శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
గత సంచికలో మనము పిళ్ళై లోకాచార్యుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గురుపరంపరలో తరువాత ఆచార్యుల గురించి తెలుసుకొందాం.
తిరువాయ్మొళి పిళ్ళై – కుంతీ నగరము (కొంతగై)
తిరునక్షత్రము: వైశాఖ మాసము, విశాఖ నక్షత్రము
అవతార స్థలము: కుంతీ నగరము (కొంతగై)
ఆచార్యులు : పిళ్ళై లోకాచార్యులు
శిశ్యులు: అళగియ మణవాళ మాముణులు, శఠగోప జీయర్ (భవిష్యదాచార్య సన్నిధి), తత్వేస జీయర్, మొదలైన
పరమపదం చేరిన స్థలము: ఆళ్వార్ తిరునగరి
శ్రీ సూక్తులు: పెరియాళ్వార్ తిరుమొళి స్వాపదేశము.
తిరుమలై ఆళ్వార్ గా జన్మించిరి, శ్రీశైలేశర్, శఠగోప దాసర్ గా వ్యవహరింపబడి తుదకు ఆళ్వారులకు తిరువాయ్మొళిపై గల శ్రద్దకు మరియు దానిని విస్తరించడములో వారు సల్పిన కృషికి ఫలితముగా తిరువాయ్మొళి పిళ్ళైగా ప్రసిద్దిగాంచిరి.
తిరుమలై ఆళ్వార్ తన చిన్న వయస్సులోనే పిళ్ళై లోకాచార్యుల శ్రీ చరణముల వద్ద పంచ సంస్కారములను పొందెను. వీరు తమిళములో గొప్ప పండితులు మరియు గొప్ప పరిపాలనాధ్యక్షులు. వీరు సంప్రదాయము నుండి వేరు పడి మధురై రాజ్యమునకు ముఖ్య సలహాదారుడిగా నియమించబడెను, ఆ రాజు చిన్న వయస్సులో మరణించడము వలన తన కూమారుల సంరక్షణ భాధ్యతలను తిరుమలై ఆళ్వారులకు అప్పగించెను. పిళ్ళై లోకాచార్యులు తన చివరి రోజులలో, తన దివ్యమైన కరుణను తిరుమలై ఆళ్వారులపై ప్రసరించి మన సంప్రదాయమునకు నాయకుడిగా నియమించవలెనని కూర కులోత్తమ దాసులు మరియు ఇతర శిశ్యులను ఆఙ్ఞాపించిరి. కూర కులోత్తమ దాసులు తిరుమలై ఆళ్వారులను కలిసి సంస్కరించుటకు ప్రయత్నం మొదలు పెట్టారు .
ఆ సమయములో (మహమ్మదీయుల దండయాత్ర ముగిసిన కొద్ది కాలమునకు), నమ్మాళ్వారులు ఆళ్వార్ తిరునగరి నుండి వచ్చి నమ్పెరుమాళ్ళతో కొంత కాలము కోళికోడ్ లో ఉండెను. కాని అప్పుడు నమ్పెరుమాళ్ళు అక్కడి నుండి బయలుదేరపోతే, అక్కడి స్తానిక ప్రజల మధ్యన భేదాభిప్రాయాల వలన, ఆళ్వార్ వారి వెంట ప్రయణము చేయలేక పోయెను. ఆ సమయములో, ఆళ్వార్లను తీసుకొని దక్షిణ పడమర కొండలు గల ప్రదేశమునకు వెళ్ళునప్పుడు దోపిడి దొంగల భయముచే వారిని ఒక పెట్టెలో ఉంచి ఒక చిన్న రాతి కొండ క్రింద భద్రపరచిరి. తదుపరి కొంత కాలమునకు, తోళప్పర్ అనే ఒక శ్రీవైష్ణవుడు నమ్మాళ్వారులపై గల అనుబంధముచే, తిరుమలై ఆళ్వారుల వద్దకు వచ్చి, నమ్మాళ్వారులను తీసుకురావడము కొరకు రక్షణగా కొందరు సైనికులను తనతో పాటు పంపమని అభ్యర్తించిరి. తిరుమలై ఆళ్వార్ సంతోషముతో వారిని ఏర్పాటు చేయగా తోళప్పర్ ఆ కొండ గల ప్రదేశమునకు దారిని చూపిరి. అప్పుడు అందరూ ఆ కొండ క్రిందికి వెళ్ళుటకు భయపడుచుండగా తోళప్పర్ స్వతంత్రముగా తానే క్రిందికి వెళ్ళెను. ఆ సమయములో, ఆళ్వార్ తిరునగరి నుండి వచ్చిన శ్రీవైష్ణవులు తోళప్పర్ని అభినందించి ఈ విధముగా చెప్పెను, మీరు చేసిన కృషికి ఈ దినము నుండి ఆళ్వారుల యొక్క ప్రత్యేక మర్యాద/ప్రసాదము లభించును. వారు ఒక తాడు సహాయముతో క్రిందికి వెళ్ళి, నమ్మాళ్వారులను పదిలముగా పైకి పంపిరి. అప్పుడు రెండవ సారి ఆ తాడును క్రిందికి పంపి తోళప్పర్ వారిని తీసుకువస్తుండగా ఎలాగో జారి కొండ క్రింద పడి వెంటనే పరమపదమును చేరిరి. నమ్మాళ్వారులు వెంటనే తోళప్పర్ల కుమారులను సమాధానపరిచి, తామే తోళప్పర్ల కుమారులకు తండ్రిగా ఉంటామనిరి. ఆ విధముగా తోళప్పరుల కృషి వలన (తిరుమలై ఆళ్వారుల సహాయముతో) నమ్మాళ్వారులను తిరిగి తిరుక్కనంబికి తీసుకురాగా అప్పడి నుండి వారు అక్కడనే ఉండిరి.
ఇప్పుడు తిరుమలై ఆళ్వారుల గురించి. ఒకసారి తిరుమలై ఆళ్వార్ దిన చర్యగా పల్లకిలో కూర్చోని పరిక్రమణ చేస్తూ వచ్చు చుండగా కూర కులోత్తమ దాసులు ఆళ్వారుల తిరువిరుత్తమును సేవించడం గమనించిరి. పిళ్ళై లోకాచార్యుల దీవెనలు తిరుమలై ఆళ్వార్ పై పరిపూర్ణముగా ఉండడము వల్ల, వారు దాసరుల గొప్పతనము గ్రహించి, పల్లకి నుండి దిగి దాసరులను తిరువిరుత్తముల అర్థములను తెలుపమని అభ్యర్తించిరి, కాని దాసర్ ఇప్పుడు ఉపదేశించడము వీలుకాదని చెప్పిరి దానితో కొద్దిగా వాగ్వాదము జరిగెను. అది చూసి వారి సేవకులు దాసరులకి హాని తలపెట్ట పోగా, తిరుమలై ఆళ్వార్ సాత్వికుడుగా ఉండడము వలన వారిని వారించి అక్కడి నుండి వెళ్ళిపోయెను. తదుపరి వారు తమ పెంచిన తల్లికి జరిగిన సంఘటనను తెలుపగా వారు పిళ్ళై లోకాచార్యులతో గల సంబంధమును గుర్తుకు చేసిరి. తిరుమలై ఆళ్వార్ వెంటనే తను ఇంత వరకు ఏమి కోల్పోయినది గ్రహించి దుఖించిరి. మరలా, ఒక నాడు తిరుమలై ఆళ్వార్ ఏనుగుపై ప్రయాణించుచుండగా, వారు దాసుడిని చూసిరి. అప్పుడు వెంటనే క్రిందికు దిగి దాసరుల శ్రీ చరణముల వద్ద సాష్టాంగ ప్రణామమును సమర్పించిరి. దాసర్ అప్పుడు వారికి అన్ని అర్థములను ఉపదేశించుటకు అంగీకరించిరి. తిరుమలై ఆళ్వార్ వారి తిరువారాధనము కొరకై ఒక అగ్రహారమును అన్ని వసతులతో ప్రత్యేకముగా నిర్మించిరి. పరిపాలనయందు తీరిక లేనివాడైనందుకు, దాసరులను తను తిరుమణి కాపు ధరించే సమయములో ప్రతి నిత్యము రావలేనని కోరెను. మొదటి సారి దాసర్ వచ్చినప్పుడు తిరుమలై ఆళ్వార్ తిరుమణ్ కాప్పును పెట్టుకొనునప్పుడు పిళ్ళై లోకాచార్యుల తనియన్ను చదువుతూ పెట్టుకోవడము గమనించి సంతోషము చెందిరి. అప్పడి నుండి వారు పిళ్ళై లోకాచార్యుల వద్ద నేర్చుకొన్న ఙ్ఞానమును క్రమము తప్పక తిరుమలై ఆళ్వారులకి ఉపదేశించిరి. ఒకసారి తిరుమలై ఆళ్వార్ పనిలో ఉండడము వలన ఆరోజు పాఠమునకు వెళ్ళలేకపోయెను, దాసర్ కూడా మరుసటి దినము నుండి పాఠము చెప్పుటకు వెళ్ళలేదు. అప్పుడు తిరుమలై ఆళ్వార్ దాసర్ దగ్గరకి వెళ్ళి అపరాద క్షమాపనమును అడుగగా, దాసర్ క్షమించి వారికి తన శేష ప్రసాదమును ఇచ్చిరి. అప్పడి నుండి తిరుమలై ఆళ్వార్ లౌకిక బంధములను విడచి, తన పూర్తి అధికారమును యువరాజునకు అప్పగించి రాజ్యమును వదిలి దాసరులతో తమ పూర్తి సమయమును గడిపిరి.
దాసర్ చివరి దశలో, తిరుమలై ఆళ్వారులను తిరుక్కణ్ణన్గుడి పిళ్ళై వద్దకి వెళ్ళి తిరువాయ్మొళిని వివరముగా మరియు విళంచోలై పిళ్ళైల వద్ద రహస్య అర్థములను నేర్చుకోవలసినదిగా ఆఙ్ఞాపించిరి. వారిని మన సంప్రదాయమునకు నాయకుడిగా నియమించిరి. దాసర్ పరమపదమునకి చేరిన తదుపరి పిళ్ళై లోకాచార్యులను ధ్యానిస్తు, తిరుమలై ఆళ్వారులు అన్ని చరమ కైంకర్యములను చాలా గొప్పగా నిర్వహించిరి.
తిరుమలై ఆళ్వార్ తిరుక్కణ్ణన్గుడి పిళ్ళై దగ్గరికి వెళ్ళి తిరువాయ్మొళిని నేర్చుకోవడము మొదలు పెట్టిరి. పిళ్ళై దాని సారమును మాత్రమే చెప్పుతుండగా, తిరుమలై ఆళ్వార్ ప్రతీ పదమునకు అర్థమును అడుగగా, పిళ్ళై తిరుప్పుట్కుళి జీయర్ వద్దకి వెళ్ళి నేర్చుకోమని చెప్పెను. తిరుమలై ఆళ్వార్ తిరుప్పుట్కుళి వెళ్ళగా, అనుకోకుండా వారు వెళ్ళుటకు మునుపె జీయర్ పరమపదమునకు చేరిరి. తిరుమలై ఆళ్వార్ చాలా బాధపడి దేవ పెరుమాళ్ళకు మంగళాశాసనము చేయుటకు వెళదామని నిశ్చయించుకొనిరి. వారు అక్కడకు వెళ్ళగానే ప్రతీ ఒక్కరు సాదరముగా ఆహ్వానించిరి, దేవ పెరుమాళ్ తన యొక్క శ్రీ శఠగోపము, మాల, శాత్తుపడి మొద,, వారికి ఇచ్చిరి. ఆ సమయములో నాలూర్ పిళ్ళై సన్నిదిలో ఉండిరి. (గమనిక: నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానమును ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళకి ఇచ్చిరి, వారు తమ కుమారులైన ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ళకి ఉపదేశించిరి. నాలూర్ పిళ్ళై ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ళకు శిశ్యులు, వారు ఈడు వ్యాఖ్యానమును పూర్తిగా తమ కుమారులైన నాలూర్ ఆచాన్ పిళ్ళైలకి ఉపదేశించిరి.) దేవ పెరుమాళ్ స్వయముగా నాలూర్ పిళ్ళైలతో మాట్లాడి ఈ విధముగా చెప్పెను“ జ్యోతిష్కుడిలో నేను చెప్పిన విధముగా (పిళ్ళై లోకాచార్యుల వలె) మీరు తిరుమలై ఆళ్వారులకు అరుళిచ్చెయల్ మొత్తము అర్థములను తిరువాయ్మొళి ఈడు వ్యాఖ్యానమును తిరుప్పుట్కుళి జీయర్ దగ్గర నేర్చుకోలేకపోవడము వలన పూర్తి చేయమని ఆఙ్ఞాపించిరి”. అది విని నాలూర్ పిళ్ళై తన అదృష్టముగా భావించుదునని, కాని తన వృద్దాప్యము వలన తిరుమలై ఆళ్వారులకు సరిగా చెప్పలేనేమోనని అనిరి. అప్పుడు దేవ పెరుమాళ్ ఈ విధముగా అనిరి “మీ కుమారుడు నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై చెప్పిననూ మీరు చెప్పిన విధముగానే ఉండును”. దైవాఙ్ఞగా విని, నాలూర్ పిళ్ళై తిరుమలై ఆళ్వారులను అంగీకరించి చాలా సంతోశముతో నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై వద్దకు తీసుకుపోయి ఈడు మరియు ఇతర అరుళిచ్చెయల్ అర్థములను ఉపదేశించమని వారిని ఆఙ్ఞాపించిరి.
నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై (దేవరాజర్ అనికూడా వ్యవహరించుదురు) అర్థములను ఉపదేశించడము మొదలు పెట్టిరి, ఈ విషయము తెలుసుకొని తిరునారాయణపురతు ఆయి, తిరునారాయణపురతు పిళ్ళై మరియు ఇతరులు నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై మరియు తిరుమలై ఆళ్వారులను తిరునారాయణ పురమునకు వచ్చి అక్కడ కాలక్షేపమును చెప్పడము వలన మేము వివరముగా నేర్చుకొనుటకు అవకాశము ఉంటుందని అభ్యర్తించిరి. వారి అభ్యర్తనని మన్నించి తిరునారాయణ పురమునకు చేరి, ఎమ్పెరుమానారుకు, యదుగిరి నాచ్చియార్, శెల్వ పిళ్ళై మరియు తిరునారణనులకు మంగళాశాసనమును చేసి పూర్తి కాలక్షేపమును అక్కడ నిర్వహించిరి. అక్కడ తిరుమలై ఆళ్వార్ ఈడును పూర్తిగా నేర్చుకొని వారి సపర్యల ద్వారా ఆచార్యులను సంతోష పరిచిరి, నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై తమ తిరువారాధన పెరుమాళ్ళని (ఇనవాయర్ తలైవన్) తిరుమలై ఆళ్వారులకు ఇచ్చిరి. ఆ విధముగా ఈడు 36000 పడి నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై ద్వారా 3 గొప్ప పండితులకు విస్తరించెను – తిరుమలై ఆళ్వార్, తిరునారాయనపురతు ఆయి మరియు తిరునారాయనపురతు పిళ్ళై.
తిరుమలై ఆళ్వార్ ఆళ్వార్ తిరునగరికి తిరిగి వెళ్ళి అక్కడే నివసించుటకు నిర్ణయించుకొనిరి. నమ్మాళ్వార్ ఆళ్వార్తిరునగరిని విడచి వెళ్ళి పోయినప్పటి నుండి ఆ ప్రదేశము అంతయూ ఒక అడవిగా మారిపొయినది. అక్కడికి చేరిన వెంటనే అక్కడ ఉన్న పొదలను, చెట్లను తొలగించి దానిని మరల ఒక సుందరమైన ఆళ్వార్ తిరునగరిగా రూపొందించిన కారణము వలన వారికి కాడు వెట్టి గురు అనే బిరుదును ఇచ్చారు (కారణము అడవిని శుభ్రమును చేసిన ఆచార్యులు). వారు నమ్మాళ్వారులను తిరిగి తిరుక్క నంబి (కేరళలోని) నుండి ఆళ్వార్తిరునగరికి తెచ్చి గుడిని మరలా నెలకొలిపి ఆరాధించిరి. వారు ఎమ్పెరుమానారులకు (భవిష్యదాచార్యుల తిరుమేని నమ్మాళ్వారులు చాలా క్రితము ఇచ్చినది) ఆళ్వార్తిరునగరి దక్షిణమున గుడిని నిర్మించి, చతుర్వేది మంగలము (4 వీధులు గుడి చుట్టూ) మరియు 10 కుటుంబాలను ఏర్పరిచి, ఒక శ్రీవైష్ణవ అమ్మైయారును (విధవ) గుడిలో కైంకర్యములకు తదుపరి వారికి సహాయముగా పెట్టిరి. వారు నమ్మాళ్వారుల కీర్తిని పాడటం మరియు తిరువాయ్ మొజిని ఉపదేశించడమువలన తిరువాయ్ మొజి పిళ్ళైగా వ్యవహరింపబడిరి.
కొంతకాలము తరువాత, తిరువాయ్మొళి పిళ్ళై తిరువనంతపురమునకు వెళ్ళి అక్కడ పిళ్ళై లోకాచార్యుల ముఖ్య శిశ్యుడు విళాంచోలై పిళ్ళైని కలసి రహస్య గ్రంథములను నేర్చుకోదలచిరి. విళాంచోలై పిళ్ళై ఎల్లప్పుడూ వారి ఆచార్యులను ధ్యానం చేస్తూ ఉండేవారు, వారు సంతోషముతో తిరువాయ్మొళి పిళ్ళైని ఆహ్వానించిరి. విళాంచోలై పిళ్ళై అన్ని లోతైన అర్థములను వారికి ఉపదేశించి వారిని సంపూర్ణముగా ఆశీర్వదించిరి. తదుపరి తిరువాయ్మొళి పిళ్ళై ఆళ్వార్ తిరునగరికి తిరిగివచ్చిరి. ఆ తరువాత విళాంచోలై పిళ్ళై తమ చరమ తిరుమేనిని వదిలి నిత్య విభూతిలో ఆచార్యులకు ఎల్లపుడూ సేవచేయుటకు వెళ్ళిరి. అది విని, తిరువాయ్మొళి పిళ్ళై చరమ కైంకర్యములను వారికి నిర్వహించిరి.
కొంతకాలము తరువాత పెరియ పెరుమాళ్ ఆదిశేషులని సంసారము నుండి జీవాత్మాలను పరమపదమును తెచ్చుటకై మరలా అవతరించమని ఆజ్ఞాపించిరి. తిరువనంతాళ్వాన్ తమ స్వామి యొక్క ఆఙ్ఞను శిరసావహిస్తూ అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ (అళగియ మణవాళ మాముణులు) తిగళ కిడంతాన్ తిరునావీరుడయ పిరాన్ (గోమడతాళ్వాన్ పరంపర, ఎమ్పెరుమానార్ ఎర్పరచిన 74 సింహాసనాధి పతులలో ఒక వంశము) మరియు శ్రీరంగ నాచ్చియార్లకు ఐప్పసి తిరుమూలము నందు ఆళ్వార్తిరునగరిలో జన్మించిరి. వారు కొంత కాలము వారి అమ్మమ్మ గారి ఊరైన శిక్కిల్ కిడారంలో పెరిగి సామాన్య శాస్త్రము మరియు వేద అధ్యాయనమును వారి తండ్రి వద్ద అభ్యసించిరి. తిరువాయ్మొళి పిళ్ళైల గురించి విని,అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ఆళ్వార్తిరునగరికి తిరిగి వచ్చి, వారికి శిశ్యులుగా మారిరి, సపర్యలు మొదలు పెట్టి వారి వద్ద అరుళిచ్చెయల్ అర్థములను మొత్తము నేర్చుకొనిరి. తిరువాయ్మొళి పిళ్ళై సలహాల ద్వారా, భవిష్యదాచార్యులకు అత్యంత భక్తి మరియు ప్రేమతో తిరువారాధనమును చేస్తూ ఎమ్పెరుమానార్ల కీర్తి విషయమై యతిరాజ వింశతిని వ్రాసిరి. కొందరు తిరువాయ్మొళి పిళ్ళై శిష్యులు ఎందుకు మా ఆచార్యులు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లతో చాలా అనుబంధముగా ఉంటారని ఆశ్చర్యము చెందగా, తిరువాయ్మొళి పిళ్ళై అది గ్రహించి వారికి ఆదిశేషులే ఈ విధముగా అవతరించిరని వివరించిరి.
వారి చివరి దశలో, తిరువాయ్మొళి పిళ్ళై, మన సంప్రదాయమునకు తన తదుపరి ఎవరు నిర్వహిస్తారని కలత చెందుచుండిరి. ఆ సమయములో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు తానే బాధ్యతలను నిర్వహించుదునని మరియు వారి కోరికలను పూర్తి చేయుదునని వాగ్దానమును చేసిరి. అది విని చాలా సంతోషము చెంది, తిరువాయ్మొళి పిళ్ళై వారిని శ్రీభాష్యమును ఒకసారి నేర్చుకోమని కాని తిరువాయ్మొళి మరియు వాటి వ్యాఖ్యానములపై ఎల్లప్పుడూ ద్యాసను ఉంచవలెనని, మిగిలిన జీవితమును శ్రీరంగములోని పెరియ పెరుమాళ్ళకు మంగళాశాసనమును చేయవలెనని ఆఙ్ఞాపించిరి. తిరువాయ్మొళి పిళ్ళై తన ఇతర శిశ్యులకు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లను ప్రత్యేక అవతారముగా గుర్తించి వారితో చాలా గౌరవముగా ఉండమని చెప్పిరి. ఆ తరువాత, పిళ్ళై లోకాచార్యుల తిరువడిని ధ్యానించి, తిరువాయ్మొళి పిళ్ళై తమ చరమ తిరుమేనిని వదిలి పరమపదమును చేరిరి. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ మరియు ఇతర శిష్యులు వారికి చరమ కైంకర్యమును గొప్పగా జరిపించిరి.
ఎమ్పెరుమానార్లు ఏవిధముగా పెరియ నంబి (పరాంకుశ దాసర్) వద్ద ఆదరువు పొందిరో , అళగియ మణవాళ పెరుమాళ్ నాయనారులు తిరువాయ్మొళి పిళ్ళై (శఠగోప దాసర్) వద్ద ఆదరువును పొందిరి. వారి కృషి వలన మనము ఆళ్వార్తిరునగరిని, ఆతినాథర్ ఆళ్వార్ గుడి మరియు భవిష్యదాచార్యులు (ఎమ్పెరుమానార్) గుడిని ప్రస్తుత రూపములో చూస్తున్నాము. వారు తమ జీవితమును పూర్తిగా నమ్మాళ్వారులపై మరియు తిరువాయ్మొళి కి అర్పించిరి, వారు పిళ్ళై లోకాచార్యుల ఆఙ్ఞగా చాలా ప్రదేశములకు వెళ్ళి చాలా మంది ఆచార్యుల ఉపదేశములు సేకరించిరి చివరగా వాటిని అళగియ మణవాళా పెరుమాళ్ నాయనార్ భవిషత్తులో అళగియ మణవాళ మామునిగా మారబోతున్నారో వారికి ఇచ్చిరి. తిరువాయ్మొళి పిళ్ళై కృషి వలన మనము ఈడు 36000 పడి వ్యాఖ్యానమును పొందితిమి, తదుపరి అళగియ మణవాళ మాముణులచే ఎంతో ఎత్తునకు చేరినది.
ఎమ్పెరుమానారులతో మరియు మన ఆచార్యులతో మనకూ అలాంటి అనుబంధమూ కలిగేలా తిరువాయ్మొళి పిళ్ళైల శ్రీ చరణములను ప్రార్థిద్దాము .
తిరువాయ్మొళి పిళ్ళైల తనియన్ :
నమ శ్రీశైల నాథాయ కుంతీ నగర జన్మనే ।
ప్రసాదలబ్ద పరమ ప్రాప్య కైంకర్యశాలినే ॥
మన తదుపరి సంచికలో అజగియ మణవాళ మాముణుల వైభవమును చూద్దాము.
రఘు వంశీ రామానుజ దాసన్
మూలము: https://guruparamparai.wordpress.com/2012/09/19/thiruvaimozhi-pillai/
పొందుపరిచిన స్థానము – https://guruparamparai.wordpress.com/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
Pingback: శ్రీ వైష్ణవ గురు పరంపర పరిచయం – 2 | guruparamparai telugu
Pingback: శ్రీవైష్ణవ తిరువారాధనము | srIvaishNava granthams – Telugu
Pingback: తిరుక్కచ్చి నంబి | guruparamparai telugu
Pingback: ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ | guruparamparai telugu
Pingback: పిన్భళగియ పెరుమాళ్ జీయర్ | guruparamparai telugu
Pingback: విళాఞ్జోలైపిళ్ళై | guruparamparai telugu
Pingback: తిరునారాయణ పురత్తు ఆయ్ జనన్యాచార్యులు | guruparamparai telugu
Pingback: ఎంగళాళ్వాన్ | guruparamparai telugu
Pingback: srisailEsa (thiruvAimozhi piLLai) | guruparamparai – AzhwArs/AchAryas Portal
Pingback: పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ | guruparamparai telugu