు అత్యంత భక్తిని కలిగిఉండేవారు.వారి ‘న్యాస తిలకం’ లో ‘యుక్త ధనంజయ’ అను శ్లోకమున వారు పెరుమాళ్ తో విన్నపం చేస్తున్నారు ‘ మీరిక మోక్షమును ఇచ్చే అవసరం లేదు కారణం ఆ మోక్షం మాకు శ్రీరామానుజుల తిరువడి సంబధమున వలన కచ్చితము అనుగ్రహింపబడును’ .

ఈ విషయాల వల్ల వేదాన్తాచార్యులు తాను ఇతర ఆచార్యుల మరియు పండితుల యందు ఉన్న మర్యాద, గౌరవం, ప్రీతి మరియు భక్తి తెలుస్తుంది.  శ్రీవైష్ణవులపై శ్రావ్యంగా చర్చించి ఇలా  చక్కని బాటను వేసారు.

ఆచార్య- చంపు

A critical appreciation of Sri Vedanta Desika Vis-à-vis the Srivaishnavite World”,లో 1967  శ్రీ . S.సత్యమూర్తి అయ్యంగార్, గ్వాలియర్, ఇలా పేర్కొన్నారు. మరియు ఇతర ఆధార సమాచారములతో వేదాన్తాచార్యుల విషయం మరికొంత తెలుసుకోవచ్చును. 

గొప్ప పండితుడు మరియు కవి గా ప్రసిద్ధికెందిన S.సత్యమూర్తి అయ్యంగార్,  వీరి ‘ఆచార్య చంపు’ గా ప్రసిద్ధికెక్కిన ‘ వేదాన్తాచార్య విజయ’ అను పద్య గద్య రూపాన ఉన్న  సంస్కృత కావ్యములో ‘ కౌశిక కవితార్కికసింహ వేదానన్తాచార్యులు’గా కీర్తించారు వీరిని , వీరు సుమారు  1717 AD ప్రాంతము వారు.  వేదాన్తాచార్యుల జీవిత చరిత్ర పై ఉన్న ఈ రచన చారిత్రాత్మకంగా  అత్యంత పురాతనమైన  మరియు అత్యంత ప్రామాణికమైన రచనగా పరిగణింపబడుతుంది .

వీరి రచనారంభం  మొదటి స్తబకం (అధ్యాయం లేదా విభాగం)  కవి యొక్క కాంచీపుర  కుటుంబ విషయాలు మరియు    వేదాన్తాచార్యుల పితామహులైన ‘పుండరీక యజ్వ’తో ప్రారంభమగును.

రెండవ స్తబకం అనంతరసూరి(వేదాన్తాచార్యుల తండ్రి )జననం మరియు వివాహం ఇంకా వీరి భార్య గర్భమున దివ్యఘంటా(శ్రీవేంకటేశుని ఘంట)ప్రవేశంతో ఆరంభమగును.

మూడవ  స్తబకంలో  వేదాన్తాచార్యుల జననం , బాల్యం, తమ మేనమామ అయిన శ్రీవాత్సవరదాచార్యులతో సహవాసం మరియు వారి దివ్య ఆశీస్సులు, ఉపనయనం,  విద్యారంభం, వేదాభ్యాసం మొదలైనవి, వివాహం మరియు హయగ్రీవుని దయవల్ల విజయ ప్రాప్తి, ‘న్యాయ సిద్ధాంజనం’ ఆది రచనలు మరియు ‘కవితార్కికసింహ’ అను బిరుదును పొందుట మొదలైనవి చర్చించబడ్డాయి.

నాల్గవ  స్తబకంలో కాంచీపుర ఉత్సవములు,  ‘వరదరాజ పంచాశత్’ రచన, అద్వైత పండితులగు విద్యారణ్యపై విజయం మరియు వేంకటాద్రి యాత్ర మొదలైనవి చర్చించబడ్డాయి.

ఐదవ స్తబకంలో దివ్యదేశయాత్ర, దయాశతక రచన, వైరాగ్య పంచకం- రాజ న్యాయస్థానంలో విద్యారణ్యులచే జరిగిన వాదన, ఉత్తరదేశ తీర్థయాత్ర, కాంచీ పునరాగమనం, అద్వైత పండితుడైన విద్యారణ్య మరియు ద్వైత పండితుడైన అక్షోభ్య లతో వాదనలో   తమ తీర్పును స్థాపించుట, దకక్షిణదేశ తీర్థయాత్ర, కొంత కాలం తిరువహీంద్రపురమున నివాసం, అనేక రచనలు, శ్రీముష్ణపు తీర్థయాత్ర,  శ్రీరంగము నుండి ఆహ్వానమును అందుకొనుట మొదలైనవి చర్చించబడ్డాయి.

చివరి మరియు ఆరవ స్తబకం లో ఆచార్యచంపులోని  విశేషములు-  వేదాన్తాచార్యుల శ్రీరంగ యాత్ర, శ్రీరంగనాథుని దర్శనం, ‘భగవద్ధ్యాన సోపానం’ మొ||, అద్వైత పండితుడైన కృష్ణమిశ్రునితో 18రోజులు వాదించి జయమును పొంది “వేదానన్తాచార్య” “సర్వతంత్ర- స్వతంత్ర” అనే బిరుదులను కైవసం చేసుకొనుట,ఒక కవి స్పర్థతో ‘పాదుకాసహస్ర’ రచన, శ్రీరంగమును తురుష్కుల దండయాత్ర నుండి రక్షించుట, మిగిలిన క్షేత్రముల దర్శనం, పాములనాడించే వాడితో స్పర్థ వలన ‘గరుడదండకం’ రచన, పుత్రజననం మరియు ‘రహస్యత్రయం’ రచనలు మొదలైనవి చర్చించబడ్డాయి

ఈ ‘ఆచార్య చంపు’ బాగా ప్రచారం పొందినది, సంస్కృత పండితులచే ఆదరింపబడినది, ఈ విలువైన గ్రంథం ఎక్కువగా పునర్  ప్రచురణ  జరగలేదు.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

—————

ఆధారములు:

1.  పుత్తూర్ స్వామి పొన్ విళ మలర్

2.శ్రీ సత్యమూర్తి అయ్యంగార్, గ్వాళియర్ వారి “A critical appreciation of Sri Vedanta Desika Vis-à-vis the Srivaishnavite World”; c 1967.

3. శ్రీ. ప్ర.భ. అణ్ణంగరాచార్యస్వామి వారి- తమిళర్ తొజు వేదానన్తావాసిరియన్(తమిళం)

4. శ్రీ.ఉ.వే.V. V.రామానుజం స్వామి వారి కార్యము పై     శ్రీ.ఉ.వే.. T. C. A. వేంకటేశన్ స్వామి ఆగ్లములో  రచించిన “లోకాచార్య పంచాశత్” http://acharya.org/books/eBooks/vyakhyanam/LokacharyaPanchasatVyakhyanaSaram-English.pdftaken on Sep 25, 2012.

5. చిత్రం తిరువళ్ళిక్కేణి వాస్త్యవులు కోయిళ్ అనంతన్ కస్తూరిరంగన్ స్వామి వారి ఇమెయిల్ సౌజన్యముతో

6. చిత్రములు గ్రహించినది  https://picasaweb.google.com/113539681523551495306/  – నుండి,  Sep 25, 2012న.

Source: https://guruparamparai.wordpress.com/2015/06/05/vedhanthacharyar/ (originally from http://acharyar.wordpress.com/2012/09/25/sri-vedanthachariar-vaibhavam/)