పొన్నడిక్కాల్ జీయర్

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రిందటి సంచికలో అళగియ మణవాళ మాముణుల గురించి తెలుసుకున్నాము. ఈ రోజు వారికి ప్రాణ సుకృత్ అయిన వారైన శ్రీ వానమామలై జీయర్ స్వామి వారి గురించి తెలుసుకుందాం.

పొన్నడిక్కాల్ జీయర్ - వానమామలై

పొన్నడిక్కాల్ జీయర్ – వానమామలై

పొన్నడిక్కాల్ జీయర్ - తిరువల్లికేణి

పొన్నడిక్కాల్ జీయర్ – తిరువల్లికేణి

తిరు నక్షత్రం  : భాద్రపద మాసము, పునర్వసు  నక్షత్రము
అవతారస్థలం : వానమామలై
ఆచార్యులు: అళగియ మణవాళ మామునిగళ్
శిష్యులు: చోల సింహపురం మహార్యర్ (దొడ్డాచార్యర్), సమరభుంగవాచార్యర్, శుద్ధ సత్త్వం అణ్ణ, జ్ఞానక్కణ్ణత్తాన్, రామానుజం పిళ్ళై, పళ్ళక్కాయ్ సిద్ధర్, గోష్టి పురత్తైయర్ మరియు అప్పాచిఆరాణ్ణా మొదలగువారు
పరమపదించిన ప్రదేశము : వానమామలై
శ్రీ సూక్తి గ్రంధములు : తిరుప్పావై స్వాపదేశ వ్యాఖ్యానము

అళగియ వరదర్ అను పేరుతో జన్మించి పొన్నడిక్కాల్ జీయర్ అను పేరుతో ప్రసిద్ధి పొందారు. వానమామలై జీయర్, వానాద్రి యోగి, రామానుజ జీయర్, రామానుజ ముని మొదలగు పేర్లతో వీరు కీర్తింపబడురు. వీరు అళగియ మణవాళ మాముణులు వారికి మొట్ట మొదటి మరియు ముఖ్యమయిన శిష్యులు.

అళగియ మణవాళ మాముణులు వారు గృహస్తుడిగ ఉన్నప్పుడు వారికి మొదటి శిష్యులయ్యిరి. అళగియ వరదర్లు వెంటనే సన్యాసాశ్రమమును స్వీకరించి వారి జీవితములో ఎక్కువ భాగము మాముణులతో ఉండేను. పొన్నడిక్కాల్ అనగా బంగారు పాదము. మొట్ట మొదటి శిష్యుడు అయి మామునిగళ్ శిష్య సంపదకు పునాది వేసినందుకు కారణముగా వీరిని పొన్నడిక్కాల్ అను పేరుతో పిలుచుదురు. వీరు ఎన్నో తొతాద్రి మఠములను భారత దేశము అంతటా స్ధాపించి మన సంప్రదాయమును ప్రచారం చేసారు.

మాముణులు అప్పుడు మొదటి సారి తిరుమలై యాత్రను చేయదలచిరి, పెరియ కేళ్వి అప్పన్ జీయర్ ఒక స్వప్నమును చూసెను, అందులో ఒక గృహస్తర్ పడుకొని ఉండగా వారి పాద పద్మముల యందు ఒక సన్న్యాసి నిలబడి ఉన్నారు. జీయర్ అక్కడి ప్రజలను వారిరువురు ఎవరు అని అడుగగా, వారు ఈ విధముగ చెప్పెను ఒకరు “ఈట్టు పెరుక్కర్ అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ మరియు ఇంకొకరు నాయనార్ స్వయంగా పొన్నడిక్కాల్ జీయర్ అని పిలిచే మహానుభావులు.

పొన్నడిక్కాల్ జీయర్ ఎంతో మంది ఆచార్యులను మాముణుల వద్దకు చేరుటకు పురుష కారముగా ఉండెను. యతీన్ద్ర ప్రవణ ప్రభావములో ఎంతో మంది శ్రీ వైష్ణవులు పొన్నడిక్కాల్ జీయర్ ద్వారా మాముణులకు సంబంధమును పొందిరని మరియు వారిని కైంకర్యమును చేయుటకు సహాయపడిరని చూడ గలము.

కన్దాడై అణ్ణన్ మరియు వారి యొక్క బంధువులు మాముణులకి శిశ్యులుగా చేరిన తదుపరి, మాముణులు పొన్నడిక్కాల్ జీయర్ను తన యొక్క ప్రాణ సుక్రుత్ అని వారికి తమ వలె ఘనత /గౌరవమ్ చెందాలని చెప్పిరి. అప్పాచిఆరాణ్ణా మాముణుల వద్దకు శిశ్యుడిగా మారుటకు రాగా, మాముణులు పొన్నడిక్కాల్ జీయర్ను పిలచి, వారి ఆసనముపై కూర్చో బెట్టి, వారికి తమ ఒక్క శంఖము మరియు చక్రము ఇచ్చి అప్పాచిఆరాణ్ణాకి సమాశ్రయణమును అనుగ్రహించమని ఆదేశించిరి. పొన్నడిక్కాల్ జీయర్ మొదట వినయంతో నిరాకరించి నప్పడికినీ, మాముణుల కోరికను చూసి, సమాశ్రయణమును అప్పాచిఆరాణ్ణాకు మరియు ఇతరులకు అనుగ్రహించిరి. అలానే మాముణులు పొన్నడిక్కాల్ జీయర్కి అష్ట దిగ్గజులని నియమించిరి (వారికి ఎనిమిది మంది శిష్యుల మాదిరి) – చోల సింహపురం మహార్యర్ (దొడ్డాచార్యర్), సమరభున్గవాచార్యర్, శుద్ధ సత్త్వం అణ్ణ, జ్ఞానక్కణ్ణత్తాన్, రామానుజం పిళ్ళై, పళ్ళక్కాయ్ సిద్ధర్, గోష్టి పురత్తైయర్ మరియు అప్పాచిఆరాణ్ణా.

ఒక్కప్పుడు మాముణులు అప్పాచిఆరాణ్ణాని శ్రీ రంగమును వదిలి కాంచీ పురమునకు వెళ్ళమని ఆదేశించిరి, అది విని వారు విచారపడిరి. ఆ సమయములో మాముణులు అప్పాచిఆరణ్ణాను తన యొక్క పాత రామానుజన్ (మన సాంప్రదాయములో తీర్త సొమ్బుని రామానుజన్ అని అందురు) తీసుకొమ్మని అడిగిరి, అది చాలా కాలము పొన్నడిక్కాల్ జీయర్చే ఆరాదించబడినది. దానిని తమ యొక్క రెండు చిన్న అర్చా తిరుమేనిలను (మాముణులు) చేయమని, ఒకటి అప్పాచి ఆరణ్ణా దగ్గర ఉంచుకొని మరొకటి వారి ఆచార్యులైన పొన్నడిక్కాల్ జీయర్కి ఇవ్వమనిరి.

కొంతకాలము తరువాత దైవనాయకన్ ఎమ్పెరుమాన్ (వానమామలై) సేనై ముదలిఆర్ ద్వారా ఒక శ్రీ ముకమును (ఆదేశమును) మాముణులకి, పొన్నడిక్కాల్ జీయర్ని వానమామలై దివ్య దేశమునకు కైంకర్యములను చూసే నిమిత్తమై పంపమనిరి. మాముణులు పొన్నడిక్కాల్ జీయర్ని వానమామలైకి వెళ్ళమని ఆదేశించగా అది శిరసావహించి వెళ్ళిరి. అప్పుడు మాముణులు ప్రతీ ఒక్కరిని పెరియ పెరుమాళ్ళ ముందు 4000 దివ్య ప్రబంధమును రోజు 100 పాశురములను క్రమముగా పఠించమనిరి.పెరియ తిరుమొళి సాత్తుమురై రోజున, “అణియార్ పొళిల్ శూళ్ అరన్గనగరప్పా” పాడుచుండగా, ఎమ్పెరుమాన్ చాలా సంతోషము చెంది, తన సన్నిది నుండి అరన్గనగరప్పన్ (లక్శ్మినారయణన్ విగ్రహమును) పొన్నడిక్కాల్ జీయర్కి ఇవ్వగా, వారితో అది వానమామలైకి చేరినది. పెరియ పెరుమాళ్ ప్రత్యేక ప్రసాదమును మరియు శ్రీ శఠగోపమును పొన్నడిక్కాల్ జీయర్కి ఇచ్చి వీడుకోలును పలికిరి. అలానే మామునిగళ్ పొన్నడిక్కాల్ జీయర్ని తన మఠమునకు తీసుకువచ్చి, గొప్ప తదియారాదనను చేసి వారిని వానమామలైకి పంపిరి.

పొన్నడిక్కాల్ జీయర్ వానమామలైలో నివసించి, ఎన్నో కైంకర్యములను వానమామలై మరియు పక్కనే గల నవ తిరుపతి, తిరుక్కురున్గుడి మొదలగు దివ్యదేశములలో మరియు తను యాత్రలు చేసినప్పుడు బదిరీకాశ్రమములో చేసిరి. వారికి ఎంతో మంది శిష్యులు లభించిరి, వారికి కాలక్షేపములను అనుగ్రహించిరి మరియు కైంకర్యములను కొనసాగించమని ఆదేశించిరి.

పొన్నడిక్కాల్ జీయర్ ఉత్తర దివ్య దేశములను దర్శించుటకు పెద్ద యాత్రను చేపట్టిరి. ఆ సమయములో మాముణులు సంసారములో తన లీలలను చాలించుకొని పరమపదమునకు చేరిరి. ఆ సమయములో వారు యాత్రలో తిరుగు ప్రయణములో, తిరుమలైకి చేరగానే మాముణులు పరమపదమునకు చేరదలచిరన్న వార్త వినిరి బాధతో తిరుమలైలో కొంచము కాలము నివసించిరి. వారు యాత్ర చేసి నప్పుడు వచ్చిన మొత్తము ధనమును శ్రీ రంగమునకు వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళి, జీయర్ నాయనార్ని (మాముణులు పూర్వాశ్రమములో మనవడు) మరియు ఇతర శ్రీ వైష్ణవులతో కలసి వారి యొక్క ఆచార్యుల ఎడబాటును గురించి బాధపడిరి. ఆ సమయములో, మామునిగళ్ ఆఙ్ఞ ప్రకారము, మాముణుల యొక్క ఉపదణ్డమ్ (మరొక దణ్డమ్), ఉంగరము (తిర్వాళి మోదిరమ్) మరియు పాదుకాలను పొన్నడిక్కాల్ జీయర్కి ఇచ్చిరి. ఇప్పడికినీ ఆ ఉపదణ్డమును వానమామలై జీయరుల త్రిదణ్డములో కట్టుతారు. ఆ విధముగానే, ఈ రోజు కూడా వానమామలై జీయర్లు మాముణులు యొక్క ఉంగరమును ప్రత్యేక సందర్బములలో ధరిస్తారు. వారు తిరిగి వానమామలైకి చేరి తన కైంకర్యమును యదావిధిగా చేసిరి.

ఆ సమయములో, వానమామలైలోని శ్రీవరమంగై నాచ్చియార్కి ఉత్సవ విగ్రహము లేదు. ఒకసారి పొన్నడిక్కాల్ జీయరుల స్వప్నములో దైవ నాయకన్ ఎమ్పెరుమాన్ కనిపించి నాచ్చియార్ తిరుమేనిను (విగ్రహము) తిరుమలై నుండి తీసుకురమ్మని ఆదేశించిరి. అందువలన, వారు ఎమ్పెరుమాన్ యొక్క ఆఙ్ఞను నెరవేర్చుటకై తిరుమలైకి బయలుదేరిరి. వారి కలలో, నాచ్చియార్ కనిపించి ఈ విధముగా చెప్పెను “ప్రియమైన తండ్రీ, వానమామలైకి తీసుకువచ్చి దైవ నాయకన్ ఎమ్పెరుమాన్తో తిరు కళ్యాణము జరిపించుము”. ఆ విధముగానే ఆమె తిరుమలై జీయర్ స్వామికి తన విగ్రహమును పొన్నడిక్కాల్ జీయర్కి ఇవ్వ వలసినదిగా ఆదేశించెను. జీయర్ వారి ఆఙ్ఞను అనుగుణముగా నాచ్చియార్ను పొన్నడిక్కాల్ జీయర్తో పంపిరి. పొన్నడిక్కాల్ జీయర్ వారిని వానమామలైకి తీసుకువచ్చి, గొప్పగా తిరు కళ్యాణముకు ఏర్పాటులు చేసి స్వయముగా వారే కన్నికాదానమును చేసిరి. దైవనాయకన్ ఈ విధముగా చెప్పిరి “పెరియాళ్వార్ వలె, పొన్నడిక్కాల్ జీయర్ కూడా మాకు మామగారు” ఇప్పడికీని ఈ సాంప్రదాయము వానమామలై దివ్య క్షేత్రములో ఉన్నది.

తదుపరి చాలా సంవత్సరములు జీవించి విలువైన ఉపదేశములను ప్రతీ ఒక్కరికిని అందించి, పొన్నడిక్కాల్ జీయర్ తమ ఆచార్యులైన అళగియ మణవాళ మాముణులని ధ్యానిస్తూ తమ యొక్క చరమ తిరుమేని వదిలి పరమపదమును చేరిరి. వారు తదుపరి జీయరుని వానమామలై మఠమునకు నియమించిరి, ఇప్పడికినీ ఈ ఆచార్య పరమ్పర నడుచుచున్నది. మనకూ ఎమ్పెరుమానార్ మరియు మన ఆచార్యులతో అటువంటి అనుబంధము కలిగేలా పొన్నడిక్కాల్ జీయర్ శ్రీ చరణములను ఆశ్రయించుదాము.

పొన్నడిక్కాల్  జీయర్ తనియన్ (దొడ్డాచార్యర్ సమర్పించిరి)

రమ్య జామాత్రు యోగీంద్ర పాదరేఖా మయమ్ సదా
తతా యత్తాత్మ సత్తాదిమ్ రామానుజ మునిమ్ భజే

దొడ్డాచార్యర్ పొన్నడిక్కాల్ జీయర్ వైభవమును గురించి సంస్కృతము వ్రాసిన కొన్నింటిని క్రింద చూద్దాము. ఈ రెండు రచనలు పొన్నడిక్కాల్ జీయరుల గొప్పతనమును చాలా అద్భుతముగా వర్ణించెరి. దొడ్డాచార్యుల అసలు ప్రతిని తమిళములో సులభ అనువాదమును శ్రీ ఉ.వే. తెన్ తిరుప్పేరై అరవిన్దలోచనన్ స్వామి వ్రాసెను. (http://www.kaarimaaran.com/downloads/PrapathiMangalasasanam.pdf).

వానమామలై జీయర్ మంగళాశాసనము:

  • అళగియ వరదర్ అనే నామముతో తెలియబడి, జన్మతహ వచ్చిన మంచి గుణములతో, శుద్దమైన ఆత్మతో, సముద్రము అంతటి కరుణని కలిగి, మాముణుల కరుణని కలిగిన వానమామలై జీయరుని నేను ఆరాదించుదును.
  • మన సాంప్రదాయమునకు మరియు అందరు జీయర్ స్వాములకు నాయకుడిగా ఉండి, మాముణుల గొప్ప గుణములను కలిగిన రామానుజ జీయరును నేను ఆరాదించుదును.
  • ఎల్లప్పుడూ మాముణులు శ్రీ చరణముల వద్ద తుమ్మెద వలె ఉండి, నా మనసుని నిండు చంద్రుడివలె సంతోషముగా ఉంచిన రామానుజ జీయరును నేను ఆరాదించుదును.
  • మాముణులు తన జీవిత శ్వాసగా భావించే మరియు వాత్సల్యము, శీలము, ఙ్ఞానము వంటి మంచి గుణములను కలిగిన రామానుజ జీయరును నేను ఆరాదించుదును.
  • మిగిలిన రెండు ఆశ్రమములను వదిలి (గృహస్తాశ్రమము మరియు వాన ప్రస్తమము) నేరుగా బ్రహ్మచర్యము నుండి సన్న్యాసమును స్వీకరించిన వానమామలై జీయరును నేను ఆరాదించుందును.
  • మాముణులచే మొదటగా అనుగ్రహము పొంది మన కామము (దురాశ) మొదలగు దోషములను (లోపాలను) నిర్మూలించే వానమామలై జీయరును నేను ఆరాదించుందును.
  • అన్ని సద్గుణములు కలిగి ఉండి, లౌకిక విషయములో ఇష్ట అనిష్టములు లేకుండ ఉండు మరియు తామర పుష్పముల వంటి కన్నులు కలిగి ఉండు వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను .
  • వైరాగ్యం మొదట హనుమాన్లో మొదలైనది అటు పిమట భీష్మ పితమహాలో అభివృద్ది చెందింది. ఇప్పుడు వానమామలై జీయర్ స్వామిలో ప్రకాశించునది. అటువంటి కీర్తిని గడించిన స్వామిని చూచుట బహు ఆనందముగా నుండును.

  • ఎవరి ఉభయ వేదంతముల వివరణముల మహా పండితులను అయినను ఆకర్షించునో, ఎవరి అనుష్టానము దృష్టాంతము ను గొని సన్యాసులు సైతము ఆచరణ చేయుదురో, మచ్చ లేని వారు మరియు జ్ఞానము, సద్గుణముల భాండాగారము అయిన వారు ఎవ్వరో, మరియు ఎవరియితే మణవాళ మాముణులను ఆశ్రయించిరొ, అటువంటి వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.
  • ఎవరి కాలక్షేప గోష్టిలో పక్షులు సైతము “శ్రీ మన్నారయణుడె పరాత్పరుడని, వారే శుద్ధ సత్వమని, ఇతర దేవతలందరూ వారికి పరిచారకులని” కూవుదురో, అటువంటి వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.
  • ఎవరి కటాక్షము యొక్క శక్తి వలన అర్థ పంచక జ్ఞానము సులువుగా స్ఫురించునో, ఎవరి శిష్యులకు కల్ప వృక్షము వంటి వారో మరియు ఎవరైతే వానమామలైలో పెక్కు కైంకర్యములు చేసిరో, అటువంటి వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.

  •  ఎవరైతే వారి నిశ్చలమైన కరుణతో నన్ను ఉద్ధరించిరో (భౌతిక విషయములందే ఆశ ఉండు శ్రీ వైష్ణవ సిద్ధాంతములో ఆశక్తి లేనివాడైన నేను) మరియు వానమామలై దివ్య క్షేత్రమునకు ఐశ్వర్యము వంటి వారైనా వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.
  • జ్ఞాన వైరాగ్యములు సంపూర్ణముగా కలిగి, ఒక బంగారు ఆభరణముల పెట్టి వలె నుండి, ఎమ్పెరుమానర్లచే స్థాపించబడిన ఆచార్య పీఠము తీసుకొనుటకు సంసిద్ధముగా నుండు వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.

  • మణవాళ మాముణులు కరుణకు పాత్రమై, జ్ఞానము మొదలగు సద్గుణముల సముద్రమై, దైవనాయక ఎమ్పెరుమాన్ మీద విడదీయరాని ప్రేమ కలిగిన వారై ఉండు వానమామలై జీయర్ స్వామిని నేను పూజించెదను.

వానమామలై జీయర్ స్వామి ప్రపత్తి:

  1. అప్పుడే విరిసిన తామర పూవ్వు వలె అందముగా నుండు వారున్నూ, సేవించిన వారికి ఆనందము కలిగించు వారున్నూ, సంసారము అనే దుఃఖ సాగరములో మనలను సహాయము చేయు వారు అయిన వానమామలై జీయర్ స్వామిని నేను ఆశ్రయించెదను.
  2. దోషములను నివారించు వారున్నూ, సద్గుణముల సముద్రమున్నూ, శిష్యులకు కల్ప వృక్షము అయినటువంటి వారైనా మణవాళ మాముణుల ఆశీర్వాదముచే ప్రఖ్యాతిని పొందినట్టు వంటి వారైనా వానమామలై జీయర్ స్వామిని నేను ఆశ్రయించెదను.
  3. మణవాళ మాముణులని ఆశ్రయించిన వారై, సంసార సంబంధమును పెంపొందించునని దాంపత్య జీవితమున చిక్కుకొనని వానమామలై జీయర్ స్వామిని నేను ఆశ్రయించెదను
  4. విరక్తి అనే లతా హనుమానతాళ్వాన్ నుండి మొదలై ఇప్పుడు వానమామలై జీయర్ వరకు పూర్తిగా వ్యాపించి పరిమళించు చున్నది, అటువంటి వానమామలై జీయర్ స్వామిని నేను ఆశ్రయించెదను.
  5. ఏ విధంగా ఆదిశేషుడు ఎమ్పెరుమాన్ యొక్క ప్రీతి కాగా కైంకర్యములు చేసెదరో ఆ విధంగానే తమ ఆచార్యులైన మణవాళ మాముణుల ప్రీతి కాగా వానమామలైలో కైంకర్యములు (మండపములు కట్టించుట మొదలగునవి) చేసిన వానమామలై జీయర్ స్వామిని నేను ఆశ్రయించెదను.
  6. నమ్మాళ్వార్లచే అనుగ్రహింప బడ్డ లోతైన వేదాంత అర్థములను విశేషంగా విశదపరిచిన వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.
  7. వానమామలై జీయర్ స్వామి యొక్క నామము పలికినంత మాత్రమున సంసారము అనే పాము యొక్క విషము నుండి విమోచనము ను పొంది ఎమ్పెరుమాన్తో సమముగా జీవత్మాలను ఉజ్జించజేయును. అటువంటి వారి శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.
  8. అనాది కాలము నుండి కూడ బెట్టుకొన్న పాపములను విముక్తిని ఇచ్చే, సాధువులచే పూజింపబడే, స్వచ్చముగా నుండు వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.
  9. వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద తీర్థమును ఎవరినైను పవిత్రము చేసి తాపత్రయమును వెంటనే తొలగించును. అటువంటి వారి శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.
  10. నిర్మలమైన మరియు సద్గుణముల సాగరము అయినటువంటి అప్పాచియారణ్ణ ఆశ్రయించిన వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.
  11. సద్గుణముల శిఖరమై, సాధువులచే పూజింపబడే సమరభుంగవాచార్యులు ఆశ్రయించిన వానమామలై జీయర్ స్వామి యొక్క శ్రీ పాద చరణములను నేను ఆశ్రయించెదను.
  12. వానమామలై జీయర్ స్వామి కి సాటి సమముగా ఎవరు లేరు. వారి వైరాగ్యము హనుమాన్, భీష్ముడు మొదలగు వారి కన్నను ఎక్కువ. ఒరాణ్ వళి గురుపరంపరైలో నమ్మాళ్వార్ మొదలగు వారి భక్తికి సమముగా ఉన్నది. వారి జ్ఞానము నాథమునుల, ఆళవన్దార్ మొదలగు వారి తో సమము. వీటనింటిని పరిశీలించిన పిదప వానమామలై జీయర్ స్వామి కన్నా గొప్పవారు ఎవ్వరైనను ఉందురో?
  13. దైవనాయకన్ ఎమ్పెరుమాన్ ను ఆదిశేషుని వలె సేవించిరి. కులశేఖర్ ఆళ్వార్ మాదిరిగా ఎమ్పెరుమాన్ యొక్క భక్తులను కొని యాడిరి, నమ్మాళ్వార్లను మధుర కవి ఆళ్వార్లు సేవించిన విధముగా వారి ఆచార్యులైన మణవాళ మాముణులు సేవించిరి, పూర్వాచార్యుల యొక్క అడుగుజాడలలో అనుసరించిరి, మంచి గుణముల భాండాగారముగా ఉండిరి.
  14. పూర్వము ఎమ్పెరుమాన్ నారాయణ, నరులుగా అవతారము ఎత్తినారు. ఇప్పుడు ఎమ్పెరుమాన్ మణవాళ మాముని మరియు వానమామలై జీయర్ స్వామిగా అవతరించిరి. వానమామలై జీయర్ స్వామి యొక్క కీర్తి ఇంత గొప్పది.

మనము తదుపరి సంచికలో తిరిగి గురు పరంపరలోని ఇతర ఆచార్యుల వైభవమును తెలుసుకుందాము.

అడియేన్ రఘు వంశీ రామానుజదాసన్

మూలము: http://guruparamparai.wordpress.com/2012/09/30/ponnadikkal-jiyar/

పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/2012/08/17/introduction-contd/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org