ఈయుణ్ణి మాధవ పెరుమాళ్

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమతే వరవరమునయే నమ:
శ్రీవానాచల మహామునయే నమ:
nampillai-goshti1
తిరునక్షత్రము:  వృశ్చిక మాసము,  భరణి నక్షత్రము ( యతీంధ్ర ప్రవణ ప్రభావములో   హస్త అని పేర్కొనబడింది)
అవతార స్థలము:  శ్రీరంగము

ఆచార్యులు:   నంపిళ్ళై

శిష్యులు: ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ (వారి కుమారులు),
ఈయుణ్ణి మాధవ పెరుమాళ్(నంపిళ్ళై ప్రియ శిష్యులు),   వీరినే శిరియాళ్వాన్అప్పిళ్ళై అని కూడా అంటారు.తిరువాయిమొళి ఈడు మహా వ్యాఖ్యానము వీరి ద్వారానే మణవాళ మామునులకు చేరింది.
తమిళములో “ఈతల్” అనగా ఇచ్చుట అని ,“ఉణ్ణుతల్” అనగా  భుజించుటా అని అర్థము. ఈయుణ్ణి అనగా శ్రీవైష్ణవులకు పెట్టకుండా తిననివారని అర్థము.
 నంపిళ్ళై  నిరంతరము  భగవధ్విషయ కాలక్షేపములో  పొద్దుపుచ్చేవారు.  అవి  శ్రీరంగములోని  శ్రీవైష్ణవులకు బంగారు కాలము.  ప్రతి ఒక్కరు మహాచార్యులైన నంపిళ్ళై ద్వారా  భగవధనుభవములో  ఓలలాడారు.  నంపిళ్ళై ఎంపెరుమాన్ మరియు వారి ఆచార్యులైన నంజీయర్ల కృప వలన  ఆళ్వార్ల  పాశురములకు  శ్రీ రామాయణము, పురాణములు, ఇతిహాసముల నుండి  ఉదాహరణలనిస్తూ వివరించేవారు.
నంపిళ్ళైకు  వడక్కు తిరు వీధి  పిళ్ళై  ప్రియ శిష్యులు.  పగలు  నంపిళ్ళై చెప్పే తిరువాయిమొళి కాలక్షేపము విని రాత్రిళ్ళు దానిని జాగర్తగాగ్రంధస్థము చేసేవారు. ఒక సారి నంపిళ్ళై వడక్కు తిరువీధి పిళ్ళై  గృహమునకు  రాగా  వారు తిరువాయిమొళి  కాలక్షేపము చేసిన  విషయాలు తాటాకు మీద కనబడ్డాయి.  తన శిష్యుడు అక్షరము పొల్లు లోకుండా రాయగలిగినందుకు  ఎంతో  సంతోషించారు.  కాని  తన అనుమతి లేకుండాఈ పని  చేయటము వారిని   నొప్పించింది .ఈ గ్రంధమే తరువాతి  కాలములో ఈడు ముప్పత్తారాయిరప్పడి గా ప్రసిధ్ధి పొందినది. తరువాత దీనిని ఈయుణ్ణి  మాధవ  పెరుమాళ్ళకు  అందజేసి శిష్యులకుబోధించమనిచేప్పారు.(ఈచరిత్ర https://guruparamparaitelugu.wordpress.com/2013/09/25/vadakku-thiruvidhi-pillai/ లో  చూడవచ్చు..)
       ఈయుణ్ణి  మాధవ  పెరుమాళ్  వారి కుమారులైన  ఈయుణ్ణి  పధ్మనాభ  పెరుమాళ్ళకు ,వారు తన శిష్యులైన నాలుర్ పిళ్ళైకి బోధించారు.  వీరు కూరతాళ్వాన్  శిష్యులైన  నాలురాన్ వారసులు.
నాలుర్ పిళ్ళై జన్మస్థలము  మేల్పాడగం (తొణ్దై నాడు),తిరునక్షత్రము పుష్యమి.వీరిని సుమన:కోసేలర్, కోల వరాహ పెరుమాళ్ నాయనార్, రామానుజార్య దాసర్, అరుళాళర్  తిరువడి  ఊనృఇయవర్ అని కూడా అంటారు.వీరి శిష్య్లులు నాలూరాచాన్  పిళ్ళై, తిరుప్పుళింగుడి జీయర్ మరియు తిరుక్కణ్ణంగుడి జీయర్.
తిరుప్పుళింగుడి జీయర్ శ్రీవైష్ణవ చరితమనే గ్రంధమును రాశారు.
నాలూర్ పిళ్ళై కుమారులు మరియు  ప్రియశిష్యులు  నాలురాచ్చాన్ పిళ్ళై.వీరి తిరునక్షత్రము ధనుర్మాస భరణి నక్షత్రము.
వీరినే దేవరాజాచ్చాన్ పిళ్ళై,  దేవేసర్,  దేవాధిపర్ మరియు మేల్నాడు ఆచ్చాన్ పిళ్ళై అని కూడా అంటారు.వీరి తండ్రిగారి దగ్గర  ఈడు ముప్పత్తారాయీప్పడి   నేర్చుకున్నారు  .వీరి శిష్యులు తిరునారాయణపురత్తు ఆయ్,  ఇళంపిళిచైపిళ్ళై మరియు తిరువాయిమొళి పిళ్ళై.
 నాలూర్ పిళ్ళై, నాలూరాచాన్ పిళ్ళై తిరునారాయణపురములోనే నివాసముండేవారు.
   కూర కులోత్తమ ధాసర్ ఆనతి  మేరకు  తిరువాయిమొళి పిళ్ళై తిరువాయిమొళిలోని  అర్థములు తెలుసుకోవటానికి కాంచీపురమునకుబయలుదేరారు.  అదే సమయములో  నాలూర్ పిళ్ళై, నాలూరాచ్చాన్ పిళ్ళై కూడా అక్కడకు చేరుకున్నారు.  దేవ పెరుమాళ్ సన్నిధిలో అందరూకలుసుకున్నారు. దేవ పెరుమాళ్  అర్చక ముఖముగా  “పిళ్ళై లోకాచార్యులు మరెవరో కాదు,  సాక్షాత్ ఎంపెరుమానులే”  అనితెలియ జేసారు.  అంతే కాక నాలూర్ పిళ్ళైని  ఈడు వ్యాఖ్యానమును  తిరువాయిమొళి  పిళ్ళైకి  బోధించవలసినదిగా  అదేశించారు.  దానికి నాలూర్ పిళ్ళై దేవపెరుమాళ్ళను ఈ వయసులో తాను ఈ పని చేయగలనా అని అడిగారు.  అప్పుడు  ధేవ పెరుమాళ్  మీ కుమారులు నాలూరాచాన్ పిళ్ళై మీకు సహకరిస్తారని చెప్పారు.  ఆ విధముగా  తిరువాయిమొళి పిళ్ళై అందరితో కలసి ఈడు వ్యాఖ్యానమును  నాలూరాచాన్ పిళ్ళై దగ్గర అధికరించిఆళ్వార్ తిరునగరి  చేరుకొని  మణవాళ మామునులకు అనుగ్రహించారు. మామునులు  తరవాతి  కాలములో  “ఈట్టు పెరుక్కర్” గా ఖ్యాతిగాంచారు.
నాలూర్ పిళ్ళై లేక  నాలూరాచ్చాన్ పిళ్ళై  తిరువాయిమొళికి,  పెరియాళ్వార్ తిరుమొళికి  వ్యాఖ్యానము  రాసినట్లుగా చెపుతారు.
మామునులు, తమ” ఉపదేశ రత్నమాల” లో ఈడు వ్యాఖ్యానము పరిక్రమణ  చేసిన విధమును  48,49 పాశురములలో చక్కగావివరించారు.
 •  48వ పాశురములో,వడక్కు తిరువీది పిళ్ళై ఈడు ముప్పత్తారాయిరప్పడి ని గ్రందస్తము చేసినట్టుగా చెప్పారు.నంపిళ్ళై దానిని వారి నుండి తీసుకొని ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళ్కు ఇచ్చినట్టు చెప్పారు.
 •  49వ పాశురములో,  ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళ  నుండి,  వారి కుమారులు  ఈయుణ్ణి  పధ్మనాభ పెరుమాళ్ నేర్చుకొని  నాలూర్ పిళ్ళై మరియు  నాలూరాచ్చాన్ పిళ్ళైకి  తరువాత  తిరువాయిమొళి పిళ్ళైకి, తిరునారాయణపురతు ఆయ్కి అనుగ్రహించారని  చెప్పారు.
     ఈ విధముగా ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ చరిత్ర తెలుసుకున్నాము. వీరు గొప్పఙాని  నంపిళ్ళై  ప్రియ  శిష్యులు. వారి చరిత తెలుసుకోవటము వలన మనలోనూ  భాగవత నిష్ట  కలగాలని కోరుకుందాము.
ఈయుణ్ణి  మాధవ  పెరుమాళ్ళ తనియన్: 
 
లోకాచార్య పధాంభోజ సంశ్రయం కరుణాంభుధిం
వేధాంత ధ్వయ సంపన్నం మాధవార్యం అహం భజే
ఈయుణ్ణి పధ్మనాభ పెరుమాళ్ళ తనియన్:
 
మాధవాచార్య సత్పుత్రం తత్పాదకమలాశ్రితం
వాత్సల్యాధి గుణైర్ యుక్తం పధ్మనాభ గురుం భజే
నాలూర్ పిళ్ళై తనియన్ :
 
చతుర్గ్రామ కులోధ్భూతం ద్రావిడ బ్రహ్మ వేధినం
యఙ్ఞార్య వంశతిలకం శ్రీవరాహమహం భజే
నాలూరాచాన్ పిళ్ళై తనియన్:
 
నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే
రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే
ఆచార్యన్ తిరువడిగలే శరణం
అడియెన్ చూడామణి రామానుజ దాసి

Source: https://guruparamparai.wordpress.com/2013/04/21/eeynni-madhava-perumal/

అనంతాళ్వాన్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వవరవరమునయే నమ:
శ్రీ వానాచల మహా మునయే నమ:

ananthazhwan

తిరునక్షత్రము : మేషమాసము, చిత్రా నక్షత్రము

అవతార స్థలము : సిరుపుత్తూరు/కిరన్గనూరు ( బెంగళూరు-మైసూరు మార్గములో)

ఆచార్యులు : అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్
పరమపదించిన స్థలము : తిరువేంకటమ్(తిరుమల)
రచనలు : వేంకటేశ ఇతిహాసమాల, గోదా చతుశ్శ్లోకీ, రామానుజ చతుశ్శ్లోకీ

అనంతాచార్యర్, అనంత సూరి మొదలగు నామధేయములు ఉన్నవి

శిష్యులు- ఏచ్చాన్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి.

ఎంపెరుమానార్ గురించి తెలుసుకొని వారి శ్రీపాదములను ఆశ్రయించాలని కోరికతో వారిని చేరారు. ఆ రోజులలోనే యఙ్ఞమూర్తిని సంస్కరించి  వారికి అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ అను నూతన నామధేయాన్ని ఏర్పరిచారు. అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ శిష్యులు కమ్మని అనంతాళ్వాన్ ను ఎంపెరుమానార్ ఆదేశమిచ్చారు. ఉభయులు ఆనందముతో అంగీకరించారు. కాని అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ సౌహృదయముతో పేరుకే నేను ఆచార్యుడైనను నా శిష్యులందరు ఎంపెరుమానార్ శ్రీపాదాలనే శిరోధార్యముగా భావిస్తారని ప్రకటించారు. కావుననే తిరుమల లో ఎంపెరుమానార్ శ్రీపాదములను (శ్రీశఠారిని) అనంతాళ్వాన్ అని వ్యవహరిస్తారు.

అనంతాళ్వాను కు మధురకవి ఆళ్వార్ కు గల పోలికలను పరిశీలిద్దాము:

*ఉభయుల తిరునక్షత్రం మేషమాసము, చిత్రా నక్షత్రము.

* ఉభయులు ఆచార్యనిష్ఠలో పరిపూర్ణులు

తిరువాయ్ మొళి లో “ఒళవిళ్ కాలమెల్లాం” పదిగములోని(3.3.1) అమృత తుల్యమైన పాశురమునకు వ్యాఖ్యానము చెపుతున్న సమయములో నమ్మాళ్వార్ శ్రీవేంకటేశ్వరునికి చేయదలచిన పుష్పకైంకర్యము గురించి ఎంపెరుమానార్ వివరించారు.అదేసమయాన శ్రోతలను చూసి” ఎవరైన తిరుమలలో అందమైన పూతోటలను పెంచి శ్రీవేంకటేశ్వరునికి పుష్పకైంకర్యము చేసి నమ్మాళ్వార్ కోరికను తీర్చగలవారు ఉన్నారా?” అని ప్రశ్నించారు. వెంటనే అనంతాళ్వాన్ లేచి ” తమరి ఆనతితో దాసుడు తమరి కోరికను నమ్మాళ్వార్ కోరికను నెరవేర్చుటకు సిద్ధమని విన్నవించుకున్నారు. అది విన్న ఎంపెరుమానార్ అమితానందముతో ఆనతిచ్చి తిరుమలకు పంపారు. అనంతాళ్వాన్ తిరుమల చేరుకొని స్వామికి మంగళాశాసనములు చేసి తోటను  పెంచి “ఇరామానుశన్” అని నామధేయమును ఉంచి ఎంపెరుమానార్ కోరిక మేరకు పుష్పకైంకర్యము చేయసాగారు. అది తెలిసిన ఎంపెరుమానార్ తిరుమలేశుని దర్శనార్థం తిరువాయ్ మొళి కాలక్షేపం త్వరగా ముగించి తిరుమల కు బయలుదేరారు. ఎంపెరుమానార్ కాంచీపురము మీదుగా ప్రయాణించి దేవపెరుమాళ్ కి , తిరుకచ్చినంబికి మంగళాశాసనము చేసుకొని తిరుపతికి చేరుకున్నారు. వీరిని ఆహ్వానించుటకు అనంతాళ్వాన్ మరికొదరు శ్రీవైష్ణవులతో కూడి కొండ క్రిందకు వచ్చారు.

తిరుమల స్వయంగా ఆదిశేషుని అవతారమని ఎంపెరుమానార్ కొండ పైకి వెళ్ళుటకు ఇష్ఠపడలేరు. కాని అనంతాళ్వాన్ తదితరుల కోరికమేరకు బయలుదేరారు. తిరుమలనంబి స్వయముగా ఆహ్వానించుటకు ఎదురారాగా ,ఎంపెరుమానార్ తోటకు వెళ్ళి  అక్కడ అనేకరకాల పూలమొక్కలను చూసి ఎంతో సంతోషముతో తిరుమంగైఆళ్వార్ పాశురమైన “వళర్ తాడానాళ్ పయన్ పెత్తెన్” (పరకాల నాయకి  తన పెంపుడు చిలుక నారయణుని నామాలు పలకడం చూసి సంతోషముతో పాడిన పాశురం)పాశురంను గుర్తుకు చేసుకున్నారు. అంతాళ్వాన్ కృషిని, అంకితభావనను చూసి చాలా సంతోషించారు.

 

ఒకసారి అనంతాళ్వాన్ భార్య నిండుగర్భణిగా ఉన్నప్పుడు ఇద్దరు తోట పని చేస్తున్నారు. ఆమె అవస్థను చూడలేక వేంకటేశుడు కిన్న బాలుడిలా వచ్చి సహాయము చేయబోతే, అనంతాళ్వాన్   మా ఆచార్యులు   ఆఙ్ఞానుసారం మేమే ఈ పనిని  చేయాలి నీ సహాయము అవసరం లేదని చెప్పి పంపారు. ఆ బాలుడు చూడ కుండా ఆమె చేతిలోని మట్టి తట్టను  తీసుకొని దూరంగా పోసాడు. అది తెలిసి అనంతాళ్వాన్ కోపముతో ఆ బాలుణ్ని వెంబడించాడు.

ananthazhwan-art1

 

ఆ బాలుణ్ణి అందుకోలేక చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు. అది ఆ బాలుని గడ్దానికి(చుబుకానికి) తగిలింది.ఆ బాలుణ్ణి డిని అందుకోబోగా అంతలో దేవాలయములోనికి వెళ్ళి మాయమయ్యాడు.  సాయంకాలం దేవాలయానికి వెళ్ళిన అనంతాళ్వాన్ కు స్వామి చుబుకము నుండి రక్తం రావడం కనిపించినది. అప్పుడు విషయం అర్థమైంది అనంతాళ్వాన్ కు. వెంటనే పచ్చకర్పూరము అద్దారు.  నేటికి ఆ సాంప్రదాయము మేరకు స్వామి చుబుకానికి పచ్చకర్పూరము అద్దడం జరుగు తుంది.

 

ఒక సారి అనంతాళ్వాన్ కు ఒక పాము కరచినది.తోటి వారందరు ఎంతో ఆందోళన పడ్డారు.  కాని అనంతాళ్వాన్  నిర్భయంగా ” నన్ను కరచిన పాము బలముగలదైతే  ఈ శరీరాన్ని విడచి విరజా స్నానము చేసి, పరమపదమును చేరి అక్కడ స్వామికి కైంకర్యమును చేస్తాను.  కరచిన పాము కంటే ఈ శరీరము బలముగలదైతే ఇక్కడే ఉండి  స్వామిపుష్కరిణిలో స్నానముచేసి తిరుమలేశునికి కైంకర్యము చేస్తాను” అని అన్నారు.

ananthazhwan-snake

మరొకసారి అనంతాళ్వాన్ ప్రసాదాన్ని మూట కట్టుకొని  దానిని తీసుకొని పొరుగూరికి బయలుదేరారు. కొండ దిగి  నడుస్తూ దారిలో ప్రసాదమును తిందామని మూట విప్పారు. దానిలో కొన్ని చీమలు కనిపించాయి, వెంటనే తన శిష్యులని కొండ ఎక్కి ఆ మూటలోని చీమలను తిరుమలలో వదిలి రమ్మన్నారు . అలా ఎందుకు చేశారంటే కుళశేఖరాళ్వార్ తన పెరుమాల్ తిరుమొళి ఒ” తిరుమలైయిలే ఎడునావేన్”(తిరుమలలో ఏదో ఒకటి అవుతానని) అన్నారు. “బహుశా ఈ చీమలు వారే అయితే కొండ క్రింద వదలడం ఎంత అపచారము చేసిన వారమవుతాము”  అని  తన శిష్యులతో అన్నారు.

ananthazhwn-ants

ఇంకొకసారి అనంతాళ్వాన్ పూమాల కడుతున్న సమయములో ఒక స్వామి  వచ్చి” శ్రీనివాసుడు మిమ్ములను రమ్మన్నారు” అని చెప్పాడు. వీరు పని పూర్తిచేసుకొని వెళ్ళగా శ్రీనివాసుడు ” ఆలస్యమయింది తమరికి” అని అడిగారు దీనికి వీరు ” పూలు పూర్తిగా విచ్చుకోక ముందే  మాల కట్టాలి, మా ఆచార్యులు ఆఙ్ఞ అయిన ఈ కైంకర్యము కంటే వేరేదేది ఈ సన్నిధిలో నాకు లేదు” అన్నారు

“మేము మిమ్ములను ఇక్కడి నుండి వెళ్ళిపోమని ఆఙ్ఞాపిస్తే” అన్నాడు శ్రీనివాసుడు.

” మీరు తిరుమలకు నాకంటే కొంచెం ముందుగా  వచ్చారు. నేను మా ఆచార్యుల ఆనతి మీద వచ్చాను. నన్ను వెళ్ళి పోమని మీరెలాగ అనగలరు?” అని అన్నారు అనంతాళ్వాన్.

ananthazhwan-srinivasan

వీరి ఆచార్య నిష్ఠను చూసి స్వామి ఎంతో మురసి పోయారు.

అనంతాళ్వాన్ శ్రీసూక్తులను వారి ఔనత్యాన్ని వివిధ వ్యాఖ్యానముల నుండి కొన్నింటిని పరిశీలిద్దాము

పెరియాళ్వార్ తిరుమొళి 4.4.1 కి మణవాళ మామునుల వ్యాఖ్యానం •

నావకారియం శొల్లిలాదవర్ నాల్ దొరుం విరుందోమ్బువార్ 

దేవకారియం శెయ్ దు వేదం  పయిన్ఱు వాళ్ తిరుకోట్టియూర్

మూవకారియము తిరుత్తుం ముదల్వనై చిందియాద

అప్పావకారిగళై పడైత్తవన్ ఎఙ్ఞనం పదైత్తాంగొలో  

.ఈ పాశురంలో తిరుకోష్ఠియూర్ లో ఉన్న వాక్ శుద్ధి గల శ్రీవైష్ణవులు తమ ఆచార్యులకు ప్రియమైన విషయాలు తప్ప మరొకటి మాట్లాడరు అని పెరియాళ్వార్ పేర్కొన్నారు.పాశురమునకు మామునులు వ్యాఖ్యానము చేస్తు  అనంతాళ్వాన్ కు  భట్టర్ మీద ఉన్న అభిమానమును ఈవిధంగా పేర్కొన్నారు.

అనంతాళ్వాన్ అంతిమ సమయంలో భట్టర్ కు ప్రియమైన శ్రీవైష్ణవులతో ” ఏ నామము భట్టర్ కు  ప్రియమైనది” అని అడిగారు. దానికి వారు ” అళిగియ మణవాళన్” అని చెప్పగా విని ” భర్త పేరును భార్య చెప్పడము శాస్త్ర సమ్మతము కానప్పటికిని  భట్టర్ కు ప్రియమైన నామము కదా! అదే చెప్పుకుంటాను” అని  “” అళిగియ మణవాళన్” అనుంటూనే పరమపదించారు.

పూర్వాచార్యులు పేర్కొన్న అనంతాళ్వాన్ శ్రీసూక్తులను  కొన్నింటిని చూద్దాము.

నాచ్చియార్ తిరుమొజి 7.2 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం

ఈ పాశురములో ఆండాళ్ పాంచజన్యము యొక్క  వైభవమును ఈ విధంగా తెలిపినది. పుట్టింది సముద్రములో , నివాసం శ్రీమన్నారాయణుని శ్రీ హస్త కమలముల్లో . సందర్భముగా పెరియవాచ్చాన్ పిళ్ళై – అనంతాళ్వాన్  మరియు నంజీయర్ మధ్య జరిగిన ఒక సంఘటనను చెప్పారు. వేదాంతి (పూర్వాశ్రమములో నంజీయర్  కు వేదాంతి అని పేరు)

భట్టర్ చేత సంస్కరించబడిన తర్వాత  తన సంపదను మూడు భాగములుగా చేసి తన భార్యలిద్దరికి చెరొక్కటి ఇచ్చి మూడవది తమ ఆచార్యులకు సమర్పించారు. సన్యసించి ఆచార్య కైంకర్యము చేసుకోవడానికి శ్రీరంగమును చేరుకొన్నారు. ఈ విషయం తెలిసి న  అనంతాళ్వాన్ ” మీరు గృహస్థాశ్రమమును కొనసాగించి  ఉండవలసినది.  అక్కడే ఉంటు  ఆధ్యాత్మిక విషయములను  అర్థం చేసుకుంటు, ఆచార్య భాగవత కైంకర్యము చేసి ఉండ వలసినది.  ఎందుకు సన్యాసాశ్రమమును స్వీకరించారు?” అక్కడ ఉన్న ఇతర శ్రీవైష్ణవులు ‘అలా ఎందుకు చెపుతున్నారు’ అని అడిగారు.  “భాగవతుడైన వాడు  తిరుమంత్రములో పుట్టి ద్వయంంత్రములో పెరగాలి” అన్నారు అనంతాళ్వాన్.

నాచ్చియార్ తిరుమొజి 12.5 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం

ఈ పాశురములో గోపగోపికలు శ్రీకృష్ణుడు కాళీయుడు మీద కెక్కి నాట్యము చేస్తున్నాడని వినగానే స్పృహ తప్పి పడిపోయారని ఆండాళ్ పాడారు. ఒకసారి  అనంతాళ్వాన్ శ్రీగుహదాసర్  తో కలసి ఎంపెరుమానార్  ను సేవించుకోవడానికి వెళుతున్నారు. శ్రీరంగం చేరుకోగానే కొందరు ఏకాంగులు శిరోముండనం చేసుకొని కావేరి నుండి వస్తూ  కనపడ్డారు. వారిని చూసి విషయమేమని విచారించగా,   ఎంపెరుమానార్   పరమపదించారని చెప్పారు. ఇది విన్న నంబిగుహదాసర్ పక్కన ఉన్న చెట్టెక్కి దూకి చనిపోవాలనుకున్నారు. అది చూసిన అనంతాళ్వాన్ “ ఎంపెరుమానార్   పరమపదించారని తెలియగానే పోని ప్రాణము చెట్టెక్కి దూకితే పోతుందా, కాళ్ళు చేతులు విరుగుతాయి అంతే” అని అన్నారు.

* పెరుమాళ్ తిరుమొళి 4.10- పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం- ఈ పాశురములో కులశేఖరాళ్వార్   తిరుమల పై ప్రీతిని ప్రకటించుకున్నారు. తిరుమల మీద ఏదో ఒక వస్తువుగా పడి ఉన్న చాలని తలచారు.

అదే అనంతాళ్వాన్ వేంకటేశుని  దగ్గరనైన ఉండటానికి అభ్యంతరం లేదన్నారు. అదే తిరుమల తో వారికున్న సంబంధము.

*పెరుమాళ్ తిరుమొళి 4.10- పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం – ఈ పదిగములో తిరుమంగైఆళ్వార్  పరకాల నాయకిగా  తిరువేంగడం  గురించి  తపించి ” వేంగడమే వేంగడమే ” అని ఆ దివ్యదేశము మీది ప్రీతిని చాటుకున్నారు. భట్టర్ శ్రీరంగనాథుని  ” అళిగియ మణవాళన్ ” అన్నట్లుగా ,అనంతాళ్వాన్ శ్రీనివాసున్ని ” తిరువేంగడముడయాన్” అని పిలిచారు అని నంజీయర్ అన్నారు.

*తిరువాయ్ మొళి 6.7.1 నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానమున  – ఈ పదిగంలో నమ్మాళ్వార్ , వైత్తమానిధి ఎంపెరుమాన్ మీద , తిరుక్కోళూర్ దివ్యదేశము మీద  తమ ప్రీతిని చాటుకున్నారు. నంపిళ్ళై , అనంతాళ్వాన్ దివ్యదేశవాసము గురించి చెప్పిన ఒక సంఘటనను వివరించారు.

చోళ కులాంతకం అనే ఊరిలో  శ్రీవైష్ణవులొకరు వ్యవసాయం చేస్తు  కనబడగా, వారి స్వస్థలమేదని అడిగారు అనంతాళ్వాన్ . దానికి  వారు ” మాది తిరుక్కోళూర్, అక్కడ ఉపాధి దొరకనందున  ఇక్కడకు రావల్సి వచ్చినదని” బదులు చెబుతారు దివ్యదేశవాసము వదలుకొని ఇక్కడ రావటం కన్నా ఎంపెరుమానార్, మరియు  నమ్మాళ్వార్ కు ఎంతో ఇష్ఠమైన తిరుక్కోళూర్ లో నివాసముతో వారికి కైంకర్యము చేస్తు జీవించడానికి గాడిదలము పెంచుకొని సంపాదించవచ్చు” అని  అనంతాళ్వాన్ అన్నారు. దీని వలన  దివ్యదేశవాస శ్రీవైష్ణవ  కైంకర్యము ఎంత ముఖ్యమైనదో అర్థమవుతుంది.

* తిరువాయ్ మొళి 6.7.1 నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానమున  – ఈ పదిగంలో నమ్మాళ్వార్ , పరాంకుశనాయకిగా పెరుమాళ్ కు ఒక పక్షిద్వారా సందేశమును పంపుతుంది.  ఈ సందేశమును పెరుమాళ్  కు విన్నవిస్తే నీకు ఈ లోకము, పరమపదము ఇస్తానని  వాగ్ధానం   చేశారు. ( ఈమె పెరుమాళ్ కు నాయకి కావున ఆయన సొత్తు అంతా ఈమెదే)అంతా పక్షికే ఇస్తే వీరు  ఎక్కడ ఉంటారని ఒకరికి సందేశము వచ్చినది” ఆ పక్షి చూపిన చోటే ఉంటారు” అని అనంతాళ్వాన్ అందముగా అన్నారు.

*తిరువాయ్ మొళి 6.8.1 నంపిళ్ళైడు వ్యాఖ్యానమున  – ఈ పాశురంలో నమ్మాళ్వార్ , పెరుమాళ్ ను ” ఎన్ తిరుమగళ్ శేర్ మార్బన్” అన్నారు(శ్రీ మహా లక్ష్మి నివస స్థానము)

అనంతాళ్వాన్ తమ కూతిరికి ” ఎన్ తిరుమగళ్” అని పేరు పెట్టుకొని  పవిత్రమైన మాతల మీద తన ప్రేమను చాటుకున్నారు.

*వార్తామాలై-345- భట్టర్ ఒకసారి తన  శిష్యులలో ఒకరిని శ్రీవైష్ణవుల లక్షణాలను తెలుసుకొనుటకు అనంతాళ్వాన్  వద్దకు పంపించారు. వీరు వెళ్ళే  సమయానికి   అనంతాళ్వాన్  తిరుమాళిగలో తదీయారాధన జరుగుతుంది. పంక్తిలో కూర్చోగానే మరొక  శ్రీవైష్ణవుల కోసం వీరిని లేపారు. ప్రతి పంక్తిలోను అలాగే జరిగింది.  ఆఖరికి   అనంతాళ్వాన్  తో కూర్చొని ప్రసదమును స్వీకరించారు వారు. అప్పుడు   అనంతాళ్వాన్  ఆ శ్రీవైష్ణవుల గురించి వివరములను అడిగారు. తాము భట్టర్ శిష్యులమని ,  శ్రీవైష్ణవుల లక్షణాలను తెలుసుకొనుటకు భట్టర్ తమ వద్దకు పంపిచారని చెప్పారు.

దానికి అనంతాళ్వాన్  ” కొక్కై పోలిలే, కోలియై పోలిలే , ఉప్పై పోలిలే, ఉమ్మైపోలిలే ఇరుక్కు వేండం” అని చెప్పారు. అంటే కొంగ లాగ అవకాశం వచ్చే వరకు ఆగడం, కోడి లాగా సారతమమైన పదార్థాలను  మాత్రమే తీసుకోవడం, ఉప్పు లాగా తన ఉనికిని చాట కుండా అన్నింటా ఉండాలి” అని చెప్పారు. ఆఖరికి మాలాగా అన్నారే దాని అర్థం ఏమిటని అడిగారు, ” ప్రతిపంక్తిలోను కూర్చున్న మిమ్ములను  లేపినా మీరు కోపగించుకోక ఓపికగా ఉన్నారు. ఇలాగే శ్రీవైష్ణవులకు ఓపిక ఉండాలి” అని చెప్పారు.

తిరువేంకటాద్రీశుని కృప  అనంతాళ్వాన్ పైన ఈనాటికి అపారముగా ఉన్నది. వారి వీరి అవతారోత్సవమైన మేష మాసములో చిత్తా నక్షత్రం నాడు,  వారి పరమపదోత్సవమైన కర్కాటక మాసం పూర్వఫల్గుణి  నక్షత్రం నాడు  తిరువేంకటాద్రీశుడు  అనంతాళ్వాన్ తోటకు విచ్చేసి తన శేషమాలను,  శ్రీశఠగోపమును అనుగ్రహించే సాంప్రదాయం ఇప్పటికిని కొనసాగుతున్నది

ananthazwan-magilatree

 

ఈ వ్యాసములో  అనంతాళ్వాన్ వైభవము  కొంతవరకు మాత్రమే  తెలుకున్నాము. మన మీద వారి అపార కృపాకటాక్షములు సదా ప్రసరించాలని ప్రార్థన చేద్దాం.

ananthazhwan-thirumalai

అనంతాళ్వాన్  తనియన్:

అఖిలాత్మ గుణవాసం అఙ్ఞాన తిమిరాపహం|
ఆశ్రితానాం సుశరణం వందే అనంతార్య దేశికమ్||

అడియేన్ చక్రవర్తుల చూడామణి రామానుజ దాసి

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source: http://guruparamparai.wordpress.com/2013/03/31/ananthazhwan/

శ్రీ శ్రుతప్రకాశికభట్టర్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమత్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

అవతార స్థలము~:శ్రీరంగము

ఆచార్యులు~: వేదవ్యాసభట్టర్, నడాదూర్ అమ్మాళ్

శ్రీ సూక్తులు: శ్రుతప్రకాశిక, శ్రుతప్రదీపక, వేదార్ధసంగ్రహము వ్యాఖ్యానము(తాత్పర్యదీపిక), శరణాగతిగద్యము మరియు సుబాలోపనిషత్తులకు వ్యాఖ్యానము, శుకపక్షీయము.

శ్రీపరాశరభట్టర్ పుత్రులు శ్రీవేదవ్యాసభట్టర్ పౌత్రులుగా అవతరించిన శ్రీశ్రుతప్రకాశికభట్టర్ శ్రీవైష్ణవసాంప్రదాయములో సుప్రసిద్ధ ఆచార్యపురుషులు. శ్రీభాష్యమునకు శ్రుతప్రకాశిక మరియు శ్రుతప్రదీపకలను మిక్కిలి ప్రశస్తములు, గహనములు అగు వ్యాఖ్యానములు చేశారు. ఈ వ్యాఖ్యానముల నామకరణముద్వారా తాము ఎంపెరుమానార్ నుంచి నడాదూర్ అమ్మాళ్ వరకు ముఖతః శ్రోత్రపరంపరగా వచ్చిన సూత్రములనే గ్రంథీకరించామని తెలియజేశారు.

శ్రుతప్రకాశికభట్టర్ శ్రీభాష్యమును నడాదూర్ అమ్మాళ్ వద్ద అధ్యయనము చేశారు. భట్టర్ ప్రజ్ఞను, సునిశితబుద్దిని గమనించిన అమ్మాళ్, భట్టర్ వచ్చిన తరువాతనే కాలక్షేపము ప్రారంభము చేసేవారు.  విషయమును గ్రహించిన కొందరు శిష్యులు అమ్మాళ్, భట్టర్ వారి వంశప్రాశశ్త్యమువలననే వారిని ఎక్కువగా ఆదరించుచున్నారని ఆరోపించారు. అమ్మాళ్ వారందరకు భట్టర్ వారి ప్రజ్ఞాపాటవములు తెలియజేయుటకు, ఒకసారి అధ్యాపనమును అకస్మాత్తుగా ఆపి, క్రితం రోజు తాము అదే విషయము గురించి చేసిన వివరణమును ప్రశ్నించిరి. అప్పుడు భట్టర్ అందరును ఆశ్చర్యచకితులు అగునట్లు, వినినది వినినట్టు సమాధానము ఇచ్చారు. అప్పుడు అమ్మాళ్ శిష్యులకు భట్టర్ ప్రజ్ఞాపాటవము అవగతము అయినది.

నంపిళ్ళై మరియు పెరియవాచ్ఛాన్పిళ్ళై మొదలగు వారు దివ్యప్రబంధమునకు వ్యాఖ్యానములు రచించి, ఆళ్వార్ల భావపరంపరలను శాశ్వతముగా విస్తరింపచేసినట్లు, శ్రుతప్రకాశికభట్టర్ శ్రీభాష్యము, వేదార్ధసంగ్రహము మొడలగు వ్యాఖ్యానములు రచించి సంస్కృతవేదాంతమును విస్తరింపచేసిరి.

గొప్ప జ్ఞాని మరియు నడాదూర్ అమ్మాళ్ ప్రియశిష్యులు అయిన శ్రీశ్రుతప్రకాశికభట్టర్ యొక్క జీవితమునుండి కొన్ని ముఖ్యమైన ఘట్టములను దర్శించాము. వారి పాదకమలములను ఆశ్రయించి, వారి భాగవతనిష్ఠలో కొంత అయినా పొందెదము. 

శ్రుతప్రకాశికభట్టర్ తనియన్

యతీంద్ర కృత భాష్యార్ధా యద్ వ్యాక్యానేన దర్శితాః
వరమ్ సుదర్శనార్యమ్ తమ్ వన్దే కూర కులాధిపమ్

అడియేన్ అనంతరామ రామానుజదాసుడు

 archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source: http://guruparamparai.wordpress.com/2013/04/16/srutha-prakasika-bhattar/

నడాదూర్ అమ్మాళ్

   శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వవరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

engaLazhwan

                       ఎంగలాళ్వాన్ శ్రీచరణములలో నడాదూర్ అమ్మాళ్

తిరునక్షత్రము:  చైత్ర,  చిత్త

అవతార స్థలము:కాంచీపురం

ఆచార్యులు: ఎంగలాళ్వాన్

శిష్యులు: శ్రీ శ్రుతప్రకాశికభట్టర్  (సుదర్శన సూరి), శ్రీ కిడాంబి అప్పుళ్ళార్ మొదలగువారు

పరమపదము చేరిన ప్రదేశము: కాంచీపురం

శ్రీ సూక్తులు: తత్త్వసారము, పరత్వాది పంచకము (లఘువివరణము – http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-parathvadhi.html), గజేంద్రమోక్ష శ్లోకద్వయము, పరమార్ద శ్లోక ద్వయము, ప్రపన్న పారిజాతము, చరమోపాయసంగ్రహము, శ్రీభాష్య ఉపన్యాసము, ప్రమేయ మాలై మొదలగునవి.

కాంచీపురంలో అవతరించిన వీరి నామధేయము వరదరాజన్. ఎమ్పెరుమానార్ స్థాపించిన శ్రీభాష్య సింహాసనాధిపతులలో ఒకరు అయిన నడాదూర్ ఆళ్వాన్ మునిమనుమలు.

ఎంగళాల్వాన్  కాంచీపురమ్ దేవపెరుమాళ్కు క్షీరకైంకర్యము చేస్తూ ఉండేవారు.  క్షీరమును వేడి చేయడములో,  ఆ క్షీరమును దేవపెరుమళ్కు సమర్పించడములో, దేవపెరుమాళ్ పట్ల మాతృత్వభావము చూపెడివారు.  అందువలన  దేవపెరుమాళ్ వీరిని “అమ్మాళ్” మరియు “వాత్స్య వరదాచార్యులు” అని  ప్రేమతో సత్కరించారు.

ఎంగళాల్వాన్  శ్రీభాష్యము అధ్యాపనమునకు పితామహులు అయిన నడాదూర్ ఆళ్వాన్ ను ఆశ్రయించగా, వారు వయోభారముచేత ఎంగళాల్వాన్నుఅశ్రయించమనిరి. అమ్మాళ్ ఎంగళాల్వాన్ తిరుమాళిగను చేరి, ద్వారమును తట్టగా, ఎంగళాల్వాన్ “వచ్చినది ఎవరు” అని అడుగగా, అమ్మాళ్ “నేను వరదన్” అని సమాధానము ఇచ్చారు. అప్పుడు ఎంగళాల్వాన్  అమ్మాళ్ను ” ‘నేను’ అనేది  నశించిన తరువాత రమ్మ” ని అన్నారు. అమ్మాళ్ పితామహులను చేరి జరిగిన వృత్తాంతము తెలియజేయగా, వారు “నేను” అని స్వపరిచయము చేసుకొనుట అహంకారపూరితము కావున, “అడియేన్” అని వినమ్రముగా అహంకారరహితముగ చేయవలెను అని ఆదేశించిరి. అమ్మాళ్ మరల ఎంగళాల్వాన్ తిరుమాళిగను చేరి, ద్వారమును తట్టగా, వారు “వచ్చినది ఎవరు” అని అడుగగా, అమ్మాళ్ “అడియేన్ వరదన్ దాసన్” అని సమాధానము ఇచ్చిరి. ఈ సమాధానముతొ తృప్తి చెందిన ఎంగళాల్వాన్ , అమ్మాళ్ను స్వాగతించి, శిష్యునిగా స్వీకరించి, వారికి సాంప్రదాయరహస్యములను విశదీకరించిరి.  అమ్మాళ్ శ్రీవైష్ణవ సాంప్రదాయ విశిష్ఠులుగా ప్రసిద్ది చెందడముతో, వారి అచార్యులు అయిన  ఎంగళాల్వాన్  “అమ్మాళాచార్యులు” గా కొనియాడబడిరి.

అమ్మాళ్ శిష్యులలో అగ్రగణ్యులయిన శ్రుతప్రకాశికభట్టర్ (శ్రీవేదవ్యాసభట్టర్ మునిమనమలు), అమ్మాళ్ వద్ద శ్రీభాష్యము అధ్యయనము చేసి, శ్రీభాష్యమునకు శ్రుతప్రకాశిక అను వ్యాఖ్యానము మరియు వేదార్ధసంగ్రహము, శరణాగతిగద్యములకు వ్యాఖ్యానములు చేసిరి.

ఒకపరి అమ్మాళ్ శ్రీభాష్యప్రవచనము చేయుచుండగా, ఒక శిష్యుడు భక్తియోగమును ఆచరించుటలో క్లిష్ఠతను మనవి చేయగా, అమ్మాళ్ వారికి శరణాగతిని సూచించిరి. శిష్యులు శరణాగతి కూడ మిగుల కష్టసాధ్యమని మనవి చేయగా, అమ్మాళ్ వారితొ “ఉజ్జీవనమునకు రామానుజులవారి పాదకమలములనే శరణ్యముల”ని భావించవలెనని ఆదేశించిరి.

చరమోపాయ నిర్ణయములో మరి ఒక వృత్తాంతము తెలుపబడినది.

నడాదూర్ అమ్మాళ్ శిష్యులకు శ్రీభాష్యము ప్రవచించుచుండిరి. వారిలో కొందరు
“జీవులకు భక్తియోగమును ఆచరించుట దుస్సాధ్యము (ఎందువలననగా, భక్తియోగము ఆచరించగోరు జీవులకు పురుషులు మరియు త్ర్రైవర్ణికులు(బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు) అయి ఉండుట అను మొదలగు లక్షణములు ఉండవలెను) మరియు జీవాత్మకు ప్రపత్తి చేయుట స్వరూపవిరుధ్ధము (ఎందువలననగా, జీవుడు పరమాత్మకు దాసుడు, పరతంత్రుడు అయి ఉండటము వలన ఉజ్జీవనము కొరకు తానై ఏమి ఆచరించుటకు అధికారము లేకుండుట వలన), మరి జీవుడు ఉజ్జీవనము పొందుట ఎట్లూ?” అని ప్రశ్నించిరి. ఈ ప్రశ్నకు నడాదూర్ అమ్మాళ్ “అప్పుడు జీవునకు ఎంపెరుమానార్ అభిమానమునకు పాత్రము అయి ఉండుటయే చరమోపాయము. మరియొక ఉపాయము లేదు. ఇది నా ధృఢనిశ్చయము” అని పలికిరి.అమ్మాళ్ చరమసందేశము ప్రసిద్ధమైన శ్లోకరూపములో:

ప్రయాణకాలే చతురస్స్వశిష్యాన్ పదాస్తికస్తాన్ వరదోహి వీక్ష్య
భక్తి ప్రపత్తి యది దుష్కరేవః రామానుజార్యమ్ నమత్యేవధీత్

ఆమ్మాళ్ చివరి దినములలో వారి శిష్యులు తమకు ఏది శరణ్యము అని ప్రశ్నించగా వారు “భక్తి మరియు ప్రపత్తి మీ స్వరూపమునకు తగినవి కాదు. అందువలన మీరు ఎమ్పెరుమానర్లను ఆశ్రయించి, వారికే ఆధార్యము కలిగి ఉండినచో మీకు ఉజ్జీవనము కలుగును” అని సమాధానము ఇచ్చారు.

వార్తామాలైనందు అమ్మాళ్ గురించి కొన్ని ఐతిహ్యములు ప్రస్తావించబడినవి.

 • 118 – ఎంగళాల్వాన్ నడాదూర్ అమ్మాళ్కు చరమశ్లోకమును వివరించుచుండగా,  “సర్వధర్మాన్ పరిత్యజ్య” వద్ద అమ్మాళ్ పరమాత్మ శాస్త్రములందు కల ఇతర సకల ఉపాయములను త్యజించుమని ఏ విధముగా  అంత స్వాతంత్ర్యముతో  ఆదేశించుచున్నారు అని ఆశ్చర్యమును వ్యక్తము చేశారు. అప్పుడు ఎంగళాల్వాన్ “నిరంకుశస్వాతంత్ర్యము పరమాత్మకు స్వభావసిద్ధము కావున ఆ ఆదేశము శాస్త్రసమ్మతము. జీవులు పరమాత్మకు పరతంత్రులు కావటమువలన, వారు పరమాత్మ కంటె వేరగు ఉపాయములను ఆశ్రయించుట స్వరూపవిరుద్ధము కావున, పరమాత్మను మాత్రమే రక్షకముగా భావించవలెనను అదేశముతో జీవులను సంసారమునుండి ఉజ్జీవింపచేయుచున్నారు.  అందువలన పరమాత్మ ఆదేశము ఆయన స్వభావోచితము” అని పలికిరి.
 • 198 – ఒకపరి నడాదూర్ అమ్మాళ్ ఆలిపిళ్ళాన్ అను  (బహుశా అబ్రాహ్మణ లేక ఆచార్యపురుషత్వము లేని)  శ్రీవైష్ణవునితో ప్రసాదమును స్వీకరించుచుండగా చూసిన పెరుంగూర్పిళ్ళై ఆనందముతో ” నేను తమని  ఈ శ్రీవైష్ణవునితో కలసిమెలసి ఉండుట చూచియుండని యెడల వర్ణాశ్రమధర్మములు ఎల్లప్పుడూ పాటించవలెనననే సామాన్యధర్మము  యొక్క ముఖ్యభావము నాకు గోచరించెడిది కాదు” అని పలికిరి. అప్పుడు అమ్మాళ్  “యధార్ధముగా పూర్ణుడైన ఆచార్యసంబంధము కలిగిన అందరు వ్యక్తులు, సమస్త వస్తువులు మనకు సేవ్యములు/స్వీకార్యములు. అటులనే నేను ఈ గొప్ప శ్రీవైష్ణవునితో ప్రసాదస్వీకారమను  అనుష్ఠానము మన పూర్వాచార్యులు ఆదేశించిన విశేషమైన భాగవతధర్మములో భాగముగానే భావించవలయున”ని సెలవిచ్చిరి.

మనవాళమానులు తమ పిళ్ళైలోకాచార్యుల తత్త్వత్రయవ్యాఖ్యానము సూత్రము 35 లో (http://ponnadi.blogspot.in/p/thathva-thrayam.html), జీవస్వాతంత్ర్యమును (జీవాత్మకు పరమాత్మచే ప్రసాదించబడినది) అనగా, కర్మాచరణములో జీవుని ప్రథమప్రయత్నము, పిమ్మట ఆ కర్మాచరణలో పరమాత్మ యొక్క సహాయసహకారములను స్పష్ఠపరచుటకై, నడాదూర్ అమ్మాళ్ యొక్క తత్త్వసారమునుంచి ఒక అద్భుతమైన శ్లోకమును ఉదహరించిరి.

పరమోత్కృష్ఠజ్ఞానమును కలిగినవారు, ఎంగళాల్వాన్లకు మిక్కిలి ప్రియతములు అయిన నడాదూర్ అమ్మాళ్ యొక్క జీవితమునుండి కొన్ని ముఖ్యమైన ఘట్టములను దర్శించాము. వారి పాదకమలములను ఆశ్రయించి, వారి భాగవతనిష్ఠలో కొంత అయినా పొందెదము. 

నడాదూర్ అమ్మాళ్ తనియన్:

వందేహమ్ వరదార్యమ్ తమ్ వత్సాభిజనభూషణమ్
భాష్యామృత ప్రధానాఢ్య సంజీవయతి మామపి

అడియేన్ అనంతరామ రామానుజదాసుడు

Source: http://guruparamparai.wordpress.com/2013/04/05/nadathur-ammal/

తిరువరంగత్తు అముదనార్

తిరువరంగత్తు అముదనార్

(శ్రీరంగామృత కవి)

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

Thiruvarangathu-Amudhanar

తిరువరంగత్తు అముదనార్

తిరునక్షత్రము: ఫాల్గుణ(ఫంగుణి) హస్తా నక్షత్రం

అవతార స్థలము: శ్రీరంగం

ఆచార్యులు:కూరత్తాళ్వాన్

పరమపదము చేరిన ప్రదేశము: శ్రీరంగం

తిరువరంగత్తుఅముదనార్  పూర్వము పెరియకోయిల్ నంబిగా వ్యవరించబడెడి వారు. వీరు శ్రీరంగమున అధికార ప్రతినిధిగా  మరియు పురోహితులుగా(వేదపురాణ విన్నపము చదివెడివారు) ఉండెడి వారు. ప్రథమంగా వీరు శ్రీరంగ ఆలయములోని కార్యకలాపాలను సంస్కరించే  ఎంపెరుమానార్ (శ్రీరామానుజులు)  పై   ప్రతికూలంగా ఉండెడివారు. కాని  శ్రీమన్నారాయణుని దివ్యకటాక్షముతో అంతిమంగా ఎంపెరుమానార్ తో బాంధవ్యం ఏర్పడి  వారి కృప కు పాత్రులయ్యారు .

ఎప్పుడైతే ఎంపెరుమానార్ , పెరియపెరుమాళ్ చే ఉడయవర్(విభూతిద్వయనాయకులు)గా ప్రకటింపబడి ఆలయ సంస్కరణలను ఉత్తమ మార్గములో చేయదలచిరో పెరియకోయిల్ నంబి వీరిని అంత సులువుగా అంగీకరించలేదు. ఎంపెరుమానార్ చాలా విసుగుచెంది మొదట వీరిని పదవి నుండి తీసివేయాలని నిర్ణయించుకున్నారు. కాని ఓ రోజు ఎంపెరుమానార్, పెరియపెరుమాళ్ తిరువీధి/పురప్పాడు గురించి ఎదురుచూస్తునప్పుడు, స్వామి  వీరి స్వప్ననమున  సాక్షాత్కరించి పెరియకోయిల్ నంబి తనకు చాలా కాలము నుండి సేవచేస్తున్న ఆప్తుడి గా సూచించారు.

ఎంపెరుమానార్ , పెరియకోయిల్ నంబిని ఉద్ధరించడానికి మరియు మార్గనిర్ధేశం చేయడానికి,  తాను చేయు సంస్కరణలకు తగ్గట్టుగా తయారుకావడానికి కూరత్తాళ్వాన్ ను నియమించారు. ఆళ్వాన్ వారిని ప్రభావశీలురుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అయితే  పెరియకోయిల్ నంబి తాను ఎంపెరుమానార్ కు శిష్యులు కావాలని ఆశించారు. కాని  పెరియకోయిల్ నంబిని, తనను ఉద్ధరించిన కూరత్తళ్వాన్  ను ఆచార్యులుగా స్వీకరించవలసినదని ఎంపెరుమానార్ సూచించారు. పెరియకోయిల్ నంబి తన సాంప్రదాయ సామర్ధ్యముతో తమిళభాషలో రాసిన అమృతము వంటి పద్యముల వలన ఎంపెరుమానార్  చే ‘అముదనార్’ అనే నామంతో వ్యవహరింపబడ్డారు. క్రమంగా అముదనార్  ఆళ్వాన్ మరియు ఎంపెరుమానార్ల తో  తమ బాంధవ్యమును పెంచుకున్నారు.

అముదనార్ పెరియకోయిల్ అధికార నియంత్రణను ఎంపెరుమానార్ కు  అప్పగించుట

అముదనార్ తల్లిగారు పరమపదించినప్పుడు 11వ రోజున జరుగు ఏకోధిష్ఠమున, మరణించిన వ్యక్తి శరీరమును ఒకరి యందు భావించి వారికి విశేషముగ ఆతిథ్యమును ఇవ్వవలసి ఉండును.   చివరన  ఆ ఆతిథ్యము స్వీకరించిన వారిని ఆతిథ్యము ఇచ్చిన వారు ‘మీరు సంతృప్తులయ్యారా’ అని అడగాలి. స్వీకరించినవారు పూర్తిగా ‘సంతృప్తులమయ్యాము’ అంటేనే ఆ కార్యము సఫలవుతుంది. దీనిలో విశేషమేమనగా ఎవరైతే ఈ ఆతిథ్యమును ఇస్తారో వారు ఒక సంవత్సరము వరకు ఆలయ కైంకర్యమును చేయరాదనే నియమం  ఉండెడిది ఆరోజుల్లో. అముదనార్ ఈ కార్యానికై ఉన్నత లక్షణాలు గల  శ్రీవైష్ణవుడు కావాలని  ఎంపెరుమానార్ ఆశ్రయిస్తారు.  ఆళ్వాన్ ను వెళ్లవలసినదిగా ఎంపెరుమానార్ నియమించగా ఆళ్వాన్ సంతోషముతో అంగీకరిస్తారు. ఆ ఆతిథ్యకార్యము ముగియగా అముదనార్ , ఆళ్వాన్ ను సంతృప్తులయ్యారా అని అడుగగా వారు ఆలయ నియంత్రణను ఎంపెరుమానార్ కు అప్పగిస్తే తాము సంతృప్తులము అవతామన్నారు. దీనికి అంగీకరించిన అముదనార్ తమ మాటను నిలబెట్టుకొనుటకై ఆలయ తాళం చెవులను  మరియు నియంత్రణను ఆళ్వాన్ ద్వారా ఎంపెరుమానార్ కు అప్పగించారు.   కాలక్రమేణ అముదనార్ తమ పౌరోహిత్యమును కూడా ఆళ్వాన్(ఇప్పటికి శ్రీరంగమున మనం ఆళ్వాన్ యొక్క వారసులు కైంకర్యమును  చేయుటను సేవించవచ్చు) కు ఇచ్చివేసారు. అధికారం ఇచ్చినప్పటి నుండి అముదనార్ రానురాను ఆలయ కైంకర్యమునకు దూరమయ్యారు. ఎంపెరుమానార్ ఒకపరి తిరువరంగపెరుమాళ్ అరైయర్ దగ్గరకు వెళ్ళి ‘ఇయఱ్పా; గాన అధికారమును  తమకు ఇవ్వవలసినదని ప్రార్థించారు. వారు దీనికి ఆమోదించి  ఆ గానాధికారాన్ని ఎంపెరుమానార్ కి ఇచ్చారు. ఎంపెరుమానార్ ఈ ‘ఇయఱ్పా’ ను అముదనార్ కు అధికరింపచేసి నిత్యము శ్రీరంగనాథుని కైంకర్యమున దీనిని ఆలపించ వలసిన నిత్య కైంకర్యమును వారికి ఏర్పరిచారు.

శ్రీరామానుజనూర్ట్రందాది అవతారము మరియు వైభవం

serthi-amudhanar-azhwan-emperumanar

శ్రీరంగనాయకి సమేత నంపెరుమాళ్, అముదనార్, కూరత్తాళ్వాన్, ఎంపెరుమానార్

 కొంతకాలం తర్వాత అముదనార్ ఎంపెరుమానార్ పైన  ‘రామానుజ నూర్ట్రందాది’ ని (108పాశురములు) రాసి ఎంపెరుమాన్ మరియు ఎంపెరుమానార్ సన్నిధిన ఉంచారు. నంపెరుమాళ్ ఒకసారి తన బ్రహ్మోత్సవ చివరి రోజున ఎంపెరుమానార్ ను ఇక తమ ఊరేగింపు గోష్ఠిలో పాల్గొనరాదని  మరియు శ్రీవైష్ణవులకు  రామానుజ నూర్ట్రందాది ని ఊరేగింపు గోష్ఠిలో  సేవించవలెనని, అది కాలక్రమేణ ప్రతి పురప్పాడులో ఇక నిత్య కృత్యము అవ్వాలని నిర్ణయించారు.

ఎంపెరుమాన్ యొక్క అభీష్ఠమున ఎరిగిన ఎంపెరుమానార్ , అముదనార్  యొక్క ఈ గొప్పకార్యమును  గ్రహించి , ముదలాయిరమ్ నకు ఎలాగైతే మధురకవిఆళ్వార్ కూర్చిన (నమ్మాళ్వార్ వైభవమును సూచించు) కణ్ణినుణ్ శిరుత్తాంబు అంతిమంగా(శాత్తుమరై) ఉండునో    అలాగే ఇయఱ్పా కు ఈ రామానుజ నూర్ట్రందాది  కూడ ఉండాలని నియమనం చేసారు.

ఈ ప్రబంధం  ప్రపన్నగాయత్రిగా ప్రసిద్ధి పొందినది, అలాగే ఎంపెరుమానార్  అందరి శ్రీవైష్ణవులకు ప్రతి రోజు ఒక్కసారైన గాయత్రిజపం తో సమానంగా బ్రహ్మోపదేశం(ఉపనయనవీతులు)పొందిన వారందరు తప్పని సరిగ్గా  దీనిని అనుసంధించాలని నియమనం చేసారు.

రామానుజ నూర్ట్రందాది లో ఎంపెరుమానార్  యొక్క దివ్యనామము ప్రతిపాశురంలో పొందుపరచబడింది. కావుననే దీనికి రామానుజ నూర్ట్రందాది అనే నామము స్థిరమైనది.ఇది  ఆచార్య అభిమాన నిష్ఠులకు (ఆచార్యుల దయకు   పాత్రులైనవారు) అన్నింటిని సమకూర్చునది. మరియు ఈ ప్రబంధం ఎవరైతే  ఆచార్యునిపై దృష్ఠిని నిలుపుతారో వారికి ఇక ఏ స్వప్రయత్నము చేయడం  అవసరమే లేకుండ భగవత్ సంబంధముకూడ ఏర్పడును. అందుకే మన పూర్వాచార్యులందరు మనం నిత్యము శ్రీరామానుజుల దివ్య పాదారవిందములపై పూర్తిగా ఆధారపడాలని సూచించారు.

శ్రీవైష్ణవ పండితుల్లో  నాయకుడైన  నాడాదూర్ అమ్మాళ్ అనే వారు దివ్య ప్రబంధమగు రామానుజ నూర్ట్రందాది లో  45వ పాశురమగు ‘పేరొన్ఱు మత్తిల్లై’  మరియు  ‘నిన్ఱవణ్ కీర్తియుం’  అను 76 వ పాశురం ఆధారంగా   ఎంపెరుమానార్ మనకు లక్ష్యం మరియు దానిని చేరుటకు సాధనం కూడా అని కృపచేసారు.

 పెరియవాచ్చాన్ పిళ్ళై తిరుక్కుమారులగు నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై అను వారు  తమ కృతమగు చరమోపాయనిష్ఠ (http://ponnadi.blogspot.in/p/charamopaya-nirnayam.html) అను  గ్రంథమున ఎంపెరుమానార్  వైభవమును తెలుపుటకు రామానుజ నూర్ట్రందాది ని  విస్తృతంగా ఉపయోగించారు.

మామునులు  రామానుజనూర్ట్రందాది పై  సంక్షేపముగా   సుందరమగు ఒక వ్యాఖ్యానాన్ని రచించారు. పరిచయ భాగంలో అముదనార్ మరియు రామానుజనూర్ట్రందాది వైభవమును తెలిపిరి. ఆ అమృత రుచిని ఇప్పుడు మనం ఆస్వాదిస్తాము.

తిరుమంత్రం మరియు ఆళ్వారు పాశుర సారము  చరమ పర్వనిష్ఠ(సర్వం ఆచార్యులపై ఆధారపడి ఉండుట). ఇది నమ్మాళ్వార్ విషయమున మధురకవి ఆళ్వార్ వెల్లడించిరి. మధురకవిఆళ్వార్ వలె అముదనార్ కూడ సర్వం ఎంపెరుమానార్  మీద ఆధారపడ్డారు మరియు తమ ప్రబంధములో నిరూపించారు కూడ.

అముదనార్  ఆళ్వాన్ యొక్క అలుపెరుగని మరియు అపార కరుణా ప్రయత్నముతో మరియు   ఎంపెరుమానార్  దివ్యకృపచే సంస్కరించబడ్డారు. ఎలాగైతే మధురకవిఆళ్వార్ తమ 10 పాశురములలోని తమ నిష్ఠతో వెల్లడింపబడ్డారో, అముదనార్  తమ 108 పాశురములో ఆచార్య నిష్ఠను ఈ జగత్తులో    ప్రతివారు ఉజ్జీవించి లాభపడుటకు మరియు ఆచార్య నిష్ఠులకు చాల ప్రధాన సూత్రముగా ఆచార్య నిష్ఠను  బహిర్గతం చేసారు. మామునులు కూడ దీనిని ఉపవీతులకు(ఉపనయన సంస్కారవంతులకు) ప్రధానమగు గాయత్రి మంత్రము వలె ప్రతి శ్రీవైష్ణవ ప్రపన్నుడికి అత్యంత ప్రధానమైనదని,  దీనిని ప్రపన్నగాయత్రిగా వ్యవహరించి  ప్రతిదినం శ్రీవైష్ణవుని చే పఠింపబడాలి అని వెల్లడించారు..

అముదనార్ ప్రావీణ్యత

అముదనార్ తమిళం మరియు సంస్కృతములలో నిష్ణాతులు. ఇది అతనికి అరుళిచ్చెయళ్ లో చాలా పాశురములకు సుందరమగు అర్థాలను తెలుపుటకు తోడ్పడింది.

ఇక్కడ దానికి ఉదాహరణలను సేవిద్దాం:

తిరువిరుత్తం 72వ పాశురమున, నంపిళ్ళై గారు అముదనార్ యొక్క కథన్నాన్నిఅందంగా వర్ణిస్తారు. ఈ పాశురమున నమ్మాళ్వార్ ,  పరాంకుశ నాయికా అవస్థ(స్థితి) భావనలో ఉన్నప్పుడు  గాఢాంధ రాత్రిన ఎంపెరుమాన్ తో వియోగం కలిగినప్పుడు  ఆ భావనను ఆందోళనగా  అనుభవిస్తారు.  సాధారణంగా లోకమున ప్రేయసి ప్రియులు వియోగ దుఃఖాన్ని ఎక్కువగా రాత్రి సమయాన అనుభవిస్తారు.  ఆ సమాయాన సన్నని  చంద్రవంక  దర్శనం వలన చీకటి కొంత తగ్గును. సాధారణంగా ఈ చల్లని నెలవంకను చూసి ప్రేమికుల సమూహం ఆనందాన్ని అనుభవిస్తారు, కాని వియోగమున ఇది బాధాకరం. పరాకుంశనాయకి  ఈ  నెలవంక చల్లదనం వల్ల  ఎంపెరుమాన్ విషయాన తన మానసిక స్థితిని  అసలు నియంత్రించుకోలేక పోయినది . ఈ విషయాన్ని అముదనార్ ఉపమానంతో  చాలా చక్కగా వర్ణించారు. ఒకసారి భయస్థుడగు ఒక బ్రాహ్మణుడు రాత్రి సమయాన అడవి గుండా ప్రాయాణిస్తున్నాడు. ఆ సమయాన ఒక అడవి మృగం అతన్ని వేటాడగా దాన్నుండి తప్పించుకొని ఎలాగో ఒక చెట్టుపైన ఎక్కాడు. ఆ మృగం  ఈ బ్రాహ్మణుడు దిగగానే  ఆరగిస్తామని క్రింద ఎదురుచూడ సాగింది. ఆ బ్రాహ్మణుడు చాలా భయపడసాగాడు . ఆ సమయాన్నే ఒక పులి ఆ వైపుగా వచ్చి ఆ అడవి మృగాన్ని చంపి తినివేసి  ఈ బ్రాహ్మణుడు దిగగానే  ఆరగిస్తామని క్రింద ఎదురుచూడ సాగింది. ఆ బ్రాహ్మణుడు క్రితము కన్నాఇంకా ఎక్కువగా భయపడసాగాడు పులి తినునేమో అని. అదే విధంగా ఈ పరాంకుశనాయకి  అసలు ఆదిలోనే చీకటికి భయపడ సాగింది ఆపై నెలవంక చల్లదనం – ఇలా అభివర్ణించారు అముదనార్.

భట్టర్ మరియు అముదనార్

                   భట్టర్ తాను ఆళ్వాన్ కుమారుడని అహంభావించేవారు.  తాను స్వయంగా తమ సహస్రనామ భాష్యములో ఎంపెమానార్ తో గొప్ప సంబంధము గల ఆళ్వాన్ కు తాము జన్మించామని చెప్పుకున్నారు. అముదనార్ కూడ ఆళ్వాన్ తో సంబంధమును తమ రామానుజనూర్ట్రందాది  లో 7వ పాశురాన చెప్పుకున్నారు.

ఒకసారి అముదనార్  అత్యంత పారవశ్యంతో వేరొక శ్రీవైష్ణవుడితో భట్టర్ కు ఇలా కబురు  పంపారు “ మీకు కేవలం ఆళ్వాన్ తో  శారీరక సంబంధము మాత్రమే,  కాని మాకు వారితో ఙ్ఞాన సంబంధము” అని.  భట్టర్ దానికి ప్రతిసమాధానంగా “ అది సరే ! కాని మీరు అలా ఆత్మస్తుతి చేసుకోరాదు కదా” అనిరి.

                   ఆళ్వాన్ తో సంబంధము చాల విశేషమైనదని కావుననే  అది అముదనార్ గర్వమునకు దారితీసినది- అని  దీనిలోని వైభవ విషయములో మన పూర్వాచార్యుల అభిమతం. కాని వారు ఈ చర్చల సమస్యలను అంతగా ఇతరులు నొచ్చుకోకుండా ఉండేలా చూసారు. ఆ విషయం ఒక ఉదార మార్గమున  పరిష్కరించారు,  ఇలాంటి సంఘటన మనం అర్థము చేసుకుంటామని.  మనం మన పూర్వాచార్యుల నిజాయితీని గొప్పగా అభినందించాలి, ఎందుకనగా ఇలాంటి సంఘటనలను కూడ వారు చాప క్రింద(సాధారణముగా పరిష్కరించలేనిది) దాయకుండా బహిర్గతం  చేసారు.

చివరగా మామునులు, తమ  ఆర్తిప్రబంధములోని 40వ పాశురాన   – ఈ సంసార సాగరములో మునగ కుండ తప్పించునది అదేనని  గుర్తించారు. మనం ఎంపెరుమానార్ దివ్య పాదార విందముల యందు సదా ఆధీనులమై ఉండాలి, శ్రీరామానుజుల  ప్రియ భక్తులతో కాలం గడపాలి. కబురు రామానుజనూర్ట్రందాదిని సదా పఠనం/ధ్యానం చేయాలి.

మనం కొంత మాత్రమే  తిరువరంగత్తు అముదనార్ వైభవమును అనుభవించాము. వారు  పూర్తిగా భాగవత నిష్ఠలో ఉండి సదా ఎంపెరుమానార్ కు మరియు ఆళ్వాన్ కు అత్యంత ప్రియతములై ఉండిరి. మనం కూడ వారి  భాగవత నిష్ఠలో కొత నైన రావాలని వారి శ్రీపాదాలను ప్రార్థిస్తాము.

తిరువరంగత్త అముదనార్ తనియ:

శ్రీరంగే మీనహస్తే చ జాతమ్ రంగార్యనందనం |

రామానుజ పదస్కంధం రంగనాథ గురుంభజే  ||

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

archived in https://guruparamparaitelugu.wordpress.com, also visit http://ponnadi.blogspot.com/

Source: http://guruparamparai.wordpress.com/2013/03/26/thiruvarangathu-amudhanar/

 

 

వంగి పురత్తు నంబి

శ్రీ~:
శ్రీమతే రామానుజాయ నమ~:
శ్రీమద్ వరవరమునయే నమ~:
శ్రీ వానాచల మహామునయే నమ~:

తిరునక్షత్రము~: తెలియదు

అవతార స్థలము ~: తెలియదు (వంగి పురము వారి తండ్రిగారి గ్రామము లేదా శ్రీరంగము వారి తండ్రిగారైన వంగి పురత్తు ఆచ్చి మణక్కాల్ నంబి గారి శిష్యులైన పిదప ఇక్కడే నివశించారు)

ఆచార్యులు~: ఎమ్పెరుమానార్

శిశ్యులు~: సిరియాతాన్

గ్రంథములు~: విరోధి పరిహారము

వంగి పురత్తు ఆచి మణక్కాల్ నంబి శిష్యులు. వంగి పురత్తు నంబి వన్గి పురత్తు ఆచి కూమారులు మరియు ఎమ్పెరుమానారులకి శిష్యులైరి.

వీరు విరోధి పరిహారము బయటకు రావడములో ఒక సాదనముగా ఉండిరి –మన సంప్రాదాయములో ఒక ఉత్తమ గ్రంథము.ఒకసారి వంగి పురత్తు నంబి ఎమ్పెరుమానార్ వద్దకి వెళ్ళి ఒక ప్రపన్నుడు సంసారములొ ఎటువంటి కష్టములను ఎదుర్కొనునని అడుగగా, ఎమ్పెరుమానార్ 83 అవరోధములను కలిగిన ఒక చిట్టీ ఇచ్చెను. వంగి పురత్తు నంబి ఆ 83 అవరోదములను ఒక గ్రంథరూపములో వివరణాత్మకముగా వ్రాసిరి. ఈ గ్రంథములో,మన జీవితములో వచ్చు ప్రతీ అంశములను ఏ విదముగా నిర్వహించవలెనో పూర్తి మార్గదర్శకములతో వ్రాసిరి.

వంగి పురత్తు నంబి గారి కుమారులకు వంగి పురత్తు ఆచి అను నాదేయమును పెట్టిరి, వారు కొన్ని ఐదిహ్యములను తెలియబరచిరి.

మన వ్యాఖ్యానములలో,వంగి పురత్తు నంబి గారికి సంబందిచిన కొన్ని ఐదిహ్యములను ఇక్కడ చుద్దాము.

 • నాచ్చియార్ తిరుమొజి 9.6 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానముఆండాళ్ ఎమ్పెరుమాన్ ని శ్రీ మహాలక్ష్మి అను గొప్ప సంపదని కలిగిఉండెనని కీర్తించినది.ఈ సంభదముతో, వంగి పురత్తు నంబి తమ శిష్యులైన సిరియాతాన్ కు “అన్నీ తత్వాలు ఒక గొప్ప శక్తి ఉన్నదని అంగీకరించును,కాని మనము(శ్రీవైష్ణవులు) శాస్త్రములో చెప్పబడిన విదముగా –శ్రీమాన్ నారాయణుడే అదిదేవత అని మరియు ప్రతీ ఒక్కరు వారిని శరణు వేడవలెనని చెప్పిరి”.
 • పెరియ తిరుమొజి 6.7.4 – పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము – ఈ పాశురములో, తిరుమంగై ఆళ్వార్ కణ్ణన్ ఎమ్పెరుమాన్ (తానే ఆదిదేవత అయిననూ) వెన్న దొంగలించిన సమయమున యశోదమ్మకు పట్టుబడిన వెంటనే ఏడవడము మొదలుపెట్టెను. ఈ సంభదము ద్వారా,ఒక అందమైన సంఘటనను వివరించెను. వంగి పురత్తు నంబి ఎమ్పెరుమానారులని తిరువారాధన క్రమమును (గృహ తిరువారాధన) తెలుపని అభ్యర్తించిరి. ఎమ్పెరుమానార్ సమయము చిక్కపోవడముచే వారికి చెప్పలేదు.కాని ఒకసారి నంబి గారు లేనప్పుడు, ఎమ్పెరుమానార్ తిరువారాధన క్రమమును ఆళ్వాన్ మరియు మారుతి సిరియాండాన్ (హనుమత్ దాసర్)లకు చెప్పసాగిరి.ఆ సమయమున వంగి పురత్తు నంబి ఆ గదిలోకి రావడముచూసి ఎమ్పెరుమానార్ గొప్ప అనుభూతిని చెందెను.అప్పుడు వారు ఈ విదముగా చెప్పిరి “చాలా కాలము నుండి నాకు ఈ సందెహము ఉండేది. ఇప్పుడు నాకు ఎందుకు ఎమ్పెరుమాన్ (తానే ఆదిదేవత అయిననూ) వెన్న దొంగిలించు సమయమున ఎందుకు  బయపడెనో తెలిసినది.నేను అటువంటి అనుభూతిని ఈ సమయమున పొందితిని–మీరు నన్ను అభ్యర్తించినప్పుడు,నేను మీకు ఉపదేశించలేదు కాని ఎలాగో ఈ రోజు అది వీరికి ఉపదేశించుచున్నాను.నేను ఆచార్యుడిని అయినప్పడికినీ మీరు నాకు శిష్యులైన కారణముచే నేను మీకు భయపడనవసరము లేదు,నా యొక్క పని ద్వారా మిమ్మల్ని చూచిన వెంటనే భయముకలిగెను”.అదీ మన ఎమ్పెరుమానార్ యొక్క గొప్పతనము.ఎప్పుడైనా వారు తప్పుచెసినచో , బాహాటముగానె ఒప్పుకొని దాని ద్వారా ఒక గొప్ప సూత్రముని వివరించెడివారు.
 • తిరువిరుత్తము – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము అవతారిక – నమ్పిళ్ళై ఇక్కడ మొదటగా నమ్మాళ్వార్ సంసారిగా ఉండెననీ ఎమ్పెరుమాన్ దివ్య కృపా కటాక్షముచే తదుపరి  ఆళ్వార్ అయ్యెనని నిర్ణయించెను.కాని ఆళ్వార్ అళోచనల గొప్పతనము ఆచార్యుల ద్వారా చూసినప్పుడూ వేరుగా ఉండును –ఒకవైపు నుండి చూస్తే వారు ముక్తులు (సంసారమునుండి బయట పడినవారు);అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ శిష్యులు ఒకరు వారు ముక్తులు కాకున్ననూ మంచి వారిలో ఒకరు అనెను;ఇంకొకరు వారు నిత్య సూరి అనెను; వంగి పురత్తు నంబి వారు స్వయముగా ఎమ్పెరుమాన్ అని చెప్పెను.
 • తిరువాయ్ మొజి 7.2.7 – నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము – ఈ పదిగములో (కంగులుమ్ పగలుమ్), నమ్మాళ్వార్ అమ్మ భావముతో పాడెను,కాని అక్కడ ఆళ్వారులు వారి అమ్మగారు వివరిస్తున్నారని చెప్పెను. ప్రతి పాశురములో, ఆళ్వార్ (అమ్మ) ఎమ్పెరుమాన్ కొరకు వారిని తిరువరంగత్తాయ్ అని పిలుచును.కాని ఈ పాశురములో, ఆమె ఆ విదముగా చేయడము లేదు. వంగి పురత్తు నంబి ఇక్కడ ఒక రోగి చివరి సమయమున ఉన్నప్పడి సంఘటన ద్వారా వివరించెను,ఆ సమయములో వైద్యుడు నేరుగా రోగి బందువుల కళ్ళలోనికి చూడకుండా వేరే వైపునకు తిరిగి ఆ రోగి పరిస్తిని వారి బందువులకు వివరిస్తాడో. అదేవిదముగా, ఆళ్వార్ ఎమ్పెరుమాన్ నుండి వేరుగా ఉండడముచే వారి పరిస్తితిని చెప్పుటకు , ఆళ్వార్ (అమ్మ) ఎమ్పెరుమాన్ ని ఈ పాశురములో నేరుగా పిలువక ఆమె యొక్క పరిస్తితిని ఆక్రోశము ద్వారా తెలిపెను.
 • తిరువాయ్ మొజి 9.2.8 – నమ్పిళ్ళై ఈడు వ్యాఖ్యానము – శ్రీ రంగములో శ్రీజయంతి పురప్పాడు సమయమున, వంగీపురత్తు నంబి ఎమ్పెరుమాన్ ని సేవించుటకై గొల్లపిల్లల సమూహమున చేరిరి. ఆణ్డాన్ అక్కడ ఉన్నారేమిటని అడుగగా, నంబి ఈ విదముగా చెప్పెను “నేను విజయస్వ అని చెప్పితిని”. ఆణ్డాన్ అందుకు సమాదానముగా మీరు వారి మద్యన ఉండి,వారి యొక్క భాషను మాట్లాడక కష్టమైన సంస్కృతమును ఎందుకు మాట్లాడుతున్నారని అడిగిరి.

వార్తామాలై లో, కొన్ని ఐదిహ్యములు వంగి పురత్తు నంబి (మరియు వారి కుమారుల) కీర్తిని తెలుపును.వాటిని ఇక్కడ చూద్దాము.

 • 71 – వంగి పురత్తు నంబి యతివర చూడామణి దాసర్ కి ఉపదేశించిరి – ఒక జీవాత్మ (ఎవరైతే అచేతనుడో) ఎమ్పెరుమాన్ (గొప్ప వాడు మరియు సర్వ శక్తిమంతుడు)ని పొందినప్పుడు,అక్కడ జీవాత్మ యొక్క కృషిగాని మరెవరి కష్టము కాని లేదు . జీవాత్మకు రెండు దారులు కలవు – ఆచార్యుల కృపచే , ద్వయ మహా మంత్రమును ద్యానము చేసి బయటకు రావడమో లేక నిత్య సంసారిలా ఎప్పుడూ సంసారములో ఉండడము.
 • 110 – వంగి పురత్తు ఆచి కిడామ్బి ఆచ్చాన్కి ఉపదేశించిరి – అనాదియైన ఈ కాలములో ఒక జీవాత్మ ఈ యొక్క సంసారములో ఉన్నప్పుడూ , ఎల్లప్పుడూ పెరియ పిరాట్టియార్ మనలను ఎమ్పెరుమాన్ దగ్గరికి చేర్చునని దృడనిశ్చయముతో ఉండవలెను.
 • 212 – ఇది ఒక అందమైన సంఘటన. ఒక శ్రీవైష్ణవి పేరు త్రైలోక్యాళ్ వంగి పురత్తు ఆచి కి శిష్యురాలు.ఒకసారి అనంతాళ్వాన్ శ్రీరంగమునకు వచ్చినప్పుడు, ఆమె వెళ్ళి వారికి 6 నెలలు శుశ్రూష చేసెను.అనంతాళ్వాన్ తిరి వెళ్ళిన పిదప, ఆమె ఆచి వద్దకు వచ్చెను. ఆచి ఆమె ఇన్ని రోజులు రాకపోవడము గురించి కారణము అడుగగా ఆమె అనంతాళ్వాన్ కి సపర్యలు చేసెనని చెప్పినది. ఆచి ఆమెను వారు ఎమైనా ఉపదేశించారా అని అడుగగా ఆమే ఈ విదముగా చెప్పినది “నేను మీకు ఎన్నో సంవత్సరములు సేవలను చేస్తే–మీరు నాకు ఎమ్పెరుమాన్ యొక్క శ్రీ చరణములను ఆశ్రయించమనిరి.ఈ 6 నెలలలో వారు నాకు మీ యొక్క శ్రీ చరణములకు దాసురాలని చూపిరి”. అనంతాళ్వాన్ ఆమెకు ఆచార్యుల శ్రీ చరణములే మనకు సర్వము అని చెప్పడము ఈ సంఘటన ద్వారా తెలియబరచిరినది.

పిళ్ళై లోకాచార్యర్ తమ ముముక్షుపడిలో వంగి పురత్తు నంబి గారి చరమ శ్లోకము యొక్క ముగింపును గుర్తించింరి.చరమ శ్లోక ప్రకరణము చివరన, చరమ శ్లోకము యొక్క కీర్తిని తెలిపెను.265 సూత్రములో, “వంగి పురత్తు నంబి  కణ్ణన్ ఎమ్పెరుమాన్ అర్జునుడికి తన గొప్పతనమును ఎన్నో వివిదములైన సంఘటనల ద్వారా చూపి చివరన చరమశ్లోకమును అనుగ్రహించిరనిరి. అందువలన సులభముగా అర్జునుడు ఆ సూత్రమును గ్రహించెను”. వ్యాఖ్యానములొ, మామునిగళ్ వంగి పురత్తు నంబిని “ఆప్త తమర్”అని  చెప్పెను –మన ఆధ్యాతిక భావనములో నేర్పరులు.

వంగి పురత్తు నంబి గారి జీవితములోని కొన్ని ముఖ్య సంఘటనలను ఇక్కడ చూసాము.వీరు పుర్తిగా భాగవత నిష్ఠతో ఉండి ఎమ్పెరుమానారుకి ప్రియ శిష్యులైరి.మనకూ అటువంటి ఆచార్య నిష్ఠ కలిగేలా వారి శ్రీ చరణములను ఆశ్రయించుదాము.

వంగి పురత్తు నంబి తనియన్ ~:

భారద్వాజ కులోత్భూతమ్ లక్ష్మణార్య పదాశ్రితమ్
వందే వంగిపురాధీశమ్ సంపూర్ణాయమ్ కృపానిధిమ్

பாரத்வாஜ குலோத்பூதம் லக்ஷ்மணார்ய பதாச்ரிதம்
வந்தே வங்கிபுராதீஸம் ஸம்பூர்ணாயம் க்ருபாநிதிம்

అడియేన్ రఘు వంశీ రామానుజ దాసన్

source:

వడుగ నంబి

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

vaduganambi-avatharasthalam

తిరునక్షత్రము~: చైత్ర మాసము, అశ్విని

అవతార స్థలము~: సాలగ్రామము (కర్నాటక)

ఆచార్యులు~: ఎమ్పెరుమానార్

పరమపదము చేరిన ప్రదేశము~: సాలగ్రామము

గ్రంథ రచనలు~: యతిరాజ వైభవము, రామానుజ అష్టోత్తర శత నామ స్తోత్రము, రామానుజ అష్టోత్తర శత నామావళి

తిరునారాయణపురమునకు ప్రయాణించు సమయములో, ఎమ్పెరుమానార్ మిథిలాపురి సాళగ్రామమునకు వెళ్ళిరి,వారు ముదలియాణ్డాన్ ను అక్కడ ప్రవహించే నదిలో శ్రీ చరణములతో తాకమని ఆఙ్ఞాపించిరి.ఆ నదిలో స్నానము ఆచరించడము వలన అక్కడి ప్రజలు (ముదలియాణ్డాన్ పాద పద్మముల స్పర్శచే) పునీతులై ఎమ్పెరుమానార్ లకు శిష్యులైరి. అందులో ఒక స్వామి వడుగ నంబి,వీరిని ఆంద్ర పూర్ణులు అని కూడా వ్యవహరించుదురు. ఎమ్పెరుమానార్ తన కృపా కటాక్షముచే వడుగ నంబిని అశీర్వదించి,మన సంప్రదాయములోని ముఖ్య సూత్రములను ఉపదేశించిరి.వడుగ నంబి ఆచార్య నిష్ఠతో ఎమ్పెరుమానారులను సేవించి వారితో ఉండసాగిరి.

వడుగ నంబి పూర్తిగా ఆచార్య నిష్ఠతో ఉండడమువలన ఎమ్పెరుమానారులను అర్థించి వారు ధరించిన పాదరక్షలకు ప్రతీ నిత్యము తిరువారాధనమును చేయసాగిరి.

ఒకసారి ఎమ్పెరుమానారుతో కూడి ప్రయాణించు సమయములో, ఎమ్పెరుమానారుల తిరువారాధన పెరుమాళ్ళతో కూడి, వడుగ నంబి కూడా వారి తిరువారాధన మూర్తులైన (ఎమ్పెరుమానారుల పాదరక్షలు) ఒకే మూటలో ఉంచిరి. ఎమ్పెరుమానార్ అది గమనించి వడుగ నంబిని అలా చేయుటకు గల కారణమును అడిగిరి. వడుగ నంబి వెంటనే ఈ విదముగా చెప్పిరి “నా ఆరాధన మూర్తి కీర్తిలో మీ ఆరాధన మూర్తులతో సమానము అందువలన ఇలా చేయుటలో తప్పేమి లేదనిరి”.

ఎమ్పెరుమానార్ ఎల్లప్పుఢూ మంగళాశాసనము చేయు సమయములో,పెరియ పెరుమాళ్ళ అందమైన రూపమును సేవిస్తూ ఆనందించేవారు. ఆ సమయములో వడుగ నంబి ఎమ్పెరుమానారుల అందమైన రూపమును చూసి ఆనందించేవారు. ఎమ్పెరుమానార్ అది గమనించి వడుగ నంబిని పెరియ పెరుమాళ్ళ అందమైన నేత్రములను సేవించి అనందించమనిరి . వడుగ నమ్బి తిరుప్పాణాళ్వార్ ల శ్రీ సూక్తిని అనుసరించి ఈ విదముగ చెప్పిరి“ఎన్ అముదినై కణ్డ కణ్గళ్ మఱ్ఱొన్ఱినై కాణావే” అర్థము “ఎమ్పెరుమానారుల దివ్య సౌందర్యమును దర్శించిన ఈ నేత్రములు వేటిని చూడదలచలేదు” . ఎమ్పెరుమానార్ వారి యొక్క ఆచార్య నిష్ఠను చూసి సంతోషముతో ఆశీర్వదించిరి.

వడుగ నంబి నిత్యమూ ఎమ్పెరుమానారుల శేష ప్రసాదమును తీసుకొనెడివారు,ఆపై వారి చేతులను భక్తితో తలపై తుడుచుకొనేవారు (చేతులను కడుగుటకు బదులుగా) – సాదారణముగా ఎమ్పెరుమాన్/ఆళ్వార్ ఆచార్యుల ప్రసాదములు పవిత్రములు అవడముచేత తీసుకొన్న పిదప ఇలానే చేస్తాము , స్వీకరించిన తదుపరి, మనము చేతులను కడుగరాదు, చేతులను మన తలపై తుడుచుకొనవలెను. ఒకసారి ఎమ్పెరుమానార్ అది గమనించి కలవరపడగా, నంబి తమ చెతులను శుబ్రముచేసుకొనిరి. మరుసటి రోజు, ఎమ్పెరుమానార్ భగవత్ ప్రసాదమును స్వీకరించి మిగిలినది వడుగ నంబికి ఇచ్చిరి. వడుగ నంబి స్వీకరించి చేతులను కడుగుకొనిరి. ఎమ్పెరుమానార్ మరలా కలత చెంది ప్రసాదమును స్వీకరించి చేతులను ఎందుకు కడుక్కొన్నారనిరి. వడుగ నంబి,వినయముతో మరియు తెలివిగా “నేను దేవర వారు నిన్న ఆఙ్ఞాపించిన విదముగా నదుచుకుంటున్నాను అని చెప్పిరి”. ఎమ్పెరుమానార్ “మిరు నన్ను చాలా సులభముగా ఓడించినారు” అని చెప్పి వారి నిష్ఠను అభినందించిరి.

ఒకసారి వడుగ నమ్బి ఎమ్పెరుమానార్ కోసము పాలను కాచుచున్నారు. ఆ సమయమున , నమ్పెరుమాళ్ పుఱప్పాడులో బాగముగా ఎమ్పెరుమానారుల మఠము ముందుకు వచ్చెను. ఎమ్పెరుమానార్ వడుగ నంబిని వచ్చి సేవించమని పిలువగా వారు “నేను మీ పెరుమాళ్ళను చూచుటకు వస్తే,నా పెరుమాళ్ళ పాలు పొంగిపోవును. అందువలన నేను రానని చెప్పెను”.

ఒకసారి వడుగ నంబి బందువులు(వారు శ్రీవైష్ణవులు కారు) వారిని చూచుటకు వచ్చిరి.వారు వెళ్ళిన తదుపరి, వడుగ నంబి పాత్రలను అన్నీ పడేసి ఆ ప్రదేశమును శుబ్రము చేసెను.ఆపై ముదలియాణ్డాన్ తిరుమాళిఘకు వెళ్ళీ,వారు వదిలివేసిన కుండలను తీసుకొని వచ్చి ఉపయోగించసాగిరి.ఈ సంఘటన ద్వారా ఎవరైతే పూర్తి ఆచార్య సంభదమును కలిగి ఉంటారో వారికి సంభదించినవి (వారు వదిలివేసినవి అయినా) పవిత్రములుగా భావించి మనమూ స్వీకరించవచ్చు అని తెలియపరచును.

vaduganambi-emperumanar

ఎమ్పెరుమానార్ తిరువనంతపురమునకు వెళ్ళినప్పుడు,అనంత శయన ఎమ్పెరుమాన్ ఆలయములోని ఆగమమును మార్చదలచెను. కాని ఎమ్పెరుమాన్  ప్రణాళిక వేరుగా ఉండడముచే ఎమ్పెరుమానార్ నిద్రించుచున్న సమయమున ఎత్తుకొని వెళ్ళి తిరుక్కురుంగుడి దివ్య దేశమున వదిలి వచ్చెను. ఎమ్పెరుమానార్ ఉదయము లేచి పక్కన నదిలో స్నానమును ఆచరించి,ద్వాదశ ఊర్ద్వ పుండ్రములను (12 పుండ్రములు) దరించి వడుగ నంబిని (వారు తిరువనంతపురములోనే ఉండెను) శేషమును స్వీకరించుటకు పిలిచిరి. తిరుక్కురుంగుడి నంబి స్వయముగా వడుగ నంబి వలె వచ్చి తిరుమణి ని దరించెను. ఎమ్పెరుమానార్ తదుపరి తిరుక్కురుంగుడి నంబిని శిష్యుడిగా స్వీకరించిరి.

ఎమ్పెరుమానార్ పరమపదము చేరిన తరువాత, వడుగ నంబి తమ స్వస్థలమునకు వెచ్చేసి,అక్కడ ఎమ్పెరుమానారుల వైభవమును ప్రవచిస్తూ ఉండెను .వారు ఎమ్పెరుమానారుల శ్రీ పాద తీర్థమును (చరణామృతము)తప్ప వేరవరిదీ స్వీకరించెడి వారు కారు .ఎమ్పెరుమానారుల శ్రీ చరణములను ఆరాదిస్తూ వారి శిష్యులకి/అభిమానులకి ఎమ్పెరుమానారుల తిరువడిని చేరుటయే అంతిమ ఉద్దేశ్యమని చెప్పి మిగిలిన కాలమును సాలగ్రామమున నివసించి ఎమ్పెరుమానార్ తిరువడిని చేరిరి.

మన వ్యాఖ్యానములలో, కొన్ని ఐదిహ్యములు వడుగ నంబి కీర్తిని తెలుపును.మనమూ వాటిని ఇక్కడ చుద్దాము.

 • పెరియాళ్వార్ తిరుమొజి 4.3.1 – మణవాళ మామునిగళ్ వ్యాఖ్యానము – ఈ పదిగములో  “నావ కారియమ్” అను పదమును గురించి.ఒక సంఘటనను వడుగ నంబి జీవితములో గమనించవచ్చు.ఒకసారి వడుగ నమ్బి దగ్గర ఒక శ్రీవైష్ణవుడు తిరుమంత్రమును అనుసందించెను. అది విని వడుగ నంబి (ఆచార్య నిష్ఠచే)  “ఇది నావ కారియమ్” అని చెప్పి వెళ్ళిపోయెను.ఇది ముఖ్యముగా మనము తిరుమంత్రము, ద్వయము, చరమ శ్లోకము –అనుసందిచుటకు మొదలు గురు పరంపరను అనుసందిచవలెనని ఆపై రహస్య త్రయమును అనుసందించవలెననీ తెలియచేయును. పిళ్ళై లోకాచార్యర్ ఇది గుర్తించి“జప్తవ్యమ్ గురు పరమ్పరైయుమ్ ద్వయముమ్” (ప్రతీ ఒకరు తప్పక గురు పరంపర తదుపరి ద్వయ మహా మంత్రమును అనుసందించవలెను) శ్రీవచన భూషణ దివ్య శాస్త్రములో (సూత్రమ్ 274)తెలిపిరి.
 • పెరియాళ్వార్ తిరుమొజి 4.4.7 – మణవాళ మామునిగళ్ వ్యాఖ్యానము –వడుగ నమ్బి పరమపదము చేరిన పిదప, ఒక శ్రీవైష్ణవుడు అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానారుతో “వడుగ నమ్బి పరమపదమును చేరిరి” అని చెప్పెను.దానికి అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ ఈ విదముగా అనెను “వడుగ నంబి ఆచార్య నిష్ఠులు కావున, మీరు వారు ఎమ్పెరుమానార్ తిరువడిని చేరినారని చెప్పవలెను, పరమపదమునకు కాదు అనెను”.
 • వడుగ నంబి యతిరాజ వైభవమును తెలుపు ఒక అందమైన గ్రంథమును రచించిరి.ఈ గ్రంథములో వారు ఎమ్పెరుమానార్ 700 సన్యాసులతో, 12000 శ్రీవైష్ణవులతో,ఇతర శ్రీవైష్ణవులెందరితోనో ఆరాదించబడెను అని పేర్కొనెను.

పెరియవాచ్చాన్ పిళ్ళై మాణిక్క మాలైలో “వడుగ నంబి ఆచార్య అను పదము (స్థానము)చాలా ప్రత్యేకము మరియు దీనికి ఎమ్పెరుమానార్ ఒక్కరే సరితూగుదురని చెప్పెను”.

పిళ్ళై లోకాచార్యర్ వడుగ నంబి గారి గొప్పతనమును శ్రీవచన భూషణ దివ్య శాస్త్రములో (సూత్రమ్ 411) వివరించిరి.

వడుగ నంబి ఆళ్వానైయుమ్ ఆణ్డానైయుమ్ ఇరుకరైయర్ ఎన్బర్ (வடுகநம்பி ஆழ்வானையும் ஆண்டானையும் இருகரையர் என்பர்)

మామునిగళ్ వడుగ నంబిని మధురకవి ఆళ్వార్ తో పోల్చెను కారణము వారికి నమ్మాళ్వారులే సర్వస్వము. కూరత్తాళ్వాన్ మరియు ముదలియాణ్డాన్ ఎమ్పెరుమానారుకి పూర్తిగా దాసులైనా –కొన్ని సమయములలో వారు ఎమ్పెరుమాన్ ని కీర్తించి సంసారములో ఇమడలేక ఎమ్పెరుమాన్ ని మోక్షము ప్రసాదించవలెననీ అభ్యర్థించిరి .అందువలన వడుగ నమ్బి “వారు ఎమ్పెరుమానారుకి చెందిన వారైనా,వారు ఎమ్పెరుమాన్ మరియు ఎమ్పెరుమానార్ లను పట్టుకొనిరి ”అని చెప్పెను.

చివరగా ఆర్తి ప్రభందములో (పాశురము 11), మామునిగళ్ వడుగ నమ్బి స్థానమును గుర్తించి తీవ్రమైన తృష్ణతో ఎమ్పెరుమానార్ ని వారిని వడుగ నంబి వలె అనుగ్రహించమని వేడుకొనెను. వడుగ నంబికి ఎమ్పెరుమానార్ పై అపారమైన నమ్మకముచే ప్రత్యేకముగా ఎమ్పెరుమాన్ ని ఆరాదించలేదు. దీని ద్వారా మన పూర్వాచార్యులు ఎవరైతే ఆచార్యులను ఆరాదించుదురో, స్వయముగా ఎమ్పెరుమాన్ ని ఆరాదించినట్టే అని తెలిపిరి . కాని మనము ఒక్క ఎమ్పెరుమాన్ ని ఆరాదిస్తే, ఆచార్యులను ఆరాధించినట్లు కాదు. అందువలన మన సంప్రదాయములో ఆచార్యుల ఆఙ్ఞలను పాఠించడమే ముఖ్యమైన సూత్రము, మామునిగళ్ ఇది వడుగ నంబిలో పూర్తిగా ఉండెనని గుర్తించిరి.
వడుగ నంబి గారి జీవితములోని కొన్ని ముఖ్య సంఘటనలను ఇక్కడ చూసాము.వీరు పుర్తిగా భాగవత నిష్ఠతో ఉండి ఎమ్పెరుమానారుకి ప్రియ శిష్యులైరి.మనకూ అటువంటి ఆచార్య నిష్ఠ కలిగేలా వారి శ్రీ చరణములను ఆశ్రయించుదాము.

వడుగ నంబి తనియన్ :

రామానుజార్య సచ్చిశ్యమ్ సాళగ్రామ నివాసినమ్
పంచమోపాయ సంపన్నమ్ సాళగ్రామార్యమాశ్రయే

ராமானுஜார்ய ஸச்சிஷ்யம் ஸாளக்ராம நிவாஸிநம்
பஞ்சமோபாய ஸம்பந்நம் ஸாளக்ராமார்யம் ஆச்ரயே

అడియేన్ రఘు వంశీ రామానుజ దాసన్

source: