Monthly Archives: August 2013

శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 1

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

లక్ష్మీనాథ సమారంభామ్ నాథయామున మధ్యమామ్
అస్మదాచార్య పర్యంతామ్ వందే గురు పరంపరాం

శ్రియఃపతి ( లక్ష్మీ నాథుడు, శ్రీమన్నారాయణుడు) తో ఆరంభమై నాథమునులు మరియు యామునాచార్యులు మధ్యముగా, స్వాచార్యులతో అంతమగు  గురుపరంపరని నేను నమస్కరిస్తున్నాను.

ఈ దివ్యమైన శ్లోకమును కూరత్తాళ్వాన్ అనే ఆచార్యులు మన గురుపరంపరని ఉద్దేశించి రచన.

కూరత్తాళ్వాన్: భగవద్రామానుజుల శిష్యులు. వీరి  ప్రకారము “అస్మదాచార్య” అనగా  భగవద్రామానుజులు. కాని సాధారణముగ అస్మదాచార్యులు  అనగా ఈ శ్లోకమును పఠించువారి యొక్క ఆచార్య పురుషులుగా మనము భావించవలెను.

acharya haaramఉపదేశ రత్నమాలై అను గ్రంథమున మణవాళ మామునులు మన సాంప్రదాయమును ఎమ్పెరుమానార్ దర్శనము అని నమ్పెరుమాళ్ కీర్తించ్చినట్లు తెలియచేసారు.ప్రాచీనమైన సనాతన ధర్మమును చాలా తేలికైన భాషలో జనులందరికి అందించి మరలా ధర్మ సంస్ధాపన చేసిన గురువులు మన ఎమ్పెరుమానార్లు. వారు వారి ముందు ఉన్నఆచార్యులు అయిన నాథమునులు, యామునాచార్యుల శ్రీ సూక్తులను తీసుకొని మన అందరికి అందించిన మహనీయులు.

గురువు మరియు ఆచార్య అను ఈ రెండు పదములు పర్యాయపదములు. గురువు అనగా అజ్ఞానమును పోగొట్టువాడు. ఆచార్య అనగా శాస్త్రమును నేర్చుకొని, అది ఆచరణలో (అనుష్టానములో) పెట్టి మరియు ఇతరులను ఆచరించే విధముగ చేయువాడు. గురు పరంపర అనగ ఒకరితో మొదటి ఉపదేశమును పొంది; పొందిన వారు వారి శిష్యులకు ఉపదేశించి  అలా క్రమమును తప్పకుండ ఒక పరంపరాగతంగ ఎక్కడాకూడ ఆ పరంపర ఆగకుండ జ్ఞానబోధ చేసే పరంపరను గురు పరంపర అని అందురు. పైన చెప్పిన లక్ష్మీనాథ సమారంభామ్ శ్లోకము నుండి మన శ్రీ వైష్ణవ సంప్రదాయమునకు ప్రథమ ఆచార్యులుగా శ్రీమన్నారాయణుడే ఉండి జీవుల అజ్ఞానమును పోగొట్టి వారికి నిరంతరము బ్రహ్మానంద అనుభూతిని కలగచేసి చివరికి శ్రీ వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించుచున్నారు. ఇందువలన మనకు మొట్ట మొదటి ఆచార్యులు ఆ శ్రీమన్నారాయణుడే.

తత్త్వ జ్ఞానం మోక్ష లాభః అని శాస్త్రము చెప్పుచున్నది. అనగా “తత్త్వ జ్ఞానమును పొందిన; మోక్షము పొందును”.

ఇప్పుడు మనము పొందుతున్న జ్ఞానము ఈ విధమైన పరంపరాగతంగ ఆచార్య పురుషులచేత పొందినదే.

అందువలన ఆచార్యుల గురించి తెలుసుకొనుట ఎంతో అవసరము.వారి జీవితము, వారి జీవన విధానము, వారి శ్రీ సూక్తులు తెలుసుకొనుటవలన మనకు భగవంతుని మీద ప్రేమ కలిగి మన స్వరూపమును పొందగలము.

రామానుజ తిరువడిగళే శరణమ్
జై శ్రీమన్నారాయణ .!

అడియేన్ .!

Source